Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నయి. అధికార పక్షం, ప్రతిపక్షం నాయకుల హడావుడి మొదలైంది. ఈసారి పోటీ గట్టిగానే ఉండేటట్లు ఉంది. పదవి కోసం ఎంతైనా ఖర్చు పెట్టేటట్టు ఉన్నరు. ముందుగా సర్పంచి ఎన్నికలు రాబోతున్నయి. రెండు ప్రధాన పార్టీలు సరైన అభ్యర్థుల కోసం చూస్తున్నయి. ఈసారి జరిగే ఎలక్షన్ ఇజ్జత్ కా సవాల్ అన్నట్టు ఉంది ఒక్కొక్క నాయకుడిని చూస్తుంటే. లక్షల రూపాయలు ఖర్చైన పరువాలేదు కాని గెలుపు మాత్రం మనదే ఉండాలి అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. ఓట్ల రాజకీయం కాదు నోట్ల రాజకీయం నడిచేలా ఉంది. ఎవరు ఎక్కువ నోట్లు పంచితే వాళ్ళదే విజయం. కొన్ని వర్గాలు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నయి. ఎవరైతే మా వర్గానికి ఎక్కువ ఇస్తరో వాళ్ళకే మా మద్దతు అన్నట్టు ఉన్నరు మద్దెల చెరువు ఊరి జనాలు.
గతంలో అన్నల భయానికి ఊరిని వదిలి హైదరాబాద్ పారిపోయిన వెంగళ్ రెడ్డి, కుసుమారావు లకు తెలంగాణ ఏర్పడ్డాక పుట్టిన ఊరి మీద మనసు మళ్ళింది. ఊరి మీద అనడం కంటే ఊరి పెత్తనం మీద అనడం సరైనది అను కుంట. ఇద్దరు మద్దెల చెరువు ఊరిలో మంచి భూస్వాములు. ఊరి చుట్టూ ఉన్న వందల ఎకరాల పొలం తాతల కాలం నాటి నుంచి వాళ్ళ పేర్ల మీదే ఉంది. వాళ్ళు ఊరి నుంచి పారిపోయిన కాడ్నుంచి పొలం బీడు వడిపోయింది. బంగ్లాలు పాడు వడ్డవి. ఊర్ల పాడువడ్డ గాని పట్నంలో రియల్ ఎస్టేట్ దందా చేసి మస్తు సంపాదించిండ్రు.
మద్దెల చెరువు ఊరిలో గత ఇరవై సంవత్సరాల నుంచి పుట్టిన పిల్లలకు ఊరు చుట్టున్న పొలం గాని నడి ఊర్లో ఉన్న బంగ్లాలు గాని దొరోళ్ళవని తెలుసు కాని వాళ్ళు ఎట్లుంటరో కూడా తెల్వదు. వాళ్ళు ఊరిని ఇడ్వక ముందు ఊరి పెత్తనమంతా కొన్నేండ్లు వెంగళ్ రెడ్డి, మరి కొన్నేండ్లు కుసుమారావులది అన్నట్టు ఉండేది. కాని మూడో వ్యక్తికి అవకాశం ఉండేది కాదు. కాదు అనడం కంటే ఉండనిచ్చేవారు కాదనడం ఉత్తమం. ఈ ఇద్దరి వర్గాల ఓటు బ్యాంకు చూస్తే ఊరు మొత్తంలో ఒకటిన్నర శాతం ఉంటుంది. కాని తొంబై ఎనిమిదిన్నర శాతం ఓట్ల జనాబని వారి గుప్పిట్లో పెట్టుకునేవాళ్ళు. ఒక దాప వెంగళ్ రెడ్డి సర్పంచిగా చేస్తే మరో దాప కుసుమారావు చేసేటోడు. వాళ్ళను కాదని మూడో వ్యక్తి నామినేషన్ జోలికి పోయెటోడు కాదు. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. సామాన్య జనానికి ప్రత్యక్ష నరకం చూపించే వాళ్ళు. అట్ల ఒకరోజు మిద్దెకాడి బాలయ్యను వెంగళ్ రెడ్డి సర్పంచిగా ఉన్నప్పుడు దారుణంగా హత్య చేసిండ్రు. చేసిండ్రు అనే దానికంటే తన భూమిని వెంగళ్ రెడ్డికి ఇవ్వను అన్నందుకు చంపించిండు అనాలి. అది తెలుసుకున్న బాలయ్య కొడుకు తనని కూడా చంపుతారేమోనని అడవిలోకి పారిపోయిండు. ఆ కొన్నాళ్ళకే అన్నలు మద్దెల చెరువు ఊరిలోకి వచ్చిండ్రు. రాత్రికి రాత్రే వెంగళ్ రెడ్డి, కుసుమారావు హైదరాబాద్ పారిపోయిండ్రు.
