Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యావద్భారత దేశంలో మొట్ట మొదటిసారిగా వ్యవసాయ కూలీలను వర్గ ప్రాతిపదికపై సంఘటితం చేసిన ఘనత పుచ్చలపల్లి సుందరయ్యది. సుందరయ్య ఆంధ్ర రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా అలగానిపాడులో 1913 మే 1న భూస్వామ్య కుటుంబంలో పుట్టాడు. చిన్న వయస్సులోనే వ్యవసాయ కార్మికులతో పనిచేశాడు. ఆనాడు భూస్వాములు, వ్యవసాయ కూలీలపై జరుపుతున్న ఆర్థిక, సామాజిక దోపిడీలను ప్రత్యక్షంగా పరిశీలించాడు. వారికి 'సంఘం' అవసరాన్ని గుర్తించాడు. 1934లో వారికి సంఘాన్ని పెట్టాడు. నిరక్షరాస్యత, సాంఘిక దురాచాలకులోనై వెనుకపడి వున్న వ్యవసాయ కూలీలలో చైతన్యం రగిలించి, వారిని ఒక బలమైన రాజకీయ శక్తిగా రూపొందించాడు.
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న ఆనాటి ఆంధ్ర రాష్ట్ర గ్రామీణ ప్రజలలో సగం మంది వ్యవసాయ కూలీలే. వీరిలో అత్యధికులు దళితులు. వీరి సాంఘిక, నిరక్షరాస్యత, వెనుకబాటుతనాన్ని, పేదరికాన్ని ఆసరా చేసుకొని భూస్వాములు, జమీందార్లు అన్ని రకాలుగా వీరిని దోచుకునేవారు. కనీస కూలి అనేది లేదు. రోజు కూలి ఒక్క అణా నుంచి ఆరు అణాల వరకు ఉండేది. ఎక్కువ భాగం కూలి ధాన్యం రూపంలో ఉండేది. ధాన్యం కూలిగా యిచ్చేటప్పుడు నాసిరకం, తాలు గింజలు యిచ్చేవారు. తక్కువ పరిమాణం గల కుండలు, తవ్వలు, మానికెలు, ముంతలతో భూస్వాములు, ధనిక రైతులు కూలి యిచ్చేవారు. వీటిని పిచ్చి కుండలు, పిచ్చ తవ్వలు, పిచ్చి ముంతలు అనేవారు. సంవత్సరం పొడవునా, వ్యవసాయ కూలీలకు పని ఉండేది కాదు. పనిలేని రోజుల్లో భూస్వాములు, ధనిక రైతుల నుంచి ధాన్యాన్ని ''నాగు'' పద్ధతిలో వ్యవసాయ కూలీలు అప్పుగా తీసుకునేవారు.
అప్పు తీర్చే సందర్భంలో ఇచ్చిన దానికన్నా అదనంగా యాభైశాతం కొన్ని సందర్భాలలో వంద శాతం వరకు భూస్వాములు కూలీల నుంచి గుంజుకునేవారు. అప్పులు యిచ్చేటప్పుడు, చెల్లించేటప్పుడు కూడా పిచ్చి కుండలు, పిచ్చి తవ్వలు భూస్వాములు ఉపయోగించి వ్యవసాయ కూలీల ''శ్రమ''ను దోచుకునేవారు. భూస్వాముల దోపిడీతో పాటు, వ్యవసాయ కూలీలపై వ్యాపారుల దోపిడీ కూడా ఉండేది. వీరి దోపిడీ మరీ దారుణంగా ఉండేది. సరుకులు విపరీతంగా అడ్డూ, అదుపు లేకుండా ధరలు పెంచి అమ్మేవారు. దళిత వ్యవసాయ కార్మికులను అమానుషంగా, అస్పృశ్యులుగా భావిస్తూ, భయంకరమైన ఆర్థిక, సామాజిక దోపిడీకి గురిచేసేవారు. గ్రామ చావిడి, గ్రామ బావుల దరిదాపులకు కూడా రానిచ్చేవారు కాదు. వారు కొత్త బట్టలు గానీ, చెప్పులు గానీ వేసుకొని గ్రామ బజార్లలో తిరగడం మహా నేరంగా పరిగణించేవారు. ఇక చదువు గురించి అసలు మాట్లాడే పనిలేదు. వ్యవసాయ కూలీల పిల్లలను బడులకు రానిచ్చేవారు కాదు. రాత్రి బడులలో చదవడం కూడా మహా నేరంగా పరిగణించేవారు.
