Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సాయుధ వివాదాన్ని మరింతగా కొనసాగించటంలో రెండు శక్తులకు పరస్పర ప్రయోజనం ఉంది, దీన్ని సాకుగా చూపి పౌరశక్తులకు అధికారాన్ని బదలాయించకుండా చూస్తున్నాయని'' సూడాన్ కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి సాలె మహమ్మద్ సూడాన్ పరిణామాలపై చెప్పారు. ఈ వివాదంలో ఆర్ఎస్ఎఫ్కు మద్దతు ఇవ్వటం ద్వారా ఎఫ్‌ఎఫ్‌సి కూటమి తన విశ్వసనీయతను కోల్పోయిందని గతంలో ఆ సంస్థలో ఒక ప్రధాన భాగస్వామిగా ఉండి తరువాత వెలుపలికి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే విప్లవ కార్యాచరణకు తిరిగి ఉపక్రమించటం, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచటం తప్ప మరొక మార్గం లేదని కూడా పేర్కొన్నది.
ఆఫ్రికాలోని కీలక దేశమైన సూడాన్‌లో పారా మిలిటరీ-మిలిటరీ మధ్య కానసాగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు ఆరువందల మందికి పైగా మరణించగా ఐదువేల మంది గాయపడినట్లు వార్తలు. అమెరికా మార్గదర్శకత్వంలో సూడాన్ మిలిటరీ-పారామిలిటరీ మధ్య రంజాన్ మాసంలో కుదిరిన ఒప్పందాలు విఫలమయ్యాయి. దీంతో అక్కడ శాంతి, భద్రతలు భగం కావటానికి కారకులైన వ్యక్తుల మీద ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించాడు. తరువాత వైరి పక్షాల మధ్య రాజీకుదిర్చేందుకు చైనా రంగంలోకి దిగుతుందా అన్న చర్చ మొదలైంది. మిలిటరీకి అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మద్దతు ఉండగా పారామిలిటరీకి పశ్చిమాసియా, మధ్యప్రాచ్యం లోని కొన్ని దేశాల మద్దతు ఉంది. సంక్లిష్టమైన ఈ వివాదంలో చైనా ఏ పక్షమూ వహించటం లేదన్న ఒక్క సానుకూల అంశం తప్ప సయోధ్య కుదుర్చటం, కుదరటం అన్నది అంత తేలిక కాదు. ఆఫ్రికా సమస్యలను ఆఫ్రికాయే పరిష్కరించు కోవాలి అన్న ఆఫ్రికా యూనియన్ వైఖరిని గౌరవిస్తున్న చైనా ఏ దేశ వివాదంలోనూ ఒక పక్షం వైపు మొగ్గలేదు.
ఆఫ్రికాలో పశ్చిమ దేశాల భూ సంబంధ రాజకీయాలకు బలైన దేశాల్లో సూడాన్ ఒకటి. బ్రిటిష్ వలస పాలన నుంచి 1956లో విముక్తి పొందిన తరువాత అక్కడ శాంతి లేదు. అంతకు ముందు ఈజిప్టు ఆక్రమణలో తరువాత బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నప్పుడు దక్షిణ, ఉత్తర సూడాన్ ప్రాంతాలుగా ఉంది. బ్రిటిష్ వారు వైదొలుగుతూ ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా రెండు ప్రాంతాలను ఒకే దేశంగా చేశారు. అప్పటి నుంచి దక్షిణ సూడాన్ పౌరులు ప్రభుత్వంలో తమ ప్రాతినిధ్యం పెరగాలని, తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. నిరాకరించటంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. మధ్యలో పది సంవత్సరాలు తప్ప 1956 నుంచి 2005వరకు అది కొనసాగి ఐదు నుంచి పదిలక్షల మంది ప్రాణాలు తీసుకుంది. 2011లో దక్షిణ సూడాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. అవిభక్త సూడాన్‌లో, తరువాత పదకొండు మిలిటరీ కుట్రలు, తిరుగుబాట్లు జరిగాయి. అంతర్యుద్ధంలో పాలకులు కిరాయి మూకలను సమీకరించి డార్ఫర్, ఇతర ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాన్ని అణచివేశారు. తరువాత వాటిని 2013లో పారామిలిటరీగా మార్చారు. ఇటీవలి అధికార పంపిణీలో మిలిటరీ నేత, పారామిలిటరీ నేతలు ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు అధికార వ్యవస్థను ఆక్రమించారు. పారామిలిటరీని మిలిటరీలో ఎప్పుడు విలీనం కావించాలన్న అంశంపై ఒప్పందానికి భిన్న భాష్యాలు చెప్పి అధికారం కోసం జరిగిన కుమ్ములాటల కారణంగా రెండింటి మధ్య అంతర్యుద్ధం మొదలైంది. జనం నలిగిపోతున్నారు. అణచివేతలో ఇద్దరూ ఇద్దరే.
