Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నాటక శాసనసభ ఎన్నికల తేదీ దగ్గరైన కొద్ది బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ఆశలు ఆవిరైపోతున్నాయి. అత్యధిక సర్వేలు, అభిప్రాయ సేకరణలు కాంగ్రెస్‌కే అనుకూలతను చూపిస్తున్నాయి. మూడు సర్వేలు కాంగ్రెస్ విజయం సాధిస్తుందని జోస్యం చెబుతుంటే ఒక్క అభిప్రాయ సేకరణ బీజేపీ పెద్దపార్టీగా వస్తుందని మాత్రమే చెబుతున్నది. క్షేత్రస్థాయిలో పరిశీలించినవారు కూడా దాదాపు ఇదే అంచనాకు వస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షాల ప్రచార సరళి కూడా అలాంటి సంకేతాలే ఇస్తున్నది. విజయావకాశాలు సన్నగిల్లడంవల్లనే మోడీ నేరుగా మతపరమైన అంశాలలో భాషలో మాట్టాడేందుకు సిద్ధమై పోయారు. అఖరుకు కేరళ స్టోరీ వంటి సినిమాను కూడా మతతత్వ ప్రచారానికి ఉపయోగించుకోవడం మొదలెట్టారు. ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచార సరళి, బీజేపీపై దాని విమర్శలు ఒకటైతే మూడో శక్తిగా కొనసాగుతున్న జేడీఎస్ తన బలం పెరిగిందంటూ మరోవైపున చెప్పుకుంటున్నది. (ఎన్నికలకు సంబంధించిన రాజకీయాంశాలు గతంలో ప్రజాశక్తి ప్రచురించింది.) తక్షణ రాజకీయాంశాలతో పాటు కర్నాటక సామాజిక నేపథ్యాలు, పార్టీల వ్యూహాలు సర్వేల అంచనాలు ఇప్పుడు చూద్దాం.
సర్వేల అంచనాలు
మొట్టమొదటగా ఎబిపి సి ఓటరు సర్వే రాష్ట్రంలోని 224 స్థానాల్లోనూ కాంగ్రెస్ 107 నుంచి 119 వరకూ తెచ్చుకోవచ్చని వెల్లడించింది. బీజేపీకి 74నుంచి 86 వస్తాయని, జేడీఎస్‌కు 23 నుంచి 35 రావచ్చని ఈ సర్వే పేర్కొంటున్నది. ఓట్ల విషయానికొస్తే కాంగ్రెస్‌కు 40శాతం, బీజేపీకి 35శాతం, జేడీఎస్‌కు 17శాతం, ఇతరులకు 8శాతం రావచ్చని సూచితమైంది. టీవీ9 కన్నడ సి ఓటరు సర్వే కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇదే సిఓటరు ఇండియాటుడేతో చేసిన సర్వేలో బీజేపీ ఓటమి పాలవుతున్నది. ముఖ్యమంత్రిగా ఎవరికి ఎక్కువ అవకాశముందన్న దానిపై కాంగ్రెస్ నేత సిద్దరామయ్య 42శాతం ఓట్లతో ముందున్నారు. ప్రస్తుత బీజేపీ సిఎం బసవరాజ్ బొమ్మై 31శాతంతో వెనకబడిపోయారు. మరో కన్నడ వార్తావేదిక జరిపిన సర్వేలోనూ 132-140 సీట్లతో కాంగ్రెస్ మంచి ఆధిక్యత చూపిస్తున్నది. బీజేపీకి 57 నుంచి 65 వరకూ మాత్రమే వస్తాయంటున్నది. జీ న్యూస్ మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ మాత్రం 103-115 సీట్లతో బీజేపీ ఏకైక పెద్దపార్టీగా వస్తున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్‌కు 79-91, జేడీఎస్‌కు 26-36, ఇతరులకు మూడు వరకు రావచ్చని అంచనా కట్టింది. లక్ష 80 వేల మందితో చేసిన ఈ సర్వే చాలా పెద్దదంటూ మోడీ ప్రభావం వల్లనే ఎన్నికల దృశ్యం మారిపోతుందని జీ అంటున్నది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కు పెద్దగా మేలు చేసిందేమీలేదని కూడా వ్యాఖ్యానించింది. కన్నడ ఛానల్ సువర్ణ మూడోసారి జరిపిన సర్వేలోనూ జన్ కీ బాత్ సర్వేలోనూ బీజేపీ ఏకైక పెద్దపార్టీగా వస్తాయని చెబుతున్నాయి,
