Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలోని సాగు భూముల స్వభావం, వాతావరణం విత్తనోత్పత్తికి అనుకూలమైనది. రబీ సీజన్లో గాలిలో తేమ శాతం 72 నుంచి 80శాతం వరకు, పగటి ఉష్ణోగ్రత 24 నుంచి 30డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలలో తేడా 8-10డిగ్రీల సెంటీగ్రేడ్, 35డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటే వరి హైబ్రిడ్ విత్తన దిగుబడి గణనీయంగా ఉంటుంది. అందుకే తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ద వరల్డ్, సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందింది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు సాధారణ రకాలు ఓపెన్-పొలినెటెడ్(ఓపీ) వరి విత్తనాలు హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిని సాగు చేస్తున్నారు. రబీ పంట కాలంలో హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తికి అనుకూలమైనది. ఈ కాలంలో ఆడ, మగ రకాలు పుష్పించే దశలో వర్షాల బారిన పడవు. తద్వారా అధిక, మంచి నాణ్యత కలిగిన విత్తనాలను పొందవచ్చు. విత్తన ఉత్పత్తికి ఉపయోగపడే ఈ సహజ సిద్ధమైన తెలంగాణ ప్రాంతంలోని వాతావరణ అనుకూలత రైతుల ఆర్థిక అభివృద్ధి తోడ్పడటానికి బదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు, కొద్దిమంది స్థానిక సీడ్ మిల్లు యజమానుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నది.
రైతులను మోసం చేస్తున్న సీడ్మిల్స్
లోకల్ సీడ్(ఓపీ) వరి విత్తనం ఎకరానికి 30 క్వింటాళ్లు (40 బస్తాలు రబీ సీజన్లో, 30బస్తాలు వానకాలం సీజన్లో) దిగుబడి వస్తుంది. ఒక ఎకరానికి విత్తనం దొడ్డు రకం 30కేజీలు, సన్నరకం 25కేజీలు అవసరం పడుతుంది. ఎకరా పెట్టుబడి సుమారు 30వేలు వస్తుంది. కౌలు భూమి అయితే రూ.12 నుండి 15 వేలు అదనం. పంట కాలం దొడ్డు రకాలు 125రోజులు, సన్న రకాలు 135రోజులు. ఈ సీజన్లో సీడ్ మిల్ యజమానులు ఏకపక్షంగా విత్తన రైతుల నుండి కొనుగోలు చేస్తామని ప్రకటించిన రేట్లు క్వింటాల్‌కు ఎన్‌ఎల్‌ఆర్ 34449(రకం), ఇతర అన్ని దొడ్డు రకాలకు రూ.2080, జెజిఎల్1798, జెజిఎల్384, కెఎన్ఎం1638 రూ.2,150తో తీసు కుంటున్నారు. బీపీటీ 5204 రూ.2,200, ఆర్ఎన్ఆర్15048 అండ్ హెచ్ఎంటీ రూ.2300 సీడ్ కంపెనీలు విత్తనాలు అమ్మే ధరలతో పోలిస్తే, వీరు రైతు నుండి కొనే ధర చాలా తక్కువ. అంతేకాకుండా క్వింటాలుకు 4కిలోల తరుగు కింద తీస్తున్నారు. రూ.50 హమాలీ చార్జీల కింద కట్ చేస్తున్నారు. డబ్బులు చెల్లించడానికి నెల నుండి రెండు నెలల సమయం తీసుకుంటున్నారు. విత్తనం కోసం ఇచ్చిన ధాన్యానికి డబ్బులు కట్ చేసుకుంటారు. సీడ్ సాగు చేసే ముందు రైతులకు అనేక మాయ మాటలతో ప్రోత్సహిస్తారు. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత విత్తన రైతులను మోసం చేయడం సర్వ సాధారణంగా జరుగుతున్నది. సీడ్ డీలర్ల, ఆర్గనైజర్ల మోసాలు తక్కువేం కాదు. కొంతమంది సీడ్ డీలర్లు, ఆర్గనైజర్లు ఇటు రైతులకు అటు సీడ్ మిల్ యజమానులకు శఠగోపం పెట్టడం చూస్తూనే ఉన్నాం. రైతులకు పెట్టుబడి కోసం ఇచ్చే అప్పులపై మూడు శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా బ్యాంకుల నుండి పంట రుణాలు పొందే అవకాశం లేని కౌలు రైతులు వీరి బారిన పడుతున్నారు. సీడ్ కంపెనీలు మార్కెట్లో తిరిగి అమ్మేటప్పుడు మాత్రం సాధారణ రకం వరి విత్తనాలు క్వింటాలకు రూ.32 వందల నుండి 10వేల వరకు అమ్ము తున్నారు. కంపెనీలు విత్తనాలు ప్రాసెస్ క్రమంలో ఖర్చులు క్వింటాల్‌కు సగటున రూ.300 వస్తుంది. దొడ్డు రకాలకు 10శాతం, సన్న రకాలకు 20శాతం తరుగు పోతుంది. ప్రాసెస్ ఖర్చులలో సగం, ఆపైగా డబ్బులు రైతుల నుండి కట్ చేసే దాన్యం, హమాలీ చార్జీల కటింగ్ రూపంలో రికవరీ అవుతాయి. రైతుల నుండి