మల్ల ఇన్నేండ్లకు వెంగళ్ రెడ్డి తిరిగి పుట్టిన ఊరికి వస్తున్నడని ఆ నోట ఈ నోట ఊరంతా తెలిసిపోయింది. వాళ్ళ అరాచకం తెలిసిన పెద్ద మనుషులకు ఒక్కసారిగా గుండె ఝల్లుమన్నది. వెంగళ్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నా కూడా కొంత మందిని తనకు ఊరిలో అనుకూలంగా ఉండేటట్టు పెట్టుకున్నడు. దాదాపు ఇరవై ఏండ్ల తర్వాత ఆయన వచ్చిండని తెలుసుకున్న కొందరు పోయి కలిసిండ్రు. కొందరు వయసు పడ్డ వాళ్ళు భయపడి దూరం నుంచే నమస్కారం పెట్టిండ్రు. వెంగళ్ రెడ్డి గతంలో లెక్క కాకుండా ఇప్పుడు అందరిని చాలా దగ్గరికి తీస్కోని మాట్లాడుతుండు. ఈసారి కుటుంబాన్ని వదిలేసి ఒక్కడే వచ్చిండు హైదరాబాద్ నుంచి. ఊరి వాళ్ళతో మాట్లాడుతూ బంగ్లా మొత్తం పరిశీలించిండు. ఆయన ఎట్లెట్ల తిరుగుతుంటే జనం కూడా అట్లట్లా తిరుగుతున్నరు. ఓ పదిమందిని పక్కకు పిలిసి పైసలిచ్చి బంగ్లను శుభ్రం చేయమని చెప్పిండు. వాళ్ళు ఆ పనిలో ఉంటే వెంగళ్ రెడ్డి ఓ ఐదు మందిని తోల్కొని పొలం చూడనీకె పోయిండు. పొలం అంతా మురికి తుమ్మ వనమైంది. చెట్లు పీకిచ్చి మంచిగా చేయమని కొందరికి చెప్పి పైసలిచ్చిండు. వాళ్ళు సరే అయ్యా అన్నట్లు తలూపిండ్రు. ''నేను పోయోస్త. గొడవ పడకుండా పని పూర్తి జేయుండ్రి'' అని చెప్పి ఇంటికి వచ్చి వాళ్ళకు కూడా చెప్పి కారు తీస్కోని హైదరాబాద్ బయలుదేరిండు. అక్కడ్నుంచే పనులు ఎట్లైతున్నయో తెలుసుకుంటుండు వెంగళ్ రెడ్డి.
వారం తర్వాత బంగ్లా ఇరవై ఏండ్ల కిందటి లెక్క ముస్తాబైంది. దినం చూస్కొని వెంగళ్ రెడ్డి కుటుంబంతో ఊరిలో అడుగు పెట్టిండు. దొర దొరసాని వచ్చిండ్రని ఊరంతా గుమ్మి గూడిండ్రు. అందరిని నవ్వుతూ పలకరించిండ్రు. చేతుల చేయి కలుపుతుండ్రు. చేయి కలిపినోళ్ళైతే దొర చేయి తాకిండని మురుసిపోతున్నరు. రాత్రి అయ్యింది. అందరూ ఇండ్లల్లకు పోయి పండుకున్నరు.
పొద్దున్నే చింతకింది సాయిలు బాయికాడికి పోదమని గుడికెళ్ళి పోతుంటే నసుకు నసుకు ఉన్నంగానే టెంట్లు కడుతున్నరు. సాయిలుకు ఏమీ అర్థం కాలేదు. సరే తీరు నాకెందుకనుకొని అట్లే పోయిండు. ఆకలి పొద్దు కాంగనే ఇంటికి పోయి తినొద్దమని ఇంటికి వస్తుంటే ఊర్ల ఎన్నడు లేనిది పెద్ద పెద్ద గిన్నెలకు వండుతున్నరు. సాయిలు నెత్తికి సుట్టుకున్న సెల్ల చేతికి తీస్కోని పక్కకేంటి పోతున్న బాలరాజు పిలిసి అడిగిండు. ''వెంగళ్ రెడ్డి దొర ఊరికి వచ్చినందుకు అందరికీ దావత్ ఇస్తుండే సాయన్న'' అని చెప్పి తన పని చూస్కున్నడు. అట్లిట్ల టైం పన్నెండు దాటింది. అందరూ తిన్నీకె రావాలని సాటింపు ఇచ్చిండ్రు. జనాలు వస్తుంటే వెంగళ్ రెడ్డి ఆయన భార్య ఇంద్రజారెడ్డి లే వడ్డిస్తున్నరు. అందరూ ఇష్టంగా తిన్నరు. ఇటువంటి తిండి మా జన్మలో తినలేము అనేవారు కూడా లేకపోలేరు. అందరూ వెంగళ్ రెడ్డి భార్యాభర్తలకు దండం వెట్టి ఇండ్లల్లకు పోయిండ్రు. ఇట్ల ఊరి జనాల మనసులను దగ్గర చేసుకుంటున్నడు వెంగళ్ రెడ్డి.
