Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రభుత్వాలకు నిరుద్యోగులు గుర్తుకురావాలంటే ఎన్నికలు వచ్చితీరాల్సిందే! అప్పుడు మాత్రమే నిరుద్యోగుల వెతలు నేతల నోట ఊటల్లా పెళ్ళుబుకువస్తాయి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోడీ, రాష్ట్రమొస్తే ఇంటికోఉద్యోగం వచ్చినట్టే అన్నట్టు భ్రమింపజేసిన కేసీఆర్‌ల వాగ్దానాలు ఏట్లె కలిసినై. ఎప్పడో మరిచిన నిరుద్యోగులను మళ్ళీ ఎంఎల్‌సి ఎన్నికల సమయంలో నెమరేసుకున్నారు ఏలికలు. దక్షిణ తెలంగాణ మొత్తం పరుచుకున్న రెండు ఎంఎల్సీ ఎన్నికలు రాగానే నిరుద్యోగులు ఆప్తులుగా కనిపించారు ప్రభుత్వ పెద్దలకు. ఎవ్వరు అడగకపోయినా లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకు తిరిగారు. సవాళ్ళు ప్రతిసవాళ్ళు చేసుకున్నారు. ఎన్నికల్లో ఒడ్డున పడగానే ఉద్యోగుల వయోపరిమితి అరవయొక్క ఏండ్లకు పెంచి నిరుద్యోగులకు కర్రుకాల్చి వాతపెట్టారు. బహుషా రాబోయే ఎన్నికలనాటికి ఎక్కువ మంది రిటైర్ అయితే మేం చెప్పినదానికన్న ఎక్కువ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పకోవటానికి ఈ ఉపాయం పన్నినట్టున్నారు ఏలికలు. మొత్తానికి ఒంటె నాలుక కోసం నక్కాశపడ్డట్టు తయారయ్యంది నిరుద్యోగుల దుస్థితి. నోటిఫికేషన్ వచ్చేది లేదు, ఉద్యోగం వచ్చేది లేదు. తెలంగాణ సాకారమైతే మా నీళ్ళు మాకే, మా నిధులు మాకే, మా నియామకాలు మాకే అంటూ కేంద్రంతో ఆత్మహత్యల యుద్ధం చేసిన యువత, నేడు తెలంగాణ వచ్చినా ఉద్యోగాల భర్తీ లేక దగాపడి మళ్ళీ ఆత్మహత్యలకు పురికొల్పబడుతున్నది.
రాష్ట్రం సాకారం కాగానే ఇక ఉద్యోగాలు వస్తాయనుకున్న సమయానికి సంబంధం లేకున్నా కమల్‌నాథన్ కమిషన్న్ని సాకుగా చూపారు. ఉద్యోగ ఖాళీల సంఖ్యపై స్పష్టత లేదంటూ దాటవేస్తూ వచ్చారు. అన్ని వైపుల నుంచి వత్తిడి పెరగగా భర్తీ చేయనున్న ఉద్యోగాలపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ వాటాగా వచ్చిన ఖాళీ ఉద్యోగాలు లక్షా తొమ్మిది వేలు. వాటిని భర్తీ చేయటం కూడా తామే ఉద్యోగాలను సృష్టించినట్టు అసెంబ్లీలో ప్రకటన ద్వారా భ్రమింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ వాటిని కూడా సక్రమంగా భర్తీ చేయలేదు. పైగా సర్వీస్ కమిషన్ని దేశంలో ఎక్కడలేని విధంగా తీర్చిదిద్దుతామనీ, యూపీఎస్సీ మాదిరి క్యాలెండర్ ఇయర్ అమలు చేస్తామనీ పలికిన ప్రగల్బాలు నీటి మూటలే అయ్యాయి. అందుకు ఈ మధ్యకాలంలో పబ్లిక్ సర్విస్ కమిషన్ గవర్నర్‌కి సమర్పించిన నివేదికే సాక్ష్యం. తెలంగాణ వచ్చిననాటి నుంచి 108 నోటిఫికేషన్ల ద్వారా 35724 పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్టు ఈ నివేదిక చెప్పగా, మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల సమయంలో పబ్లిక్ సర్విస్ కమిషన్ రిపోర్టుకు భిన్నంగా ప్రభుత్వంలోని మంత్రులు, నాయకగణం తాము 1,32,799 ఉద్యోగాలు భర్తీ చేశామని రాష్ట్ర ప్రజలని తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశారు. ఇంతకూ పబ్లిక్ సర్విస్ కమిషన్ రిపోర్టు తప్పా? ప్రభుత్వ పెద్దలు చెప్పింది తప్పా? అనేది నిరుద్యోగలను తొలుస్తున్న ప్రశ్న. ఏదో ఒకటే వాస్తవం అయ్యే అవకాశం ఉన్నది. మరేది వాస్తవం అనే విషయాన్ని స్పష్టం చేయాల్సిన భాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది.
