Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్యాంగ అధికరణ 265 ప్రకారం పార్లమెంటు, శాసనసభలు చేసిన చట్టాలతో పన్నులు విధిస్తారు, వసూలు చేస్తారు. నేటి కేంద్ర ప్రభుత్వ పన్నుల విధానం కేంద్ర ఆదాయాన్ని పెంచింది. రాష్ట్రాల ఆదాయాలకు గండికొట్టింది. పన్నులు, సరుకులపై సుంకాలు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయాలు, మూలధన ఆదాయాలు, విదేశీ సహాయాలు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో భాగం. 1.6.2015 నుంచి సేవలపై 14శాతం సేవా పన్ను విధించారు. 15.11.15 నుంచి 0.5శాతం స్వచ్భ భారత్ సెస్, 1.6.2016 నుంచి 0.5శాతం రైతు సంక్షేమ కృషి కల్యాణ్ సెస్‌లతో సేవా పన్ను 15శాతం అయింది. 2015 నుంచి మార్చి 2020 వరకు రూ.2.1లక్షల కోట్లకు పైగా అదనపు సేవా పన్ను వసూలైంది. పన్నులు, రుసుములు, చిల్లర పన్నులు (సెస్), అదనపు పన్నుల (సర్‌చార్జ్) ద్వారా తన ఆదాయాలను పెంచుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుత ప్రభుత్వానికి సెస్సులు, సర్‌చార్జీలు ప్రధాన ఆదాయ వనరులు. 2015-17 మధ్య రెండేండ్లలో రూ.16,601.13 కోట్ల స్వచ్ఛ భారత్ సెస్ వసూలైంది. మోడీ ప్రభుత్వంలో బలవంతపు విధింపులు ఎక్కువ. 2010-11లో ఈ ఆదాయం 10.4శాతం, 2020-21లో 19.9శాతం. ఈ విధానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇది బ్రిటిష్ వలస ఆర్థిక విధానం. రాష్ట్రాలతో ఆదాయ పన్నులు పంచుకోవాలని రాజ్యాంగ అధికరణ 270, ఎక్సైజ్ డ్యూటీని పంచాలని అధికరణ 272 చెపుతాయి. బలవంతపు సెస్, సర్ఛార్జీలను రాష్ట్రాలకు పంచనక్కరలేదని అధికరణ 271 మినహాయింపు ఇచ్చింది. అదనపు విధింపులను కేంద్రం పూర్తిగా వాడలేదని, వాటి నిర్ధారిత ప్రయోజనాలకు కాక ఇతరాలకు (ఈ ఇతర అవసరాల వివరాలు ప్రభుత్వం ప్రకటించలేదు) దారి మళ్ళించిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పలు మార్లు నివేదించింది. 2017లో వస్తుసేవలపన్నులు (జీఎస్టీ) ప్రవేశపెడుతూ అదనపు వడ్డింపులను ఎత్తివేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎత్తేసిన వాటి కంటే ఎక్కువగా కొత్త వాటిని ప్రవేశపెట్టింది. అందులో జీఎస్టీ, పరిహార సెస్, సాంఘిక సంక్షేమ సర్ఛార్జ్ విచిత్రమైనవి. జీఎస్టీ పరిహార సెస్ 2017-18లో రూ.61,331కోట్లు, 2018-19లో రూ.90,000 కోట్లు వసూలైంది. అదనపు వడ్డింపులతో కేంద్రం రాష్ట్రాల పాలనా విధానాల్లో దూరింది. లాభదాయక ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్లకు అమ్మేస్తోంది. 2019-20 బడ్జెట్లో పెట్రోల్, డీజెల్ సెస్ పెంచింది. రాష్ట్రాల ఆదాయాలను గండికొట్టిన కేంద్రం ఆర్డినెన్స్‌తో తన ఖర్చులను, రక్షణరంగ వ్యయాన్ని రాష్ట్రాలపై రుద్దింది. అందులో రఫాల్ యుద్ధ విమానాల, అమెరికా హెలికాప్టర్ల కొనుగోళ్ల ఖర్చు ఉంది. రాష్ట్రాలకు ఆర్థిక బాధ్యతలు, ఖర్చులు ఎక్కువ. కేంద్రం నిధుల పంపిణీ నిరాకరించడంతో రాష్ట్రాలకు బాధ్యతల నిర్వహణ ఇబ్బందులు కలుగుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్రాల ఆదాయాలు తగ్గాయి. జీఎస్టీతో ఆదాయ పెరుగుదల వ్యత్యాసాలను భర్తీ చేస్తానన్న కేంద్రం మొండిచేయి చూపింది. తన ఆదాయాన్ని పెంచుకున్న కేంద్రం రాష్ట్రాలను గాలికి వదిలేసింది. కేంద్రం తగ్గించిన కార్పొరేట్ పన్నుల కారణాన రూ.65,000 కోట్ల రాష్ట్రాల వాటా తగ్గింది. ఆర్థిక బాధ్యత-బడ్జెట్ నిర్వహణ చట్టం రాష్ట్రాల ద్రవ్యలోటుపై పరిమితులు విధించింది. ఫలితంగా రాష్ట్రాలు అనివార్య ఖర్చులు కూడా పెట్టలేవు. కోవిడ్ మహమ్మారి వల్ల రాష్ట్రాల ఆదాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఖర్చులు పెరిగాయి.
ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్ష్యం ప్రజాసంక్షేమం. కార్పొరేట్ల లాభాలు పెంచటం, తాము తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు మెరుగుపరుచుకోటం కాదు. నేటి బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో జీఎస్టీ 28.5శాతం (13.49), కార్పొరేట్ పన్నులు 28.1శాతం (31.14-39.19శాతం), వ్యక్తుల ఆదాయ పన్ను 26.3శాతం (19.76శాతం), ఎక్సైజ్ 11శాతం (19.79), కస్టమ్స్ 5.7శాతం (14.45). బ్రాకెట్లలోని అంకెలు యూపీఏ ప్రభుత్వ కాలానివి. యూపీఏ హయాం కంటే బీజేపీ పాలనలో కార్పొరేట్, ఎక్సైజ్, కస్టమ్స్ పన్నులుతగ్గాయి. ఇతర పన్నులు పెరిగాయి.2021-22 బడ్జెట్లో కేంద్ర జీఎస్టీ ఆదాయం రూ5.8లక్షల కోట్లు. జీఎస్టీ పరిహార సెస్ ఆదాయం రూ.1,10,500 కోట్లు.2019-20 బడ్జెట్లో ప్రభుత్వం ఆదాయ పన్ను సర్‌ఛార్జ్‌ని 25-37శాతం పెంచింది. కార్పొరేట్ పన్నుకు వార్షిక ఆదాయ పరిధిని 250 నుంచి 400 కోట్లకు పెంచింది. విద్యారంగ పరిశోధన నిధుల సేకరణకు జాతీయ పరిశోధన సంస్థను ఏర్పాటుచేసింది. పరిశోధనలకు ప్రభుత్వం ఖర్చుపెట్టదు. జాతీయ ఆస్తుల అమ్మకాల ఆదాయం 31.3శాతం, సంపన్నులకు పెట్రోల్ రాయితీ 50.9శాతం, ఇతర రాయితీలు12.9శాతం పెంచింది. గ్రామీణ అభివృద్ధి శాఖకు కేటాయింపు 4.8శాతమే. గ్రామీణ ఉపాధి ఖర్చు1.8శాతం, స్వచ్ఛ భారత ఖర్చు 25.5శాతం తగ్గించింది. మహిళా, శిశు సంక్షేమాలకు వరుసగా9.1శాతం, 12.8శాతం మాత్రమే పెంచారు. ఏప్రిల్ 2019లో 1.6లక్షల కోట్ల ఆర్బీఐ నిధులు మళ్లించారు. మే నెలలో 1.45లక్షల కార్పొరేట్ పన్నులు రద్దుచేశారు. 2014 ఏప్రిల్ నుంచి 2019 దాకా 5.55లక్షల కోట్ల మొండి బకాయీలు రద్దుచేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు అదనపు ఆదాయాలు అవసరం. రాష్ట్రాలు ప్రజలపై అక్రమంగా అనేక రకాల కొత్త పన్నులు రుద్దాయి. పాత పన్నులను పెంచాయి. పన్నులు పెంచే బదులు రాష్ట్రాలు కేంద్రం నుంచి తమ వాటాలు అడగాలి. తమ ఆదాయాలకు గండికొట్టే విధానాలు ఆపించాలి. కేంద్రం ఈ పరిస్థితుల్లో రాష్ట్రాల ఆసక్తులను కాపాడాలి. రెండేండ్లు దాటిన సెస్సులు, సర్‌చార్జీలను రాష్ట్రాలకు పంచాలి. 1983లో సర్కారియా కమిషన్ సిఫారసు ప్రకారం కొత్త సెస్సులు, సర్ఛార్జీలను పరిమిత కాలానికి మాత్రమే విధించాలి.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్: 9490204545