Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అరేయ్ రామిరెడ్డి, ఈ న్యూస్ చూసే ఉంటావు నిన్న రాత్రి హైదరాబాద్‌లో నాలుగేళ్ల పిల్లాడ్ని కుక్కలు దారుణంగా కొరికి చంపేసిన సంగతి.... వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఆ వీడియో కూడా చూశానురా... ఒళ్ళు జలదరిస్తోంది ఆ పసివాణ్ణి తలుచుకుంటుంటే...'' ఆ పసివాడి స్థానంలో తన మనవడు ఉండి ఉంటే అన్న ఆలోచన మొదలవగానే కడుపులో దేవినట్టు అయ్యింది. చెప్పేది సగంలోనే ఆపేశాడు సుబ్బరామయ్య. గొంతు బొంగురుపోయింది. కళ్ళుమూసుకుని బాధని దిగమింగడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
రోజూ పొద్దున్నే స్నేహితులు ఇద్దరూ కలిసి ఓపికని బట్టి కొంత జాగింగ్, కొంత వాకింగ్ చేసి బీచ్ రోడ్డులో ఉన్న కాఫీ షాప్‌లో కూర్చుని పేపర్లో వార్తలు చదువుతూ కబుర్లు చెప్పుకోడం పరిపాటి అయిపోయింది రిటైర్ అయిన తరవాత. ఇద్దరూ హైస్కూల్ నించి మంచి ఫ్రెండ్స్. కాలేజీలో హాస్టల్ రూమ్మేట్స్. ఉద్యోగాలు వేరైనా రిటైర్ అయిన తరవాత రెండు కుటుంబాలు సొంత ఊరు వైజాగ్‌లోనే సెటిల్ అయ్యారు.
సుబ్బరామయ్య చూపించిన వార్త చదివిన రామిరెడ్డి వెంటనే ఏమీ అనలేదు. చేతిలో ఉన్న కప్పులోంచి వేడి వేడి కాఫీ ఇంకొక సిప్ తీసుకుని, సుబ్బరామయ్య ముఖంలోకి కొన్ని క్షణాలు అలా చూస్తూ ఉండిపోయాడు. అతడి కళ్ళల్లో నీళ్ళు తిరగడం చూసి, ఫ్రెండ్ చేతిమీద చెయ్యివేసి అనునయంగా నొక్కాడు. సుబ్బరామయ్యకి ఐదేళ్ల మనవడు ఉన్న సంగతి తెలుసు రామిరెడ్డికి. కుక్కల బారినపడి చనిపోయిన ఆ పసివాడి స్థానంలో తన కొడుకునో, మనవడినో ఊహించుకున్న ప్రతి తండ్రికి, ప్రతి తాతకి కడుపులో దేవెయ్యక.., కళ్ళలో నీరు రాక మానదు. అంత దారుణంగా ఉంది ఆ సంఘటన.
''ఊరుకోరా సుబ్బరామయ్య... ప్రపంచంలో రోజూ ఏదో ఒక మూల ఇలాంటిది, ఏదో ఒక ఘోరమైన సంఘటన జరుగుతూనే ఉంటుంది. అన్నీ మన కంట్రోల్లో ఉండవు, ఏంచేస్తాం?'' ఓదార్చడానికి ప్రయత్నించాడు.
ఆ పసివాడి స్థానంలో తన మనవడిని ఊహించుకున్నప్పుడల్లా సుబ్బరామయ్యకి దుఃఖం తన్నుకొస్తోంది. ఏం మాట్లాడలేక బీచ్‌లో కెరటాలని చూస్తూ ఉండిపోయాడు కొంతసేపు. ఒక్కసారి గాఢంగా నిట్టూర్చి ''నిజమేరా, ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మన కంట్రోల్లో ఉన్న వాటి గురించి మనమేం చేస్తున్నాం?'' ప్రశ్నించాడు. గొంతులో జీర ఇంకా తగ్గలేదు.