దేశంలో హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎంత చెప్పుకుంటున్నా బీజేపీ నాయకత్వానికి తన పరిమితులు స్పష్టంగా తెలుసు. అందులోనూ దక్షిణ భారతదేశంలో వారికి మొదటి నుంచి ఠికానాలేదు. కర్నాటకలోని చిత్ర విచిత్రమైన మత సామాజిక వైరుధ్యాలను రాజకీయ కోణంలోకి మళ్లించడం వల్లనే మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వంటివారు అక్కడకాలూనగలిగారు. కాని గత రెండు దశాబ్దాలలోనూ బీజేపీ ఎన్నికల విజయాలు కొన్ని సాధించినప్పటికీ మూల సిద్ధాంతమైన హిందూత్వ వ్యూహం మాత్రం ఆ స్థాయిలోనూ అంత వేగంగానూ వేళ్లూనుకోలేకపోయింది. అనేకసార్లు అధికారంలోకి వచ్చినా ఏ ముఖ్యమంత్రి కుదురుగా ఉన్నది లేదు. బీజేపీ సీఎంల సగటు పాలనా కాలం 800రోజులు మాత్రమే! ఒక్క యడ్యూరప్ప నానా తంటాలు పడి ఫిరాయింపుదార్ల సహాయంతో నాలుగుసార్లు పీఠమెక్కి 3182 రోజులు పూర్తి చేసుకున్నాడు. అంటే బీజేపీ పాలన అస్థిరత్వ మయంగానూ అవినీతి భరితంగానూ కొనసాగిందన్నమాట. దీనికి మతతత్వం జోడించి హిజాబ్, లవ్ జిహాద్, టిప్పు సుల్తాన్, ముస్లిం రిజర్వేషన్ వంటివి ఎన్ని తెచ్చినా ఇవేవీ బీజేపీకి స్థిరమైన పునాది కల్పించలేకపోయాయి.
భిన్న సామాజిక శిబిరాలు
పితృభూమి పుణ్యభూమి వంటి వీరసావర్కార్ హిందూత్వ పదజాలం కర్నాటకలోని కొన్ని ప్రాంతాలలోనైనా ప్రభావం చూపించి ఉండకపోతే బీజేపీ అక్కడ బలం పుంజుకోగలిగేది కాదు. భాషా జాతీయ భావన అందుకు తోడ్పడింది. సామాజిక సమీకరణలూ, రాజకీయ మితవాదం అక్కడ ప్రాబల్యం వహించాయి. వామపక్ష శక్తులు పరిమిత ప్రభావాన్నే చూపుతూ వచ్చాయి. మైసూర్ కర్నాటక, హైదరాబాద్ కర్నాటక (ఇప్పుడు కళ్యాణ కర్నాటక), బాంబే కర్నాటక (ఇప్పుడు కిట్టూరు కర్నాటక) అని మూడు భాగాలుగా చెప్పుకునే రాష్ట్రం భాషా ప్రయుక్త ప్రాతిపదికన 1956లో ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రాంతీయ ప్రత్యేకతలు, సాంస్కృతిక ముద్రలు కర్నాటక రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. కిట్టూరు కర్నాటకను సంఫ్‌ు పరివార్ శక్తులు కొంత పట్టు సంపాదించగలిగాయి. కాని ఒక బలమైన శక్తిగా ఉన్న లింగాయత్‌లు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని బ్రాహ్మణేతర ఉద్యమ తరహాను అనుసరించారు. విశేషమేమంటే వీరికి మఠాలు కేంద్రాలుగా ఉపకరించాయి. తమది ప్రత్యేక సమూహమని లింగాయత్‌లు 1940 నాటికే ప్రకటించారు. కర్నాటక రాష్ట్ర ఏర్పాటుకు తామే పునాది వేశామని కూడా వారినేతల వాదన. కాంగ్రెస్ గుత్తాధిపత్యం సాగిన 70వ దశకం వరకూ వీరు చాలావరకూ ఉపేక్షా భావనకు గురైనారు. 