వెంగళ్ రెడ్డి మద్దెల చెరువుకు వచ్చిన సంగతి కుసుమారావు చెవిల పడ్డది. చల్ నేనేం తక్కువ అన్నట్టు కుసుమారావు కూడా ఊరిలో అడుగు పెట్టిండు. బంగ్లను, భూమిని అంతా మంచిగా చేసుకున్నడు. వెంగళ్ రెడ్డి వచ్చిన తర్వాత చేసిన పనులను తెల్సుకున్నడు. ఆయన బిర్యానీ దావత్ ఇస్తే కుసుమారావు దానితో పాటు మందు కూడా వెట్టిండు. ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కాలేదు కాని ఊరి జనాలకు మాత్రం మంచిగా అడిగినప్పుడల్లా దావత్లిస్తూ ఖుషీ చేస్తున్నరు. వాళ్ళు చేసే పనులకు ఇన్నేండ్లు అన్నాతమ్ముడు అని పిలుచుకునేటోళ్ళంతా రెండు వర్గాలుగా చీలిపోయిండ్రు. మా దొరంటే మా దొర అన్న పరిస్థితి ఏర్పడింది మద్దెల చెరువు ఊరిలో. వాళ్ళ పలుకుబడులను చూసి రెండు ప్రధాన పార్టీలు ఇద్దరిని చెరో పార్టీలోకి తీస్కున్నయి. ఇప్పుడు జోరు ఇంకా ఎక్కువైంది.
కుసుమారావు బంగ్లా దర్జాగా కూర్చొని పేపర్ చదవుతుంటే రెండు రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల అని కనిపించింది. మస్తు ఖుషి అయ్యిండు. జీతగాళ్ళను పిలుసుకొని విషయం చెప్పిండు. మా దొరే సర్పంచ్ అన్నంతగా సంబుర పడ్డరు వాళ్ళు కూడా. అక్కడ వెంగళ్ రెడ్దిది కూడా ఇదే పరిస్థితి. ఎవరిని వర్గానికి వాళ్ళు మల్లా దావత్ ఇచ్చిండ్రు. ఇన్ని దినాలు కరువొచ్చినట్లే తింటున్నరు కొందరైతే.
చూస్తున్నంగనే నోటిఫికేషన్ కూడా విడుదలైంది. గ్రామాల వారిగా రిజర్వేషన్ల లిస్టు కూడా వచ్చేసింది. మద్దెల చెరువు గ్రామం ఎస్సీ రిజర్వ్డ్ అని ఉంది. అది చూడగానే వెంగళ్ రెడ్డికి, కుసుమారావులకు తల తీసేసినట్టు అయ్యింది. కొంతసేపు ఈ రిజర్వేషన్ల పద్ధతిని తిట్టుకున్నరు కూడా. ఇన్ని దినాలు ఊరి జనాల కోసం ఖర్చు పెట్టినదంతా వృధా అయ్యిందని తలకొట్టుకున్నరు. కాని ఊరు మీద పట్టు మాత్రం పోగొట్టుకోకూడదు అనుకున్నరు. అనుకున్నట్టుగానే ప్రణాళికలు రచిస్తున్నరు. ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళను తమకు అనుకూలంగా ఉండేవాళ్ళను ఎన్నుకున్నరు. అందులో ఒకడు చింతకింది సాయిలు అన్న కొడుకు దాసును వెంగళ్ రెడ్డి ఎంచుకున్నడు. వాళ్ళకు బద్ధ శత్రువు అయినటువంటి గుండుకాడి మల్లయ్యను కుసుమారావు పోటీకి దింపాలనుకున్నడు. ఇద్దరూ చదువురాని వాళ్ళే.