సూడాన్‌లో వర్తమాన పరిణామాలను చూస్తే ఏడు లక్షల మంది పౌరులు నిర్వాసితులైనట్లు ఐరాస సంస్థ వెల్లడించింది. రాజధాని ఖార్టూమ్ పరిసర ప్రాంతాల మీద విమానదాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాలన్నీ ఖాళీగా ఉన్నాయి. మరోవైపు అమెరికా-సౌదీ ప్రతిపాదన మేరకు సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో మిలిటరీ-పారా మిలిటరీ ప్రతినిధుల మధ్య తొలిసారిగా ముఖాముఖీ కాల్పుల విరమణ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బాంకులు, ఏటిఎంలు పని చేయటం లేదు. చమురు కొరత, ధరల పెరుగుదలతో జనం సతమతమవుతున్నారు. రాజధానిలో ఎక్కువ ప్రాంతాలు పారా మిలిటరీ ఆధీనంలో ఉన్నాయి. వారిని దెబ్బతీసేందుకు మిలిటరీ వైమానిక దాడులు జరుపుతున్నది. రాజధానిలో కాల్పుల విరమణకు పారామిలిటరీ (ఆర్ఎస్ఎఫ్) అంగీకరించకుండా ఒప్పందం కుదిరే అవకాశం లేదని మిలిటరీ అధికారి అల్ బుర్హాన్ చెప్పాడు. ఆర్ఎస్ఎఫ్ పౌరులను రక్షణగా చేసుకుందని, సేవా కేంద్రాలను ఆక్రమించిందని ఆరోపించారు. విమానాలను కూల్చివేసేం దుకు పారా మిలిటరీ క్షిపణులను సంధిస్తున్నట్లు వార్తలు.
చైనా నిజంగా సూడాన్‌లో రాజీ కుదుర్చుతుందా లేదా అన్నది అనేక అంశాల మీద ఆధారపడి ఉంది. సంక్లిష్టత రీత్యా అంత తేలికగాకపోవచ్చు. సూడాన్ పరిణామాలను గమనించినప్పుడు అక్కడ భద్రతా దళాల మధ్య హింసాకాండ ప్రబలటమే అమెరికా పెత్తనం దిగజారుడుకు ఒక నిదర్శనం అని, అది ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో భాగమే అని కొందరు చెబుతున్నారు. అమెరికా, దాని అనుచరులుగా ఉన్న ఇతర పశ్చిమ దేశాల ప్రమేయం లేకుండా ప్రపంచంలో ఏదీ జరగదని బలంగా ఉన్న నమ్మకం సడలుతున్నది. ఈ దేశాల నేతలు ఊహించని పరిణామాలు చోటు చేసుకోవటం, అవి పెద్దన్న అమెరికా ప్రమేయం లేకుండా జరగటం పెద్ద చర్చగా మారింది. ఇరాక్ మీద దాడి చేసి అమెరికా చేతులు కాల్చుకుంది. ఇప్పుడు అక్కడ అమెరికా పలుకుబడి ఎంత అన్నది ప్రశ్నార్థకం. తరువాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి అవమానకరంగా తాలిబాన్లకు సలాం కొట్టి బతుకుజీవుడా అంటూ ఎక్కడి ఆయుధాలను అక్కడే వదలి కట్టుబట్టలతో అమెరికా మిలిటరీ పారిపోవటం తెలిసిందే. అది శిక్షణ ఇచ్చిన మిలిటరీ కూడా అమెరికాను ఆదుకోలేకపోయింది. దీని అర్థం అమెరికా కథ ముగిసినట్లు కాదు.
