Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిన్నటివరకు బద్ధ విరోధులుగా ఉన్న భారత్, పాకిస్థాన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా శాంతి మంత్రం జపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత అయిదేండ్లుగా సైనిక చర్యలతో ఉద్రిక్తంగా ఉన్న వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పుల విరమణకు ఇరు దేశాలు రహస్య చర్చల ద్వారా ఒక ఒప్పందానికి వచ్చాయి. తూర్పు లడఖ్‌లో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు చైనాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అకస్మాత్ మార్పు అందరూ ఊహించినదే. దీనికి ముందు చర్చల ప్రక్రియ సాగింది. అదీగాక ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణుల్లో సైనిక బలగాల నిర్వహణ అత్యంత వ్యయ ప్రయాసలతో కూడినట్టిది. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతల తొలగింపునకు ఇరు దేశాలు ఒక అంగీకారానికి రావడంలో ఆశ్చర్యం కలిగించేదేమీ లేదు. కానీ, భారత్, పాక్‌ల మధ్య కుదిరిన ఒప్పందం అలా కుదిరింది కాదు. భారత్, పాక్ మధ్య గత ఒక్క ఏడాదిలోనే 5వేలకు పైగా కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా 22మంది పౌరులు మరణించారు. 71మంది గాయపడ్డారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చర్చలు జరపాలని, శాంతిని పునరుద్ధరించాలని భారత్‌ను కోరారు. దీనికి భారత ప్రభుత్వం ససేమిరా అంటూ వచ్చింది. పాక్ మిలటరీ ఆర్థిక స్థితిగతులు పేలవంగా ఉండడమో, ఆచరణాత్మకంగా ఉండాలని అనుకోవడం వల్లనో ఏ ఉద్దేశంతో అయినప్పటికీ ఇమ్రాన్ నుంచి ఆ అభ్యర్థన చేశారు. ఖజానాపై పడే భారాన్ని దృష్టిలో పెట్టుకోకుండా భారత విదేశాంగ విధానాన్ని ప్రమాదకరమైన పంథాలో నడిపించేందుకే మోడీ మొగ్గు చూపారు. కాశ్మీరీలకు, తీవ్రవాదానికి మద్దతును విడనాడేంతవరకు పాక్‌తో చర్చలు జరిపేది లేదని ఇప్పటివరకు తెగేసి చెప్పారు. అటువంటి మోడీని చర్చల వేదిక వద్దకు తీసుకొచ్చిందేమిటి? పాకిస్థాన్ ఏమంత శక్తివంతంగా లేకపోవడమా? ట్రంప్ వైట్‌హౌస్ నుంచి వైదొలగిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వ్యూహంలో వచ్చిన మార్పా? బైడెన్ అధికారంలోకి వచ్చిన నెలన్నర రోజులకే ఆఫ్ఘనిస్థాన్‌లో వైరి వర్గాల మధ్య రాజీకి యత్నాలు చేపట్టారు. అక్కడ ఎన్నికలు జరిగేవరకు అన్ని వర్గాల ప్రాతినిధ్యంతో కూడిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అమెరికా సేనలను వెనక్కి తీసుకునే విషయమై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా తిష్టవేసేందుకు పొరుగునే వున్న పాకిస్థాన్ సాయం దానికి తప్పని సరి. కాబట్టి పాకిస్థాన్‌ను అమెరికా వదులుకునే పరిస్థితి లేదు. పాకిస్థాన్‌కు కోపం తెప్పించే పని భారత్ చేస్తే అది అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తుంది. అమెరికా చెప్పినట్టు మొదటి నుంచి ఆడుతున్న మోడీ ప్రభుత్వం ఇప్పుడీ విషయంలోనూ అగ్రరాజ్యం మాటను జవదాటే పరిస్థితి లేదు. పాక్ పట్ల భారత ప్రభుత్వ వైఖరిలో ఈ అకస్మాత్తు మార్పునకు ఇదీ అసలు కారణం!
విదేశాంగ విధానం-భద్రత
ఆసియా ప్రాంతంలోను, ప్రపంచంలోను భారత్ నాయకత్వ పాత్ర పోషించాలంటే సైన్యం చాలా కీలకమన్నది ఆర్ఎస్ఎస్ చాలా కాలంగా చెబుతూ వస్తున్న సిద్ధాంతం. ప్రజల సౌభాగ్యం కన్నా ఆర్ఎస్ఎస్ ఈ వ్యూహాత్మక అంశాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. మితవాద జాతీయవాదంలోని ప్రధాన వైరుధ్యం ఇదే. ఇది సామ్రాజ్యవాద శక్తులతో మిలాఖత్ అయిన భారతదేశంలోని కులీన వర్గాల ఆందోళనలతో ముడిపడి ఉంది. మెజారిటీ ప్రజల అభీష్టానికి భిన్నంగా తమ ఉన్నత హక్కులను పరిరక్షించుకోవాలని కోరుకుంటున్న కొద్దిమంది బడా బాబులకు సేవ చేయడానికే ఈ భావజాలం ఉద్దేశించబడింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఆర్ఎస్ఎస్, బీజేపీలు అమెరికాతో జత కట్టేందుకు, బడా పెట్టుబడిదారుల సేవలో తరించే వైఖరిని తీసుకోవడానికి ఇదే కారణం.
