Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ సాయంత్రం పెరట్లో కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్న గంగాధరంకి, ఓ కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది.
''హలో ఎవరండీ?'' లిఫ్ట్ చేసి అడిగాడు.
''హలో గంగాధరమేనా! మాట్లాడేది?''
''హా.. నేనే మాట్లాడుతున్నా, మీరెవరు?''
''గంగాధరం, నేను రా...సుబ్బారెడ్డిని...''
''ఒరే సుబ్బు.. ఎన్నాళ్ళకి గుర్తొచ్చానురా?ఎలా ఉన్నావు?''
''...................''
''ఒరే... కాల్ చేసిన విషయం చెప్పడం మర్చిపోయాను. వచ్చే నెలలో మన ఫ్రెండ్స్ అందరం గెట్టుగెదర్ అవదాం అని ప్లాన్ చేస్తున్నాం. నువ్వు తప్పకుండా రావాలి మరి.''
''తప్పకుండా వస్తాను రా.. మిమ్మలందరినీ కలుసుకుని ఎంత కాలం అయ్యింది!''
''నాకు తెలుసురా నువ్వు ఈ ప్రోగ్రాం మిస్ చేసుకోవని. ఉంటాను మరి, ప్రోగ్రాం డీటైల్స్ అన్నీ వాట్సాప్ చేస్తా.. ఇంకా చాలా మందికి కాల్ చేయాలి. 'తనకి' కూడా.. '' అంటూ కాల్ కట్ చేశాడు సుబ్బారెడ్డి.
అంతవరకు సుబ్బారెడ్డితో మాట్లాడిన అన్ని విషయాలకన్నా ''తను'' అన్న పదం గంగాధరం ఆనందాన్ని రెట్టింపు చేసింది.
గంగాధరంది పల్లెటూరు. నాన్న సైకిల్ మీద బట్టల వ్యాపారం చేసేవారు. ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకుని దగ్గరలోనే మంచి కాలేజీలో చేరాడు. అప్పటి వరకి తెలుగు మీడియంలో చదివిన గంగాధరంకి ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం అయ్యేసరికి ఏమి అర్థమయ్యేది కాలేదు.
ఓ రోజు క్లాస్ స్టార్ట్ అయ్యిన కాసేపటికి, ''మే ఐ కమిన్ సర్'' కొత్త వాయిస్ వినిపించింది. కొత్తగా వచ్చిన జ్యోతిని ఆహ్వానించారు క్లాస్ టీచర్. చక్కటి జుట్టు, చామన ఛాయ, కాళ్ళకి గజ్జెల పట్టీలు.. గంగాధరం తననే చూస్తూ ఉండిపోయాడు.
అతనలా జ్యోతిని రోజూ చూడటం గమనించిన ఫ్రెండ్స్ ఒకరోజు, ''గంగాధరం మీతో ఏదో మాట్లాడాలంట'' అని జ్యోతికి చెప్పేసి వెళ్లిపోయారు.
''హలో అండీ!'' పలకరించింది జ్యోతి. ఆమె అలా డైరెక్టుగా వచ్చి పలకరించేసరికి గంగాధరం కాళ్ళూ, చేతులు ఆడలేదు. తెలియని భయం, కంగారు అలుముకున్నాయి. మాట్లాడడానికి ఎంత ప్రయత్నిస్తున్నా మాట మాత్రం గొంతు దాటి బయటకి రావడం లేదు. నవ్వుతున్నాడు. అటూ ఇటూ తిరుగుతున్నాడు కానీ ఏమీ చెప్పడం లేదు. తన పరిస్థితిని అర్థం చేసుకున్న జ్యోతి విషయం గ్రహించి, అక్కడినుండి వెళ్ళిపోయింది.
విషయం తెలిసిన స్నేహితులు అతన్ని తిట్టారు. వచ్చిన అవకాశాన్ని చేజార్చినందుకు మందలించారు. ఇదంతా వాళ్ళ పనే అని తెలిసిన గంగాధరం కోపంతో ఊగిపోయాడు. ఇంతలో అటెండర్ వచ్చి, ''గంగాధరం.. నిన్ను శంకరం మాస్టారు రమ్మంటున్నారు'' అని చెప్పేసి వెళ్లిపోయాడు.