రెండు ప్రపంచ యుద్ధాల్లో మిగతా దేశాలతో పోల్చితే అమెరికా లాభపడింది తప్ప నష్టపోయింది లేదు. తిరుగులేని మిలిటరీ, ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఐరోపా పునరుద్దరణ పేరుతో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి నాటో మిలిటరీ కూటమి పేరుతో ఐరోపాను తన చక్రబంధంలో బిగించుకుంది. ఇతర ఖండాలను కూడా తన కౌగిలిలోకి తెచ్చుకొనేందుకుగాను 80దేశాలలో 800మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది. అట్లాంటిక్ సముద్రంలో ఆరవ నౌకాదళాన్ని, పసిఫిక్ - హిందూ మహా సముద్రంలో సప్తమ నౌకాదళం, పర్షియన్ గల్ఫ్Ûలో పంచమ నౌకదళాన్ని మోహరించింది. అంటే అన్ని ఖండాల చుట్టూ త్రివిధ దళాలను మోహరించింది. దానికి గాను రకరకాల సాకులు చెబుతున్నది. ఇదంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే కమ్యూనిజం, దానికి ఆలవాలంగా ఉన్న పూర్వపు సోవియట్, వర్తమాన సోషలిస్టు చైనా, ఇతర సోషలిస్టు దేశాల పలుకుబడిని నిరోధించేందుకు అని ప్రపంచాన్ని నమ్మించింది. ఇంతటి శక్తి కలిగి ఉండి కూడా 1960, 70 దశకాల్లో వియత్నాం కమ్యూనిస్టు మిలిటరీ, గెరిల్లాల చేతుల్లో చావుదెబ్బతిన్నది. ఆప్ఘనిస్తాన్‌లో తాను పెంచి పోషించిన తాలిబాన్ల చేతుల్లో అవమానాలపాలైంది. ఇప్పుడు ఉక్రెయిన్‌లో అక్కడి మిలిటరీ, కిరాయి మూకలకు ఆయుధాలు అందిస్తూ పరోక్షంగా పోరు సాగిస్తున్నది. అదే చైనాను చూస్తే ఆఫ్రికాలోని జిబౌటీలో అనేక దేశాలతో పాటు తాను కూడా ఒక సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇదిగాక మయన్మార్ బంగాళాఖాతంలోని కోకో దీవుల్లో, సంకేతాలను పసిగట్టే ఒక కేంద్రాన్ని, తూర్పు తజికిస్థాన్, లావోస్, దక్షిణ చైనా సముద్రంలో ఒక ఆరు చిన్న మిలిటరీ పోస్టులను ఏర్పాటు చేసింది. అమెరికా తన మిలిటరీని చూపి ప్రపంచాన్ని భయపెడుతుంటే చైనా తన దగ్గర ఉన్న మిగులు డాలర్లను ప్రపంచంలో వివిధ దేశాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర పథకాల మీద ఖర్చు పెడుతున్నది, రుణాలు ఇస్తున్నది.
