Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు ఫ్రాన్స్‌లో కార్మికులు పెన్షన్ కోసం బెత్తాలు పట్టుకొని వీధికెక్కారు. కార్మికులు, ఉద్యోగుల పనైపోయింది, వాళ్ళ కోరలు పీకేశారు అని సంకలు గుద్దుకునే వాళ్ళకు ఇలాంటి సమ్మెలు, మన రైతులు చేసిన సమ్మెలు కూడా బెత్తంతో చేసే శబ్దాల లాంటివేనని గుర్తు చేయాలి. అసలైన దెబ్బ కొట్టినప్పుడు ఆ బెత్తం సురుకు తెలుస్తుంది. అప్పుడు వీపంతా వ్యాజిలైనులు, నవనీతాలు పట్టించుకున్నా ఫలితముండదు. బెత్తం దెబ్బ అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది.
ఇక మళ్ళీ బడులు తెరిచే సమయ మొస్తోంది. బడి అంటే బెత్తం, బెత్తం అంటే బడి గుర్తొస్తుంది. బడిలో టీచరంటే చేతిలో బెత్తం లేకుండా ఊహించలేం. తప్పు చేసినా, కరెక్టు చేయకపోయినా ఈ బెత్తం తన పని తను చేస్తుంది. చిన్నప్పుడు బడిలో బెత్తం తెమ్మని ఎవరో ఒకరిని పంపేవారు. ఇదే సందని బయట ఉండే చెట్టెక్కి ఓ కొమ్మను తుంచి ఆకులు రెమ్మలు తీసేసి బెత్తం తెచ్చి సారుకిస్తే ఆయన ఎదిరా ఎలాగుందో చెప్పు అని ఆ బెత్తం తెచ్చినోడి మీదనే మొదటి ప్రయోగం చేసేవాడు. అలా చెప్పుకుంటూ పోతే బెత్తం గురించి చాలానే ఉంటుంది. ఇక ఇంట్లో అయితే ఏదిపడితే అది బెత్తం లాగే పనిచేస్తుంటుంది. చిన్నప్పుడు ఎన్ని బెత్తం దెబ్బలు తింటే అంత బాగుపడతారని కొందరి విషయంలో తేలింది. అందుకే ఈ బెత్తం తరగతిలోని విద్యార్థులను కాపాడినట్టే, మనిషి జీవితాన్ని కాపడుతుంది. పుస్తకం హస్త భూషణం అన్నట్టు బెత్తం హస్త ఆయుధం అనొచ్చు.
బెత్తమంటే సర్కారు బడిలోనే ఎక్కువ వాడతారని మనకు అనుభవంలో తెలుస్తుంది. నిజంగా దాని పని నిజంగా కొట్టడం కాదు, భయపెట్టడం. ఎప్పుడో అవసరమొచ్చి ఆ బెత్తంతో క్లాసులో ఒకరిని కొడితే చాలు అందరి మెదడుల్లో అది రికార్డయిపోయి ఉంటుంది. అది ఎక్కడో మూలకు పెట్టి చెబితే ఒకలాగ, చేతిలో పట్టుకుని చెబితే ఒకలాగ ఉంటుంది. తరగతి గదిలో ఒకరకమైన క్రమశిక్షణను తెస్తుంది ఆ బెత్తం. కొందరు అయ్యవార్లుంటారు చేతిలో ఎప్పుడూ బెత్తం ఉంటుంది కాని దాన్ని ఎప్పుడూ వాడరు. కోపమొస్తే చెవి పిండి లేదా పొట్టదగ్గర పట్టుకొని గిచ్చి మరీ తమ కోపాన్ని చూపే వాళ్ళు కొందరు.
ఇక సర్కారు బడులతో పాటు ప్రయివేటు బడులు ఎప్పుడొచ్చాయో అప్పుడు ఈ బెత్తం గురించిన అవగాహన చాలా మందికి పోయింది. ఆ ప్రయివేటు కాన్వెంటుల్లో, బడుల్లో పిల్లల్ని కొట్టకూడదు. కొడితే నేరం. అప్పుడప్పుడూ అక్కడక్కడా కొడతారు కాని అలాంటి కేసులు చాలా తక్కువ. బడిలో తెలుగు మాట్లాడినందుకు కొట్టిన టీచరమ్మను కూడా మనం చూశాం. బడిలో తెలుగు మాట్లాడొద్దు అని రాసిన బడులనూ చూశాం. అప్పుడెప్పుడో ఇంగ్లీషోడు ఉన్నప్పుడే బాగుండేదని కొందరు చెబితే, ఇప్పుడు ఈ కొత్త ఇంగ్లీషోడు చెప్పకుండానే అన్నే చేసేస్తున్నాడని చూసేవారికి తెలిసిపోతుంది. వాడి డాలర్ ఇప్పుడు అంత విలువైనది. అది బెత్తం పట్టుకొని ప్రపంచాన్నే శాసిస్తోంది మరి. వాడు చెర్నాకోలా లాంటి బెత్తాన్ని పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతాడు. వాడు ఎక్కడ యుద్ధం చేయమంటే అక్కడ చేయాలి. ఎలా చేయించాలో కూడా వాడికి బాగా తెలుసు. ఎలాంటి ఆయుధాలు వాడమంటే అవి వాడాలి. వాటివల్ల వచ్చే కాలుష్యం గురించి మాట్లాడడు వాడు. బెత్తం పట్టుకొని కాలుష్యం కాలుష్యం అనుకుంటూ దునియా మొత్తం చక్కర్లు కొడుతుంటాడు. అన్నీ తన వ్యాపారానికే వాడుతుంటాడు. అయినా వాడి బ్యాంకులు దివాలా తీస్తుంటే ఊరకే చూస్తూ ఉంటాడు. వాటిపైన వాడి బెత్తం పనిచేయదు.
