Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీను గాడి కళ్ళలో, కలల్లో కూడా ఆ చొక్కానే! ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. కళ్ళు మూసుకుంటే చొక్కా ఎక్కడ కనిపించదో అని భయం. పైగా ఆ చొక్కాని ఎదురుగా కనిపించే తాడు మీద వేసుకున్నాడు. ఇక అప్పటినుంచి కన్నార్పకుండా దానివైపే చూస్తున్నాడు. వాడికి నిద్రపడితేగా అటు ఇటూ పొర్లుతునే ఉన్నాడు. మధ్య మధ్యలో వాడి అమ్మ నూకాలు కేకలు పెట్టేది ''తొంగో యెహే'' అంటూ.
వాడు పుట్టి బుద్ధి ఎరిగాక పనిలోకి వెళ్ళలేదు. ఇలా రాత్రిళ్ళు జాగారమూ చేయలేదు.
వేసవి కాలం పోయి వానాకాలం వస్తుందిట రేపటి నుంచి. ఎంచక్కా.. చొక్కా వేసుకునే పనిలోకి పోవచ్చు. అసలు వర్షాకాలం లోనే కదా! వానలు పడతాయి. అవి పెద్దగా చప్పుడు చేస్తూ పడతాయి. చిన్నగా సూదుల్లగా గుచ్చుతూ వరుసగా పడుతూనే ఉంటాయి. అలాంటి వానలు పడ్డప్పుడు ఇల్లంతా నీళ్ళతో నిండిపోయేది. భయంతో చలితో మోకాళ్ళలో తలను దాచేసి ముడుచుకొని బిక్కు బిక్కుమంటూ ఉండిపోయేవాడు.
వాడు ఉండే చోటు నుంచి కొంచెం దూరంలో కొండలు, ఆ పక్కనే చిన్నచిన్న లోయలు, నేలంతా పచ్చని తివాచీ పరచినట్లుండేది. చలికాలంలో ఎలా వచ్చిందో తెలియదు, ఒక చిరిగిపోయిన కోటు ఉండేది. అదే వేసుకునే వాడు.
వాడి ఈ చిన్ని జీవితంలో కొత్త చొక్కా వేసుకున్నదే లేదు. అయితే ఓ అద్భుతం ఈ బొమ్మల చొక్కా రూపంలో వాడి దగ్గరకు వచ్చింది.
పైగా రేపటి నుంచి వాడి నాన్న అప్పన్న పనిలోకి తీసుకుని వెళ్తానన్నాడు. అందుకు ఈ సంబరం. నిజానికి ఈ ఆనందం ఆ చొక్కా వాడి దగ్గరకి వచ్చినప్పటి నుంచి వచ్చింది. ముంబయిలో అప్పన్న, నూకాలు బిల్డింగ్ కూలీలుగా ఉండేవారు. కరోనా మహమ్మారి వచ్చి వలస కూలీలంతా ఊరి బాట పట్టారు.
అప్పుడు వాళ్ళు కూడా చాలా కష్టాలు పడుతూ అంచెలంచెలుగా ప్రయాణం చేస్తూ వచ్చారు. కొంతమంది పుణ్యాత్ములు వాళ్ళకి భోజనం వసతి సదుపాయాలుతో పాటు బట్టలు కూడా ఇచ్చారు.
అలా సీను దగ్గరకు వచ్చేసరికి ఆ వాలంటీరు వాడి మాటలు వింటూ మురిసిపోయింది. కొంతమంది పాత బట్టలిచ్చినా మరి కొంతమంది నిస్వార్థ పరులుంటారుగ అలాంటి వాళ్ళు ఇచ్చిన వాటిలో కొత్త షర్టును వాడి కిచ్చింది. అప్పటి నుంచి అది ఎప్పుడు వేసుకోవాలా అని ఎదురు చూస్తున్నాడు. మొత్తానికి ఎన్నో సాధక బాధకాలను ఎదుర్కుంటూ ఊరు చేరుకున్నారు.