అలగానిపాడు వ్యవసాయ కార్మిక సంఘం
జాతీయోద్యమంలో, సత్యాగ్రహౌద్యమంలో పాల్గొని, కమ్యూనిస్టు భావాలవైపు ఆకర్షితులైన పుచ్చలపల్లి సుందరయ్య తన స్వగ్రామమైన అలగానిపాడులో వ్యవసాయ కూలీలపై, అగ్రకుల భూస్వామ్య పెత్తందార్ల దోపిడీని చూసి సహించలేకపోయాడు. మొదట్లో ఆయన తన స్వగ్రామంలో అగ్ర కులాల వారి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాడు. ఆయన కొంతమంది మిత్రులతో కలిసి అస్పృశ్యతకు, అసమానతలకు వ్యతిరేకంగా ''మనుష్యులంతా సమానులే'' అనే భావాన్ని కలిగించడం కోసం, అలగానిపాడులో దళితులకు, అగ్ర కులాల వారికి కలిపి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు. ఆయన బంధువులు అగ్ర కులాల వారు కొంతమంది సుందరయ్య నిర్వహించిన కార్యక్రమాన్ని సహించలేకపోయారు. హరిజనులను బెదిరించి భోజనాలకు రాకుండా చేశారు. దీంతో సుందరయ్య పసి హృదయం గాయపడింది. దీనికి నిరసనగా ఆయన, ఆ చిన్న వయస్సులోనే ఒక రోజంతా అన్నం తినకుండా ఉపవాసం చేశాడు. ఆయన చేసిన ఈ సత్యాగ్రహం ఆనాడు హరిజనులలో గొప్ప ప్రభావాన్ని కలిగించింది. 1928 నుంచి 34 వరకు ఆయన వ్యవసాయ కార్మికులలో విస్తృతంగా పనిచేశాడు. 34లో వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటుచేసినప్పటికీ 32లోనే దానికి ఒక ప్రత్యేక నిబంధనావళిని తయారుచేశాడు. వ్యవసాయ కార్మిక యువకులకు ముఖ్యంగా దళిత యువకులకు రాత్రి బడులు, లైబ్రరీలు నిర్వహించాడు. తన మిత్ర బృందంతో కలిసి ప్రాథమిక పాఠశాలను ఏర్పరచి, వారిలో నిరక్షరాస్యతను తొలిగించడానికి తీవ్రంగా కృషి చేశాడు. రాత్రింబవళ్ళు కష్టించి పనిచేసే వ్యవసాయ కూలీలకు వైద్యం అందుబాటులో లేదని భావించి, వారి కోసం అలగానిపాడులో ప్రాథమిక హెల్త్ సెంటర్‌ను (పీహెచ్సీ) ఏర్పాటు చేశాడు. సాధారణంగా వ్యవసాయ కూలీలకు సీజనల్‌గా వచ్చే జబ్బులను తెలుసుకొని తన దగ్గరి బంధువైన ఒక డాక్టర్‌ను సంప్రదించి పది రకాల మందులను తెప్పించి తన హెల్త్ సెంటర్ ద్వారా వారికి ఉచితంగా పంపిణీ చేసేవాడు. జబ్బులతో ఎవరైనా గాయపడి వస్తే, ఆ గాయాన్ని శుభ్రంగా తుడిచి, ఆయింట్మెంట్ వేసి కట్టు కట్టేవాడు. ఒకరోజు ఆయన హెల్త్ సెంటర్‌కు ఒక వ్యవసాయ కార్మిక మహిళ రొమ్ము మీద గడ్డతో వాసన కొడుతుండగా వచ్చింది. కట్టు విప్పి చూశాడు. లోపల గడ్డ పెద్దగా ఉంది. అమ్మా! యిది నేను చేయగల వైద్యం కాదు. మరో డాక్టర్‌తో చేయించుకొమ్మన్నాడు. ఆమె వినలేదు. ''నువ్వే తగ్గించాలి. నీ హస్తవాసి మంచిది, నేను యింకో చోటుకి వెళ్ళనని'' మొండికేసింది. ''నా వల్ల కాదు, నేను నిన్ను నెల్లూరుకు పంపుతానని, అక్కడ వైద్యం చేయించుకునేందుకు పైసలు లేకపోతే నేను ఖర్చులిచ్చి పంపుతానని'' ఆమెకు చెప్పాడు. అయినప్పటికీ, ఆమె వినలేదు. చివరికి, గత్యంతరం లేక పుండులోని గుడ్డను లాగేసి, పైపైన శుభ్రంచేసి, ఆయింట్మెంట్ రాసి, కట్టు కట్టి నెల్లూరులో ఆయనకు తెలిసిన డాక్టర్ వద్దకు చిట్టీ రాసి, చేతి ఖర్చులిచ్చి పంపించాడు. ఆయన తన వద్దకు వచ్చిన రోగులందర్నీ మంచి ఆదరంగా, ఆప్యాయంగా చూసేవాడు. రోగులకు ఆయన చేసిన సేవ, సుందరయ్య మంచి వైద్యుడని పేరు తెచ్చింది. ఆ చుట్టు ప్రక్కల గ్రామాల వ్యవసాయ కార్మికులలో ఆయన పట్ల ప్రేమ, ఆదరణ, అభిమానం పెరిగింది.
