Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్థిల్లుతున్న భారతదేశంలో నానాటికీ పత్రికా స్వేచ్ఛ పరిస్థితి దారుణంగా దిగజారిపోతుండడం విషాదకరం. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్.ఎస్.ఎఫ్) అనే సంస్థ రాజకీయ, ఆర్థిక, లెజిస్లేటివ్, సామాజిక, భద్రతా సూచీలు అనబడే ఐదు అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకొని ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా మే 3న విడుదల చేసిన ఆర్ఎస్ఎఫ్ 21వ ఎడిషన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో 180 దేశాల జాబితాలో భారతదేశం అతి బలహీనమైన స్కోరుతో 161వ స్థానంలో నిలవడం దిగ్భ్రాంతిని కలిగిం చింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారతదేశం 2016లో 133వ ర్యాంక్, 2017లో 136వ ర్యాంక్, 2018లో 138వ ర్యాంక్, 2019లో 140వ ర్యాంక్, 2020లో 142వ ర్యాంక్, 2021లో 142వ ర్యాంక్, 2022లో 150వ ర్యాంక్లని సాధించి ఇలా ప్రతి సంవత్సరం దిగజారుతూనే ఉంది. ఈ సంవత్సరం ఏకంగా గత సంవత్సరం కన్నా మరీ 11 స్థానాలు దిగజారి 161వ ర్యాంక్‌కి పడిపోయి అట్టడుగుకు నెట్టివేయబడడం తద్వారా భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ పరిస్థితులు ఎంతగా పతనమవుతున్నాయో అనే విషయం చాలా సష్టంగా విదితమవుతూనే ఉంది.
ముఖ్యంగా భారతదేశంలో ఇలా ప్రతి సంవత్సరం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో ర్యాంకులు పడిపోవడమే తప్ప ఎగబాకిన దాఖలాలు లేకపోవడానికి 'నియంతృత్వ పాలకుల అణచివేత విధానాలే కారణ హేతువులు' అని చాలా సష్టంగా పేర్కొనవచ్చు. నేడు దేశవ్యాప్తంగా మీడియా సంస్థలు మొత్తం రాజకీయ రంగు పులుముకొని రాజ కీయ నేతలతో సంబంధాలు ఉన్న వాణిజ్యవేత్తల నియంత్రణలోకి చేతులు మారడంతో పత్రికా స్వేచ్ఛ కొడిగట్టిన దీపంలా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూనే ఉంది. నియంతృత్వ ప్రభుత్వాల అనుకూల శక్తులు జర్నలిస్టులని ఒత్తిళ్లకు గురిచేయడమే కాకుండా వారిపై కఠిన ఆంక్షలు విధించడం, మహిళా జర్నలిస్టులపై చెప్పుకోలేని ఆకృత్యాలకు పాల్పడటం, జర్నలిస్టుల సమాచారాన్ని బహిరంగంగా ఆన్లైన్లో పొందుపరచి వారి గోప్యతకు తీవ్ర విఘాతాన్ని కలిగించడం ఇలా అనేక రకాలుగా అశాంతికి గురిచేయడం నిత్యకృత్యాలుగా కొనసాగుతుండడం విషాదకరం.
'ఫ్రంట్ లైన్ వారియర్స్'గా పిలువబడి నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వాలు ఏనాడు పెద్దగా చర్యలు తీసుకోకపోగా తమకు అనుకూలంగా వ్యవహరించని వారిని అనునిత్యం పోలీస్ వేధింపులకు గురిచేస్తూ సివిల్, క్రిమినల్ కేసుల్లో అన్యాయంగా ఇరికిస్తూ వారిని అశాంతికి గురిచేయడం కడు విచా రకరం. మరీ ముఖ్యంగా ఏడాదికి సగటున నలుగురు జర్నలిస్టులు మరణించడం బాధాకరం. ఇలా అనేక మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో ప్రాణాలు పోయినా కూడా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. అలాగే జర్నలిస్టులపై మరోపక్క మాఫియా బెదిరింపు ఘటనలు చోటుచేసుకోవడం ద్వారా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావడం ఆందోళనాకరం. ఇలాంటి అమానుష ఘటనలు అన్ని జర్నలిస్టుల ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా అంతిమంగా పత్రికా స్వేచ్ఛను మరింతగా నశింపజేస్తూ ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నాయి. ఎన్నో సమస్యలు, సవాళ్లు తలెత్తుతున్ననూ వాటన్నింటినీ జర్నలిస్టులు సమర్థవంతంగా అధిగమిస్తూనే మరింతగా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఈ దృగ్విషయాలు వారి వృత్తి పట్ల అంకితభావానికి నిదర్శనంగా చెప్పొచ్చు.
ముఖ్యంగా హిందుత్వ అజెండాతో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పత్రికా స్వేచ్ఛ మెల్లమెల్లగా పతనం కావడాన్ని స్పష్టంగా గమనించవచ్చు. పత్రికా స్వేచ్ఛలో ప్రతి సంవత్సరం నార్వే దేశం ప్రథమ స్థానంలో నిలుస్తూనే ఉండగా భారతదేశం మాత్రం ప్రతి సంవత్సరం తన పొరుగు దేశాల కన్నా మరింత లోతుగా దిగజారడం గమనార్హం. మొత్తం 180దేశాల్లో కేవలం 52దేశాల్లోనే పత్రికా స్వేచ్ఛ సజావుగా అమలు కావడం గమనార్హం. అదేవిధంగా జర్నలిస్టుల పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్న 31దేశాల జాబితా లోనూ భారతదేశం ఉండడంతో మీడియా పరువు మరింతగా మంటగలిసింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.అలాగే 42 దేశాల్లో జర్నలిస్టులు కష్టతరమైన పరిస్థితులు అనుభవించడం, 55 దేశాల్లో నిత్యం పలు సమ స్యలు అధిగమిస్తూనే ముందుకు సాగడం బాధాకరం. ఈ రకంగా ప్రతి పది దేశాలలో కేవలం మూడు దేశాలలో మాత్రమే పత్రికా స్వేచ్ఛ సజావుగా అమలు కావడం లేదనేది విస్మయాన్ని కలిగిస్తోంది.
భారతదేశంలో పాలకులు అనుసరిస్తున్న నియంతృత్వ విధానాల పర్యవసానంగా ఫోర్త్ ఎస్టేట్‌లో మిళితమైన పత్రికా స్వేచ్ఛ కేవలం నామమాత్రంగా మాత్రమే అమలు కావడం కడు గర్హనీయం. అలాగే జర్నలిస్టుల భద్రతా సూచీలో భారతదేశం ఏకంగా 172వ స్థానానికి దిగజారడం ద్వారా 'జర్నలిస్టుల భద్రతాలేమి' చాలా స్పష్టంగా విదితమవుతుంది. పత్రికా స్వేచ్ఛ నిర్బంధం విషయంలో నియంతృత్వ పాలకులు అనుసరించే విధానాల్లో మార్పు లు రానంత కాలం వరకు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారతదేశం ర్యాంక్ మరింతగా దిగజారడమే కాకుండా ప్రపం చంలో దేశ ప్రతిష్ట మరింతగా దెబ్బతినే పరిస్థితులు పొంచి ఉన్నాయి. అందువల్ల పత్రికా స్వేచ్ఛకి తగిన ప్రాధాన్యత ఇచ్చే దిశగా పాలకులు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- జె.జె.సి.పి.బాబూరావు
9493319690