అధికార పార్టీ నాయకగణం చెబుతున్న లెక్కలతో గానీ, ఉద్యోగ ఖాళీల గురించి అసెంబ్లీలో ప్రభుత్వ ప్రకటన గానీ ఇటీవలి పే-రివిజన్ కమిటి రిపోర్టుతో సరితూగటం లేదు. ఈ లెక్కల వ్యత్యాసాలపై స్పష్టత ఇవ్వాల్సిన భాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్రం విడిపోగానే నోటిఫికేషన్లు ఎందుకివ్వటం లేదు? ఉద్యోగాలు ఎందుకు భర్తీ చెయ్యటం లేదు? కనీసం డీఎస్సీ నైనా ఎందుకు వేయ్యటం లేదంటే... కమల్‌నాధన్ కమిషన్ పేరు చెప్పి కాలం వెళ్ళబుచ్చారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఉద్యోగాల ప్రకటనను కూడా నాడు ఉద్యమం పేరుతో అడ్డుకుని, ప్రత్యేక రాష్ట్రంలో ఇంకా ఎక్కువ ఉద్యోగ ఖాళీలతో నోటిఫికేషన్లు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగుల నోట్లో మట్టి కోట్టింది తెలంగాణ పాలన. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా డీఎస్సీ పూర్తి చేసి నియామకాలు చేశారు. కానీ తెలంగాణ డీఎస్సీకి కాదు కదా టెట్ పరీక్షలకు కూడా నోచుకోలేదు. తెలంగాణలో నిర్వహించిన టెట్‌లో క్వాలిఫై అయినవారి కాలపరిమితి కూడా దాటిపోయింది. ఇప్పుడు డీఎస్సీ వేసినా వారి టెట్ చెల్లకుండా పోయే ప్రమాదంలో ఉత్తీర్ణులను నెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది.
ఇదిలా ఉండగా మొన్నటి పే-రివిజన్ కమిషన్ ప్రకటించిన లెక్కలపైనైనా ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. రాష్ట్రంలో 4,91,304 మంజూరైన పోస్టులు ఉండగా అందులో 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, అంటే 39శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అది చెప్పింది. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి 14మంది ఉద్యోగాస్తులు ఉండాల్సిన చోట 8.5శాతం మాత్రమే ఉద్యోగస్తులుండటం మూలంగా ఉన్న ఉద్యోగస్తులపై తీవ్ర పని వత్తిడి ఉందని పేర్కొన్నది. టీచర్ పోస్టులు 23998, పోలీసు ఉద్యోగాలు 37182, వైద్య ఆరోగ్య శాఖలో 30570, రెవెన్యూ శాఖలో 7961, పంచాయతీరాజ్ ఖాఖలో 12628 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పింది. రాబోయే తెలంగాణలో నిరుద్యోగముండదూ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానమే ఉండదని గప్పాలు కొట్టిన వారి పాలనలో 50,400 మంది కాంట్రాక్టు, 58128 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారని చెప్పింది. అవాకాశం చిక్కినప్పుడల్లా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వైరం పెట్ట జూసింది ప్రభుత్వం. పీఆర్సీ రిపోర్టు ప్రకారం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వారిని అర్హతల ఆధారంగా క్రమబద్దీకరించినా సమారు రెగ్యులర్ ఉద్యోగాలు మరో లక్ష ఖాళీగా ఉన్నాయి. కానీ ఉద్యోగాల భర్తీ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయని, పేదరికమే ఉండదని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానమే ఉండదని గట్టిగా దట్టమైన మసాలలు దట్టించి ఉపన్యాసాలు దంచినవారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. యువత తీవ్ర నిరాశా నిస్పృహలతో బతుకీడుస్తున్న నేపథ్యంలో వారికి సరైన సమాచారం కూడా ఇవ్వకపోవటం నేరమే అవుతుంది. అసలు రాష్ట్ర్లంలో ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఎప్పటి వరకు ఉద్యోగాలు భర్తీ చేయబడతాయి? భర్తీ చేస్తారా చేయరా? అనే స్పష్టత ఈ రాష్ట్రానికి ముఖ్యంగా యువతకు ఇవ్వాలి. అందుకు వెంటనే ప్రభుత్వం అధికారకంగా శ్వేతపత్రం విడుదల చేయాలి. లేని పక్షంలో ఏ యువత బలిదానాలతో రాష్ట్రం సిద్ధించిందో ఆ యువత అంతకుమించిన తెగువజూపితే నష్టం ప్రభుత్వానికే, అంతిమంగా ఏలికల అధికారానికే. ఇప్పటికే అనేక మంది యువత ఆవేదనతో ఆవేశంతో మరిగిపోతున్నారు. ఉద్యోగం కోసం ఆత్మహత్యయత్నం చేసి నిన్న నిమ్స్‌లో కనుమూసిన కేయు విద్యార్థి సునిల్ నాయక్ది కొత్తగా సాకారమైన తెలంగాణలో కొనసాగబోయే ఆత్మహత్యల పరంపరకు ప్రారంభం కాకుండా నివారించాల్సిన భాధ్యత ప్రభుత్వానిదే. లేదంటే సెకండ్‌వేవ్ ఫలితాలు చేదుగా ఉంటాయి.
- కాడిగల్ల భాస్కర్
సెల్: 9491118822