Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఏజిఎస్ నిర్వహించిన ఈ ''రేలా పండుం''లో ప్రేక్షకులు సైతం ఎరీనాలోకి వచ్చేసి కళాకారులతో పాటు నృత్యాలు చేసేంత ఉత్సహాన్ని నింపాయి. రెండురోజుల పాటు రాత్రి 10.30గంటల వరకూ ఈ కార్యక్రమాలు నడిచాయి. ప్రతిరోజూ ''ఈరోజు ఉత్సవాలలో ఇంతటితో ముగిశాయి'' అని మైక్‌లో ప్రకటించాక, అప్పటివరకూ విడివిడిగా నృత్యాలు చేసిన బృందాలన్నీ ఒక్కుమ్మడిగా గ్రౌండ్ మధ్యలోకి వచ్చి ప్రేక్షకులతో కలిసిపోయి నృత్యం చేసేవారు. ఆడ, మగ, పిల్లా, పాప, ముసలీ తేడాలేకుండా వందలాదిమంది ఒక్కటిగా నృత్యం చేయడంలో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం 3వ రాష్ట్ర మహాసభల సందర్భంగా మే 3,4 తేదీల్లో ఆదివాసీ సాంస్కృతిక ఉత్సవాలు 'రేలా పండుగ' భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అత్యంత కోలాహలంగా జరిగాయి. 5,6 తేదీల్లో భారీ సాంస్కృతిక ర్యాలీ, బహిరంగసభ, ప్రతినిధుల సభ ఎంతో స్ఫూర్తిదాయ కంగా నిలిచాయి. ఆది వాసీలతో పాటు నాయకులకు కూడా కొత్త ఉత్తేజాన్నిచ్చాయి.ఈ ఉత్సవాలలో సుమారు 500మంది కళాకారులు పాల్గొన్నారు. మహాసభ నిర్దేశించిన కర్తవ్యాలను ముందుకు తీసుకు పోవాల్సిన నూతన కమిటీ ఎన్నికతో 6వ తేదీ సాయంత్రం మహా సభలు ముగిశాయి. ర్యాలీ, బహిరంగసభ, మహా సభలలో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఏఏఆర్ఎమ్) జాతీయ నేత బృందాకరత్ పొల్గొన్నారు.ఈ మహాసభలు జరిగిన తీరు, కళాకారుల ప్రదర్శన, ఆదివాసీల పోరాటం, సంస్కృతి ఇక్కడ చర్చించుకోవడం ప్రత్యేకతను సంతరించు కుంది. ప్రస్తుతం దేశంలోని భిన్నత్వాన్ని, బహుళత్వాన్ని ధ్వంసం చేసే శక్తులు అధికారంలో ఉన్నాయి. ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే భాష పేరుతో ఆధిపత్య వాదాన్ని రుద్దుతూ ఆదివాసీ సంస్కృతిని, కళలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. వాస్తవానికి ఆది వాసులు ఏ మతానికి చెందరు. వారి సాంప్రదాయాలు, అలవాట్లు అన్నీ భిన్నమైనవి. పెళ్ళిలో బ్రాహ్మణుడు ఉండడు. సమ్మక్క, సారక్క అడవి దేవతల జాతరలో కూడా కోయ తెగ పద్ధతులు, పూజలు ఉంటాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతాల ఆచారాలకు వీరికి పొంతన లేదు. ఇటీవల మిషనరీలు, అనేక రకాల రంగుల మాలలు ధరించే వారు, డిజె సంస్కృతి, గణేష్ మండపాలు, శోభాయాత్రలు అడవుల్లోకి చొచ్చుకు వస్తున్న కొద్దీ ఆదివాసీ సంస్కృతి ఉనికి, అస్తిత్వం ప్రమాదంలో పడిపోయాయి. ప్రకృతితో ముడిపడి ఉండే వైవిద్యభరితమైన వీరి సంస్కృతిని కాపాడు కోవాలనే పలువురి ఆకాంక్షలకు ఆదివాసీ గిరిజనసంఘం (టీఏజిఎస్) ఆచరణ రూపం ఇచ్చింది.ఈ క్రమంలో జరిగిన మహాసభలు ఆదివాసీ సంస్కృతిపై ఆధిపత్యపు మతరంగులు పులిమే పాలకులను ఎదిరించి, ధిక్కరించి పోరాడే శక్తినిచ్చాయి.వారి డిమాండ్లు, ఆకాంక్షలకు అనుగుణంగా నూతన ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలిచాయి.