1983లో ఏపీలో ఎన్టీఆర్ రంగ ప్రవేశం చేసినప్పుడే కర్నాటకలోనూ మొదటిసారి రామకృష్ణహెగ్డే నాయకత్వంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జాతీయంగా జనతా ప్రయోగం ముక్కలైన తర్వాత కర్నాటకలో దక్కిన ఈ విజయం కొత్త దశను సూచిస్తుంది. అయితే ఆ దశలోనూ లింగాయత్‌లకు తగిన ప్రాధాన్యత దక్కలేదని అసంతృప్తి పెరిగింది. 1991లో తొలి లింగాయత్ ముఖ్యమంత్రి వీరేంద్రపాటిల్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగించిన నాటి నుంచి కాంగ్రెస్ లింగాయత్‌లలో మరింత వెనకపట్టు పట్టింది. యడ్యూరప్ప, గాలి జనార్ధనరెడ్డి వంటి అక్రమ కుబేరుల అండదండలతో వారిని బీజేపీ వైపు తిప్పుకోగలిగారు. ఈ మధ్యనే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్వంటివారు అలా వచ్చిన వారే. ఇంకో వైపున జనతా శిబిరంలో లుకలుకల మధ్య లింగాయత్ వ్యతిరేక శక్తులను దేవగౌడ సమీకరించుకోగలిగారు. ప్రధాని పదవి కూడా కొంతకాలం నిర్వహించి వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా మరో వ్యవసాయ కులమైన వొక్కలింగలపై దృష్టిపెట్టారు. ఆ విధంగా దక్షిణ కర్నాటకలో కొంత పట్టు సాధించగలిగారు.
పరివార్ ఎత్తులు
ఇక లింగాయత్‌ల ప్రత్యేక నేపథ్యం రీత్యా సంఫ్‌ు పరివార్ వారిని తనతో కొనసాగించుకోవడానికి భిన్నమైన వ్యూహం అనుసరించింది. యడ్యూరప్పతో పదేపదే విభేదాలు రావడానికి ఇదీ ఒక కారణం. సంప్రదాయ నాయకులను కాదని పునాదిలేని వారిని ముందుకు తెచ్చి నాగపూర్ పెత్తనంతో నడిపించాలని చూడటమే. వొక్కలింగల ప్రాబల్యం గల దక్షిణ భాగంలో చిన్న చిన్న స్థానిక దేవతలను మఠాధిపతులను పైకి లేపింది. ప్రార్థనా స్థలాలనూ ఆలయాలనూ కొత్త పేర్లతో ప్రతిష్టించింది. కాలభైరవుడు ఇలవేల్లుగా గల ఆదిచుంచనగిరి మఠం దీనికి కేంద్రంగా చేసేందుకు ప్రయత్నించింది. టిప్పు సుల్తాన్‌ను వెనక్కు నెట్టి ఉరిగౌడ, నంజేగౌడ వంటి వొక్కలింగ పూజా పురుషులను ఆకాశానికెత్తింది. ఇది ఒక విధంగా వొక్కలింగలను ఇబ్బందిలో పెట్టగా మరో విధంగా పై మఠం కూడా ఆమోదించలేకపోయింది. తమ పునాదిని కాపాడుకోవడం కోసం వొక్కలింగలు ప్రాంతీయ పునాదిని నొక్కి చెప్పడం ప్రారంభించారు. ఎన్నికల ప్రారంభంలో మూడు పార్టీలూ తమ సంప్రదాయ పునాదిని కన్నా ఇతరులపై ఎక్కువగా దృష్టి పెట్టాలని ప్రకటించాయి. అందుకు తగినట్టే కాంగ్రెస్ 51శాతం టికెట్లు లింగాయత్‌లకు ఇస్తే బీజేపీ 47శాతం టికెట్లు వొక్కలింగలకు ఇచ్చింది. జేడీఎస్ ఇతర ప్రాంతాల వైపు చూడటం ఆపి తన పునాది అయిన హసన్ మాండ్యాలపైనే కేంద్రీకరించాల్సి వచ్చింది. పీష్వాల పాలన తెచ్చేందుకే యడ్యూరప్పను