అతనొక్కడిదే కాదు ఈ పరిస్థతి. కోట్ల మంది వలస కూలీల జీవన వ్యధలు ఇలాగే ఉన్నాయి. ఉన్న ఊర్లో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో పొట్టకూటి కోసం బిల్డింగ్ కూలీలుగా, రోడ్లు, ఫాక్టరీలు, హౌటళ్ళు, ఇళ్ళలో పనులు చేస్తూ కడుపు నింపు కోవడం కోసం కష్టపడ్డారు.
రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో పులి మీద పుట్రలా కరోనా, దానితో పాటు లాక్డౌన్ వచ్చి పడింది.
అందరూ తిరుగుముఖం పట్టారు. ఒక ఏడాది కాలం చాలా గడ్డుగా గడిచింది.
కరోనా మూలంగా బతుకుతెరువు పోయి పూట గడవడమే కష్టంగా ఉండేది. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఓ పూట తిని మరో పూట పస్తులుండి రోజులు వెళ్ళదీసాడు.
నెమ్మదిగా పరిస్థితి కాస్త మెరుగయింది. ప్రజలు కూడా భయం వీడి పనులు చేసుకుంటున్నారు.
ఆ సమయంలోనే వాళ్ళకి వ్యవసాయ కూలీలుగా కాస్త ఉపాధి దొరికింది. అసలు లేని దానికన్నా ఏదో ఒకటి, దొరికిన దానిని అందిపుచ్చుకోవాలనుకున్నారు.
ఆ రాత్రి పడుకునే ముందు నూకాలు, అప్పన్న మాట్లాడు కుంటున్నారు. అది సీను గాడిని పనికి పెట్టె విషయం. వాళ్ళు పనిచేసే కొంత దూరంలోనే ఒక పెద్ద నర్సరీ ఉంది. అందులో పని చేసే వాళ్ళకు సహాయం చేసే పని.
''డబ్బులు కూడా బానే ఇత్తారంటే''
''మనలాకాకుండా, వీడయిన చదువుకుంటాదాని ఆశపడ్డాను. హు.. ఆ దేముడు ఇదే రాసాడు కాబోలు'' అని నిట్టూర్చింది నూకాలు.
''బాధపడకే నూకాలు, నుదుటున ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది''
''సరేలే నీదంతా ఎఱ్ఱి చాదస్తం'' అంటూ పక్కకు తిరిగి ''రేపు నీకు ఇచ్చిన కొత్త బొమ్మల చొక్కా వేసుకుని పనిలోకి వెళ్ళు'' అని చెప్పింది కొడుకుకుతో ప్రేమగా.
ఆ మాటతో వాడి ఆనందానికి పగ్గాలు లేకుండా పోయింది.
మొదటి రోజున పనిలోకి బొమ్మల చొక్కా వేసుకుని వెళ్దామని వాడి చిట్టి బుఱ్ఱలో నిలబడింది.
రాత్రి ఒంటేలు పోసుకోవడానికి బయటకు వచ్చినప్పుడు మినుకు.. మినుకు మంటూ మెరిసే మిణుగురులను చూసేవాడు. అదే సమయంలో పైన ఆకాశంలోకి చూసినప్పుడు అక్కడ నక్షత్రాలు మినుకు మినుకుమని మెరిసేవి. రెంటినీ మార్చిమార్చి చూసేవాడు. అంతలోపే వాడి బొమ్మల చొక్కాలో ఉన్న నక్షత్రపు బొమ్మలు కళ్ళముందు మెదిలి ఆ చొక్కాను బయటకు తెచ్చి ఆకాశంలో నక్షత్రాలు బావున్నాయా? దూరంగా కనిపించే మిణుగురులు బాగున్నాయా లేకపోతె తన చొక్కా లోవి బావున్నాయా? వాడికేమి అర్ధం కావటం లేదు.
ఇంతలో వాళ్ళ అమ్మ ''ఒరే సీనిగా ఎంత సేపురా?'' అని అరిచింది.