''ఒరే... శంకరం మాస్టారు నిన్నెందుకు రమ్మంటున్నారురా? కొంపదీసి ఆ అమ్మాయి కంప్లైంట్ చేయలేదు కదా.. ఆయనకసలే ఫుల్ కోపం. మన కాలేజీలో అందరికన్నా చాలా స్ట్రిక్ట్..'' మిత్రబందం భయపెట్టారు.
''సార్.. పిలిచారంట!'' భయంగా వచ్చి రాని గొంతుతో అన్నాడు.
''హా... నిన్ను చాలా రోజులనుండి చూస్తున్నాను. ఇంకా నిన్ననే నీ ఇంటర్ మార్క్స్ చూశాను. చాలా మంచి మార్క్స్. మరి ఇక్కడేందుకిలా..?'' అన్నట్లుగా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు శంకరంమాస్టర్.
తనకేమీ అర్థం కాలేదన్నట్లు ఫేస్ పెట్టిన గంగాధరంతో, ''అదేరా.. అంత మంచి స్టూడెంటువి. మూడు సబ్జక్ట్స్ ఎలా తప్పావో అని ఆలోచిస్తున్నాను'' అనగానే గంగాధరంకి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు.
మాస్టర్ అంత ఆప్యాయంగా అడిగేసరికి తన బాధనంతా చెప్పుకున్నాడు గంగాధరం. అంతా విన్న మాస్టర్ అతని కాలేజీ అయిపోయాక ఇంటికొచ్చి ట్యూషన్ చెప్పించుకోమని, ఫీజు ఇవ్వనవసరం లేదని, ఇంటి అడ్రసు పేపర్ మీద రాసిచ్చాడు. ఆయన నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పరీక్షలలో అన్ని సబ్జక్ట్స్ లో పాస్ అయ్యాడు గంగాధరం.
కాలేజీలో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. ఇంట్రడక్షన్ అండ్ స్పీచ్ లు అవ్వగానే పేర్లు ఇచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు యాంకర్స్. ఎవరికి తగ్గట్టు వాళ్ళు ప్రదర్శనలు ఇస్తున్నారు. గంగాధరం ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 'జ్యోతి నత్య ప్రదర్శన' అంటూ యాంకర్నుంచి పిలుపు వినగానే చప్పట్లతో ఊగిపోయాడు.
అప్పటివరకు తను ఏదో సినిమా పాటలకి డాన్స్ చేస్తాదేమో అనుకున్న గంగాధరం, తనుధరించిన డ్రస్ లో ఒక దేవతలగా అనిపించింది. ఎంత అందంగా ఉందో మాటల్లో చెప్పలేనంతగా, చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు. తన ఆహార్యనికి తగ్గట్లే 'శివ పార్వతి ఆనంద తాండవం' ఎంత బాగా చేసిందంటే సాక్షాత్తూ శివ పార్వతులే వచ్చి నాట్యం చేశారా అన్నట్లుగా... తన డాన్స్ అయిపోయి వందనం చేస్తుండగా అందరూ ఒకటే చప్పట్లు, ఈలలతో కాలేజీ పరిసరాలు మొత్తం మారు మోగిపోయాయి.
గంగాధరం మాత్రం తన్మయత్వంలో చప్పట్లు కొడుతూనే ఉన్నాడు. ఎంతలా అంటే తనని తను మరచిపోయేలా, తదుపరి 'గంగాధరం' అని పిలుస్తున్నా, తన స్నేహితులు అందరూ తనని ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా కొడుతూనే ఉన్నాడు..
సుబ్బారెడ్డి ఇచ్చిన ఒక్క చెంప దెబ్బకి స్పహలోకి వచ్చాడు. వచ్చీ రాగానే తనకి నిజంగానే షాక్ కొట్టినంత పని అయ్యింది. 'తరువాత కంటెస్టంట్ గంగాధరం' అనే పిలుపు వినపడగానే తన గుండె పాయింట్ జేబులోకి వచ్చినంత పని అయ్యింది.
దాని నుంచి తేరుకుని, ''నాకు చెప్పకుండా నా పేరెందుకురా ఇచ్చారు?'' అంటూ తన పక్కనే ఉన్న సుబ్బు చెంప మీద ఒక్కటిచ్చాడు పట్టరాని ఆవేశంతో..
