Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జులై 5 2013న ఆర్డినెన్స్ ద్వారా, ఆగస్ట్ 23న రాష్ట్రపతి సంతకంతో చట్టం ద్వారా ''ఆహార భద్రతా చట్టం'' వచ్చింది. 52సెక్షన్లు, 3షెడ్యూల్స్‌తో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. చట్టం రూపొందించినప్పుడే అదనంగా నిధులు కేటాయించాలని కూడా నిర్ణయించారు. ఈ చట్ట ప్రకారం ప్రతి మనిషికి 5కిలోల బియ్యం లేదా ముతకధాన్యాలు, గోధుమలు ఇవ్వాలి. అంత్యోదయ అన్నయోజన కింద 35కిలోలు ఇవ్వాలి. గర్భవతి అయిననాటినుంచి ప్రసవం వరకూ మహిళకు భోజనం పెట్టాలి. ప్రసూతి ఎలవెన్స్ రూ.6,000 ఇవ్వాలి. 6 మాసాల నుంచి 3ఏండ్ల వరకు 500 కేలరీల శక్తిగల 12-15 గ్రాముల ప్రొటీన్స్ రేషన్ ద్వారా గాని, ఇంటికి గాని పంపాలి. 3ఏండ్ల నుంచి 6ఏండ్ల వరకు ఉదయం స్నాక్స్, ఉడకబెట్టిన వేడి అన్నం, 500 కేలరీల శక్తిగల పౌష్టికాహారం ఇవ్వాలి. 6 మాసాల నుంచి 6ఏండ్ల వరకు 800 కేలరీల శక్తిగల 20-25 గ్రాముల ప్రొటీన్స్‌ను, పౌష్టికాహారాన్ని ఇంటికి పంపాలి. గర్భవతులు, పాలిచ్చే తల్లులకు 600 కేలరీల శక్తిగల 18-20గ్రాముల పౌష్టికాహారం ఇవ్వాలి. 75శాతం గ్రామీణ ప్రజలు, 50శాతం పట్టణ ప్రజలకు పౌష్టికాహారాన్ని సరఫరా చేయాలి. ఈ చట్టాన్ని అమలుచేయడానికి చైర్మన్, నలుగురు సభ్యులతో రాష్ట్రస్థాయి ఆహార కమిషన్ వేయాలి. లేదా రెండు మూడు రాష్ట్రాలు కలిపి కమిషన్ వేయాలి. కమిషన్‌లో మహిళలకు అధికారం ఇవ్వాలి. జిల్లాస్థాయిలో గ్రీవెన్స్ మెకానిజం ఏర్పాటు చేయాలి. అమలు జరపని అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ చట్టం రూపొంది నేటికి ఏడేండ్లు గడిచినా దీని అమలుకు కేంద్రం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
కాగా నేటికీ భారతదేశంలో ఇందుకు అర్హులైన దారిద్య్రరేఖకు దిగువననున్నవారి ఆదాయంపై స్పష్టత లేదు. 1973-74లో రూపొందించిన దారిద్య్రరేఖ ఆదాయం ప్రకారం రోజుకి గ్రామాలలో రూ.49, పట్టణాలలో రూ.56.60 ఆదాయంతో 2100 నుంచి 2200 కేలరీల శక్తిగల ఆహారాన్ని పొందవచ్చని అంతకంటే తక్కువ ఆదాయం వచ్చేవారిని పేదలకింద గుర్తించాలని నిర్ణయించారు. తర్వాత 2005లో దానికి మార్పులు చేసి పట్టణ ప్రాంతాలలో రూ.18, గ్రామీణ ప్రాంతాలలో రూ.12కు తగ్గించి దారిద్య్రరేఖను హాస్యాస్పదం చేశారు. 2009-10లో దారిద్య్రరేఖను తలకు రూ.22.40 గ్రామీణ ప్రాంతం, రూ.27.80 పట్టణ ప్రాంతానికి లెక్కించారు. ఆ ఆదాయంతో 1700 నుంచి 1890 కేలరీల శక్తిగల ఆహారం మాత్రమే వస్తుంది. ఈ కాలంలోనే దారిద్య్రరేఖకు దిగువ ఉన్నవారు 37.2శాతం నుండి 29.8శాతానికి తగ్గినట్లుగా పేర్కొన్నారు. ఈ విధంగా దారిద్య్రరేఖ ఆదాయాన్ని నిర్ణయించడానికి అనేక గణాంకాలు నిర్ణయించినప్పటికీ ఇంతవరకూ దేశవ్యాపితంగా ఎక్కడా స్పష్టతలేదు. ప్రస్తుతం తెలంగాణలో రూ.2 లక్షల వార్షిక ఆదాయాన్ని దారిద్య్రరేఖగా నిర్ణయించారు. 2017 ఏప్రిల్ 12న తెలంగాణ ప్రభుత్వం ఆహారభద్రతా చట్టానికి రూల్స్ తయారుచేసింది. అంత్యోదయ అన్నయోజన కింద గుర్తించాల్సిన వర్గాలను నిర్ణయించింది.
వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు, గ్రామీణ చేతివృత్తులు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగం, చేనేత, మురికి ప్రాంతాలలో నివసించేవారు, రోజువారీ కూలీలు, పోర్టర్లు, భిక్షకులు, చేతిబండ్లు లాగేవారు, పండ్లు పూలు అమ్మేవారిని, 60ఏండ్ల వయసు దాటినవారిని ఆహారభద్రతా చట్టానికి అర్హులుగా గుర్తించారు. వీరితో పాటు ఒంటరి మహిళలు, వితంతువులు, గిరిజనులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, రూ.1.50 లక్షలలోపు ఆదాయం ఉన్న గ్రామీణ ప్రజలు, 2 లక్షలలోపు ఆదాయం ఉన్న పట్టణ ప్రజలకు ఈ చట్టాన్ని తెలంగాణలో వర్తింపజేయాలి. చివరికి 3.5 ఎకరాల మాగాణి, 7.5 ఎకరాల మెట్ట ఉన్నవారిని కూడా ఈ చట్టం క్రిందికి తెచ్చారు. 32 సెక్షన్లతో ఈ రూల్స్‌ను రూపొందించారు.
తెలంగాణలో 87.55లక్షల రేషన్‌కార్డులు కలిగి 2.79కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారు. కానీ ఇందులో కేంద్రం గుర్తించింది 53.30లక్షల కార్డులు మాత్రమే. 34.25లక్షల కార్డులు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రు.1500 కోట్ల నుంచి రూ.2000 కోట్లు సబ్సిడీ ఇస్తున్నది. కేంద్రం తలకు 5కిలోలు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం 6కిలోలు ఇస్తున్నది. కేంద్రం నెలకు 1.53లక్షల టన్నులు అనగా ఏడాదికి 18.36లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే సరఫరా చేస్తున్నది. బియ్యం సబ్సిడీ కింద కిలోకి రూ.32గా ధర నిర్ణయించి. అందులో రూ.29.73 కేంద్రం సబ్సిడీగా భరిస్తున్నది. అదనపు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నది. కేంద్రం 2021-22 బడ్జెట్లో 2.54 లక్షల కోట్లు ఆహార సబ్సిడీ భరిస్తున్నది. ద్వంద్వ ధరలు ఉండడంతో బ్లాక్ మార్కెట్‌కు అవకాశం ఏర్పడింది. రేషన్ బియ్యాన్ని కిలో రూ.10కి కొనుగోలు చేసి మిల్లర్లు రీసైక్లింగ్ చేసి తిరిగి భారత ఆహార సంస్థకి అమ్మి లబ్ది పొందుతున్నారు. అందువల్ల ద్వంద ధరల విధానాన్ని తొలగించాలి. దీనిని తొలగించా లంటే సార్వత్రిక రేషన్ విధానాన్ని అమలుచేయాలి. ప్రపంచంలోని అన్ని దేశాలలో సార్వత్రిక రేషన్ విధానమే కొనసాగుతున్నది. ఇక్కడ మాత్రమే దారిద్య్రరేఖ పేరుతో కొంతమందికి రేషన్, మిగిలినవారు ఉత్పత్తిధరకు కొనుగోలు చేయటం జరుగుతున్నది.
నేడు దేశంలో పౌష్టికాహార లోపం వల్ల పుట్టిన 1000 మంది శిశువులకు 40మంది మరణిస్తున్నట్లు సర్వేలు చెపుతున్నాయి. వృద్దులు కూడా పౌష్టికాహారం లోపంతో వయసుకు ముందే చనిపోతున్నారు. ప్రపంచ జనాభాలో 60శాతం భారతదేశంలోనే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదికలు చెప్పాయి. 13.40కోట్ల మంది ఒక్కపూట భోజనం చేస్తున్నారు. 52కోట్లమంది పౌష్టికాహార లేమితో అనేక వ్యాధులబారిన పడుతున్నారు.