బెత్తం మనుషులకేనా వాడేది అంటే అదేం కాదు. గుర్రాలకు, ఎద్దులకు ఇంకా మనుషులు పెంచుకునే జంతువులన్నిటికీ వాడతారు. అయితే ఒక్కోదానికీ ఒక్కో పేరుంటుంది. పులులు సింహాలకు కూడా బెత్తం వాడతారని తెలుసు కదా! అయితే అవి కరెంటు బెత్తాలు. షాక్ కొడతాయి. వాటి చిన్నప్పటినుండి దాంతో భయపెడతారు కాబట్టి పెద్దగైనా కూడా కరెంటు బెత్తమంటే హడల్ వాటికి. అది చూపిస్తే బోనులోనుండి రావలసిందే, లోనికి పోవలసిందే. అంతంత క్రూర జంతువులను ఒక్క కరెంటు బెత్తంతో ఆడించే రింగ్ మాస్టర్లని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కోసారి దానిలో కరెంటు లేకపోయినా కూడా ఏనుగుకు కట్టిన తాడు లాగా పనిచేస్తాయవి.
నిజం చెప్పుకోవాలంటే సురుకు తగిలించడం ఈ బెత్తం ముఖ్య ఉద్దేశ్యం. కొట్టినప్పుడు తగిలే సురుకు పైన చెప్పుకొన్నట్టు మెదడులో రికార్డయిపోయి ఉంటుంది. ఈత చెట్టు, కానుగ కొమ్మలలాంటి కొన్ని బెత్తాలు గాలిలో ఊపుతుంటేనే అవి చేసే సవుండు చాలు పిల్లలు మాట వినడానికి. చిన్నప్పుడు ఆ బెత్తం ఉపయోగాలు కొన్ని నేర్చుకున్నట్టు పెద్దగయ్యాక కూడా కొన్ని ఉంటాయని మనకు తెలుస్తుంది. ఎన్నికలప్పుడు ప్రజల చేతిలో ఉండె బెత్తమే ఓటు అని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు. డబ్బులు పడేస్తే ఓటేస్తారులే అనుకుంటే పొరబాటే. ఒక్కోసారి రెండువైపులా డబ్బులిచ్చి మభ్యపెట్టినా అంతకు ముందు ప్రభుత్వాలు చేసిన పనులను ప్రజలు బాగా గుర్తు పెట్టుకుంటారు. పెరిగిన ధరలను, రైతులు పడ్డ బాధలను, రకరకాల రూపాల్లో వేస్తున్న పన్నులను వాళ్ళు బాగ యాదుంచుకుంటారు. ఎప్పుడు ఎక్కడ సురుకు తగిలించాలో వాళ్ళకు బాగా తెలుసు. బెత్తంతో ఎప్పుడు శబ్దం చేయాలో, ఎప్పుడు నిజంగా కొట్టాలో ఎరిగినోళ్ళు వాళ్ళు.
జీతాలు, పెన్షన్లు ఊరకే ఇచ్చేవి కాదు అవి మా హక్కులని కార్మికులు ఎప్పుడూ చెబుతుంటారు. లక్షల కోట్లు ఒకరిద్దరు మనుషులకే కట్టబెట్టి మరీ వారి బెత్తం కింద జీ హుజూర్ అని పని చేసి మంచి బాలుడు అని పేరు తెచ్చుకోవడానికి తహతహలాడే నాయకులను చూశాం. ఇది ప్రపంచమంతా జరిగేదే. ఇప్పుడు ఫ్రాన్స్‌లో కార్మికులు పెన్షన్ కోసం బెత్తాలు పట్టుకొని వీధికెక్కారు. కార్మికులు, ఉద్యోగుల పనైపోయింది, వాళ్ళ కోరలు పీకేశారు అని సంకలు గుద్దుకునే వాళ్ళకు ఇలాంటి సమ్మెలు, మన రైతులు చేసిన సమ్మెలు కూడా బెత్తంతో చేసే శబ్దాల లాంటివేనని గుర్తు చేయాలి. అసలైన దెబ్బ కొట్టినప్పుడు ఆ బెత్తం సురుకు తెలుస్తుంది. అప్పుడు వీపంతా వ్యాజిలైనులు, నవనీతాలు పట్టించుకున్నా ఫలితముండదు. బెత్తం దెబ్బ అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది.
- జంధ్యాల రఘుబాబు
9849753298