''అంటే... నీ ఉద్దేశం ఆ వీధి కుక్కల గురించా?'' పేపర్లో ఆ వార్త పూర్తిగా చదువుతూ మళ్ళీ అన్నాడు ''ఒక్క హైదరాబాద్‌లోనే అటువంటి కుక్కలు లక్షల్లో ఉన్నాయట. మునిసిపాలిటీ వాళ్ళు వాటన్నిటికీ, అంటే మగ వాటన్నిటికీ వేసెక్టమీ చేయించారట. రాను రాను అలా వాటి సంఖ్య తగ్గిపోతుందన్నమాట. నాట్ ఏ బ్యాడ్ ఐడియా'' సాలోచనగా అన్నాడు రామిరెడ్డి.
''అవును వీధి కుక్కలు కదా ఏమైనా చేస్తారు. వేసెక్టమీ చేస్తారు, ఇంకేమైనా చేస్తారు. జనం గోల ఎక్కువైతే పట్టుకుని కాల్చి చంపేస్తారు. అంతే కదా? కుక్కలే కదా, కాల్చేయడం తేలికే'' బాధ వ్యంగ్యం కలిసి ఉన్నాయి సుబ్బరామయ్య గొంతులో.
రామిరెడ్డికి అర్థం కాలేదు వాడి మాటలవెనుక ఉన్న వ్యంగ్యం. కనుబొమలు ముడేసి సుబ్బరామయ్య మొహంలోకి చూశాడు ''ఏమిటి నువ్వంటున్నది'' అన్నట్టుగా. తనకి తెలిసినంత వరకు సుబ్బరామయ్య పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్) లో కానీ, జంతువుల హక్కుల పరిరక్షణ కార్యకర్తల సమూహంలో కానీ ఎప్పుడూ క్రియాశీలకంగా పాల్గొనలేదు. మరి తన మాటలకి అర్థం ఏమై ఉంటుంది?
సుబ్బరామయ్య చిన్నగా నవ్వాడు. ''ఈ మధ్య సుమారు రెండు నెలలు అవుతుందేమో, నూతన సంవత్సర ప్రారంభ సమయంలో అనుకుంటా, రెండు సంఘటనలు జరిగాయి. ఒకటి ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో బిజినెస్ క్లాస్‌లో ఎవరో బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌కి మందు ఎక్కువైపోయి పక్కసీట్లో ఆవిడ మీద ఉచ్చ పోసాడు. రెండోది ఢిల్లీలో అర్ధరాత్రి రోడ్డుమీద స్కూటర్ మీద వెళ్తున్న అమ్మాయిని ఎవరో కొంతమంది కారుతో గుద్దేసి, కారుతోపాటు ఈడ్చుకుంటూ పన్నెండు కిలోమీటర్లు లాక్కెళ్ళారంట. ఆ అమ్మాయి శరీరం గుర్తుపట్టలేనంతగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఆ కార్లో నలుగురో ఐదుగురో ఉన్నారని న్యూస్‌లో వచ్చింది. గుర్తున్నాయా?''.
''అవును గుర్తున్నాయి. ఆ ఎయిర్ ఇండియా న్యూస్ ఇప్పటికీ 'పీగేట్' అని వార్తల్లో వస్తూనే ఉంది''. కానీ ఈ కుక్కల గొడవకి వాటికీ సంబంధం ఏవిటో, సుబ్బరామయ్య ఇప్పుడా సంగతులు ఎందుకు గుర్తుచేస్తున్నాడో రామిరెడ్డికి ఇంకా అర్థం కాలేదు. ఏం చెబుతాడా అని ఎదురు చూశాడు.
''అదే కాదు, నిన్ననో మొన్ననో ఇంకో న్యూస్ కూడా వచ్చింది. సీనియర్స్ చేసే రాగింగ్ భరించలేక హాస్టల్లో ఒక యువకుడు ఆత్మ హత్య చేసుకున్నాడని, చూశావా?''. అవును చూశాను అన్నట్టుగా తలూపాడు రామిరెడ్డి. ఈ కుక్కల గొడవకి, మిగిలిన సంఘటనలకి ఎక్కడో కొంచెం లింకు దొరికినట్టు అనిపించింది రామిరెడ్డికి. స్నేహితుడి మొహంలోకి, పేపర్లో వార్త వైపు మార్చి మార్చి చూశాడు.
''వీధి కుక్కలు పిల్లల్ని చంపడం నీకు తెలిసి ఎన్ని సార్లు జరిగి ఉంటుంది చెప్పగలవా?''.
