Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మా.. తల్లీ.. ఆడ'మనీష'వై పుట్టావా? అదీ దళిత కులంలో. నీకంటూ సొంత ఆశ, సొంత కల ఉండకూడదు కదమ్మా.. సొంత బతుకు లేనప్పుడు అవెలా సాధ్యం? ఆడపిల్లకు ఈడొచ్చినకొద్దీ మిఠాయికోసం కుక్కలు చొంగ కారుస్తున్నాయి. మాంసం కోసం మృగాలు వేటాడుతున్నాయి.
చుట్టూతా రాక్షసమూకలు ముసుగులతో సంచరిస్తున్నప్పుడు నిన్ను నీవు ఎలా కాపాడుకోగలవమ్మా? ప్రతిక్షణమూ నీకు ప్రమాదమే కదా..
ఇప్పుడు నీ ఎదుగుదలే కాదు, నీ ఉనికే నీకు శాపంగా మారిందిగా తల్లీ.. రాముడు అక్కడే పుట్టాడని గుడికడుతున్నారు. పవిత్ర గంగానదీ అక్కడే ప్రవహి స్తున్నది. ఆ భక్తులు నీకు రక్షణ ఇవ్వలేక కురుసభ పేక్షకపాత్ర వహిస్తున్నారు తల్లీ..
ఇది ఈనాటిది కాదు. యుగాల ఘోష. తరాల వధ. వేదాలు చదివాడని మన ముత్తాత రాముని చేతిలో అంతమయ్యాడు. అంతకు ముందే ప్రశ్న కారణంగా రేణుకాంబతల్లి పరశురామునిచేతిలో...
ఇప్పటికీ ఎంతోమంది నాటి నుంచి నేటివరకూ ఈ భారత వ్యధశిల నెక్కుతున్నారు. వర్ణాశ్రమధర్మం రాజ్యమేలుతూనే ఉన్నది. ఇప్పుడు నిర్భయ చెల్లిగా నీవంతు వచ్చింది. అంతే.. ఉద్యమాలు వస్తున్నాయి. చట్టాలు పుడుతున్నాయి. వస్తున్న వందల వేల కేసుల్లో శిక్షలు పడుతున్నది ఒకటో.. అరా అంతేగా..
దుశ్శాసునులందరూ రారాజు తమ్ముళ్ళేమరి. ఏం చేద్దాం. శౌర్యం, ప్రతాపం, ఛాతి పొడవు అన్నీ చేతగాని తప్పుడు మాటలు తల్లీ. కరుణామయుడు క్రీస్తురక్తం భువిని తాకరాదని తల్లులూ చెలిళ్లూ ధవళ వస్త్రాలు పరిచారు. దోసిళ్ళు పట్టారు. నీ రక్తం ఈ భూమిని తాకరాదని చేప్పేందుకు మా చట్టాలు, మా పాలనకు చేతులు చాలడం లేదు తల్లి. నీకు ఆలనగా మా మగజాతి హృదయం (ఉంటే) ఆ స్థాయి ఎదిగేందుకు ఇంకెతకాలం పడుతుందో తెలియదు తల్లీ.. మమ్మల్ని క్షమించు.
- కె. శాంతారావు
సెల్: 9959745723