''నేనెప్పుడు ఇచ్చానురా గంగిరెద్దు మోహమోడా. నాకేం తెలియదు. ఒకవేళ మన సుందరం వాళ్ళేమైనా ఇచ్చారేమో'' అంటూ వాళ్ళ వైపు చూపించాడు సుబ్బారెడ్డి చెంప సవురుకుంటూ..
మాకూ ఏమీ తెలియదు అన్నట్లు అడ్డంగా తలూపారు మిగతా స్నేహితులు. దాంతో గంగాధరం కోపం నషాళానికెక్కింది. ఇంకెవరో తనని కావాలనే ఇలా చేశారని కోపంతో ఊగిపోయాడు. అప్పటివరకు ఎండాకాలంలో కాచే ఎండలా ఉన్న గంగాధరం, జ్యోతి నుంచి కబురు రావడంతో ఒక్కసారిగా శీతాకాలంలో మంచులా కరిగిపోయి, ఒక్క ఉదుటున జ్యోతి దగ్గర వాలిపోయాడు.
''నా పర్ఫార్మన్స్ ఎలా ఉందో తెలుసుకోవచ్చా?'' అడిగింది కాస్త బిడియంగా.
''నా రెండు కళ్ళు చాల్లేదంటే నమ్మండి. అంత చక్కటి పర్ఫార్మన్స్ నా జీవితంలో మొట్ట మొదటిసారిగా చూశాను.''
''మీరు మరీ ఎక్కువగా పొగుడుతున్నారు అండీ''
''పొగడటం కాదండీ.. మీకు ఈ రోజు బెస్ట్ పెర్ఫార్మార్ అవార్డు రాకుంటే అప్పుడు అడగండి''
''నా అవార్డు సంగతి తర్వాత.. మీరేందుకు స్టేజ్ మీదకి పిలిస్తే వెళ్లలేదు?''
''ఎవడో ఇడియట్ కావాలని నా పేరు ఇచ్చాడు. వాడు ఎవడో తెలియాలి. అప్పుడు ఉంటది వాడికి నా చేతిలో..''
''మీ పేరు ఇచ్చింది వాడు కాక ఆమె అయితే ఏంచేస్తారు?''
''ఆమెనా?'' ఆలోచనలో పడ్డాడు గంగాధరం.
''ఎవరైనా కానీ.. నన్ను అడగకుండా నా పేరు ఇవ్వడం తప్పు కదా అండీ''
''తనేవరో చెప్తే ఏం చేస్తారు?''
''ఏం చేస్తాం అండీ. నన్ను నవ్వులపాలు చేసినందుకు నాలుగు దులుపుతాను'' అన్నాడు. జ్యోతి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయింది.
''ఏమైంది జ్యోతిగారు? అంత మౌనంగా ఉన్నారు?''
''మీ పేరిచ్చింది నేనేనండి. మిమ్మల్ని అడగకుండా ఇచ్చినందుకు ఐ యమ్ సారీ..''
గంగాధరంకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. 'ఎందుకలా చేశారు?' అని అడుగుదాం అనుకున్నాడు.
కానీ ఈలోపే, ''మీరు కవిత్వం బాగా రాస్తారని తెలిసింది. ఏదన్న మంచి కవిత చదివి వినిపించండి. మౌనంగా ఉన్న గంగాధరంని ఉద్దేశించి ''మీలో ఉన్న టాలెంట్ మీ వరకే ఉంచుకుంటే ఎలా? మీ టాలెంట్ ఇతరులకి తెలిసినప్పుడే మీకు తగ్గ గుర్తింపు వస్తుందనే మీ పేరు ఇచ్చాను. అందులోనూ ఈ రోజు ప్రోగ్రామ్ కి చాలా మంది పెద్దలు వస్తారు. మీ టాలెంట్ గుర్తించి మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకుంటే అది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది.'' అంది. జ్యోతి తన మీద చూపిన శ్రద్ధకి కరిగిపోయాడు.
''చివరిసారిగా పిలుస్తున్నాం. గంగాధరం ఎక్కడున్నా రావాలి'' యాంకర్ పిలవగానే 'ఆల్ ది బెస్ట్'అన్నట్లు జ్యోతి నుంచి చిన్న చిరునవ్వు వెలువడింది. భయంగానే తడపడుతూ స్టేజ్ ఎక్కిన గంగాధరం, గట్టిగా ఊపిరి పీల్చుకుని జ్యోతిని చూశాడు.