వ్యవసాయ కార్మికులు వర్తకుల బారినపడి దోపిడీకి గురి కాకుండా వారికి చౌక ధరలకు నిత్యావసరాలను పంపిణీ చేయడం కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ''సహకార దుకాణం'' నడిపాడు. సరసమైన ధరలకు అమ్మేవాడు. లాభం, నష్టంలేని పద్ధతిపై దుకాణం నడిపాడు. చుట్టు పక్కల గ్రామాల కూలీలు కూడా సుందరయ్య దుకాణానికి సరుకుల కోసం వచ్చేవారు. నెల్లూరుకు సైకిలు మీద వెళ్ళి, సరుకులు ఆయనే స్వయంగా దుకాణానికి తెచ్చుకునేవాడు. మోత కూలి, లగేజి వంటి ఖర్చులు లేకుండా చూసుకునేవాడు. ప్రతి వ్యవసాయ కూలి కుటుంబం వద్దకు వెళ్ళి, మీరు ఈ సహకార దుకాణంలో చేరండి, ఒకరోజు వేతనం పెట్టుబడి పెట్టండి. అలా పెట్టుబడి పోగేసి మన నిత్యావసర వస్తువుల దుకాణం మనమే నడుపుకుందాం. యిప్పుడు మనం పెడుతున్న ధరల కన్నా వస్తువులు చౌకగా వస్తాయని చెప్పాడు. వెంటనే వ్యవసాయ కూలీల నుంచి ఐదు వందల రూపాయల పెట్టుబడి పోగైంది. ఆయనొక ఐదు వందలు వేసుకున్నాడు. మొత్తం వెయ్యి రూపాయలతో దుకాణం ప్రారంభించాడు.
భూస్వాములు, ధనిక రైతులు, పెత్తందార్లు, వ్యవసాయ కూలీలను దోపిడీ చేస్తున్న పిచ్చి కుండలు, పిచ్చి తవ్వలు, పిచ్చ ముంతలకు వ్యతిరేకంగా కూలీలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాడాడు. ఆయన తన ఇంట్లోనే పోరు పెట్టి పిచ్చ మానికలు లేకుండా చేశాడు. వ్యవసాయ కూలీలు కూలి రేట్లు పెంచుకోవడంతో పాటు, పిచ్చి కుండలు, పిచ్చి తవ్వలు, పిచ్చి ముంతల బెడదను వదిలించుకున్నారు.
1934లో అలగానిపాడులో సుందరయ్య నిర్మించిన వ్యవసాయ కార్మిక సంఘం 37 నాటికి ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ కూలి సంఘం పేరుతో, నెల్లూరులో ఒక సమావేశాన్ని జరుపుకొని రాష్ట్ర వ్యాపిత రూపాన్ని తీసుకున్నది. 1943 నాటికి మరింతగా విస్తరించింది. ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ కార్మిక ఉద్యమం ప్రభావంతో దక్షిణ భారతంలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కూడా వ్యవసాయ కార్మిక ఉద్యమాలు జరిగాయి. ఆ రాష్ట్రాలలో వ్యవసాయ కార్మిక ఉద్యమం నిర్మాణపరంగా విస్తరించింది.
