Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఉద్యోగులకు పీఆర్సీ, పదవి విరమణ వయస్సు పెంపుతో పాటు, నిరుద్యోగులకు త్వరలోనే యాభై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు చెప్పింది. బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ వేదికగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈ ప్రకటన చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికనే ఉధృతరూపం దాల్చింది. కానీ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లయినా ఉద్యోగాల భర్తీ నత్తనడకన సాగడం మూలంగా నిరుద్యోగుల్లో నైరాశ్యం ఆవరించింది. ఎన్నికల హామీలో నిరుద్యోగ భృతిని ఇస్తామని చెప్పినా, అది కార్యరూపం దాల్చకపోవడం, కాలయాపన జరగడం విచారకరం. మొన్న అసెంబ్లీ సాక్షిగా సీఎం ఆ హామీ కూడా కరోనా మూలంగా ఆగిందని, నిరుద్యోగులుగా ఎవరిని గుర్తించాలి? ఎలా భృతి ఇవ్వాలి? ఎంత ఇవ్వాలనే అధ్యయనం ఆధారంగా అమలుకు పూనుకుంటామన్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) తన నివేదికలో రాష్ట్రం మొత్తంలో 1,91,126 ఉద్యోగాల ఖాళీలున్నాయని వెల్లడించింది. మన రాష్ట్రం మొత్తంగా 4,91,304 పోస్టులకుగాను ప్రస్తుతం 3,00,178 (61శాతం) మందే పనిచేస్తున్నారు. దీనిని బట్టి మొత్తం పోస్టుల్లో 39 శాతం ఖాళీలే ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నది.
మన రాష్ట్రంలో 32 ప్రభుత్వ శాఖలుండగా అందులో అయిదు శాఖల్లోనే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాటిలో అత్యధికంగా 1. పాఠశాల విద్యాశాఖలో 1,37,851 ఉద్యోగాలకు 1,13,858 మంది పనిచేస్తున్నారు. 2. హౌంశాఖలో మొత్తం 98,394 పోస్టులకుగాను 61,212 మంది పనిచేస్తున్నారు. 3. రెవెన్యూ శాఖలో 27,786 ఉద్యోగులకుగాను 19,825 మంది ఉన్నారు. 4. వైద్య ఆరోగ్యశాఖలో 59,906 పోస్టులు మంజూరీ కాగా, దీనిలో 22,396 మంది మాత్రమే ఉన్నారు. 5. పంచాయతీ రాజ్ శాఖలో 26,201 ఉద్యోగాలకు గాను 13,575 మంది మాత్రమే ఉన్నారు. ఈ విధంగా మొత్తం ఈ అయిదు శాఖల్లోనే మన రాష్ట్రంలో 3,42,938 (69.80శాతం) మంజూరైన ఉద్యోగాలుండగా, పనిచేస్తున్న ఉద్యోగుల్లో 2,30,799 (79.89శాతం) మంది వీటిలోనే ఉన్నారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ శాఖల్లో 50,400 మంది ఒప్పంద ఉద్యోగాలు, 58,128 మంది పొరుగు సేవల ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరు 16.81శాతంగా ఉన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంత జనాభా 3.52 కోట్లు కాగా మంజూరైన ఉద్యోగాలు పరిగణనలోకి తీసుకుంటే ప్రతి వేయి మంది జనాభాకు 14 మంది ఉద్యోగులుండాలి. పై ఖాళీల దృష్ట్యా 8.5 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఉద్యోగ ఖాళీలు ఇలా ఉంటే? పాలనలో వేగం ఎలా సాధ్యం. ఓవైపు ఉద్యోగుల, మరోవైపు నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవలసినది పాలకులే. పరిశ్రమల స్థాపనతో ఉద్యోగాలు సృష్టిస్తూ, ఉపాధి మార్గాలను వెతుకుతూ, నిరుద్యోగ నిర్మూలన చేస్తూ, పారదర్శక పాలన అందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా, ఖాళీల భర్తీలో కూడా ఉదాసీనత చూపుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టి.ఎస్.పి.ఎస్.సీ)కి ఛైర్మన్‌తో కలుపుకుని 10మంది సభ్యులుంటారు, కాని ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ప్రభుత్వం కొత్తగా 50వేల ఉద్యోగాల భర్తీలో గ్రూప్ -1తో పాటు, గ్రూప్ -2, గ్రూప్ -3, గ్రూప్-4 లాంటి భర్తీ ప్రకటన వెల్లడించి, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి పూర్తి చేయటానికి మొదట దీన్ని నియామకం చేయాల్సి ఉంది. త్వరలో చేపట్టే భర్తీకి ముందు ఈ ప్రక్రియ పూర్తిచేస్తేనే అంతా సాఫీగా జరుగుతుంది.
మంజూరైన ఉద్యోగాల్లో 39శాతం భర్తీ కాకుండా, ఖాళీల వల్ల ఇటు ప్రజలు అటు ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులపై పనిభారం పెరిగి ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రజలకు సేవలను సంపూర్ణంగా అందించలేక పోతున్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల విస్తరణ జరిగినప్పటికీ, వాటిలో ఖాళీల వల్ల ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నట్లు ప్రభుత్వం వేసిన వేతన సవరణ సంఘం తన నివేదికలో ప్రభుత్వానికి సూచనలు చేసింది. కాబట్టి ప్రభుత్వం వెనువెంటనే ఖాళీలు భర్తీ చేయాలి. ఇంకా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తూ ఉపాధి అవకాశాలు పెంచాలి, నిరుద్యోగుల్లో వెలుగులు నింపాలి. ప్రజలకు నాణ్యమైన, సత్వర సేవలను అందించాలి. ఎన్నికల హామీ మేరకు ఈ నియామకాలతో పాటు నిరుద్యోగులను గుర్తించి వారికి భృతిని అమలు చేయాలి. నిరుద్యోగులవి ''గొంతమ్మ కోరికలు'' కానేకాదు. మన పాలకులు తమ బాధ్యతగా భావించాలి. కొన్ని వృత్తి శిక్షణలు ఇచ్చి స్వయం ఉపాధికి రుణాలు ఇస్తూ నిరుద్యోగితను తగ్గించాలి. యూనివర్సిటీల్లో, వృత్తి విద్యల్లో పట్టాలు పొందిన నిరుద్యోగులు, హైదరాబాద్‌లో అదనపు శిక్షణ కోసం సంస్థల చుట్టూ తిరుగుతూ, పస్తులుంటూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. కోర్టు చిక్కులను అధిగమిస్తూ టైమ్ బాండ్ ప్రోగ్రామ్‌లో నియామకాలను (భర్తీ) చేపట్టాలి. మొన్న వరంగల్‌లో బోడ సునిల్ నాయక్ అనే నిరుద్యోగ యువకుడు ఆత్మహత్యా ప్రయత్నం చేయడం విచారకరం. నిరుద్యోగ యువతలో ఆత్మ విశ్వాసం నింపే చర్యలు తక్షణమే చేపట్టాలి. నాడు తెలంగాణ ఉద్యమంలో అమరులైన నిరుద్యోగ యువత త్యాగం వెలకట్టలేనిది. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా యువత నిరాశ నిస్పృహలకు లోనుకావడానికి ఇన్నాళ్ల కాలయాపనే కారణమని ప్రభుత్వం గుర్తించాలి. లేదంటే తెలంగాణ యువత మరోపోరాటానికి సిద్ధమవుతుంది.
- మేకిరి దామోదర్
సెల్:9573666650