Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనగనగా జిలేబి అనే వనంలోకి కొత్తగా వంచిక అనే నక్క వచ్చి చేరింది. తన జిత్తులమారితనంతో తీయని మాటలు చెబుతూ ఎటువంటి శారీరక శ్రమ చేయకుండా ఆహారాన్ని సేకరించుకునేది. ఆహారం కోసం వనంలో ఉన్న జంతువులకు ఒకదానిపై మరొక దానికి చాడీలు చెప్పి తన పబ్బం గడుపుకునేది.
వంచిక మాటలను గ్రహించని జంతువులు సాటి జంతువుల పట్ల ద్వేషం పెంచుకోవడం మొదలైంది. వనానికి రాజైన సింహిక జంతువుల బాగోగులు తెలుసుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయించింది.
సమావేశానికి చేరుకున్న జంతువులన్నీ ఒకదానిపై ఒకటి పిర్యాదు చేసుకున్నాయి. వాటి మాటలను సింహిక విని ఆశ్చర్యపోయింది. ''ఎప్పుడూ ఐక్యతగా కలిసిమెలిసి ఉండే ఈ జిలేబి వనంలో ఎన్నడూ లేనిది కొత్తగా ఈ సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయి'' అని మంత్రి ఏనుగుతో అన్నది సింహిక.
''మహారాజా! మీరన్నది, విన్నది నిజమే. మన వనంలో ఉన్న జంతువుల మధ్య ఐక్యత లోపించింది. 'ఎవరికి వారే యమునా తీరే' అన్నట్లుగా ఉంటున్నాయి'' అని అన్నది మంత్రి ఏనుగు.
''వనంలోకి కొత్తగా వచ్చిన వంచిక నడవడిక మీద నాకు అనుమానంగా ఉంది'' అని అన్నది మంత్రి ఏనుగు.
జిలేబి వనంలోకి వెళ్లి జంతువుల అభిప్రాయాలను సేకరించింది మంత్రి ఏనుగు. 'వంచిక చాలా మంచిది.ఎప్పుడు మాతో ప్రేమగా మాట్లాడుతుంది. మంచి సలహాలు, సూచనలు కూడా ఇస్తుంది' అని మంత్రి ఏనుగుతో జంతువులన్నీ చెప్పాయి.
ఇదే విషయాన్ని రాజు సింహికతో మంత్రి ఏనుగు చెప్పింది. ''కానీ మహారాజా! నాకు వంచిక ప్రవర్తన మీదనే అనుమానంగా ఉంది'' అని అన్నది మంత్రి ఏనుగు. ''మన గూఢాచారులైన జిల్ జిల్ కోతిని, జిగేల్ ఉడుతను పిలిపించండి. రహస్యంగా వంచిక కార్యకలాపాలను కనిపెట్టమని చెప్పండి'' అని మంత్రి ఏనుగుతో అన్నది సింహిక.
జిల్ జిల్, జిగేల్ వంచికకు అనుమానం రాకుండా చెట్ల కొమ్మల మీద నుండి చూస్తూ వంచికను అనుసరించాయి. పొద్దస్తమానం జంతువులతో కలిసి మంచి విషయాలు చెప్పిన వంచిక చీకటి పడగానే ఎవరికంటా పడకుండా పొదలమాటున దాక్కుని వెల్లడాన్ని గమనించిన జిల్ జిల్ మరియు జిగేల్ చెట్ల కొమ్మల మీది నుండే వంచికను అనుసరించాయి.
జిలేబి వనం చివరి అంచు వద్ద ఉన్న పొదల మాటుకు వెళ్ళింది వంచిక. పక్కనే ఉన్న చెట్టు చివరికి ఎక్కిన జిగేల్ తన కళ్ళను తానే నమ్మలేక పోయింది. కళ్ళతో జిల్ జిల్ కి సైగ చేసింది జిగేల్.
''ద్రోహిక! ఈరోజు మన రాజుగారు సింహిక సమావేశం పెట్టారు. దానిలో జంతువుల మధ్య విభేదాలు వచ్చాయని చర్చ జరిగింది. నేనే జంతువుల మధ్య విభేదాలు సష్టించానని మంత్రి ఏనుగు అనుమానించింది. నా పోలికలతో ఉన్న నీవు ఎవరికీ తెలియదు. వాటి మధ్య విభేదాలు నువ్వే సష్టిస్తున్నావు అని తెలిస్తే మనకు మరణదండన తప్పదు'' అని ద్రోహికతో వంచిక అన్నది.
జిల్ జిల్ కోతి, జిగేల్ ఉడుత వాటి సంభాషణను విన్నాయి. మంత్రి ఏనుగు దగ్గరికి వెళ్లి జరిగిన సంగతిని వివరించాయి. మంత్రి ఏనుగు ద్రోహికను, వంచికను బంధించి సింహిక ముందు నిలబెట్టింది.
జిల్ జిల్, జిగేల్ ను అభినందించింది సింహిక. ద్రోహిక, వంచిక వైపు చూస్తూ గర్జిస్తూ పంజాను విసిరింది. వంచిక భయంతో వణుకుతూ ''మహారాజా! మన్నించండి. ఈ వనంలోకి నాతోపాటు నా పోలికలు ఉన్న నా తమ్ముడు ద్రోహిక కూడా వచ్చాడు. ఆహారం కోసం కష్టపడలేక జంతువుల మధ్య మనస్పర్ధలు, ద్వేషాలు సృష్టించి ఆహారాన్ని సంపాదించాం. మా స్వార్థం కోసం వీటికి ఇబ్బంది కలిగించాం. స్థావరం ఇచ్చిన మీకు ద్రోహం చేశాం. మాకు బుద్ధి వచ్చింది. ఎప్పుడూ ఇలా ప్రవర్తించం. మన్నించండి ప్రభూ!' అని వంచిక, ద్రోహిక వేడుకున్నాయి. ఇది విన్న జంతువులు ఆశ్చర్యపడ్డాయి. 'మాతో కలిసి తిరుగుతూ మా మధ్యే గొడవలు పెట్టాయా?' అని నోరెళ్ల బెట్టాయి జంతువులు.
'మన మాటలు, చేతలు ఇతరుల పట్ల ఐక్యతను పెంచేందుకు దోహదపడాలి కానీ చీల్చేవిగా ఉండకూడదు. మన ఆహారం కోసం ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకూడదు. నువ్వు వాటి మధ్య విభేదాలు సృష్టించినా, క్షమించమని అడుగుతున్నారు కాబట్టి మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నాను. ఇకనైనా బుద్ధిగా ఉండండి'' అన్నది సింహిక.
ఆ రోజు నుంచి తమ మాటలు, చేతల ద్వారా జంతువుల మధ్య సఖ్యతను పెంచాయి ద్రోహిక, వంచిక. ఎలాంటి విభేదాలు లేకుండా జంతువులన్నీ కలిసిమెలిసి ఉండటం చూసి జిల్ జిల్, జిగేల్ ఆనందంతో ఎగిరి గంతులు వేశాయి.
- ముక్కామల జానకీరామ్, 6305393291