''అసలు అమ్మ పడుకుంది కదా? ఎలా తెలుస్తుంది బయటకు వచ్చినట్లు'' అనుకుంటూ రెండు చేతులలో చొక్కా దాచుకుని లోపలకి వచ్చేసాడు.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తూనే ఉన్నాడు. కోడి కూతలు, పక్షుల కిలకిలలు, మెత్తగా వీస్తున్న గాలి, తెల్లగా వెలుతురుని కళ్ళు తెరిచి చూసేసరికి వాడికి ఎక్కడ లేని హుషారు వచ్చేసింది.
వాళ్ళమ్మ అక్కడికి దగ్గరలో ఉన్న కాలవకు వెళ్లి స్నానం చేస్తుంది. తను వెళుతూ వాడిని వెంటబెట్టుకుని పోయింది. ముందు వాళ్ళ అమ్మ స్నానం చేస్తుంటే ఆ పక్కనే ఉన్న పెద్ద రావి చెట్టు దగ్గర కూర్చొని వాడి చొక్కాను ఒక కొమ్మకు వేసి దానిమీద ఉన్న బొమ్మలను చూసుకుంటూ మురిసిపోతున్నాడు. ఒకసారి తొడుక్కొని చూసాడు. మళ్ళి విప్పాడు, ఇంకోసారి తొడిగాడు. ఇలా కొంత సేపు గడిచింది. ఇంతలో వాళ్ళమ్మ ''సీనిగా రారా స్నానం చెయ్యి'' అని పిలిచింది. శుభ్రంగా స్నానం చేయించి వదులుగా ఉన్న నిక్కరు, దానిపైన కొత్త బొమ్మల చొక్కా తొడిగింది.
''భలే బావుందిరా బొమ్మల చొక్కా, నా దిష్టే తగిలెను'' అంటూ వాడి చెంప మీద ముద్దు పెట్టుకుంది.
తల్లి చేసిన ఆ చర్యతో సిగ్గుపడి ముందుకు పరుగు తీసాడు.
నూకాలు, అప్పన్న ఇద్దరూ పనికి వెళుతూ వాడిని వెంటబెట్టుకుని వెళుతున్నారు. నూకాలు నెత్తి మీద పెట్టుకున్న బుట్టలో భోజనం డబ్బాలు ఉన్నాయి. సీనుగాడు ఉత్సాహంగా అడుగులు వేస్తున్నాడు. గర్వంగా అందరూ తన చొక్కా చూడాలన్నట్లు ఛాతీ విరుచుకుంటూ సినిమాలో హీరోలా నడుస్తున్నాడు. వాడినడక చూస్తూ నూకాలు, అప్పన్న ముసిముసిగా నవ్వుకుంటున్నారు.
వాడిని తోట దగ్గర దింపి డబ్బా చేతికి ఇచ్చి ''అందరూ అన్నం తినేటప్పుడు నువ్వు కూడా తిను'' అని జాగ్రత్తలు చెప్పింది.
తోటయజమానితో ''ఇదే మొదటి సారి అయ్యా! వాడు పనికి రావడం. మీరే చూసుకోవాలి అయ్యా!'' అని వినయంగా చెప్పాడు.
అలాగే అన్నట్లు చేయుపాడు ఆ యజమాని.
ఇద్దరూ వాడినే వెనక్కి వెనక్కి చూస్తూ వెళ్ళిపోయారు. అలా నిలబడిపోయిన వాడి దగ్గరకు వచ్చి మిగతావాళ్ళు నవ్వసాగారు.
''ఏరోయి ఇక్కడ చేసేది మట్టి పని, ఇలా బొమ్మలు చొక్కా వేసుకుని సినిమా హీరోలా రావడం కాదు'' అనేసరికి బిత్తరపోయాడు.
అక్కడ పని చేస్తున్న వాళ్ళందరూ చిరిగి మాసిపోయిన బనీన్లు, మట్టి పట్టేసిన నిక్కర్లు, కొంతమంది పంచలను గోచిలుగా మడిచి పెట్టుకుని ఉన్నారు.