''చిరునవ్వుల జడివానలు నీ నవ్వులు!
పురివిప్పిన నెమలివలే నీ నడకలు!!
తడి ఆరని సెలయేరులే నీ పెదవులు!!!
కడదాకా తపియిస్తా నీ తలపులు!!!!
చక్కనైన నీ మోముపై అద్దిన ఎర్రటి బొట్టులా!
నీ మోముని దాచుటకు ఎదపై వాలిన ముంగురులా!!
అందమైన నీ కాలికి తొడిగిన గజ్జెల పట్టీలా!!!
కడదాకా కలిసుంటా నీ జీవిత భాగస్వామిలా!!!!'' అంటూ జ్యోతిమీద ఆశువుగా కవిత్వం చెప్పేశాడు.
అందరూ ఊహించినట్లుగానే డాన్స్ విభాగంలో జ్యోతికి మొదటి బహుమతి వచ్చింది. ఎవరూ ఊహించనట్లుగా 'బెస్ట్ రైటర్ అవార్డు గోస్ టు గంగాధరం' అంటూ అనౌన్స్ చేశారు . ఒక్కసారిగా షాక్ కి గురైన గంగాధరం రాజా మూవీ క్లైమాక్స్ లో వెంకటేశ్ లాగా నడుస్తూ వెళ్ళి అవార్డు తీసుకున్నాడు. ఆరోజునుంచి గంగాధరం, జ్యోతి ప్రయాణం పట్టాలెక్కింది. ఎక్స్ప్రెస్ లాగా ఆగకుండా పరిగెత్తింది.
అలా సరదాగా సాగిపోతున్న గంగాధరం లైఫ్ లో ఊహించని మలుపు. ఒకరోజు వాళ్ల మామయ్య నుంచి ఫోనొచ్చింది.'' గంగాధర మా మీ నాన్నకి ఆక్సిడెంట్ అయ్యిందిరా.. నీ కోసమే కలవరిస్తున్నాడు, త్వరగా రా..'' అంటూ కాల్ కట్ చేశాడు. తిన్నా తినకపోయినా పిల్లలకి మాత్రం ఏ లోటూ రాకుండా చూసుకున్నాడు గంగాధరం తండ్రి. కానీ షాపింగ్ కాంప్లెక్స్ లు, ఆన్లైన్ షాపింగ్ లు వచ్చాక ఆయన దగ్గర కొనేవాళ్ళు తగ్గిపోయారు. దానికి తోడు ఎంతో కొంత సాయపడుతుంది అనుకున్న పంట కూడా చేతికొచ్చేది కాదు. పై బడిన వయసు కావడంతో సైకిల్ తొక్కడం కూడా కష్టమైపోయేది.
నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నాడు గంగాధరం. అతన్నిచూసిన వాళ్ల అక్క ఒక్కసారిగా అతన్ని హత్తుకుని, ''చూడరా తమ్ముడూ.. నాన్న ఇంకా నీ కోసమే ఎదురు చూస్తున్నాడేమోరా..'' అంటూ తండ్రి దగ్గరికి తీసుకెళ్లింది.
గొంతులో చిన్న గుటక తప్ప ఇంకేమీ కదలిక లేదు. ఏడ్చి ఏడ్చి మొహం మొత్తం ఉబ్బిపోయి, వాళ్ళమ్మ అలానే భర్తను చూస్తూ పక్కన కూర్చుండిపోయింది. ఎప్పుడూ నీట్ గా ఉండే తన తండ్రి అలా ఒంటినిండా దెబ్బలతో, దుమ్ము మరియు రక్తం కలిసిన బట్టలతో అలా అచేతనంగా పడుండటాన్ని చూసిన గంగాధరం ఒక్కసారిగా ''నాన్నా'' అంటూ కుప్పకూలిపోయాడు. చేయాల్సిన కర్తవ్యాలని ముగించిన గంగాధరం.
''అమ్మా! నేను చదువు ఆపేస్తాను. ఇక్కడే ఒక బట్టల షాప్ పెడతాను'' తన నిర్ణయం చెప్పాడు.