సుబ్బరామయ్య ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయో కొంచెం కొంచెం అర్థమవుతున్నాయి. ఎంతైనా నలభై ఏళ్ళ పైబడ్డ స్నేహం. ఒకరి ఆలోచనలు ఒకరికి చాలావరకు అర్థమవుతాయి. తను అనుకుంటున్నది నిజమైతే... ఉన్నట్టుండి గగుర్పాటు లాంటిది కలిగింది రామిరెడ్డికి. కళ్ళు ఆర్పకుండా సూటిగా ఫ్రెండ్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు, తన మనసులోని అనుమానం ఎక్కడ నిజం అవుతుందోనని!!!
రామిరెడ్డి మౌనం అర్ధం చేసుకున్న సుబ్బరామయ్య తనే తన ప్రశ్నకి జవాబు చెప్పాడు. ''మనకి తెలిసి చాలా కొద్ది సార్లు ఇలాంటివి జరిగి ఉంటాయి. కుక్కలు, లేదా వేరే జంతువులు పిల్లల్ని చంపడం, కదరా! కానీ మనం రోజూ పేపర్లో, టీవీలో, సోషల్ మీడియాలో ఏం చూస్తున్నాం? పసిపిల్లలు, యువతులు, ముసలివాళ్ళు అన్న తేడా లేకుండా గ్యాంగ్ రేప్‌లు చేసే రౌడీలు, అంతటితో వదలకుండా వాళ్ళని దారుణంగా నరికి చంపడాలు, రాగింగ్ పేరుమీద రకరకాల హింసకి గురిచేసి ఆత్మహత్యలకి గురిచేసేవాళ్ళు, ఫేసుబుక్ లో నగ చిత్రాలు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, అప్పులు కట్టలేదని కట్టినా కూడా తప్పుడు లెక్కలు చూపించి ఇంకా మరింత కట్టమని కొందరిని దారుణంగా హింసించడం, కట్టకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ పరువు తీస్తామని బెదిరించడం, అవి భరించలేక వాళ్ళలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకోడం... ఇలాంటివన్నీ ప్రతిరోజూ దేశంలో లెక్కలేనన్ని జరుగుతున్నాయి. ఈ వీధికుక్కలు చంపిన పిల్లలకంటే ఈ రెండు కాళ్ళ కుక్కల బారిన పడి చచ్చే వాళ్ళు వేలమంది ఉంటారు. అవునా కాదా? మరి ఈ రకం కుక్కలనన్నిటినీ ఏంచెయ్యాలి? కుక్కలు ఒక మనిషిని చంపాయని ఇంతగోల చేస్తున్నారు. అవి జంతువులు, వాటికి మంచి చెడ్డ జ్ఞానం ఉండదు. కానీ ఆ జ్ఞానం ఉన్న మనుషులు కుక్కల్లా ప్రవర్తిస్తుంటే వాళ్ళనేం చేయాలి?'' సుబ్బరామయ్యలో ఆవేశం, బాధ, ఏదో చేయాలన్న తపన, ఎలా చేయాలో తెలీని నిస్సహాయత... కళ్ళలో నీళ్ళు తెప్పిస్తున్నాయి.
తను అనుకున్నది నిజమయ్యేసరికి, ఏం మాట్లాడాలో తెలీని సందిగ్ధంలో పడిపోయాడు రామిరెడ్డి.
''ఒక సంగతి గమనించావటరా నువ్వు? ఆ ఫ్లైట్‌లో ఉచ్చ పోసిన వాడి విషయం రెండునెలలైనా ఇంకా దాని గురించి న్యూస్ వస్తూనే ఉంది. కానీ కారు కింద పడేసి దారుణంగా ఈడ్చుకువెళ్ళి అమ్మాయిని చంపేసిన న్యూస్ రావడం ఎందుకు మానేసింది? నేను రోజూ చూసే ఏ ఒక్క మీడియాలో కూడా ఆ న్యూస్ గురించి చెప్పడం లేదు. ఆ కార్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు, దానిమీద పోలీస్ ఎంక్వయిరీ ఎంతవరకు వచ్చింది...ఏమీ తెలీదు. మళ్ళీ ఈ మధ్య కూడా అచ్చం అలాంటి సంఘటనే ఇంకొకటి జరిగింది. దానిమీద కూడా ఎంక్వయిరీ ఏమవుతుందో బయటకు రాదు. అదే పనిగా ఇంటర్నెట్లో వెతికితే ఎక్కడో ఢిల్లీ లోకల్ పేపర్లలో మాత్రం ఆ న్యూస్ కనపడింది. ఆ కార్లో వాళ్ళనందరినీ అరెస్ట్ చేశారు. ఇంకా ఎవరెవరినో పట్టుకుని ఆరా తీస్తున్నారు. చూస్తుంటే కేసుని సాగదీసి నీరు కార్చేటట్టు ఉన్నారు''.
