Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా విశ్వ మహమ్మారి ప్రభంజనానికి ఇండియాలో మధ్య తరగతి వర్గాల సంఖ్య 32 మిలియన్ల వరకు తగ్గిందనీ,, 75 మిలియన్ల ప్రజలు దారిద్య్ర రేఖ దిగువకు నెట్టబడ్డారనీ పేర్కొంటూ 'ప్యూ పరిశోధన కేంద్రం' తాజాగా విడుదల చేసిన నివేదికలో పలు ఆశ్చర్యకర అంశాలు బయట పడ్డాయి. మన దేశంలో 2011 నుంచి 2019 వరకు మధ్య తరగతి ప్రజలు క్రమంగా పెరగడం గమనించిన ఈ అధ్యయనం, కరోనా వైరస్ కల్లోలానికి ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు చితికి పోవడంతో 2020లో విశ్వవ్యాప్తంగా 54 మిలియన్ల మధ్య తరగతి ప్రజలు తగ్గిపోయి పేదలుగా మారరని, 8.7 శాతం నుంచి 10.4 శాతానికి పేదరికం పెరిగిందని వివరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు పూర్వం 672 మిలియన్ల పేదలు ఉండగా, కోవిడ్-19 అనంతరం వారి సంఖ్య 803 మిలియన్లకు పెరిగినట్టు ఈ నివేదిక తెలయజేస్తోంది. ప్రపంచ జనాభాలో 3వ వంతు జనాభా కలిగిన ఇండియా, చైనా దేశాల మధ్య కరోనా ప్రభావంలో జీవన ప్రమాణాల్లో వేరు వేరుగా మార్పులు గుర్తించడం జరిగింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా ఇండియాలోనే మధ్య తరగతి వర్గాలు అధికంగా కుచించుకు పోయారని, పేదరికం ఎక్కువగా పెరిగిందనే వాస్తవాలు దేశవాసులను విస్మయానికి గురి చేస్తున్నాయి. కరోనా విజంభనతో జనవరి-2021 అంచనాల ప్రకారం ఇండియాలో ఆర్థిక ప్రగతి 9.6 శాతం పడిపోగా, చైనాలో 2 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది.
ఇండియాలో 28 శాతం ప్రజలు మధ్య తరగతి జీవన ప్రమాణాలను కలిగి ఉన్నారని తెలుస్తున్నది. దేశ జనాభా జీవన ప్రమాణాల ఆధారంగా నిరుపేద, దిగువ (లోయర్) మధ్య తరగతి లేదా అల్పాదాయ, మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి, అతి సంపన్న వర్గాలుగా విభజించబడ్డారు. పేదలు 2 డాలర్ల కన్న తక్కువ, అల్పాదాయ వర్గాల ఆదాయం 2 - 10 డాలర్లు, ఎగువ మధ్య తరగతి 10 - 20 డాలర్లు, ఉన్నత మధ్య తరగతి 20 - 50 డాలర్లు మరియు అతి సంపన్న వర్గాలు 50 డాలర్ల కన్న అధికంగా దినసరి ఆదాయం కలిగి ఉన్నారు. ఇండియాలో కరోనా మహమ్మారి కారణంగా ఉన్నత మధ్య తరగతి వర్గాలు ఒక మిలియన్, ఎగువ మధ్య తరగతి వర్గాలు 7 మిలియన్లు, మధ్య తరగతి వర్గాలు 32 మిలియన్లు, అల్పాదాయ వర్గాలు 35 మిలియన్లు తగ్గారనీ, పేదలు 75 మిలియన్లు పెరిగారని నివేదిక స్పష్టం చేసింది.
కరోనాకు పూర్వం భారతదేశ మధ్య తరగతి వర్గాలు 99 మిలియన్లుగా అంచనా వేయగా, కోవిడ్-19 దెబ్బకు 3వ వంతు తగ్గిపోయి, వారి సంఖ్య 66 మిలియన్లకు పడిపోయింది. కరోనాకు ముందు 59 మిలియన్ల నిరుపేదలు ఉండగా, 2020 చివరి నాటికి 134 మిలియన్లకు పెరగడం విచారకరంగా తోస్తున్నది. ఇండియాలో వైరస్ దుష్ప్రభావానికి పేదరికం రేటు 4.3శాతం (జనవరి-2020) నుంచి 9.7శాతం (మార్చి-2021) పెరిగిందని గమనించాలి. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం కరోనా కల్లోల ఫలితంగా 25 కోట్ల ప్రజలు పేదరికలోకి నెట్టబడ్డారని తెలిపింది. కోవిడ్-19 విసిరిన పంజా ఫలితంగా ఆర్థిక అసమానతలు పెరగడం, మధ్య తరగతి కుటుంబాలు తగ్గడం దేశ సమగ్రాభివృద్ధిని కుంటుపడేలా చేసింది. వైరస్ వల్ల దక్షిణ ఆసియా దేశాల్లో మధ్య తరగతి అతిగా కుచించుకు పోవడం మరియు పేదరికం పెరగడాన్ని నివేదిక సూచిస్తోంది. కరోనా విజృంభనను నివారించి, ప్రజల ఉపాధిని రక్షించి, దేశ ఆర్థిక రథాన్ని పట్టాలపైకి చేర్చి, సకల కుటుంబాల జీవన ప్రమాణాలను కాపాడే కనీస ప్రయత్నం భారత ప్రభుత్వం చేయకపోవడం విచారకరం.
- డా||బి.ఎం.రెడ్డి
సెల్:9949700037