తొలగించాని కుమారస్వామి ఆరోపించడం అందులో భాగమే. బీజేపీ ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్ రద్దుచేసి లింగాయత్‌లు వొక్కలింగలకు సగం సగం ఇస్తానని ఆశచూపడం ఇందులో భాగమే. అయితే ఇదిప్పుడు కోర్టులో ఉంది. ముస్లింలు కూడా దూరమై కాంగ్రెస్ వైపు మొగ్గినట్టు చెబుతున్నారు. మరోవైపు వారిని తిప్పుకున్నామని బీజేపీ ప్రచారం నడిపిస్తున్నది. ఈ రెండు వైపులా దాడుల మధ్య జేడీఎస్‌ది సహాయక పాత్రగానే అందరూ అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ కళ్యాణ కర్నాటకలో పోటీ చేస్తుందని భావించినా చేయకుండా కుమారస్వామికి మద్దతు ప్రకటించింది. సీపీఐ(ఎం) అయిదు స్థానాలలో పోటీ చేస్తున్నది. తెలుగువారు అధికంగా ఉండే బాగేపల్లి గతంలోనూ ఆ పార్టీ మూడుసార్లు గెల్చుకున్నది. జేడీఎస్ అక్కడ సీపీఐ(ఎం)కే మద్దతు ప్రకటించింది. మజ్లిస్ మొదట అనుకున్నట్టు ఎక్కువ చోట్ల గాక పరిమితంగానే పోటీ పెట్టింది.
కాంగ్రెస్ వ్యూహాలు, జాతీయ ప్రభావం
చివరగా కాంగ్రెస్ విషయానికి వస్తే లౌకికతత్వం, జాతీయత, సామాజిక న్యాయం వంటి నినాదాలతోనే సరిపెట్టుకోవడం లేదు. హిందూత్వకు వ్యతిరేకంగా వాటిని రాజ్యాంగంలోనే పొందుపర్చామని మరీ మరీ చెబుతున్నది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రబాగా ఉపయోగపడిందని వారి అంచనాగా ఉంది. రాష్ట్రానికి చెందిన దళితనేత మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ అధ్యక్షుడు కావడం, సామాజిక న్యాయాన్ని ఇక సమ్మిళిత దృక్పథానికి నిదర్శనమని వారంటున్నారు. నిరుద్యోగభృతి, పేదలకు ఆహారం, పేదలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం, కుల మత భేదాలు లేని సౌకర్యాలు వంటివాటినే ఎక్కువగా ప్రచారం చేస్తున్నది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ సంపన్న రాజకీయ వేత్త మాత్రమే గాక వ్యూహ ప్రతిహ్యూహాలలో ఆరితేరిన దిట్ట. తనను ముఖ్యమంత్రిని చేయాలని అధిష్టానం నిర్ణయమని అంటారు గాని సర్వేలు మాత్రం మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకే ప్రజల మొగ్గు ఉన్నట్టు చెబుతున్నాయి. తమకు 130పైగా సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. దక్షిణభారతంలో మొత్తం 130లోక్‌సభ స్థానాలుంటే బీజేపీ గరిష్టంగా తెలంగాణ కర్నాటక కలిపి గతసారి 29 తెచ్చు కుంది. గత నాలుగు ఎన్నికల్లోనూ రాష్ట్రంలో మెజార్టీ లోక్‌సభ స్థానాలు దానివే. అయితే శాసనసభలో ఒకసారి కూడా పూర్తి మెజార్టిరాక ఫిరాయింపులపై ఆధారపడింది. ఈ సారి ఆ అవకాశం కూడా దాదాపు మూసుకుపోయినట్టే కనిపిస్తుంది. కర్నాటక చేజారితే దక్షిణాదిన బీజేపీ శూన్యం కావడం రాబోయే 2024 ఎన్నికలను అమితంగా ప్రభావితం చేస్తుంది.
- తెలకపల్లి రవి