''ఒక్కోసారి పోలీస్ ఎంక్వయిరీ విషయాలు బయటికి వస్తే క్రిమినల్స్ జాగ్రత్త పడతారని అంటారు కదా, మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం'' తన మాటలు తనకే సంతృప్తిగా అనిపించలేదు రామిరెడ్డికి.
''హు... ఎందుకురా మనల్ని మనం మోసం చేసుకోడం. ఏమీ ఎందుకు తెలీదురా? స్కూటర్ని కారు గుద్దేసిందని తెలిసింది. ఆ కారు ఆగకుండా పన్నెండు కిలోమీటర్లు బాడీని ఈడ్చుకెళ్ళిందని తెలుసు. కార్లో ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. రెండునెలలు దాటుతోంది ఆ దారుణం జరిగి. మనం ఎన్ని చూడలేదు, వినలేదు? పెద్ద బాలీవుడ్ హీరో నడుపుతున్న కారు అదుపుతప్పి ఫుట్ పాత్ మీదకి ఎక్కితే ఐదారుమంది దిక్కూ మొక్కు లేని వాళ్ళు చచ్చిపోయారు. ఆ హీరో ఇప్పుడు కూడా తాపీగా సినిమాలు చేసుకుంటున్నాడు. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ కాస్తా పాతబడి ఏ నాలుగో పేజీ న్యూస్ అయిపోతే ఇక దాని సంగతి ఎవడూ పట్టించుకోడు. నాదొక సందేహం. ఇప్పుడా వీధికుక్కల చేతిలో చనిపోయిన పిల్లాడి తల్లిదండ్రులకి తమ బిడ్డ ఎలా చనిపోయాడు, కారణం ఏమిటి అనే విషయాల్లో ఒక క్లారిటీ ఉంది. ఆ సంగతి వెంటనే జీర్ణం కాకపోయినా, ఎంతో కొంత సమయం తరవాత వాళ్ళు ఆ దుఃఖంలోంచి బయటపడతారు. కానీ ఆ కారుకింద పడి చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించు. తమ కూతుర్ని ఎవరైనా కావాలని చంపారా లేక అది ఒక ఆక్సిడెంట్ అనుకోవాలా? ఆక్సిడెంట్ అయితే ఆ కారులో ఉన్నవాళ్ళని పట్టుకుని,వాళ్ళకి ఎంతోకొంత శిక్ష పడితే, దానికి ఒక ముగింపు వస్తుంది. కాలం నెమ్మదిగా ఆ గాయాన్ని మాన్పుతుంది. కానీ అసలు ఆ కార్లో ఎవరున్నారు, ఆక్సిడెంట్ అయితే, కారు ఆపి వెంటనే ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఒక్క నిమిషం నువ్వు ఆ పేరెంట్స్ స్థానంలో నిలబడి ఊహించుకో వాళ్ళ పరిస్థితి ఏమిటో? తమ కూతురు చావుకు కారణం ఏమిటి, ఆ కార్లో వాళ్ళకి ఇంకా ఎందుకు శిక్ష పడలేదు? ఆ తల్లిదండ్రులు ఎంతకాలం ఈ కోర్టుల చుట్టూ తిరగాలి?''.
ఇద్దరిమధ్యా కొంతసేపు మౌనం గోడలా నిల్చుంది. సుబ్బరామయ్య చెప్పినవన్నీ నిజంగా రోజూ పేపర్లో వచ్చే వార్తలే. ఇలాంటి వార్తలు, వాటికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు కూడా జనానికి ఎంటర్టైన్మెంట్ ఐపోయాయేమోనని దిగులు పడాల్సి వస్తోంది.
