Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏమున్నదక్కో...ఏమున్నదక్కా..ముల్లెమూటు సదురుకుని వెళ్లిపోతా ఉన్న..కర్నాటకలో ఇంకేము న్నదక్కో... యాడ ఉండి కన్నువేసిరో 40శాతం కమీ షన్లపై.. ప్రజలంతా ఒక్కటై కన్నడనాట అధికారాన్ని పీకేసురు..మత విభజనలు మాకాడ చెల్లబోవంటూ ఓట్లతో నడ్డివిరిచి తరిమిండ్రు సామి..సామి..గ్యాస్ రేట్ల దెబ్బకూ..భజరంగబళి నినాదం చిన్నదైపోయే సామి.. ఏమున్నదక్కో ఏమున్నదక్కా కన్నడనాట ఇంకేమున్నదక్కో' అంటూ బీజేపీ నేతలంతా పాట పాడుకోవాల్సిన సమయం మొదలైంది. ఉత్తర భారతాన తాను విసిరిన పాచికల్లా పారి అధికారంతో వికసించిన కమలం కన్నడనాట కమిలిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో తమ చేతిలో అధికారం ఉన్న ఒక్క రాష్ట్రంలోనూ హస్తం దెబ్బకు పువ్వు రెక్కలన్నీ రాలిపోయాయి. మోచా తుఫాన్ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలమీద పనిచేయనట్టే..మోషా ప్రభావం కనిపించలేదు. అవినీతి, కుల కంపు రాజకీయాలు, రిజర్వేషన్ల కుంపటి, విభజన రాజకీయాలు ఆ పార్టీకి మేలు చేయకపోగా నట్టేట ముంచాయి. మోడీ, షా, నడ్డా, ఐదారు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు కర్నాటకలో తిష్టవేసి..జాకీలు పెట్టి మరీ ఎంత లేపాలని చూసినా ప్రజాబలం ముందు వారి శక్తి చిన్నదైపోయింది. దీంతో కర్నాటకలో మరోమారు గెలిచి దక్షిణాదిపై పట్టు సాధించాలనుకున్న ఆ పార్టీ పరిస్థితి 'అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి...బోల్తాకొట్టిందిలే బుల్బుల్ పిట్టా' అన్న పాట మాదిరిగా తయారైంది.
- అచ్చిన ప్రశాంత్