వెంగళ్ రెడ్డి బంగ్లా నుంచి మెల్లగా ఊర్లకు నడుస్తున్నడు. ఆయనను చూసిన వ్యక్తులు ఆయనేంటే నడుస్తున్నరు. వెంగళ్ రెడ్డి ఈ వాడ ఆ వాడ తిరుగుతూ తిరుగుతూ ఎస్సీ వాడల అడుగు పెట్టిండు. అక్కడున్న వారంతా దొర వచ్చిండని అందరూ గుమ్మిగూడిండ్రు. మెల్లగా చింతకింది దాసు ఇంటి ముందు నిలవడిండు వెంగళ్ రెడ్డి. బయట ఎవ్వరూ లేరు. మూత దిక్కు చూసి ''అల్లుడూ'' అని పిలిసిండు. దాసును అల్లుడూ అనేసరికి అక్కడున్న జనమంతా ఆశ్చర్యపోయిండ్రు దొర వరుసవెట్టి పిలిసిండని. వాళ్ళ మొఖాలు చూసి ''నేను సిన్నగున్నప్పుడు వాళ్ళమ్మను అక్క అని పిలుస్తుంటి. అందుకే అల్లుడూ అన్న'' అని చెప్పేసరికి ఇంకా ఆశ్చర్యపోయిండ్రు. ''ఎవరు?'' అనుకుంట దాసు బయటకొచ్చి చూస్తే ఇంటి ముందు జాతర లెక్క ఉన్నరు జనం. వెంగళ్ రెడ్డిని చూడగానే దాసు భుజం మీదున్న సెల్ల చేతుల పట్టుకొని దండం పెట్టిండు. ''కాబోయే సర్పంచి ఇట్ల సెల్ల భుజం మీద నుంచి తియ్యొద్దు అల్లుడు'' అని మల్ల సెల్ల భుజం మీద వేసిండు వెంగళ్ రెడ్డి. కాబోయే సర్పంచి అనేసరికి దాసుకు అర్థం కాలేదు. పక్కలున్న వాళ్ళంతా ఇప్పటికిప్పుడే మూడోసారి ఆశ్చర్యపోయిండ్రు. దాసు భుజం చెయ్యేసి ఊర్లకు నడిపిస్తూ ''నా బదులు, నా తరపున మన ఊరికి కాబోయే సర్పంచివి నువ్వే అల్లుడు'' అని చెప్తూ బంగ్లకు తీస్కపోయిండు. ఆ బంగ్లను బయటి నుంచి తప్ప లోపలికిపోయి చూడడం ఇదే మొదటిసారి దాసు. జనాలంతా బయటనే నిలవడిండ్రు. దాసు మాత్రం వెంగళ్ రెడ్డి నడింట్ల నిలవడి చేతులు కట్టుకొని అంతా చూస్తూ ఇంత బాగుందా దొర ఇల్లు అన్నట్టు చూస్తున్నడు. వెంగళ్ రెడ్డి అతను నిలవడింది చూసి కూర్చో అని కుర్చీ ఇచ్చిండు. కాని దాసు కుర్చుంటలేడు. బలవంతంగా కుర్చోబెట్టిండు. పని మనిషి ఒకటి వెంగళ్ రెడ్డి ఎప్పుడూ తాగే గ్లాస్లో, మరొకటి పేపర్ గ్లాస్లో చాయి పోసు కొచ్చి ఇచ్చింది. భయం భయంగానే కూర్చొని తాగిండు దాసు.
అవతల కుసుమారావు కూడా గుండుకాడి మల్లయ్యకు తనదైన రీతిలో మర్యాద చేస్తూ కాకవడుతున్నడు. ఇద్దరి మాట లకు కరిగిపోయిన చింతకింది దాసు, గుండుకాడి మల్లయ్యలు ఉన్న చెరి రెండెకరాల భూమిని ఇంట్ల భార్య, తల్లిదండ్రులు వద్దన్నా అమ్మకానికి వెట్టిండ్రు గెలిస్తే ఊరికే ఏలుతం అని. భూమి అమ్మగానే దాసు తండ్రి గుండెవల్గి సచ్చిపోయిండు. తల్లి మంచం పట్టింది. అయినా కూడా భయపడకుండా పోటీ చెరు అన్నట్టు వెంగళ్ రెడ్డి ధైర్యం నూరిపోస్తుండు. వీళ్ళు భూమి అమ్మిన సంగతి ఊర్లో ఎవరికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళ భూములు కొన్నది కూడా వాళ్ళు నమ్మిన వ్యక్తులే. ప్రచారం అంతా వెంగళ్ రెడ్డి, కుసుమారావులే చేస్తున్నట్టు ఉంది. వాళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉన్నట్టు వాతావరణం ఏర్పడింది.