చౌకడిపో రేషన్ విధానాన్ని సంస్కరించాలి
గతంలో జిల్లాస్థాయిలో మార్కెటింగ్ సొసైటీలు, తాలూకాస్థాయిలో సహకార సొసైటీలను ఏర్పాటుచేసి 24 నిత్యావసర సరుకులను సరఫరా చేశారు. పప్పులు, సబ్బులు, కిరోసిన్, కొబ్బరినూనె, బట్టలు, తదితర ఉత్పత్తులను కూడా అందజేశారు. ప్రయివేటు వ్యాపారులకు పోటీగా సహకార వ్యవస్థ సరుకులను తక్కువ ధరకు ప్రజలకు అందించింది. 10ఏండ్ల క్రితం మధ్యదళారీలు ప్రవేశించి జిల్లాస్థాయి మార్కెటింగ్ సొసైటీలను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు. ఫలితంగా సహకార సంఘాలను గత ప్రభుత్వాలు ఎత్తివేశాయి. వాటిని తిరిగి పునరుద్దరించాలి.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిత్యావసర సరుకుల చట్టంలోని సరుకుల ఉపసంహరణతో మధ్యదళారీలు అక్రమ నిల్వలు పెంచి నూనెలు, పప్పులు, ఆహారధాన్యాల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఈ ధరలు పెరగడంతో కరువుభత్యం పెంచాల్సివచ్చింది. దాంతో ప్రభుత్వంపై భారం పడింది. అందువల్ల సార్వత్రిక రేషన్ విధానం ద్వారా వినియోగదారులకు 24రకాల సరుకులను సరఫరా చేయడం కోసం ప్రభుత్వం ఆహారభద్రతా చట్టాన్ని అమలులోకి తేవాలి. తెలంగాణ ప్రభుత్వం 2017లో రూపొందించిన రూల్స్‌ను అమలుచేయాలి. తెలంగాణలో ఇస్తున్న రేషన్ బియ్యం తినడానికి ఉపయోగపడకపోవడంతో చాలామంది బ్లాకులో అమ్ముకుంటున్నారు. రేషన్ పేరుతో అనర్హులు కూడా కార్డులు పొంది బ్లాక్‌మార్కెట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి సార్వత్రిక రేషన్ ఒక్కటే మార్గం. చౌకడిపోల ద్వారా అన్నిరకాల నిత్యావసర సరుకులను అందించే ప్రయత్నం చేయడం ద్వారా లక్షలమందికి ఉపాధి సౌకర్యం కలుగుతుంది. ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదు. సివిల్ సప్లయిస్, మార్కెటింగ్ శాఖలను సమన్వయపరచి వీటికి బ్యాంకు లింకేజ్ ద్వారా రుణం ఏర్పాటుతో ఈ పథకాన్ని జయప్రదంగా నిర్వహించవచ్చు. బియ్యం, కిరోసిన్, పప్పు, పంచదార, నూనెలు మినహా మిగిలిన సరుకులన్నీ పన్నులు లేని ధరలకు కొనుగోలు చేసి వినియోగదారులకు అందించాలి. ఈ షాపులను ప్రతి 600 కుటుంబాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయ్యాలి. అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవడానికి వీలుగా చౌకడిపో స్థాయిలోను, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు వేయాలి. ఈ కమిటీలకు ఉద్యోగులను కన్వీనర్లుగా పెడుతూ ప్రజా ప్రతినిధులను సభ్యులుగా పెట్టాలి. ప్రజాసంఘాల నాయకులను కూడా నియమించాలి. మన ఉత్పత్తులు ప్రస్తుతం దేశ అవసరాలకు సరిపోతాయి. బ్లాక్‌మార్కెటీర్లను తొలగించి మధ్యదళారీల ప్రమేయం లేకుండా చేస్తే అందరికీ ఆహారభద్రత ఏర్పడుతుంది. అందువల్ల ఆహారభద్రతా చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలుచేయాలి.
- ఎస్. మల్లారెడ్డి
సెల్:9490098666