ఆదివాసీ కళారూపాల వేదికగా నిలిచిన 'రేల పండుం'
రేల పండుగను కోయభాషలో ''పండుం'' అంటారు. సాంస్కృతిక ఉత్సవాలకు ''రేలా పండుం'' అని నిర్వాహకులు పేరు పెట్టారు. అంటే రేలా పండుగ అన్నమాట. 450 కిమీ దూరంలో ఉన్న ఆదిలాబాద్ మొదలుకొని ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం వరకూ విస్తరించి ఉన్న ఆదివాసీ ప్రాంతాల నుండి గోండు, కోయ, నాయక్‌పోడు, కోలాం, ప్రథాన్, డోలీ, మన్నెవార్లు, ఛత్తీస్గడ్ నుండి వచ్చిన వలస ఆదివాసీలు ఇలా అనేక తెగల సాంస్కృతిక, కళారూపాలను ఆయా కళాకారులు అత్యంత వ్యయప్రయాసలకోర్చి భద్రాచలం చేరుకుని తమ సాంప్రదాయ కళలు, నృత్యాలను ప్రదర్శించారు. జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ''రేలా పండుం'' ఏర్పాటు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. మొదటి రోజు వర్షం వలన రెండు గంటలు ఆలస్యంగా కార్యక్రమాలు మొదలయ్యాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆదివాసీ కళాకారుడు సకినం రామచంద్రయ్య ప్రారంభించారు. ఆదివాసీ సంస్కృతిలో భాగమైన గుస్సాడీ, రేలా, డోలు, తప్పెట్లు, చెచోరు, కొమ్ముకోయ, సకినండోలు వంటి అనేక కళా రూపాలతో పాటు ఆదివాసీ యువతీ యువకుల్లో దాగిఉన్న ప్రత్యేకమైన నృత్యాలు, పాటలు, వేణువు వంటి కళారూపాలను ప్రదర్శించడానికి ''రేలా పండుగ'' వేదికగా నిలిచింది. వీటి ఆధారంగా ఆదివాసులను కళారంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలురుగా ప్రేక్షకులు గుర్తించగలిగారు. కళారూపాలను వీక్షించిన గిరిజన, గిరిజనేతర ప్రేక్షకులు ఒకేచోట ఇన్ని రకాల విభిన్నమైన, సహజమైన కళారూపాలను వీక్షించడం అరుదుగా వచ్చే అవకాశం అన్నారు. మళ్ళీ ఇలాంటివి చూసే అవకాశం వస్తుందో రాదో అని కళాకారులను కొనియాడారు. సాధారణంగా సాంస్కృతిక ఉత్సవా లలో ప్రేక్షకులు శ్రద్ధగా కూర్చుని వీక్షిస్తారు. కానీ టీఏజిఎస్ నిర్వహించిన ఈ ''రేలా పండుం''లో ప్రేక్షకులు సైతం ఎరీనాలోకి వచ్చేసి కళాకారులతో పాటు నృత్యాలు చేసేంత ఉత్సహాన్ని నింపాయి. రెండురోజుల పాటు రాత్రి 10.30గంటల వరకూ ఈ కార్యక్రమాలు నడిచాయి. ప్రతిరోజూ ''ఈరోజు ఉత్సవాలలో ఇంత టితో ముగిశాయి'' అని మైక్‌లో ప్రకటించాక, అప్పటివరకూ విడివిడిగా నృత్యాలు చేసిన బృందాలన్నీ ఒక్కుమ్మడిగా గ్రౌండ్ మధ్యలోకి వచ్చి ప్రేక్షకులతో కలిసిపోయి నృత్యం చేసేవారు. ఆడ, మగ, పిల్లా, పాప, ముసలీ తేడాలేకుండా వందలాదిమంది ఒక్కటిగా నృత్యం చేయడంలో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ముగింపులో బలవంతంగా అక్కడినుండి గ్రౌండ్ బయటకు కదలడం కనిపించింది.పట్టణంలోని అనేకమంది ప్రముఖులు, ఆదివాసీ రంగంలోని ముఖ్యులు వచ్చి మధ్య మధ్యలో సాంస్కృతిక బృందాలకు, కళాకారులకు ఆకర్షణీయమైన మెమోంటోలు అందజేశారు. సోషల్ మీడియా వేదికల మీద ఈ కార్యక్ర మాలను అనేకమంది అప్లోడ్ చేయడం కనిపించింది. ప్రేక్షకులు తమ మొబైల్, కెమెరాల ద్వారా ఫొటోలు, వీడియోలు తీశారు. సాంస్కృతిక సంబరాలు ఆదివాసీ తెగల ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయి.5వ తేదీ సాయంత్రం జరిగిన ప్రజా ప్రదర్శనపై ''రేలా పండుం'' ప్రభావం పడింది. 3,4తేదీల్లో ప్రదర్శిం చిన కళారూపాలన్నీ భద్రాచలం పట్టణ పురవీధుల్లో ప్రదర్శనలో పాల్గొని ర్యాలీకి ప్రత్యేక శోభను సంత రింపజేశాయి. ప్రజాతంత్ర ఉద్యమానికి భద్రాచలం మన్యంలో మళ్ళీ పూర్వ వైభవం రానున్నదా అనే ఆసక్తి ప్రజల్లో కనబడింది.