చివరకు ఓటింగ్ డే వచ్చింది. జనాలు పోటాపోటిగా ఓట్లు వేస్తున్నరు. మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఓటింగ్ ముగి సింది. తిన్న తర్వాత లెక్కింపు అని అధికారులు చెప్తే అందరూ తిని మల్లొచ్చిండ్రు. అభ్యర్థులు తప్ప మిగతా వారంతా బయటనే ఉన్నరు. వెంగళ్రెడ్డి, కుసుమారావులతో సహా. లెక్కింపు షురు అయ్యింది. వార్డు ప్రకారం లెక్కిస్తున్నరు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఎక్కువ ఓట్లు వస్తున్నయి. చివరికి చింతకింది దాసుకు పది ఓట్లు ఎక్కువ రావడంతో అతన్నే అధికారులు సర్పంచిగా ప్రక టించిండ్రు. ఆ విషయం బయటకు పొక్కగానే ''సర్పంచ్ సాబ్ వెంగళ్ రెడ్డి జిందాబాద్'' అంటూ నినాదాలు చేసి పూలమాలలు వేసిండ్రు. ఓటింగ్లో సర్పంచిగా ఎన్నికైన చింతకింది దాసు ఇంకా లెక్కింపు రూంలోంచి బయటకే రాలేడు. కాని బయట మాత్రం జనాలు వెంగళ్ రెడ్డిని ఎత్తుకొని ఊరేగుతున్నరు. అది చూసి ఎలక్షన్ అధికారులు నోరెళ్ళబెట్టి చూసిండ్రు. గెలవకపోతి, ఉన్న భూమి అమ్ముకుంటి అని అవమానం భరించలేక అదే రోజు గుండుకాడి మల్లయ్య ఆత్మహత్య చేసుకున్నడు. మరుసటి రోజే కుసుమారావు జనాలు ఎండిపోస్తరని హైదరాబాద్ పోయి మొఖం దాసుకున్నడు. చింతకింది దాసు వెంగళ్ రెడ్డి చెప్పిన చోట సంతకం పెట్టడానికే పరిమితం అయ్యిండు. గ్రామ పంచాయితీలో వెంగళ్ రెడ్డి కుర్చీలో కూర్చుంటే సర్పంచి దాసు నిలవడాలి. నామినేషన్ వెయ్యకముందు వెంగళ్ రెడ్డి ఇంట్లో కాళ్ళు వెట్టిన దాసు ఆ తర్వాత మల్లెప్పుడు ఆ బంగ్లా ముందు కనీసం నిలవడింది లేదు.
రెండేండ్ల తర్వాత వెంగళ్ రెడ్డి చేసిన తప్పులకు చింతకింది దాసు కూడా ఆత్మహత్య చేసుకున్నడు. దాసు చనిపోయిన తర్వాత గాని వెంగళ్ రెడ్డి ఇప్పటికీ మారలేడని గుర్తించలేకపోయిండ్రు జనాలు.
మద్దెల చెరువులో బైఎలెక్షన్ వచ్చింది. మళ్ళీ అదే రిజర్వేషన్ ఉంటుందని జనాలు మేల్కొన్నారని వెంగళ్ రెడ్డి కొంచెం చూసి తిరుగుతున్నడు. హైదరాబాద్లో మాస్టర్స్ చద్వుకొని పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న సంజీవ తల్లికి పానం బాగలేదని ఊరికి వచ్చిండు. తల్లి ఇక నన్నిడిసి పోకని చెప్పెటాలకు తను కూడా ఇక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నడు. వాళ్ళ వాడలో ఉన్నవాళ్ళు, కొందరు ఊరి వాళ్ళు ఈసారి సంజీవ ఎలక్షన్లో పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డరు. సంజీవ అయితే వెంగళ్ రెడ్డి కాల్చిన కర్రులెక్క ఉంటడని కూడా అనుకున్నరు. చివరకు అదే అయ్యింది. మద్దెల చెరువులో చదవుకున్న యువ నాయకత్వం వచ్చింది. దొరల పెత్తనంకు బదులు ప్రజాస్వామ్య పాలన వచ్చింది.
- కెపి లక్ష్మీ నరసింహ
9010645470