''మన చుట్టూ ఏం జరుగుతుందో అందరికీ తెలుసురా రామిరెడ్డి'' సుబ్బరామయ్య మాటలతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు.
''డబ్బు, పలుకుబడి, రాజకీయం... ఇవేగా మన పోలీస్ యంత్రాంగాన్ని, కోర్టులనీ నడిపిస్తోంది. అఫ్కోర్స్ మిగిలిన డిపార్ట్మెంట్లు అన్నీ సవ్యంగా ఉన్నాయని కాదు. అలాగని ప్రతి ఉద్యోగస్తుడు అవినీతిపరుడని నా ఉద్దేశం కాదు. ఎంత కాదన్నా కొన్ని నేరాలున్నాయి. ఈ రేప్ లు, పట్టపగలు రోడ్డుమీద నరికేయడాలు, ఇలాంటి వాటిల్లో కూడా సామాన్యుడికి న్యాయం దక్కకపోతే ఇక మన పోలీస్ వాళ్లమీద, లాయర్లు జడ్జీల మీద నమ్మకం, గౌరవం ఎలా ఉంటాయి?''. కొన్ని క్షణాలాగి మళ్ళీ అన్నాడు ''ఈ వీధి కుక్కల బెడద నించి ఎలాగోలా తప్పించవకోవచ్చు, మన జాగ్రత్తలో మనం ఉంటే. కానీ బయటికి కనపడకుండా మనిషి రూపంలో మనమధ్యే తిరుగుతున్న పిచ్చి కుక్కలనించి ఎలా తప్పించుకోడం? నిజాయితీ ఉన్న పోలీసులు నేరస్థులని పట్టుకుంటే, డబ్బున్నవాడు కోర్టులో ఆ కేసు కొట్టేయించగలుగుతున్నాడు. ఇవి చూసి విసుగెత్తిన పోలీసులు ఎవరినైనా ఎన్కౌంటర్ చేస్తే, వెంటనే హ్యూమన్ రైట్స్ కమీషన్స్ రెడీగా ఉంటాయి. యాసీన్ మాలిక్, కసబ్ లాంటి వాళ్ళని కూడా వెనకేసుకుని వచ్చేవాళ్ళు ఉన్న దేశం మనది. గోద్రా దారుణంలో, బిల్కిస్ బాను కేసులో హంతకుల్ని కూడా క్షమా భిక్ష పెట్టి వదిలేసే గొప్ప వ్యవస్థ మనది. ఇది మన సంస్కృతి గొప్పదనం అనుకుని రొమ్ములు విరుచుకోవాలో, లేక చేతకాని దద్దమ్మలమని తల వేళ్ళాడేసుకోవాలో తెలీని అయోమయంలో బ్రతుకుతున్నాం. ఐదారేళ్ల పసికందుని రేప్ చేసి గొంతు నులిమి చంపేస్తే, ఆ కిరాతకుడికి మరణశిక్ష వెయ్యడం మానేసి వాడికి కూడా జీవితంపై ఎన్నో ఆశలున్నాయి, వాడిక్కూడా చాలా భవిష్యత్తు ఉందని చెప్పిన జడ్జీ ఉన్న దేశం మనది. అలాంటి జడ్జిని అసెంబ్లీ గానీ, పార్లమెంటు గానీ ఎందుకు నిలదీయదు? అలాంటి జడ్జిమెంట్ చూసి మానవహక్కుల సంఘాలు ఆ పసిదానికి, తల్లిదండ్రులకి న్యాయం జరగాలని ఎందుకు పోరాడలేదు? ఇలాంటి యంత్రాంగం ఉన్నంతవరకూ రెండు కాళ్ళ పిచ్చి కుక్కలు మన మధ్యనే బెంజి కార్లలో తిరుగుతూ ఉంటాయి. నువ్వూ నేనూ ఇలా కాఫీ తాగుతూ వాళ్ళని కాసేపు తిట్టుకుని, మళ్ళీ పొద్దున్నే వాకింగ్‌కి వస్తాం. ఇదింతేనా? అయితే మనకీ, ఆ రోడ్డుపక్కన పడుకుని మౌనంగా ఇవన్నీచూస్తున్న పశువులకీ పెద్ద తేడా లేదనిపిస్తోంది. ఆ ఘోరం మనింట్లో జరిగేవరకూ మనకేం పట్టదు. అప్పుడు మాత్రం మనగోల పక్కింటోడు, చుట్టూ ఉన్న సమాజం పట్టించుకోవడం లేదని అందరిమీదా పడి ఏడుస్తాం. అలా అందరి మీద పడి ఏడ్చే హక్కు మనకెక్కడిది?''.
