Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజంగా బీసీలపై బీజేపికి ప్రేమే ఉంటే దేశవ్యాప్తంగా బీసీ కుల గణన తీయాలి. మండల కమిషన్ సిఫార్సులన్నింటిని అమలు జరుపాలి. బీసీల జనభా దమాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు వర్తింపచేయాలి. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ను ప్రవేశపెట్టడంతో పాటు పటిష్టంగా అమలుచేయాలి. 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను జనరల్ కేటగిరీగా భావించి దానికి అన్ని తరగతులలోని పేదలను అర్హులుగా చేయడం ద్వారా లోపాన్ని సరిదిద్దాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ల వలె రాజ్యాంగబద్ద హోదా బీసీ కమిషన్లకు కూడా కల్పించాలి. ఇవి చేయకుండా ఉన్న రిజర్వేషనన్లను రాజకీయ లబ్థికోసం వాడుకుంటూ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి ఓట్లు వేయించకోవాలని చూస్తే తెలంగాణ సమాజం తగిన గుణపాఠం చెబుతుంది.
''రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్ను రద్దుచేస్తామని, ఆ ఫలాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు దక్కేలా చూస్తాం' అని ఇటీవల చేవెళ్లలో జరిగిన 'విజయ సంకల్ప సభ'లో కేంద్ర హౌంమంత్రి అమిత్షా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. రిజర్వేషన్లపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం బీజేపి నేతలకు కొత్తేమి కాదు. దేశ భద్రతను కాపాడే స్థానంలో ఉన్న అమాత్యుల వారే ఇలా మాట్లాడటం అభ్యంతరకరమే. ఇటీవల కర్నాటకలో ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లను రద్దుచేసి ఆ స్థానంలో రెండుశాతం ఒక్కలిగలకు మరో రెండు శాతం లింగాయతలకు బదిలీ చేస్తూ అక్కడి బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణాలో కూడా తాము అధికారంలోకి వస్తే ఈ విధంగానే చేస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణా సమాజాన్ని చీల్చడానికి, శాంతియుతంగా ఉన్న ప్రజలమధ్య చిచ్చుపెట్టేందుకు ఉపయోగపడేలా ఉన్నాయి.
సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సమూహాలను సమానత్వంలోకి తీసుకురావడానికి రిజర్వేషన్లు కల్పిస్తారు. వివిధ దేశాల్లో కొన్ని జాతి ప్రాతిపదికన, మత ప్రాతిపదికన ఆర్థిక వెనుకబాటుతనం పేరుతో రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. మన దేశంలో స్వాతంత్య్రానికి ముందే జ్యోతిబాపూలే స్పూర్తితో సాహుమహరాజ్ కొల్లాపూర్ సంస్థానంలో 1902లోనే బ్రాహ్మణేతర కులాల వారికి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ట్రావన్కోర్, బరోడా, మద్రాస్ ప్రెసిడెన్సీలలో కూడా బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. వేల సంవత్సరాలు సామాజిక అణిచివేతకు గురైన ఎస్.సి.లకు అంబేద్కర్ కృషి వల్ల 1935లో ప్రాతినిధ్య సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చాయి. స్వాతంత్య్రానంతరం రాజ్యాంగం ద్వారా ఎస్సీలతోపాటు ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. బీసీల విషయం రాష్ట్రాలకు వదిలేస్తూ కేంద్రం చేతులు దులుపుకుంది. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజ్యాంగానికి లోబడి రిజర్వేషన్లు కల్పించాయి. మండల్ కమిషన్ రిపోర్టు తర్వాత దేశం మొత్తం బీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాల సుబ్రహ్మణ్యం కమిషన్ సూచనల ప్రకారం 2005లో ముస్లింలలోని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన 14 కులాలను బీసీ-ఇ గ్రూపులో చేర్చడం జరిగింది. తద్వారా బీసీ-ఇ గ్రూపులో వారికి 4 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. అన్ని రాకాల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు పెట్టిన 50 శాతం పరిమితికి మించకుండా బీసీ రిజర్వేషన్లు 25 నుండి 29 శాతానికి పెంచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నియమించిన బి.ఎస్. రాములు కమిషన్ 4శాతం ఉన్న బీసీ-ఇ గ్రూపు రిజర్వేషన్లను మరో 8శాతం పెంచి 12శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏప్రిల్ 2017లో సిఫారసు చేసింది.ఈ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో ఆమోదించి, కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి కూడా పంపగా కేంద్రం నేటికీ ఆమోదించలేదు.