పోరాట ఘట్టాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్
బహిరంగసభలో బృందాకరత్, తమ్మినేని వీరభద్రం విభిన్నమైన అంశాలపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఆదివాసీలను ప్రకృతి, సహజ వనరుల నుండి దూరం చేసి, బడా కార్పొరేట్ల కోసం విధ్వం సం చేస్తున్నాయనీ అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అనేక సమ స్యలను ప్రస్తావించారు. జాతీయ స్థాయిలో క్రీడలు, పర్వతారోహణ, ఇతర రంగాలలో రాణించిన విద్యార్థు లకు, మంచిర్యాల జిల్లా 'కోయ పోషగూడెం' భూ పోరాటంలో మిలిటెంట్‌గా నిలిచిన మహిళలకు బృందా కరత్ చేతుల మీదుగా సన్మానం చేశారు. అదేరోజు రాత్రి ప్రతినిధుల సభ ప్రారంభమైంది. 6వ తేదీ సాయంత్రం వరకూ సాగింది. గ్రూపు చర్చలు, ప్రెజెంటేషన్లను బృందాకరత్ పర్యవేక్షించి అనంతరం దిశానిర్దేశం చేస్తూ మాట్లాడారు. ప్రతినిధుల సభలో తొలుత రాష్ట్ర కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. ఈ కాలంలో నిర్బంధాలను లెక్కచేయకుండా గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకూ జరిగిన పోరాటాలు, విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక కృషిని మహాసభ సమీక్షించింది. జీఓ 3 విషయంలో కరోనా కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయంతో జరిగిన కృషి, ఏజెన్సీ బంద్ కార్యక్రమాలు, హరితహారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖ, పోలీసుల దాడులపై రాజీలేని పోరాటాలు, ఐటిడిఏ, కలెక్టరేట్ ముట్టడులు, పాద యాత్రలు చెప్పుకోదగ్గవి. జిల్లాలు, రంగాలవారీగా గ్రూపు చర్చలు జరిగాయి. అమరులు కుంజా బొజ్జి, సున్నం రాజ య్య ప్రాంగణంలో జరిగిన ఈ సభల ప్రారంభంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మిడియం బాబూరావు సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు, న్యాయవాది పాయం రవివర్మ, నాయకులు, ప్రతినిధులు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన పలురకాల బహు ముఖ కార్యక్రమాలు, పోరాట ఘట్టాలతో ఆ జిల్లావారు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను బృందాకరత్, డాక్టర్ మిడియం బాబూరావు ఆసక్తిగా తిలకించారు.
సమన్వయంతో ఉత్తేజాన్ని నింపిన మహాసభలు
మహాసభ 34మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నది. కొత్తగా అనేకమంది యువతీయువకులు 25- 30ఏండ్ల యువత ఎక్కువ మంది ఎన్నిక కావడం విశేషం.13మంది ఆఫీస్ బేరర్స్‌తో సహా అధ్యక్షులుగా పార్లమెంట్ మాజీ సభ్యులు డాక్టర్ మిడియం బాబూ రావు తిరిగి ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా యువకుడు పూసం సచిన్ నూతనంగా ఎన్నికయ్యారు. రానున్న కాలానికి రాసిలోనూ, వాసిలోనూ మరిన్ని బహుముఖ కార్యక్రమాలకు, పోరాటాలకు పదును పెట్టేందుకు ఆచరణలో ముందుకుతీసుకుపోయే నమ్మకాన్ని మహాసభలు కలిగించాయని చెప్పాలి. భద్రాచలం నియోజకవర్గ కన్వీనింగ్ కమిటీ, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాసభల జయప్రదం కోసం ఏర్పాటు చేసిన కమిటీలు అన్నీ కష్టపడి పని చేశాయి. కల్చరల్ ఫెస్ట్ కమిటీ, ఫుడ్ కమిటీ, వసతుల కమిటీ, ట్రాన్స్ పోర్ట్ కమిటీ, కాలేజి గ్రౌండ్ బహిరంగసభ వేదిక కమిటీ, కాన్ఫరెన్స్ హాల్ కమిటీ, అలంకరణ కమిటీ, సోషల్ మీడియా కమిటీ ఇలా అనేక విభాగాలు కష్టపడ్డాయి. అన్ని విభాగాలను మచ్చా వెంకటేశ్వర్లు, కల్చరల్ ఫెస్ట్‌ను బండారు రవికుమార్, మెస్రం రాజు, ఏజె రమేష్ సమన్వయం చేశారు. రాబోయే కాలంలో ఆదివాసీల సంస్కృతిని కనుమరుగు చేసి అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్న కేంద్ర బీజేపీ నాయకత్వంపై తిరుగుబాటు చేయడంతో పాటు సమరశీల పోరాటాలకు ఈ మహాసభలు కొత్త భీజాన్ని వేస్తాయి.అలాగే నూతనంగా ఎన్నికైన నాయకత్వానికి పోరాటాలు దిక్సూచిగా నిలుస్తాయి.
- బండారు రవికుమార్