Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇందుమూలముగా నేను మొదటనే తెలియజేయడమేమనగా, నేనెవ్వరినీ బత్తాయిలని సంభోదించడం లేదు. తమాషాకు కూడా అలాంటి మాటలు వాడే అవసరం అసలే లేదు. నేను నమ్మిన సిద్ధాంతం ఇతరులతో వారెవరైనా సరే మర్యాదగానే ప్రవర్తించమంది. మరి బత్తాయిలన్న పదాన్ని శీర్షికలో ఎందుకు వాడారని అడగవచ్చు. వస్తున్నా, సరిగ్గా అక్కడికే వస్తున్నా. చాలా సంవత్సరాల క్రితం జపానులో ఒక సైంటిస్టుకు బత్తాయి పళ్ళ రసంతో కారు నడపవచ్చునా అన్న అనుమానం కలిగింది. అది జపాను కదా, వెంటనే ఆయనక్కావలసిన అన్ని సదుపాయాలు కల్పించింది అక్కడి ప్రభుత్వం. ఆ శాస్త్రజ్ఞుడు పెట్రోలు ఇంజనుకు కొన్ని మార్పులు చేసి బత్తాయి పళ్ళ రసం వేసి కారు నడిపారు. అందరి చప్పట్ల మధ్య అది కాషాయం రంగు పొగ వదుల్తూ రయ్యిమంటూ దూసుకుపోయింది. ఇంకేముంది, బత్తాయి పళ్ళ రసంతో కారు నడపడమేకాదు, కరెంటు కూడా తీయొచ్చునని తెగ సంబర పడ్డారట జపానీ భాషలో. కారు ఏ ఆటంకంలేకుండా వెనక్కొచ్చే సింది జపాను చప్పట్ల మధ్య. ఈలోగా జపాను డబ్బు ఎన్లలో లెక్కలేసి చూసినతను అదే జపానుభాషలో లబోదిబోమని అరుచుకుంటూ వచ్చాడట. ఈ సంతోష సమయంలో నీ అపశకునపు అరుపులెందుకని అడిగారు సదరు బత్తాయిరసం ప్రాజెక్టు నిర్వాహకులు. విషయం చెప్పాడతను. మిగతా అందరూ ఒకేసారి లబోదిబోమన్నారు వాళ్ళ భాషలోనే. తెలిసిందేమి టంటే బత్తాయి పళ్ళ రసంతో కారు నడిచింది కాని ఒక కిలోమీటరుకు మన రెండువేల రూపాయలంత ఖర్చు అయిందట. అదీ విషయం. బత్తాయి రసంతో చేసిన ప్రయోగం అలా షాకిచ్చింది మరి.
అలా ఒక్కొక్కసారి ఎవరు చేసే ప్రయోగాలు వారికే షాకునిస్తాయి. పోయినవారంలోనే చెప్పుకున్నాం కరెంటు ఎన్ని మార్గాల ద్వారా తయారు చేయవచ్చు అని. అలా ఆయా రకాలుగా చేసిన విద్యుత్తు అయా విధాలుగా తన షాకు చూపిస్తే ఎలా ఉంటుంది, గుంభనంగా షాకు తగిలినవారు తేలు కుట్టిన దొంగలా ఎలా సైలెంట్ ఐపోతారో చూస్తే నవ్వొస్తుంది. వారి చర్యలకు ప్రజలు స్పందించినా ఏమీ తెలియనట్టు ఉండడం చూసి కోపంతో పాటు జాలి కూడా కలుగుతుంది.
సీఏఏ, ఎన్నార్సీ అంటూ పౌరసత్వ 'నమో'దు చేస్తామని అసోంలో మొదలెట్టి మొదటి షాకు తిన్నారు. పౌరసత్వ సెంటిమెంటుతో కరెంటు తయారు చేద్దామంటే అదికాస్తా షాకు కొట్టింది. ఇక దీదీ, దాదా పోరులో ఇద్దరూ తమతమ తరహాల్లో కరెంటు తయారు చేస్తూ షాకులు కొట్టించుకుంటున్నారు. కమ్యూనిస్టులను ఓడించడం కోసం దీదీ ఎందరితోనో రంగులకతీతంగా స్నేహం చేసి హవాయిచెప్పులతో సింహాసనమెక్కింది. అప్పుడు చేసిన వైరింగు రకరకాల షార్టు సర్క్యూట్లు కొట్టింది. మిత్రులను మింగేసే మిత్రుడు శత్రువే అవుతాడు. శత్రువుకు శత్రువేమవుతాడు అంటే అజాత శత్రువవుతాడని జాతి రత్నాలు డైలాగు ఇప్పుడు బాగా ఫేమస్ అయింది. అలా జాతిరత్నాలు ఇప్పుడు ఒకరికొకరు షాకులిచ్చుకుంటున్నారు. హవాయి చెప్పులు ఇప్పుడు ఎటువంటి రక్షణ ఇవ్వలేకున్నాయి మరి. ఇప్పుడు అధికారంలోకి మళ్ళీ రావడం కోసం నందిగ్రాం అల్లర్ల వెనక ప్రస్తుత ప్రత్యర్థి సువేందు అధికారి ప్రమేయం ఉన్నట్టు నోరు జారారు. అక్కయ్య షాకుల వెనక ఎన్ని రకాల కరెంటు ఉందో అందరికీ తెలిసి పోయింది.
ఇక రైతు వ్యతిరేక బిల్లులపై ఉద్యమ షాకు నూట యాభై రోజులవైపు పరుగులు పెడుతోంది. విదేశీ మీడియాలలో కూడా వచ్చిన పరిస్థితి. అంతర్జాతీయంగా కూడా స్టేటుమెంట్లు. దీంతో దేశంలో మీడియాకూ షాకు తగిలి చూపించాల్సిన, రాయవలసిన పరిస్థితి. చేతికి గ్లౌజులు, ఒళ్ళంతా పీపీఈ కిట్లలాంటి మందమైన చర్మంతో ఉన్నట్టు, షాకు కొట్టనట్టు ప్రవర్తిస్తున్న ప్రభుత్వానికి షాకు తగిలింది. తగులుతూనే ఉంది. దొంగకు తేలు కుడితే ఎలా అరవడో ఇప్పుడూ జరుగుతోందదే.
ఇక వైజాగు ఉక్కు ఎండలో మండుతూ ఎర్రగా షాకిస్తోంది. వందమందికి పైగా కవులు తమ కలాలతో కూడా షాకిచ్చారు. ఉద్యమం సునామీలా ఎగిసిపడుతోంది.
ఇక బ్యాంకులు, జీఐసీ, ఎల్ఐసీ నాలుగురోజులు వరుసగా షాకిచ్చారు. ఉద్యోగులు దేశమంతా మరొక్కరోజు రైతులకు, ఉక్కుకు, ఆర్థిక వ్యవస్థకీ ఉక్కుకవచాలైన ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటామని, ప్రజా వ్యతిరేక పాలనకు సమాధానంగా సమ్మె షాకు ఎలా ఉంటుందో రుచి చూపించారు, అవసరమైతే మళ్ళీ చూపిస్తారు కూడా. ఇక పాలించే ''జాతిరత్నాలు'' ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. ఉప ఎన్నికల షాకు కూడా తగిలితే మంచిదని అందరూ కోరుకుంటున్నారు. ఎన్ని షాకు ట్రీటుమెంటులిచ్చినా వినకుంటే అదను చూసి మెయిన్ ఆఫ్ చేస్తారు ప్రజలు.
- జంధ్యాల రఘుబాబు
సెల్:9849753298