కంపెనీలు కొంటామని ప్రకటించిన ధరలకు అదనంగా క్వింటాలకు రూ.300 నుండి 500 ఇచ్చినప్పటికి, విత్తనాల అమ్మకం ధర క్వింటాల్‌కు రూ.100-200 తగ్గించినప్పటికీ కంపెనీలకు మంచి లాభాలు ఉంటాయి. రైతులకు న్యాయమైన ధరలు ఇవ్వకపోవడం కాకుండా సీడ్ మిల్లులో పనిచేసే శ్రామికుల శ్రమదోపిడీ తీవ్రంగా ఉన్నది. అంతర్ రాష్ట్ర వలస హమాలీ కార్మికులకు ఒప్పందం ప్రకారం రేట్లు ఇవ్వడం లేదు. సగం మాత్రమే ఇస్తున్నారు. లేబర్‌కు, దినసరి కూలీలకు ఇస్తున్నది రోజుకు రూ.280 మాత్రమే. ప్రమాదాలు జరిగి గాయాలైతే ట్రీట్మెంట్ కూడా అందించడం లేదు. చనిపోతే కుటుంబ సభ్యులను తోటి కార్మికులను బెదిరించి స్వగ్రామాలకు పంపిస్తున్నారు.
యాజమాన్య పద్ధతుల ద్వారా హైబ్రీడ్ సాగు అవసరం
మగ, ఆడగా పిలువబడే హైబ్రిడ్ వరి విత్తన ఉత్పత్తి ఖర్చు ఒక ఎకరాకు రూ.35 నుండి 40వేలు వస్తుంది. ఒక ఎకరాకు దిగుబడి వెరైటీని బట్టి 6, 10, 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పంట కాలం 5 నెలల 15రోజులు. సీడ్ కంపెనీలు క్వింటాలకు రూ.5 నుండి 9 వేలకు కొంటున్నాయి. క్వింటాలుకు 10కేజీలు కటింగ్ చేస్తున్నారు. హైబ్రిడ్ మొక్క ఎదుగుదలకు ఉపయోగించే +ఱbbవతీవశ్రీశ్రీఱష aషఱస (+A3) డబ్బులు రైతుల నుంచి కట్ చేస్తారు. ఎన్ని డబ్బులు కట్ చేస్తున్నారో రైతులకు స్పష్టంగా తెలియచేయరు. హైబ్రీడ్ వరి విత్తనం ఉత్పత్తిలో రైతులకు రిస్క్ ఎక్కువ ఫలితం తక్కువగా ఉన్నది. హైబ్రిడ్ వరి విత్తనాలను కంపెనీలు ప్రధానంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. క్వింటాలుకు 5వేల నుండి 50వేలు, ఆపైన కూడా అమ్మగల సీడ్ కంపెనీలు ఉన్నాయి. బాస్మతి వరి సీడ్ సాగు విస్తీర్ణం కరీంనగర్ జిల్లాలో ఇటీవల సంవత్సరాలలో పెరుగుతుంది. ఖర్చు ఎకరాకు సుమారు రూ.15వేలు వస్తుంది. ఎకరాకు 22 నుండి 24 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాల్‌కు రూ.2600లకు కొంటున్నారు. క్వింటాల్‌కు 10కిలోలు కటింగ్ చేస్తున్నారు. విత్తనం గింజల కింద ఎకరానికి రూ.1000 కటింగ్ చేస్తారు. బెరికికి గాను ఎకరానికి రూ.1200 కటింగ్ చేస్తున్నారు. మన దేశంలో వరి ప్రధాన ఆహార పంట. సుమారు 44మిలియన్ హెక్టార్లలో రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో 3శాతం (1.32 మి.హెక్టార్లలో) హైబ్రిడ్ వరిని సాగు చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకనుగుణంగా 2025 వరకు వరి ఉత్పత్తిని 130మిలియన్ టన్నుల వరకు అభివృద్ధి చేయాల్సి ఉంది. దిగుబడి పెంచాలంటే ఇతర యాజమాన్య పద్ధతులతో పాటు హైబ్రిడ్ వరి విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉంది. దీనిని సాధించాలంటే సాగుచేసే విస్తీర్ణంలో సరాసరి 20శాతం వరకు హైబ్రిడ్ వరిని సాగుచేసుకోవాలి. హైబ్రిడ్ వరి విస్తీర్ణం పెంచాలంటే అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన హైబ్రిడ్ విత్తనం రైతులకు అందించాలి. మన దేశంలో సుమారు 40కి పైగా వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిని చేస్తున్నాయి. విత్తనాల నాణ్యత పైనే దిగుబడి పెరుగుదల, ఎరువులు, పురుగుమందుల వాడకం ఆధారపడి ఉంటాయి. దేశ అవసరాల్లో 60శాతం వరి విత్తనాలు తెలంగాణ నుంచి సరఫరా అవుతున్నాయి. దేశంలో సాగయ్యే అన్ని పంటల విత్తనాలు 40శాతం, హైబ్రిడ్‌లో 50శాతం తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయి. 14 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. హైబ్రిడ్ వరి విత్తనాల ఉత్పత్తులు కరీంనగర్ జిల్లా ముందంజలో ఉంది. 80వేల ఎకరాల్లో వరి విత్తనాలు పండిస్తుండగా, ఇందులో 25వేల ఎకరాల్లో హైబ్రిడ్ రకాలు పండిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ విత్తన సంస్థలు ఇక్కడ తమ ఉత్పత్తులు చేస్తున్నాయి.