కొల్లిపొర శిక్షణా తరగతులు
1974లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కొల్లిపొరలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ కార్మిక ఉద్యమ కార్యకర్తలకు సుందరయ్య ''వ్యవసాయక సమస్యలపై'' రెండు రోజుల పాటు స్వయంగా శిక్షణ యిచ్చాడు. వారం రోజుల పాటు జరిగిన ఈ క్లాసులలో రెండు రోజులు సుందరయ్యగారే బోధించారు. ''శ్రమ''ను ఆధారం చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో ''వర్గ విభజన'' ఎలా చేయాలి? వ్యవసాయ కార్మికులు, పేద తరగతులు, మధ్య తరగతి రైతులు, ధనిక రైతులంటే ఎవ్వరు? భూస్వామి అంటే ఎవ్వరు? భూ కామందు అంటే ఎవ్వరు? అనే విషయాన్ని సులభశైలిలో విశ్లేషణాత్మకంగా వివరించాడు. వ్యవసాయ రంగంలో మన నినాదాలు ఎలా ఉండాలి? వ్యవసాయ విప్లవం అంటే ఏమిటి? దానిని ఎలా సాధించాలి? భూస్వాములు, పెత్తందార్లకు వ్యతిరేకంగా గ్రామీణ పేదలను ఎలా కలుపుకొని పోవాలి? కార్యకర్తల పని పద్ధతి ఎలా వుండాలి? ఆయన వివరించిన తీరు కార్యకర్తలు, నాయకుల మనస్సుకు హత్తుకుపోయింది. ఈ క్లాసులో సుందరయ్య బోధించిన అంశాలతోనే ఆ తర్వాత ''దున్నే వానికే భూమి'' అనే సుప్రసిద్ధ గ్రంథంగా వెలువడింది. ఈ క్లాసులు ఆనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ కార్మికోద్యమానికి ఒక ''మూల మలుపు''గా పేర్కొనవచ్చు. ఆనాడు క్లాసులలో పాల్గొన్న అనేక మంది కార్యకర్తలు వ్యవసాయ కార్మిక ఉద్యమానికి అంకితమైపోయారు. ప్రజాతంత్ర ఉద్యమంలో వారంతా అగ్ర నాయకులుగా తయారయ్యారు.
సుందరయ్యకు నివాళి
అలగానిపాడులో పుట్టిన వ్యవసాయ కార్మిక సంఘం 1982 వరకు దాదాపు అయిదు దశాబ్దాల కాలం, అఖిల భారత కిసాన్ సభ (రైతు సంఘం)లోనే ఉండి వ్యవసాయ కూలీల హక్కుల కోసం పోరాడింది. 1982లో మిడ్నపూర్‌లో జరిగిన 24వ, అఖిల భారత కిసాన్‌సభ మహాసభలో ప్రత్యేకంగా విడివడి, అఖిల భారతస్థాయిలో వ్యవసాయ కార్మిక సంఘంగా (ఎ.ఐ.ఎ.డబ్ల్యూ.యు.) ఆవిర్భవించింది. 1934 నాటి సుందరయ్య ఆలోచన, దేశవ్యాపిత సంఘంగా కార్యాచరణలోకి వచ్చింది. ఉమ్మడి పోరాటాల వారసత్వ సంపదతో వ్యవసాయ కార్మికుల కోసం జాతీయస్థాయిలో పోరాడే ఒక బలమైన సమరశీల సంఘంగా వ్యవసాయ కార్మిక సంఘం నేడు ఉన్నది. విజయాలు సాధించడంతోపాటు, అనేక సవాళ్ళు, ఆటుపోట్లు ఎదుర్కోవడం జరిగింది. జరుగుతున్నది. భూమి, భుక్తి, సామాజిక న్యాయం కోసం జరిగిన ఈ మహా ప్రస్థానంలో వేల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, భూస్వామ్య గూండాలు, పెత్తందార్లు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. వారి అమరత్వం కర్తవ్య సాధనలో మనల్ని ఎల్లప్పుడూ వెన్ను తట్టుతూనే ఉంది. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ, పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకుంటూ, వ్యవసాయక విప్లవం దిశగా పయనించడమే సుందరయ్యకు గ్రామీణ పేదల ఘనమైన నివాళి.
- పి. సోమయ్య
సెల్:9490098043