''వద్దురా నాయన.. నీకోసమే మీ నాన్న రాత్రింబవళ్ళు కట్టపడింది. అట్టాంటిది నువ్ ఇప్పుడు సదువు ఆపేత్తా అంటే మీ నాయన కట్టానికి ఇలువే లేకుండా పోతదిరా. ఆ పొద్దు కూడా నేను వొద్దని ఎంత సెప్పినా నీకేదో పరీక్షకి డబ్బులు కావాలంట అంటూ సాయంత్రాన బయలుదేరాడు, ఎవరో అమ్మాయి బట్టలు కావాలంటే... ఆ సీకట్లో కారు గుద్దింది..మీ నాయన ఆ దెబ్బలకి ఎంత నరకం అనుభవించుంటాడో..'' అంటూ కొంగు అడ్డం పెట్టుకుని ఏడ్చింది తల్లి.
గంగాధరంకి ప్రాణం పోయినంత పనైంది. తన కోసం ఇంత చేసిన తండ్రికితాను ఏదైనా చేయగలను అంటే చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవడమేననుకుని అమ్మ, అక్కల బాధ్యతను మామకి అప్పజెప్పి కాలేజీకి వెళ్ళాడు.
కాలేజీకి వెళ్ళిన గంగాధరం కళ్ళు జ్యోతి కోసం వెదకసాగాయి. రోజులు గడుస్తున్నాయి. కానీ, తన వివరాలేమీ తెలియడం లేదు. వారం తర్వాత వచ్చింది జ్యోతి. ఈ సారి ఆమె మొహంలో చిరునవ్వు కనిపించలేదు.
''జరిగిన విషయం తెలిసి నేనుచాలా ట్రై చేశాను, నీతో మాట్లాడదామని.. కానీ, నాకు అవకాశం దొరకలేదు.. ఐ యాం సారీ..'' అంటూ అతని చేతుల్లో మొహం పెట్టి ఏడవసాగింది.
''ఏమైపోయావు ఇన్ని రోజులు?'' అడిగాడు గంగాధరం.
''ఏమీ లేదులే.. మా ఆడవాళ్ళ ప్రాబ్లం..'' అంటూ దాటవేసింది. నిజం చెప్పలేకపోయింది.
జ్యోతి పరిస్థితి మాత్రం గంగాధరంకి అనుమానంగానే అనిపించింది. మునుపటిలా లేదు. కళ్ళు లోపలికి పోయాయి. చాలా నీరసంగా ఉంది. అడుగుదామనుకున్నా సందర్భం వచ్చినప్పుడు తనే చెబుతుందిలే అని ఊరుకున్నాడు. రోజు రోజుకి జ్యోతి పరిస్థితి దిగజారిపోతుంది. ఎంత అడిగినా 'ఏమీ లేదు' అంటుంది. తనలోని మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.
ఇంతలోఫైనల్ పరీక్షలలో, ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు గంగాధరం. జ్యోతి తప్పింది. ఎందుకిలా జరిగిందని జ్యోతి ఆలోచనలతో ఒంటరిగా కూర్చుండిపోయాడు గంగాధరం. జ్యోతి ఇంట్లో వాళ్ళంటే భయం వల్ల ఎవరూ తనని కాంటాక్ట్ చేయడానికి సాహసం చేయలేదు.
కొన్ని రోజుల తర్వాత ఓ రాత్రి సమయాన గంగాధరం ఫోన్ మోగింది, ఏదో కొత్త నెంబర్ నుంచి.. చేసింది జ్యోతినే అని నిర్ధారణ కాగానే ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినట్లయింది. రేపు కలుస్తానని ప్లేస్ చెప్పి సడన్ గా ఫోన్ పెట్టేసింది. తనకి ఏమైంది? రేపు చెప్పబోయే విషయం ఏమై ఉంటుందో? అనే ఆలోచనలతో నిద్రపోకుండా రాత్రంతా అలాగే కూర్చుండిపోయాడు గంగాధరం.
ఎదురుచూసిన ఘడియ రానే వచ్చింది.
''ఏదో చెప్తా అన్నావు?'' అడిగాడు.
''మీ రూమ్ కి తీసుకెళ్లు, అక్కడ చెప్తాను.''