స్నేహితులిద్దరి మధ్యా మౌనం చదరంగం పోటీల్లో ప్రేక్షకుడిలా, చాలాసేపు చూస్తూ ఉండిపోయింది.
''ఒరే సుబ్బరామయ్య, నిన్నొకటి అడుగుతాను అపార్థం చేసుకోనంటే'' సంకోచిస్తూ అన్నాడు రామిరెడ్డి.
రెండు క్షణాలు స్నేహితుడి మొహంలోకి చూసి, సరే అడుగు అన్నట్టుగా తలూపాడు.
''నాకు ఇద్దరు అబ్బాయిలు, నీకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కదా! అమ్మాయి సంగతి అలా ఉంచు. నువ్వుగాని నేను గాని మన సొంత కొడుకులతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నామంటావ్?''.
టాపిక్ ఎటుపోతుందో అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు సుబ్బరామయ్య. ''నువ్వేం చెప్పాలనుకుంటున్నావ్?''.
''మనకి పెళ్ళిళ్ళు అయ్యేసరికి సుమారు ఇరవైయ్యారు, ఇరవైయ్యేడు ఏళ్లు దాటాయి కదా. ఆ తరవాత రెండు మూడేళ్లకి మొదటి బిడ్డ పుట్టాడు, అవునా?'' కొంచెం ఆగి, సమాధానం కోసం చూడకుండా మళ్ళీ తనే అందుకున్నాడు. ''మన మొదటి అబ్బాయిలకి టీనేజ్ వచ్చేసరికి అంటే వాళ్ళకి పదమూడేళ్ళు వచ్చేటప్పటికి... అప్పటికి మన వయసెంత? నలభై దాటింది కదా?''.
రామిరెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడో కొద్దిగా లింకు దొరికినట్టు అనిపిస్తోంది సుబ్బరామయ్యకి.
''మనకి నలభై వచ్చేటప్పటికి మన పిల్లలు టీనేజ్‌లో అడుగుపెట్టారు. అంటే మనం టీనేజ్‌లో ఎలా ఉన్నాం, ఏమేం తప్పులు ఒప్పులు చేశాం... వాళ్ళకి బొత్తిగా ఐడియా లేదు. నలభై ఏళ్ల వయసులో మన ప్రవర్తన పూర్తిగా వేరు. అవునా?''.
అవును అన్నట్టు సాలోచనగా తలూపాడు సుబ్బరామయ్య. రామిరెడ్డి తన సంభాషణ కొనసాగించాడు.
''పిల్లలెప్పుడూ తల్లిదండ్రుల ప్రవర్తన చూసి అనుకరిస్తారని కదా సైకాలజిస్టులు చెప్పేది. టీనేజ్‌లోకి అడుగుపెట్టిన మన పిల్లలు ఆ వయసులో ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేది, మనల్ని చూసి నేర్చుకునే అవకాశం లేదు... ఎందుకంటే మనం ఆ వయసు దాటేసాం. వాళ్ళు మరి ఎవరిని చూసి నేర్చుకుంటారు? వాళ్ళ క్లాస్ మేట్స్ నించి, లేకపోతే అదే వయసున్న చుట్టాల పిల్లల దగ్గరనించి. అంటే ఏ వయసులో అయితే పెద్దవాళ్ళ గైడెన్స్ అనేది ఎక్కువగా అవసరమో, ఆ వయసులో అది వాళ్ళకి దొరకడం లేదు. పక్కవాడు ఏం చేస్తే అదే గొప్ప అనుకునే వయసు అది''.
''రేరు... నువ్వు ఏ యాంగిల్ నించి వస్తున్నావో అర్ధం అవుతోంది. కానీ మనం కూడా అవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం కదా. ఆ రోజుల్లో ఇలాంటి దారుణాలు ఎన్ని చూశాం?''.