ఆర్థిక, మిలిటరీ, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఎంతో ముందున్న తమ దేశం క్రమంగా తన పలుకుబడిని ఎందుకు కోల్పోతున్నదనే చర్చ అటు అమెరికాలోనూ ఇటు ప్రపంచంలోనూ రోజు రోజుకూ బలపడుతున్నది. సోవియట్ కూలిపోయి, కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గగానే చరిత్ర ముగిసింది, పెట్లుబడిదారీ విధాన ప్రవాహానికి ఎదురు లేదు. ప్రచ్చన్న యుద్ధంలో తమదే గెలుపు అని అమెరికా ప్రకటించుకున్న తరువాత గడచిన మూడు దశాబ్దాల్లో చరిత్ర వేరే విధంగా నమోదవుతున్నది. అమెరికా విధాన నిర్ణేతలు, వ్యూహకర్తలు కలలో కూడా ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అమెరికా ఆటకు అనుగుణంగా చైనా నడుచుకుంటుందని భావించి 1970దశకంలో దాన్ని అసలైన చైనాగా గుర్తించారు. తరువాత 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థలోకి అనుమతించారు. అప్పుడు చైనా విదేశీమారకద్రవ్య నిల్వలు కేవలం 200 బి.డాలర్లు మాత్రమే, అవి 2023 జనవరి నాటికి 3,379 బి.డాలర్లకు చేరాయి. ఇంత భారీ మొత్తం ఉంది కనుకనే అనేక దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు అవకాశం వచ్చింది. వాటి కోసం మొహం వాచి ఉన్న దేశాలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. వందల కోట్ల డాలర్లను పెట్టుబడులు, అప్పుగా తీసుకుంటున్నాయి. ఎక్కడా మిలిటరీ కేంద్రాలను పెట్టటం లేదు గనుక దాని మీద అనుమానాలు కూడా లేవు. ఇస్లామిక్ దేశాల మధ్య షియా-సున్నీ విభేదాలను అన్ని దేశాలను తన అదుపులో ఉంచుకోవాలని చూసింది. చివరికి దానికి కూడా తెరపడింది. షియా ఇరాన్-సున్నీ సౌదీ అరేబియాలను చైనా దగ్గరకు చేర్చింది. ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణలకు తెరపడేందుకు ఆ ఒప్పందం దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ప్రాంతీయ, దేశాల అంతర్గత వివాదాలకు దూరంగా ఉండటమే చైనా పలుకుబడిని పెంచుతున్నవాటిలో ఒకటి.
నాటోలో భాగంగా అమెరికాతో స్నేహం చేస్తూనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ ఇటీవలి బీజింగ్ పర్యటనలో మాట్లాడిన తీరు అమెరికాను బిత్తరపోయేట్లు చేసింది. తన వెనుక ఉన్న వారు ఎప్పుడేం చేస్తారో అన్న అనుమానాలను పెంచింది. తైవాన్ అంశంపై అమెరికా బాటలో నడిచేది లేదని, చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్య కలిగి ఉంటామని మక్రాన్ చెప్పాడు. వందల కోట్ల లాభదాయక ఒప్పందాలను ఫ్రెంచి కంపెనీలకు సాధించటంలో మక్రాన్ చొరవ చూపాడు. ఒక్క ఫ్రాన్సే కాదు జర్మనీ వైఖరి కూడా అలానే ఉంది. డాలరు పెత్తనానికి తెరదించాలన్న అభిప్రాయం రోజు రోజుకూ బలపడుతున్నది. నిజానికి అనేక దేశాల మీద ఆంక్షలు విధిస్తూ అమెరికా దాన్ని ముమ్మరం చేస్తున్నది. మొత్తం మీద చూసినప్పుడు నూతన ప్రపంచ వ్యవస్థ రూపుదిద్దు కుంటున్నది. అది అమెరికా-పశ్చిమ దేశాల కేంద్రంగా జరగటం లేదు. ఏక ధృవ కేంద్రానికి బదులు రెండు లేదా అంతకు మించి ఎక్కువ అధికార కేంద్రాలున్నప్పుడు దేశాలకు ఎంచుకొనే అవకాశాలు పెరుగుతాయి.
''సాయుధ వివాదాన్ని మరింతగా కొనసాగించటంలో రెండు శక్తులకు పరస్పర ప్రయోజనం ఉంది, దీన్ని సాకుగా చూపి పౌరశక్తులకు అధికారాన్ని బదలాయించకుండా చూస్తున్నాయని'' సూడాన్ కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి సాలె మహమ్మద్ సూడాన్ పరిణామాలపై చెప్పారు. ఈ వివాదంలో ఆర్ఎస్ఎఫ్కు మద్దతు ఇవ్వటం ద్వారా ఎఫ్‌ఎఫ్‌సి కూటమి తన విశ్వసనీయతను కోల్పోయిందని గతంలో ఆ సంస్థలో ఒక ప్రధాన భాగస్వామిగా ఉండి తరువాత వెలుపలికి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే విప్లవ కార్యాచరణకు తిరిగి ఉపక్రమించటం, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచటం తప్ప మరొక మార్గం లేదని కూడా పేర్కొన్నది.
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288