ఏమీ మాట్లాడకుండా తన రూమ్ కి తీసుకెళ్ళాడు గంగాధరం. వెళ్ళగానే గంగాధరంని పట్టుకుని భోరున ఏడ్వసాగింది జ్యోతి. గంగాధరం కూడా చిన్న పిల్లవాడివలే వెక్కి వెక్కి ఏడ్వసాగాడు.
''నీకోవిషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. కానీ, అది సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను..''
''నిన్నెప్పుడూ నేను ఇబ్బంది పెట్టలేదు. పెట్టనుకూడా..'' అనగానే అతన్ని పట్టుకుని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టింది. ఊహించని పరిణామానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు గంగాధరం. తర్వాత ప్రమిదలోని నూనె ఒత్తిలా ఒకరిలో ఒకరు కలిసిపోయారు.
గెట్ టు గెదర్ పార్టీ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా వస్తున్నారు. కులాసా కబుర్లు, ఆత్మీయ పలకరింపులతో ఆ ప్రాంగణమంతా సందడిగా మారిపోయింది. గంగాధరం చూపులు మాత్రం ఎంట్రన్స్ వైపే ఆత్రంగా చూస్తున్నారు. చివరికి ఎదురుచూపే మిగిలిపోయింది.
''ఈ రోజుకి మా ఇంట్లోనే బస..'' అంటున్న సుబ్బారెడ్డి దంపుతుల ఆహ్వానాన్ని గంగాధరం దంపతులు కాదనలేక పోయారు. ఆ రాత్రికి అక్కడే ఉన్నారు. జ్యోతి గురించి మాట మాత్రమైనా ఎవరూ అడగలేదు, చెప్పలేదు. ఎవరికి తన గురించి ఏ విషయమూ తెలియలేదు.
తర్వాతి రోజు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాళ్ల కార్ ఓ పక్కగా ఆపాడు డ్రైవరు. చాలాహడావిడిగా వెళ్తున్నారు జనాలు.
గ్లాస్ కిందకి దింపి, ''ఏమైంది?'' అని అడిగారు.
''ఓ కార్ అతను బైక్ వాళ్ళకి ఆక్సిడెంట్ చేసి వెళ్లాడంట.. వాళ్ళలో ఒక చిన్న పాప కూడా ఉందంట..'' కంగారుగా చెప్పాడు అవతలి వ్యక్తి.
వెంటనే కార్ దిగి అక్కడికి చేరుకున్నారు. అక్కడో స్త్రీ అచేతనంగా పడుంది. శరీరమంతా బాగా దెబ్బలు తగిలాయి. రక్తం చాలా పోయింది. ఇంకా బ్రతకడం చాలా కష్టం అనే పరిస్థితిలో ఉంది. పాపకి హెల్మెట్ ఉండటం చిన్న చిన్న దెబ్బలతో బయటపడగలిగింది. అప్రయత్నంగానే తనకు దగ్గరగా వెళ్ళాడు గంగాధరం. హాస్పిటల్ కి తీసుకెళ్ళాడానికి కొందరు ఆమెను పైకి లేపుతుండగా! ఆమె గంగాధరం చేతిని గట్టిగా పట్టుకుంది.
ఒక్కసారిగా షాక్ కి గురైన గంగాధరం 'ఆ స్పర్శ తనకి బాగా తెలిసనట్లే అనిపించి ఆమెను తరచి చూశాడు'. తనెవరో కాదు, జ్యోతినే.. అంతే ''ఇన్నాళ్ళకు నిన్ను ఈ పరిస్థితిలో చూస్తాననుకోలేదు'' అంటూ ఒక్కసారిగా ఆమెను గుండెలకి హత్తుకుని బిగ్గరగా ఏడ్వసాగాడు. ఆమె మాత్రం ఏమీ మాట్లాడలేకపోతున్నా మొహంలో చిన్న చిరునవ్వు.. చివరి క్షణంలో అయినా గంగాధరంని తన దగ్గరికి పంపినందుకు దేవుడికి దండాలు పెట్టుకుంది మనస్సులో.. అలా నవ్వుతూనే చివరికి గంగాధరం ఒడిలోనే శాశ్వతంగా నిద్రపోయింది. అక్కడ జరుగుతున్న విషయాలని విస్తుపోయి చూస్తుండిపోయింది గంగాధరం భార్య సరళ.