మండల్ కమిషన్ సిఫారసులను వ్యతిరేకిస్తూ బీజేపి, ఆర్ఎస్ఎస్ శక్తులు కమండల్ పేరుతో రామ జన్మభూమి, బాబ్రీ మసీదు చర్చను ముందుకు తీసుకొచ్చి ఉద్యమించి బీసీలకు తీరని అన్యాయం చేశారు.అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో బీజేపి నేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలన్న అభిప్రాయాన్ని గతంలో బహిరంగంగానే ప్రస్తావించారు. కొందరు కేంద్ర మంత్రులు, ఎంపిలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూనే ఉన్నారు. తద్వారా తమ సహజమిత్రులైన అగ్రవర్ణాలను సంతృప్తి పరుస్తుంటారు. మాటలే కాదు, చేతల్లో చూపడానికి అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చేశారు. ఈ సవరణను సుప్రీంకోర్టు సైతం సమర్థించించింది. అంతటితో ఆగకుండా ఈ 10శాతం రిజర్వేషన్లు ఇప్పటివరకు రిజర్వేషన్ అనుభవించని తరగతు లకు (నాన్ రిజర్వుడ్ కేటగిరీకి) మాత్రమే వర్తింపచేయాలని ధర్మాసనం పేర్కొన్నది. నిత్యం రిజర్వేషన్లపై తమ అక్కసు వెళ్లబుచ్చే బీజేపి నేతలు ఏ ఒక్కరూ ఈ తీర్పు పట్ల మాట్లాడలేదు. ఈ పరిణామాలతో ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాల్లో ప్రభుత్వం పట్ల, పాలక పార్టీ పట్ల సహజంగానే వ్యతిరేకత పెరిగింది. జనభాలో 50శాతానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ శాతాన్ని 27 శాతం మాత్రమే అమలు చేస్తున్నారరు. ఈ 27శాతం అమలు కూడా లోప భూయిష్టంగా ఉంది. ఉన్నత విద్యాసంస్థల్లో మెరిట్ సాధించిన బీసీ విద్యార్థులను రిజర్వేషన్ జనరల్ కేటగిరిలో కాకుండా రిజర్వేషన్ కేటగిరిలో చూపించి మోసం చేస్తున్నారు. వీటన్నింటి కారణంగా బీసీలలో ఈ వ్యతిరేకత మరింత ఎక్కువగా ఉంది. ఈ వ్యతిరేకతనుండి బయటపడటంతోపాటు, బీసీలకు దగ్గరవ్వడానికి బీజేపి దేశవ్యాప్తంగా పడరాని పాట్లు పడుతుంది. 'కడుపులో లేని ప్రేమను కౌగిలింతలో చూపాలనుకుంటుంది.' అందులో భాగంగానే కర్నాటకలో రిజర్వేషన్ల బదలాయింపు నిర్ణయం. తెలంగాణాలో కూడా ఆ విధంగానే ఈ తరగతులకు దగ్గరయ్యే ఎత్తు గడలో భాగంగానే 'షా' ఈ వ్యాఖ్యలు చేశారనిపిస్తుంది. బీసీలకు తమ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకోవడంతోపాటు ముస్లింల మీదికి బీసీలను ఉసిగొల్పి తద్వారా హిందువుల ఓట్లను దండుకోవడమే అసలు లక్ష్యం. 'ఒక్క దెబ్బకు రెండు పిట్టలు' అన్నట్లు హిందూ ఓట్ల పోలరైజేషన్ చేసుకోవడం, బీసీలలో వ్యతిరేకతను తగ్గించుకోవడం. దీంతో ముస్లింలు తమ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారనే భావన పెరిగి బీసీలకు, ముస్లింలకు ఘర్షణలు సృష్టించాలనే కుట్రలు దాగి ఉన్నాయి. హైదరాబాద్ పాతబస్తీ లాంటి చోట మతఘర్షణలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
రిజర్వేషన్లు సర్వజనులందరిని సమానంగా మార్చలేకపోవచ్చు కానీ అసమానతల సమాజంలో కొంతైనా ఊరటనిస్తాయి. సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్ల అవసరం కచ్చితంగా ఉంటుంది. గ్లోబలైజేషన్, ప్రయివేటైజేషన్ పుణ్యమా అని రిజర్వేషన్లు సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. అన్ని రకాల రిజర్వేషన్లకు వ్యతిరేకమైన బీజేపి, మైనార్టీల రిజర్వేషన్లను బీసీలకు బదలాయిస్తామనడంలో అసలు కుట్రలేమిటి?. ముస్లింలు విద్యతోపాటు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటి వారికి ఉన్న రిజర్వేషన్లు ఎత్తేయడం నష్టదాయకమే. నిజంగా బీసీలపై బీజేపికి ప్రేమే ఉంటే దేశవ్యాప్తంగా బీసీ కుల గణన తీయాలి. మండల కమిషన్ సిఫార్సులన్నింటిని అమలు జరుపాలి. బీసీల జనభా దమాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు వర్తింపచేయాలి. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ను ప్రవేశపెట్టడంతో పాటు పటిష్టంగా అమలుచేయాలి. 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను జనరల్ కేటగిరీగా భావించి దానికి అన్ని తరగతులలోని పేదలను అర్హులుగా చేయడం ద్వారా లోపాన్ని సరిదిద్దాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ల వలె రాజ్యాంగబద్ద హోదా బీసీ కమిషన్లకు కూడా కల్పించాలి. ఇవి చేయకుండా ఉన్న రిజర్వేషనన్లను రాజకీయ లబ్థికోసం వాడుకుంటూ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి ఓట్లు వేయించకోవాలని చూస్తే తెలంగాణ సమాజం తగిన గుణపాఠం చెబుతుంది.
- ఉడుత రవీందర్
9490098487