ఇంతలో ఒకతను వచ్చి ''నీ పేరేనా సీను అంటే. నువ్వు నా దగ్గరే ఉండాలి. నిన్ను మీ నాన్న నాకు ఒప్పజెప్పాడు. సరేసరే! మొక్కలకి ఎరువు వేయాలి, అక్కడ చిన్నచిన్న తట్టలలోకి ఎత్తి తీసుకుని వెళ్లి వేయాలి''
''సరే'' అని తల ఆడిస్తూ అతని వెనకే నడిచాడు. వెళుతున్న వాడి వైపు చూసి ''ఆ చొక్కా విప్పేసి రా'' అని గదమాయించాడు.
''అరె భీముడు, చిన్నపిల్లాడిని భయ పెట్టకురా'' అని పక్కనే మొక్కలకి కుదుళ్ళు చేస్తున్న ముసలి నరసయ్య అన్నాడు
''ఆ.. ఆ సరే ముసలోడా! ముందు నీ పని చూసుకో'' అని విసుక్కున్నాడు
సీను వైపు తిరిగి ''విప్పేయి విప్పేయి'' అని గదిమాడు.
అప్పుడు ఏడుపొచ్చింది. సీనుగాడికి .. భయంతో గుడ్ల నీళ్ళు కుక్కుకుంటూ చొక్కా విప్పి అక్కడ చిన్న సిమెంట్ గట్టు మీద పెట్టుకుని, భీముడు వెనకాలే నడిచాడు. మొదటి రోజునే వాడు పని సరిగా చేయటం లేదని గట్టిగ చివాట్లు పెట్ట్టాడు కూడా
పని చేస్తున్నా సీను మనసంతా విప్పి ఉంచిన చొక్కా మీదే ఉంది, అది ఎవరయినా ఎత్తుకు పోతారేమో అన్నట్లు. ఇదంతా అక్కడున్న మేనేజర్ చూస్తూనే ఉన్నాడు.
ఆ సాయంత్రం తల్లి తండ్రి పనుల నుంచి తిరిగి రాగానే కొడుకుని చూసారు. వాడు కులసాగా బొమ్మల చొక్కా తొడుక్కుని హాయిగా ఆడుకుంటున్నాడు.
''ఏరా ఈ రోజు మొత్తం పని చేసావా? అనడిగాడు తండ్రి''
''ఆ .. ఆ..'' అని మళ్ళి ఆడుకుంటున్నాడు. పక్క నున్న భార్య వచ్చేయన్నట్లు సైగ చేసింది. సరే అని తలూపి ఏదో ఆలోచిస్తూ బయటకు వెళ్ళాడు.
తిరిగి వచ్చేసరికి సీను గాడు కింద నేల మీద పడుకున్నాడు. నలువైపులా రాత్రి ప్రసరిస్తోంది. అక్కడంతా నిశబ్ధం...
ఉన్నటుండి పెద్దగాలి వీచింది. ఆ గాలికి కళ్ళనిండా దుమ్ము, ఓ ముక్క సీను గాడిమీద పడింది.
నెమ్మదిగా కళ్ళు తెరిచి, పడిన దాన్ని చేత్తో తీసి చూసాడు. అది ఓ గుడ్డ ముక్క, దాని నిండా నక్షత్రాల బొమ్మలున్నాయి. కళ్ళు నులుముకుంటూ చూసాడు.
ఎదురుగా తీగ మీద పీలికలు పీలికలుగా వేలాడుతూ బొమ్మల చొక్కా, దాని పక్కన అప్పుడే కాల్చి పడేసిన చుట్ట ముక్క ఉంది. ఆ వాసన.. వాడికి బాగా గుర్తు. చిరిగిన చొక్కాముక్కలోని నక్షత్రం గాలికి రెపరెప లాడుతోంది.
కొంచెం దూరంలో పడుకున్న నూకాలు కళ్ళలో నీళ్ళు..
కొడుకుని దగ్గరకు తీసుకుని నిజం చెప్పేయాలి అన్న ఆలోచన వచ్చింది.
కానీ... కన్న తీపికన్నా... కడుపు నింపుకునే స్వార్ధమే గెలిచింది.
- మణి వడ్లమాని, 9652067891