సుబ్బారెడ్డి సమక్షంలో అన్నీ తానై ఉండి జరగాల్సిన కార్యక్రమాలను ముగించాడు గంగాధరం. జ్యోతి వస్తువులు సర్దుతుండగా కనిపించిన డైరీలో...
''తన రాజకీయ వారసుడిగా మా నాన్నగారు మురళి అనే ఒకతన్ని చేరదీశారు. కానీ అతను నాపై కన్నేశాడు. నేను కాదనడంతో అవకాశం కోసం చూశాడు. ఆ రోజు ఫ్రెషర్స్ డే పార్టీలో మనిద్దరం చనువుగా ఉండటం చూసిన మురళి, అదే అవకాశంగా భావించి తన కోరికను తీర్చమని బలవంతం చేశాడు. అది ప్రత్యక్షంగా చూసిన మా నాన్నగారు కోపంలో తనని తీవ్రంగా కొట్టి, ఇంట్లోనుంచి బైటికి పంపించారు.
ప్రతీకారంగా ఆ రాక్షసుడు, నాన్నగారి అనుచరులకు ఒకరోజు ఫుల్ గా మందు తాగిపించాడు. ఆమత్తులో నాన్నగారి కారును డ్రైవ్ చేస్తూ ఎదురుగా వస్తున్న బండిని తప్పించబోయాడు డ్రైవర్. కార్ పల్టీలు కొట్టి, దెబ్బలు బలంగా తాకడంతో నాన్నగారు అక్కడికక్కడే చనిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పల్టీలు కొట్టిన నాన్నగారి బండి సైకిల్ పై వస్తున్న మీ నాన్నగారిని డీ కొట్టడం, మీ నాన్నగారు కూడా అదే ప్రమాదంలో చనిపోవడం..
నువ్వు పరీక్ష ఫీజు కట్టలేదని, నేను ఇచ్చినా ఆత్మాభిమానంతో తీసుకోవని మీ నాన్నగారికి బట్టలు ఆర్డర్ ఇచ్చింది నేనే. అవి నాకు తెచ్చి ఇస్తూ ఆ ప్రమాదంలో చనిపోయారు. నా వల్లే మీ నాన్నగారు చనిపోయారు. ఆ విషయం నీకు చెప్దామని ఎన్నోసార్లు అనుకున్నాను. ఎందుకో చెప్పలేకపోయాను. ఒకరోజు చెప్పేయాలని కలిశాను. కానీ, ఆ బలహీన క్షణాన అనుకోకుండా మనం ఒకటయ్యాం. అది తెలిసిన మురళీగాడు నన్ను బంధించాడు. నాన్నగారు పోయిన తరవాత అన్నింట్లో వాడిదే రాజ్యం అయ్యింది.
కొంతకాలానికి ఎలాగో వాడినుంచి తప్పించుకున్నాను. నీ గురించి విచారించాను. అప్పటికే నీకు పెళ్లి అయ్యిందని తెలిసింది. అమ్మ చిన్నప్పుడే దూరమైంది. తర్వాత నాన్న, తర్వాత నువ్వు కూడా.. ఈలోకంతో నాకిక పని లేదని చనిపోవాలనుకున్నాను. కానీ మన బిడ్డ కోసం ఆగిపోయాను. దేవునిదయవల్ల మన ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన గెట్టుగెదర్ పార్టీ గురించి తెలిసింది. ఇన్నాళ్ళకు నిన్ను చూడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది గంగాధరం...'' అని రాసుంది.
గంగాధరం చెంపలు కన్నీళ్ళతో నిండిపోయాయి. భుజంమీద పడ్డ సరళ చేతికి ఆ డైరీని ఇచ్చి, జ్యోతి ఫోటోని గోడకి కొట్టడానికి లేచాడు. డైరీ చదివిన సరళ, జ్యోతి ఫోటోని గోడకి కొడుతున్నభర్తవంక, బిడియంగా సోఫాలో కూర్చున్న పాపవంక చూస్తూ ''పెళ్లై ఇన్నేళ్లవుతున్నా మనకింకా పిల్లలు లేరని చాలా బాధపడ్డం. మనకిక ఏ చింతా లేదు! మన పాప మన దగ్గరికొచ్చేసింది.'' అంటూ పాపని గుండెలకి హత్తుకుంది సరళ ఉబికి వస్తున్న కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ.
- దార్ల శ్రీనివాసరావు,
97045 01219