ఆర్ఎస్ఎస్కు అనుకూలంగా విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ఎలా నిమగం అయినదీ, భారీగా ఆయుధాలు కొనుగోలు చేయడం ద్వారా అమెరికా ఆయుధ బేహారులకు మోడీ ప్రభుత్వం ఎలా తోడ్పాటునందిస్తున్నదీ 2014 నుండి మనం చూస్తున్నాం.
అమెరికన్ రాజకీయాల్లో మితవాదుల ప్రాబల్యం పెరుగుతున్న సమయంలోనే మోడీ భారత్‌లో అధికారానికి వచ్చారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం అంతర్జాతీయంగా మితవాద శక్తులకు మరింత ఊతమిచ్చింది. మోడీ వంటి నేతలు మరింత దూకుడుగా దేశీయ, విదేశాంగ విధాన ఎజెండాను అనుసరించడానికి ఇది దోహదపడింది. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత మోడీ మయన్మార్‌లో తిరుగుబాటుదారుల అణచివేత పేరుతో మిలిటరీ చేపట్టిన సైనిక చర్యకు ఆమోద ముద్రవేశారు. ఆతరువాత మోడీ సర్జికల్ దాడులు చేసి దాని నుంచి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. 2019లో సార్వత్రిక ఎన్నికలకు ముందు పుల్వామా దాడి, దానికి ప్రతిస్పందనగా బాలాకోట్‌పై సర్జికల్ దాడులను నిచ్చెనగా చేసుకుని మోడీ రెండో సారి ఎలా అధికారంలోకి వచ్చిందీ చూశాం.
ఆ సర్జికల్ దాడుల సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన సాహసోపేతులైన పైలట్లలో ఒకరు పాకిస్థానీ భూభాగంలో పట్టుబడినపుడు అమెరికా జోక్యం చేసుకుని విడిపించింది. దానిని కూడా మోడీ ప్రభుత్వం తన ఘనత కింద చెప్పుకుంది. కార్పొరేట్ మీడియా కూడా దీనికి అలాగే బాకా ఊదింది. ''పైలట్‌ను తిప్పి పంపకపోతే తీవ్ర పర్యవసానాలు వుంటాయి'' ''మా ఆయుధాగారం దివాలీ కోసం కాదు'' అని ప్రధాని మోడీ పాకిస్థాన్‌కు గట్టి సందేశమే ఇచ్చారని హిందూస్థాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
ఇదే తరహాలో భారత్‌కు తాము కూడా హెచ్చరికలు జారీ చేయగలమని పాకిస్థాన్ ఘాటుగా సమాధానమిచ్చింది. ఈ రెండు అణ్వాయుధ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు దిగజారడంతో అమెరికా జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేసింది. భారత్, పాక్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరగకుండా నివారించడానికి అమెరికా జోక్యం చేసుకుందన్న వాస్తవాలు 2019లో వెలుగులోకి రాలేదు. ఎందుకంటే ఈ వాస్తవాలు మోడీ ఇమేజిని దెబ్బతీస్తాయి కాబట్టి.
పాకిస్థాన్ విషయంలో మోడీ కుప్పిగంతులను భారత్-పాక్ సంబంధాల్లో అమెరికా జోక్యం మరోసారి స్పష్టంగా బయటపెట్టింది. ఆఫ్ఘనిస్థాన్‌లో బైడెన్ విధానం అమలు జరగాలంటే పాక్ మిలటరీ సాయం దానికి అవసరం. అది జరగాలంటే భారత్-పాక్ సరిహదుల్లో పాక్ సైన్యానికి ఊరట అవసరం. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా జోక్యం చేసుకున్నప్పటి నుండి సాధారణంగా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. పాకిస్థాన్ నుంచి వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేసేందుకు అమెరికా చేసిన సాయానికి మోడీ ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారన్నమాట.
దక్షిణాసియాలో అమెరికా సైనికంగా తిష్ట వేసుకుని ఉన్నంతవరకు భారత్, పాక్ మధ్య శాంతి అసాధ్యం. ఆసియా ప్రాంతంలో అమెరికా ఆధిపత్య వ్యూహంలో భారత్‌కు ముప్పుగా పాకిస్థాన్‌ను చూపించడం దానికి అవసరం. అలాగే అమెరికా అవసరాలను పాకిస్థాన్ తీర్చేలా చూసేందుకు భారత్‌ను దానికి బూచిగా చూపాలి. అమెరికాను ధిక్కరించేందుకు మోడీ కానీ, పాకిస్థాన్ సైన్యం కానీ సిద్ధంగా లేవు. ఈ పరిస్థితి మారనంత కాలం యుద్ధం, శాంతి మధ్య ఈ ఊగిసలాటలు కొనసాగుతూనే ఉంటాయి. అంతిమంగా బలయ్యేది సరిహద్దులకు ఇరువైపులా వున్న అమాయకులైన సైనికులు, పౌరులే.
పాకిస్థాన్ ఎప్పుడు భారత్‌కు వ్యతిరేకంగా తన తీవ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేస్తుందో తెలీదు. భారత్‌లో అధిక ధరలు, అంతులేని నిరుద్యోగంతో రోసిపోయిన మోడీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చు కోవడానికి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా సైన్యాన్ని ఎప్పుడు ప్రయోగిస్తుందో చెప్పలేం. అందుకే ఈ శాంతి ఎంత కాలం ఉంటుందన్నది సందేహమే.
- బి. అర్జున్