Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పద్నాలుగేండ్ల ఉద్యమం.. ఆ తర్వాత వరసగా రెండు సార్లు అధికార పీఠం... అది సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా... ఒకటి రెండు సార్లు తప్ప... అన్నిసార్లూ ఆ పార్టీదే హవా. స్థూలంగా చెప్పాలంటే అధికార టీఆర్ఎస్ చరిత్ర ఇది. తన మాటల చతురతతో జనాన్ని మాయ చేయగల దిట్ట ఆ పార్టీకి అధి నాయకుడు. ఆయనకు తోడు మంత్రివర్గంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని వాగ్దాటిలో తమకు తామే సాటని నిరూపించుకున్న తనయుడు, అల్లుడు. వారికి ఎంతమాత్రమూ తీసిపోకుండా ఒకసారి పార్లమెంటులో అడుగుపెట్టి.. ఇప్పుడు రాష్ట్ర పెద్దల సభలో కాలుమోపిన తనయ. వీరేగాక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో చేవగల నేతలెందరో. దళపతి లెక్కల ప్రకారమే అక్షరాలా 60 లక్షల మంది క్రియాశీలక సభ్యులు పార్టీకి అండా దండా అంటూ నిత్యం గొప్పలుపోయే అధికార పార్టీ గురించి ఓ చిన్న ధర్మ సందేహం. అదేంటంటే... 'పద్నాలుగేండ్ల ఉద్యమ ప్రస్థానం, రెండుసార్లు అధికార పీఠాన్ని అధిరోహించిన గులాబీ పార్టీకి... ఇతర పార్టీల్లోంచి నాయకులు, కార్యకర్తలను లాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చిందా...?' అని. పోనీ స్వరాష్ట్రం వచ్చిన కొత్తలో అంటే పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఈ రకంగా 'ఆకర్ష' మంత్రం వేశారనుకుందాం. కానీ నిన్నటికి నిన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు జెండా ఎగరేసిన అనంతరం కూడా అదే పోకడ పోవటంలో ఆంతర్యమేంటో అర్థంగాక జనాలు బుర్రలు గోక్కుంటు న్నారు. అంటే... సమర్థవంతమైన కార్యకర్తలు, నాయకుల్ని తయారు చేసుకోగల సత్తా ఈ తిరుగులేని రాజకీయ శక్తి (అధికార పార్టీ నేతలు టీఆర్ఎస్ గురించి చెప్పుకునేటప్పుడు వాడే డైలాగ్)కి లేదా...? లేక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతిపక్ష పార్టీల్లో ఏ ఒక్కరూ మిగలకూడదనే కోరికా...? ఈ ప్రశ్నలకు జర మీరు సమాధానం చెప్పి శభాష్ అనిపించుకోండి...
- బి.వి.యన్.పద్మరాజు