Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం సూచికలపై ఆధారపడి చేసిన మూడు ప్రఖ్యాత ప్రపంచ పరిశోధనా సంస్థల అధ్యయనాలు ఫిబ్రవరి, మార్చి 2021లో ప్రచురితమయ్యాయి. ఆ మూడు అధ్యయనాలు చేసిన సంస్థల్లో స్వీడన్ కు చెందిన 'వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ (V-Dem) ఇన్సిట్యూట్' భారత దేశంలో ఉన్న పరిస్థితిని ''ఎన్నికల నిరంకుశత్వం''గానూ, అమెరికాకు చెందిన 'ఫ్రీడంహౌస్' భారత దేశాన్ని ''స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం'' నుంచి ''పాక్షిక స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యానికి'' దిగజారిందనీ, ద ఎకానమిస్ట్కు చెందిన 'ఇంటిలిజెన్స్ యూనిట్' భారతదేశాన్ని ''లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం''గాను పేర్కొన్నాయి. ఈ మూడు అధ్యయనాలు కూడా దేశంలో ప్రజాస్వామ్యం కొరవడటానికి మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమనీ, ఈ ప్రభుత్వ పాలనలోనే మానవ హక్కుల సంఘాలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల పైన, మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలపై దాడులు జరుగుతున్నాయనీ పేర్కొన్నాయి. అందుకు ప్రతిస్పందనగా ''స్వీయ నియామకపు ప్రపంచ సంరక్షకుల కపటత్వాన్ని'' వాటి నివేదికలు తెలియజేస్తున్నాయని, భారతదేశంలో వాటి ఆమోదం కోసం ఎవ్వరూ ఎదురు చూడడం లేదని (వాటిని జీర్ణించుకోలేక) విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నాడు. రాజ్యసభలో V-ణవఎ సంస్థ నివేదిక పై ప్రశ్నలు లేవనెత్తేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష పార్టీల సభ్యులకు సభ ఛైర్మన్ అనుమతి నిరాకరిస్తూ, భారత దేశం గురించి మాట్లాడే దేశాలు ముందు వాటి సంగతి చూసుకోవాలని అన్నాడు.
ఈ అధ్యయన నివేదికలను ప్రత్యేక మార్గదర్శకాలు, నియమ నిబంధనలు, ఎన్నికల విధానం, బహుళత్వం, ప్రభుత్వ పని తీరు, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కుల ఆధారంగా తయారు చేశారు. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని పరిణామాలు దేశంలో ప్రజాస్వామ్యం కొరవడిందని తెలియజేస్తున్నాయి. వాటిలో న్యాయ వ్యవస్థకు సంబంధించి సూరత్ కేసులో ఇచ్చిన తీర్పులో దర్యాప్తు చేసిన సంస్థలు నిందితులకు వ్యతిరేకంగా (జీహాదీ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి) సంతృప్తికరమైన ఏ రుజువులు చూపించలేక పోయారని 122మందిని, మాలేగావ్ కేసులో 8మందిని నిర్దోషులుగా పరిగణిస్తూ విడుదల చేశారు. వారంతా జైళ్ళలో ఐదు నుంచి పందొమ్మిది సంవత్సరాలు గడిపారు. నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (SIMI) నిర్వహించిన ఒక సమావేశంలో పాల్గొన్నారని వారందరినీ UAPA (Unlawful Activities (Prevention)Act) చట్టం కింద నిర్బంధించారు.
1967లో ఏర్పడిన ఈ చట్టం యొక్క పరిణామక్రమం, భారతదేశంలోని రాజకీయ మార్పులతో ముడిపడి ఉంది. కాల క్రమంలో ఎప్పటికప్పుడు ఇతర ఉగ్రవాద వ్యతిరేక చట్టాలతో కూడా ఈ చట్టం ముడిపడి ఉంది. 1985లో 1987లో టెర్రరిస్టు అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ (టాడా) చట్టాన్ని చేసిన తర్వాత చివరకు 1995లో దాన్ని రద్దుచేశారు. ఆ తర్వాత 2002లో ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ (పోటా) ఆర్డినెన్సు ద్వారా చట్టం చేశారు. పోటా చట్టానికి కూడా దేశ వ్యాప్తంగా బాధితులున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా పెల్లుబికిన ప్రజాగ్రహంతో, 2004లో కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే, ముందు దానిని రద్దు చేస్తామని చేసిన వాగ్దానాన్ని UPA ప్రభుత్వం అమలు చేసింది. పోటా రద్దైన సమయంలో, దానిలోని లక్షణాలు UAPA లో చేర్చారు. టాడా, పోటాలను ప్రధానంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఉపయోగించారు. అదే మార్గంలో UAPA కూడా ఉంది. 2019 ఆగస్ట్‌లో ఈ చట్టానికి చేసిన సవరణ ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే వ్యక్తులను ఉగ్రవాదులుగా ముద్ర వేయడం, ఉగ్రవాద సంస్థలని భావిస్తే వాటిపై నిషేధం విధించే అధికారం ప్రభుత్వానికుంటుంది. ఈ చట్టం కింద 42సంస్థలపై నిషేధం విధించిడం జరిగింది. ఈ UAPA కింద నమోదైన కేసుల సంఖ్య 2015తో పోలిస్తే, 2019లో 72శాతం పెరిగిందని పార్లమెంట్ లో హౌం మంత్రిత్వశాఖ తెలిపింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో 2016 గణాంకాల ప్రకారం నమోదైన కేసులలో 67శాతం, విచారణలో నిరపరాధులుగా విడుదల అయ్యారు. అంటే నమోదైన కేసులలో కేవలం 33శాతం మందికి మాత్రమే శిక్షలు ఖరారు చేశారు.
