Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చివరి నిముషంలో వేదిక మార్పు... చెన్నై రైల్వే స్టేషన్లో పారా అథ్లెట్లు చిక్కుకుపోవడం... సకాలంలో బెంగళూరు చేరుకునేందుకు టిక్కెట్లను రీ షెడ్యూల్ చేయించుకోవడానికై ప్రయాసపడడం... స్టేడియాల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘన... ఇవన్నీ ఒక క్రీడా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించరాదో చెప్పడానికి అత్యంత దయనీయమైన ఉదాహరణలుగా క్రీడా చరిత్రలో నిలిచాయి. జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడానికి మొబైల్, కార్ లైట్లను ఉపయోగించారు. నిజమే మీరు సరిగానే చదివారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియం బుధవారంనాడు మసక చీకట్లలోనే పారా అధ్లెట్లకు ఆతిథ్యమిచ్చింది. క్రీడాకారులు కోరుకున్నందునే సాయంత్రం పొద్దుపోయిన తర్వాత కార్యక్రమాలు నిర్వహించినట్లు పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) చెప్పడం అంతకుమించి ఆశ్చర్యపరిచే అంశం. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో కనబరిచిన ప్రతిభా పాటవాల ఆధారంగా ఉద్యోగాలు, స్కాలర్షిప్లు, అడ్మిషన్లు దొరికే అవకాశమున్న పరిస్థితుల్లో జాతీయ స్థాయి ఈవెంట్‌ను ఇలా నిర్వహించడానికి ఇది కారణం కాబోదు.
మార్చి 24న చెన్నైలో క్రీడాపోటీలు ప్రారంభం కావడానికి కాస్త ముందుగా ఈ గందరగోళం మొదలైంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వనందున జాతీయ స్థాయి పోటీలను బెంగళూరుకు మారుస్తున్నట్లు మార్చి 20న పీసీఐ అకస్మాత్తుగా సర్క్యులర్ జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం నుండి క్రీడా పోటీల నిర్వహణకు అనుమతి తీసుకోకుండానే చెన్నైలో నేషనల్స్ పెట్టాలని పీసీఐ భావించిందా అన్నది ఇక్కడ మనల్ని తికమక పెట్టే ప్రశ్న. కావాలంటే ఈవెంట్‌ను వాయిదా వేసుకోవచ్చు, కానీ అలా చేయలేదు. దాంతో తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారి తీశాయి. అథ్లెట్లకు బుక్ చేసిన రైళ్ళు, విమానాలు, హౌటళ్లు అన్నీ రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. చాలా తక్కువ సమయంలో ఇచ్చిన నమాచారంతో వందలాదిమంది పారా అథ్లెట్లు బెంగళూరుకు చేరుకోవాల్సి వచ్చింది.
ఇటువంటి వివాదాలు పీసీఐకి కొత్తమీ కాదు. గతంలో కూడా, జాతీయ స్థాయి పోటీల సందర్భంగా ఇటువంటి గందరగోళ పరిస్థితులు, నిర్వహణా లోపాలు చోటు చేసు కున్నాయి. 2015లో ఘజియాబాద్‌లో క్రీడా మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ పారాలిపింక్స్ కమిటీ...పీసీఐని సస్పెండ్ చేయడం అన్నింటికంటే అధ్వాన్నమైన ఘటన. 2018లో పంచకులలో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. కొద్ది నెలల క్రితమే, కొత్త అధ్యక్షుడు వచ్చి బాధ్యతలు చేపట్టడంతో పీసీఐ మునుపటి గుర్తింపు తెచ్చుకుంది. పారా అథ్లెట్లకు ఉపయోగపడే విధంగా దేశంలో క్రీడా సదుపాయాలు లేవన్న విషయాన్ని పిసీఐ గ్రహించాల్సిన సమయమిదే అనిపిస్తోంది. ఈ విధంగా చివరి నిముషపు ప్రయాణాలతో వారిని పరుగులెత్తించకుండా, క్రీడాకారుల ప్రయోజనాల గురించి ఆలోచించడం వివేకవంతంగా ఉంటుంది. ఎటువంటి రాజీ లేకుండా పారా అథ్లెట్లకు సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాల్సిన అవసరముంది.
- ('ఇండియన్ ఎక్స్‌ప్రెస్' సంపాదకీయం)