Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్రలో జరిగిన అనేక ఘర్షణల్లోంచి ప్రజాస్వామిక, లౌకిక, సమానత్వం వంటి విలువలు ముందుకొచ్చాయి. వాటి సాఫల్యత కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. తమను తాము చైతన్యపర్చుకొంటూ, సామూహిక చైతన్యాన్ని పెంపొందించుకుంటూ, బలమైన శక్తిగా ఎదుగుతూ సమాజాన్ని మౌలిక మార్పు వైపు మళ్లించడం సమాజ పురోగమనంలో ఓ నిరంతర ప్రక్రియ. ఇవాళ రైతులు చేస్తున్న ఆందోళనలు అందులో భాగమే. ఈ ఉద్యమం అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వన్నె తెస్తుందనే విషయాన్ని మరువకూడదు.
వ్యవసాయదారులకు, రైతులకు భరోసా, భద్రత, మొత్తంగా ప్రజలందరికీ స్వచ్ఛమైన ఆహార భద్రతను ప్రభుత్వం ఇవ్వాలి. అందుకోసం ప్రభుత్వం ప్రజలకు సాగు భూములను పంచాల్సి ఉంది. వ్యవసాయ విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను రైతులకు చేరవేయవలసి ఉన్నది. పర్యావరణాన్ని రక్షిస్తూ ప్రజలందరి ఆహార అవసరాలను తీర్చడానికి కావలసిన వ్యవసాయ, ప్రజా పంపిణీ వ్యవస్థలను పటిష్టం చేయవలసి ఉన్నది. అలా చేయకుండా కార్పొరేట్ శక్తుల చేతుల్లో వ్యవసాయాన్ని, ఆహార భద్రతను పెట్టే చట్టాలు చేయడం తప్పని ప్రశ్నిస్తే దేశద్రోహం అని ప్రజాభిప్రాయాలను, ప్రజా ఉద్యమాలను అణచి వేస్తుండడం ఎవరికైనా ధర్మాగ్రహం తెప్పించక మానదు.
మూన్నాళ్ల బలాన్ని చూసుకుని మిడిసిపడే వాళ్లకు భవిష్యత్తు సరైన గుణపాఠం చెప్పకుండా ఉండబోదు. అయినా బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి ఏమవుతుందో సుమతీ శతకం ఏనాడో చెప్పే ఉన్నది. అలా అంటే సుమతీ శతకం కూడా దేశద్రోహం తలపెట్టే టూల్ కిట్ అవుతుందేమో! ఈ సందర్భంలో ''కలలపై నిఘా.. కలల అలలపై నిఘా... నిఘా.. నిఘా..'' శివసాగర్ కవిత్వం గుర్తుకు రాక మానదు. కార్పొరేట్ దాష్టీకాలు పోవాలని, ప్రజలు బాగుండాలని ఆలోచించడం, కలలు కనడం ప్రభుత్వాధినేతలకు నేరంగా అనిపించడం విషాదం. వాటిని వింటేనే వణికి పోతున్నారో లేదా అధికారం అండతో అహంకారంతో ఊగిపోతున్నారో గానీ ప్రజలహక్కుల్ని కాలరాస్తున్నారు. కార్పొరేట్ ప్రభుభక్తిని చాటుకుంటున్నారు.
అయినా రైతులు ఎముకలు కొరికే చలిని ఖాతరు చేయకుండా మనోనిబ్బరంతో ధైర్యంగా వ్యవసాయ చట్టాలను ఎదురిస్తున్నారు. కానీ ఎవరైనా సరే తమ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పి రాజ్యాంగమని, ప్రజాస్వామ్యమని చట్టబద్ధ నిరసనలని అంటే కుదరదని చెప్పదల్చుకున్నారు ఏలికలు. ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధినేతలను ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే చాలు కేసులు, పోలీస్ స్టేషన్లు, జైళ్లు ఎదురొస్తాయనే బలమైన సంకేతాలను పంపడంలో భాగంగా రైతులపై, రైతు ఉద్యమ సానుభూతిపరులపై, జర్నలిస్టులపై తీవ్రమైన రాజద్రోహ నేర కుట్ర కేసులు మోపుతున్నారు. కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తూ వారి లాభాలకు భంగం కలగకుండా దేశ సంపదను అప్పగించేందుకే ఇదంతా అని స్పష్టమవుతున్నది. చదువుకునే యువత నిజాయతీగా నడిచే ఉద్యమాల వైపు రాకుండా దూరం పెట్టడమనేది అరెస్టులు, కేసుల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమని తేలిపోతున్నది. సోషల్ మీడియాని ఉపయోగించుకోవడం గురించి అమిత్ షా తమ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ తాము చేసే ప్రచారంలో హాస్యం ఉండాలి భయమూ ఉండాలి అని ముసిముసిగా నవ్వుతూ అంటాడు. వారికి నవ్వు తెప్పించేదిగా వారి వ్యతిరేకులకు భయం పుట్టించేదిగా ఉండాలని నర్మగర్భంగా చెబుతాడు. నరేంద్ర మోడీ రాజ్యసభలో రైతు ఉద్యమంపై మాట్లాడుతూ ఆందోళనా జీవులని వ్యంగ్యంగా వెక్కిరిస్తుంటాడు. ఈ నవ్వులు ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రశ్నించే ప్రజలను వెటకారం చేస్తున్నాయి. ఎప్పటికైనా ప్రజలే చరిత్ర నిర్మాతలు అనే విషయం మరచిపోరాదు.
చీకటి తర్వాత వెలుగు రావాల్సిందే కదా. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపాలనుకునే కుతంత్రాలు, అణచివేతలు, నిర్బంధాలు ఎల్లకాలం సాగవని రాబోయే చరిత్ర నిరూపించకుండా ఉండబోదు.
- ఎన్. శ్రీనివాస్
సెల్: 9676407140