''చూడలేదు నిజమే. కానీ సుబ్బరామయ్య, అప్పటికి ఇప్పటికీ ఏమేం మార్పులు వచ్చాయో నీక్కూడా తెలుసు. మన టీనేజ్ అంటే సుమారు యాభై యాభై అయిదేళ్ళ ముందు, 1965-70 టైములో మన ఇండియాలో పరిస్థితులు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మనం సెలవు రోజుల్లో ఏం ఆడుకునేవాళ్ళం... గోళీకాయలు, కర్రా బిళ్ల, బావుల్లో కాలవల్లో ఈత, కొంచెం పెరిగిన తరవాత మహా అయితే సందులో క్రికెట్.. అంతే కదా. ఇంట్లో రేడియోలో పాటలు, ఎప్పుడన్నా అమ్మా నాన్నతో కలిసి సినిమా.... అదీ మనకున్న వినోదం. ఇంట్లో నాన్నని చూసినా, స్కూల్లో టీచర్ ని చూసినా నిక్కర్ తడుపుకునే వాళ్ళం. కార్లు స్కూటర్ల సంగతి వదిలేయి, అప్పట్లో పదో క్లాస్ లో గాని ఇంటర్మీడియట్ లో గాని మనలో ఎంతమందికి సొంత సైకిల్ ఉండేది? నాకయితే లేదురా''.
''ఓకే, నీవు చెప్పదలుచుకున్న పాయింట్ నాకు అర్థమైంది. మన పిల్లలు టీనేజ్ కి వచ్చిన తరవాత మనం వాళ్ళని కొడుకులాగా, కూతురులాగా కాకుండా ఒక మంచి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి ఉండాల్సింది. మనలో చాలామంది ఆ పని చెయ్యలేదు. దానికి తోడు ఈ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ లో ప్రపంచం అంతకు ముందెప్పుడూ లేనంత ఫాస్ట్‌గా మారిపోయింది, యే విషయంలో చూసినా. ప్రత్యేకంగా టెక్నాలజీ విషయంలో మనం మన పిల్లలతో పాటు అప్డేట్ అవ్వలేకపోయాం. వీటన్నిటికంటే దరిద్రం ఈ జెనరేషన్ పిల్లలని ఆల్కహాల్, డ్రగ్స్ ఎంతగా ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నాయో తలుచుకుంటేనే భయంగా ఉంది''.
''అరే సుబ్బరామయ్య, మనం ఒక సంగతి సిన్సియర్‌గా ఒప్పుకోవాలి. మన పిల్లలకి ఇవ్వాల్సినంత గైడెన్స్ మనం ఇవ్వలేదు. అప్పట్లో ఆ అవసరం ఉందని మనకి తట్టలేదు. ఇప్పుడు చేతులు కాలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం చెయ్యవలసింది ఒక్కటే. నెక్స్ట్ జెనరేషన్ వాళ్ళని హెచ్చరించడం. ప్రాబ్లం వచ్చినప్పుడల్లా , దానికి కారణం బయట సమాజం, ప్రభుత్వం అని గొంతు చించుకోకుండా , మన బాధ్యత ఎంతవరకూ ఉందో ముందు ఆలోచించడం నేర్చుకోవాలి. తల్లి తండ్రులుగా మన పిల్లలకి కావలసిన గైడెన్స్ మనం ఇవ్వగలగాలి. అలా చేయాలంటే ముందుగా మనం వాళ్ళని పిల్లలుగా కాకుండా, ఫ్రెండ్స్ గా చూడడం నేర్చుకోవాలి. మార్పు అనేది మన ఇంటిలోనించే మొదలవుతుందని ఒప్పుకోవాలి . అంతవరకూ ఈ రెండు కాళ్ళ కుక్కల దాడులు పెరుగుతూనే ఉంటాయి .ఈ దారుణాలు జరుగుతూనే ఉంటాయి. మనం ఇలా వాకింగ్ చేసుకుంటూ కాఫీ తాగి సొల్లు మాట్లాడుకునే రోజులు వచ్చి పోతూనే ఉంటాయి''.
- డా. రజనీకాంత్, 7386167202