భారత దేశంలో రాజకీయ అశాంతికి కారణమైన వ్యక్తులు, సంస్థలు చట్ట వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలను నిరోధించడానికి ఈ UAPA చట్టాన్ని తెచ్చారు. 2004లో జరిగిన ఒక సవరణ ద్వారా దానికి 'ఉగ్రవాద కార్యకలాపాలకు శిక్ష' అనే అధ్యాయాన్ని చేర్చారు. ఆ చట్టానికి వరుసగా 1972, 2004, 2008, 2012, 2019లో సవరణలు చేశారు. ఆ సవరణ ప్రకారం వ్యక్తులను ఉగ్రవాదులుగా వర్గీకరించవచ్చు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఉగ్రవాద చర్యలుగాను పరిగణించవచ్చు. ఉదాహరణకు కాశ్మీర్లో మానవ హక్కుల గురించి ప్రశ్నిస్తే, దానిని భారత దేశ సార్వభౌమాధికారాన్నే ప్రశ్నించినట్లుగా, పౌరసత్వ సవరణ చట్టం గురించి చేసే విమర్శను దేశం పట్ల విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించవచ్చు. ప్రముఖ మేథావులు, రచయితలు, సామాజిక కార్యకర్తలైన ఆనంద్ టెల్తుమ్డే, గౌతం నవలక, సుధా భరద్వాజ్, ఉమర్ ఖలీద్, వరవరరావు లాంటి వారంతా ఈ చట్టం కింద దీర్ఘకాలంగా నిర్భంధంలో ఉంటున్నారు. ఈ చట్టం కింద అరెస్ట్ అయిన వారిని ఎటువంటి చార్జిషీట్ దాఖలు చేయకుండా 180 రోజుల పాటు నిర్భంధంలో ఉంచవచ్చు. చట్టంలోని సెక్షన్ 43డి(5) ప్రకారం నేరారోపణ చేయబడిన వ్యక్తికి బెయిల్ మంజూరు కావడం అసాధ్యమైన విషయం. ఒకవేళ కోర్టు ఆ వ్యక్తిపై చేసిన ఆరోపణలు ముందుగా నిజమని భావిస్తే, బెయిల్‌ను మంజూరు చేయకుండా నిరాకరించవచ్చు. దానిననుసరించే 90శాతం వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాకు ఆరోగ్యం క్షీణిస్తున్నా బెయిల్ మంజూరు చేయడం లేదు. అదే విధంగా 80ఏండ్ల వయసులో కరోనా వైరస్‌తో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న సమయంలో కూడా ప్రజాకవి వరవరరావుకు కూడా బెయిల్ మంజూరు చేయలేదు. వీరందరిపై మోపబడిన నేరాలు ఏవీ రుజువు కాలేదు కాబట్టి వారంతా ఏ నేరం చేయని నిరపరాధులు. అయినప్పటికీ వారిని ప్రాణాంతక కరోనా సోకిన జైల్లో నిర్బంధించారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాల నివారణ చట్టం కింద నిరపరాధులను దీర్ఘకాలం పాటు జైల్లో పెట్టడం అప్రజాస్వామికం.
చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం, నిషేధిత సంస్థకు చెందిన వ్యక్తితో మామూలుగా పరిచయం ఉన్న వ్యక్తిని కూడా నేరస్తునిగా చేర్చవచ్చు. డాక్టర్, లాయర్, జర్నలిస్టులలో ఎవరైనా అనుకోకుండా నేరారోపణ చేయబడిన వ్యక్తికి ఆహారం లేదా జీవనాధారం అందించినా కూడా వారిని నేరస్తులుగా భావిస్తారు. చట్టంలో నేరపూరితమైన సహచర్యానికి, అమాయకత్వంతో కూడిన సహచర్యానికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా పేర్కొనలేదు.