'తెలంగాణ సీడ్ బౌల్'ను బలోపేతం చేయాలి
సీడ్ కంపెనీలు మార్కెట్లో విక్రయించే విత్తనాలు రైతులు పండించే విత్తనాలు సాధారణంగా ''సర్టిఫైడ్ విత్తనాలు''. విత్తనాల సర్టిఫైడ్ అనేది పంటలను పండించడానికి ఉపయోగించే విత్తనాల నాణ్యత నియంత్రణ కోసం చట్టబద్ధంగా మంజూరు చేయబడినది. సర్టిఫైడ్ విత్తనాలు మెరుగైన దిగుబడి, చీడపీడల నిరోధకత, కరువును తట్టుకునే శక్తి, కలుపు సంహారకాలను తట్టుకునే శక్తి మొదలైన లక్షణాలను కలిగి ఉండాలి. విత్తనాలు ఈ లక్షణాలను పొందడానికి కొన్ని సంవత్సరాల పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) ఫలితం. విత్తన వర్గాలు ప్రధానంగా ఐదు ఉన్నాయి. న్యూక్లియస్ సీడ్స్, బ్రీడర్స్ సీడ్స్, ఫౌండేషన్ సీడ్స్, రిజిస్టర్డ్ సీడ్స్, సర్టిఫైడ్ సీడ్స్. న్యూక్లియస్ సీడ్ జన్యుపరంగా స్వచ్ఛమైన విత్తనం. విత్తన అభివృద్ధిలో ఈ దశ అత్యంత ముఖ్యమైన దశ. బ్రీడర్స్ సీడ్ అనేది న్యూక్లియస్ సీడ్ సంతానం. మన దేశంలో బ్రీడర్ విత్తనాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్, దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉత్పత్తి చేస్తాయి. బ్రీడర్ సీడ్ సంతానాన్ని ఫౌండేషన్ సీడ్ అంటారు. ఫౌండేషన్ సీడ్స్ ఉత్పత్తి తప్పనిసరిగా సర్టిఫైడ్ ఏజెన్సీ ఆమోదయోగ్యంగా ఉండాలి. సర్టిఫైడ్ ఏజెన్సీ నిర్దేశాలకు అనుగుణంగా సర్టిఫైడ్ సీడ్స్‌ను పండించే పంపిణీ చేసే వ్యక్తి లేదా కంపెనీని సర్టిఫైడ్ సీడ్ ప్రొడ్యూసర్ అంటారు. రిజిస్టర్డ్ సీడ్స్ ఫౌండేషన్ సీడ్ సంతానం. సర్టిఫైడ్ సీడ్స్ ఇది చివరి దశ, ఇది రైతుకు చేరుతుంది. 1966లో నిర్దేశించిన విత్తన సర్టిఫైడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. విత్తన ప్రాసెసింగ్ కంపెనీలపై వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖల నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం వలన సీడ్ కంపెనీలు తమ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నకిలీ విత్తనాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్న ఘటనలు అనేకం జరుగు తున్నాయి. సీడ్ కంపెనీలు ఎంతమంది రైతులకు సీడ్ ఇచ్చింది. రైతులతో చేసుకున్న ఒప్పందాలు ఏమిటి? తదితర వివరాలు ఏవి కూడా వ్యవసాయ శాఖ నమోదు చేయడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ''తెలంగాణ సీడ్ బౌల్'' వంటి మాటలు చెబితే సరిపోదు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని బలోపేతం చేయాలి. రీసెర్చ్‌కు అధిక నిధులు కేటాయించాలి. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థను బలోపేతం చేయాలి. రైతులను మోసం చేస్తున్న సీడ్ కంపెనీలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. అగ్రికల్చర్ శాఖకు, మార్కెటింగ్‌శాఖకు పర్యవేక్షణ, నియంత్రణ అధికారాలివ్వాలి.అప్పుడైనా రాష్ట్రంలో రైతులకు భరోసా ఇచ్చినట్టు అవుతుంది.
- గీట్ల ముకుందరెడ్డి
సెల్:9490098857