సెక్షన్ 43 A, 43 దీలు నేరారోపణలు చేయబడిన వ్యక్తిని అరెస్ట్ చేసి, ఇండ్లలో సోదాలు చేయడానికి పోలీసులకు అధికారాలు కల్పిస్తాయి. రాజకీయ నాయకులు చెప్పిన విధంగా పోలీసులు నేరారోపణలు చేయబడిన వ్యక్తి ఇంటిపై దాడులు చేసి రుజువుకు అవసరమయ్యే వస్తువులను స్వాధీనం చేసుకుంటారు. కొన్ని కేసుల్లో సాక్ష్యాధారాలను, ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వ్యక్తులను నిర్భందించేందుకు సృష్టిస్తారు. ఇటీవలే భీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న రోనా విల్సన్‌కు వ్యతిరేకంగా తన ల్యాప్ ట్యాప్‌లో సాక్ష్యాధారాలను సృష్టించినట్లు బయటపడింది.
2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ UAPAను దుర్వినియోగం చేయడం చూస్తూనే ఉన్నాం. ప్రతిఘటనను అణచివేసేందుకు ఇంతకు ముందున్న పాలక వర్గాల చేతిలో కూడా చట్టం ఎప్పుడూ ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉంది. రాజకీయ ఉద్యమాలను నేరపూరిత కార్యకలాపాలుగా చిత్రీకరించి, కనీసం నేరం మోపేందుకు న్యాయవ్యవస్థ నుంచి అనుమతి పొందేందుకు ఇది ఒక తేలికైన సాధనం. కానీ ''ఈ చట్టం కింద హిందూత్వ శక్తుల చర్యలకు వారు ఏ విధమైన వేధింపులను ఎదుర్కొన లేదు. ఎందుకంటే వారి చర్యలు దేశ భద్రతకు హానికరం కాదని ప్రభుత్వం భావిస్తోందని'' అనుష్కా సింగ్ (ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, సెప్టెంబర్ 22, 2012) పేర్కొన్నాడు. నేడు అధికారాన్ని చెలాయిస్తున్న హిందూ ఉదారవాద శక్తులు తమ రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నాయి. కానీ 1975-77 మధ్య కాలంలో ఎమర్జెన్సీ తరువాత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ ఉద్యమం, ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కనిపించడం లేదు.
ఖAూAను ఉపయోగించడంలో కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా వ్యవహరిస్తుంది. దేశద్రోహం అంటే ఏమిటో సరిగా నిర్వచించకుండా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తే అసమ్మతిని దేశద్రోహంగా పరిగణిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఒక హక్కు.సామాజిక మాధ్యమాలు, బహిరంగ ఉపన్యాసాలు సామాన్య ప్రజల యొక్క వ్యక్తీకరణలకు సాధనాలు''. మహారాష్ట్ర మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్.ఎమ్.ముష్రిఫ్ 'ఫ్రంట్ లైన్' పత్రిక (ఏప్రిల్ 9,2021)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించాడు.
''సుధా భరద్వాజ్, వరవరరావు లాంటి ప్రముఖులు, యువకు లైన షార్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్ లాంటి వారు ప్రభుత్వ చర్యలను ప్రశ్నించినందుకు వారిపైన దేశద్రోహం, ఉగ్రవాద ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టారు. అసమ్మతిని ఆటంక పరిచి అదుపులో పెట్టడం ఇప్పుడొక నిరంతర ప్రక్రియగా మారింది. ప్రభుత్వం చెప్పినట్టు చేయడం లేదన్న కారణంతో ఎవరిపైనైనా దేశద్రోహ నేరాన్ని ఆరోపిస్తూ యూఏపీఏ కింద నిర్భంధిస్తున్నారు. ఈ చర్యలు సామాన్య ప్రజలను, మైనారిటీలను ముఖ్యంగా ముస్లింలను కలవర పెడుతున్నాయి'' అంటూ ఆవేదన చెందారాయన.
''ఈ చట్టం కింద నిర్భంధించబడిన వ్యక్తి, తరువాత నిరపరాధిగా విడుదలైతే, ఏండ్ల తరబడి జైల్లో మగ్గిన తరువాత అతనికి నష్టపరిహారాన్ని చెల్లించి, అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులపైన శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు (కంటి తుడుపు చర్యలైనప్పటికీ) తీసుకోవాలి. ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొని రావాలని అనుకుంటే, ఆ చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండకూడదని'' ముష్రిఫ్ అభిప్రాయపడ్డాడు.
అంబేద్కర్ ఆలోచన ప్రకారం, రాజ్యాంగం మాత్రమే రాజకీయ, ప్రజాస్వామిక సంక్షోభాలను పరిష్కరించదన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే, జవాబుదారీతనంగా ఉండడంతో పాటు రాజకీయ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయాలి. పౌర సమాజంతో పాటు నిరోధ-సమతుల్యాల (checks and balances) యంత్రాంగాలు రిపబ్లిక్‌ను రక్షించాలి. విస్తతమైన, బలమైన రాజకీయ ఉద్యమం మాత్రమే జాతి జీవనానికి పునాదిగా ఉంటుంది.
- బోడపట్ల రవీందర్
సెల్:9848412451