Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్-19 అనంతర సంక్షోభానికి మూడో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఒక విధంగా, సంపన్న దేశాల ప్రభుత్వాలు మరో విధంగా స్పందించాయి. ప్రజలను ఆదుకోవడానికి, ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి వీలుగా సంపన్న దేశాలు గణనీయంగా ఆర్థిక ప్యాకేజీలను అమలు చేశాయి. మూడవ ప్రపంచ దేశాలు మాత్రం ద్రవ్యపరమైన పొదుపు చర్యల వలలో చిక్కుకుపోయాయి. మూడవ ప్రపంచ దేశాలన్నింటిలోకీ భారతదేశం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అత్యంత దరిద్రంగా ఉంది. ఆ ప్యాకేజీ మన జీడీపీలో ఒక శాతం కన్నా మించి లేదు. తక్కిన మూడవ ప్రపంచ దేశాల పరిస్థితి కూడా మరీ భిన్నంగా ఏమీ లేదు. అదే అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడే రెండు లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజిని ప్రకటించారు. అది వాళ్ళ జీడీపీలో 10శాతం. ఆ తర్వాత బైడెన్ వచ్చాక మరో లక్షా తొంభై వేల కోట్ల డాలర్ల ప్యాకేజిని ప్రకటించారు. అందులో ఒక లక్ష కోట్లు నేరుగా ప్రజలకు చెల్లించారు. ఈ రెెండు ప్యాకేజిలు కలిపితే ఆ దేశపు జీడీపీలో 20శాతం అవుతుంది. (రెండు ప్యాకేజిలకు నడుమ ఏడాది పైగానే వ్యవధి ఉంది) యూరోపియన్ యూనియన్ దేశాలలో కూడా వారి ఆర్థిక వ్యవస్థలు కోలుకోడానికి వీలుగా పెద్ద మొత్తాల్లోనే ప్యాకేజీలను అమలు చేశారు.
మామూలుగా ఐఎంఎఫ్ ఈ తరహా సహాయాలను సమర్ధించదు. పొదుపు చర్యలు విధిగా పాటించి తీరాలనేది ఐఎంఎఫ్ విధించే ముఖ్యమైన షరతు. కానీ ఈ సందర్భంగా ఐఎంఎఫ్ అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఈ సహాయ ప్యాకేజీలను అది గట్టిగా బలపరిచింది, ప్రోత్సహించింది కూడా. మూడో ప్రపంచ దేశాలలో కూడా ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచాలని ఐఎంఎఫ్ సూచించింది. అయితే ఆక్స్‌ఫామ్ అనే సంస్థ చేసిన విశ్లేషణ చూస్తే మాత్రం ఐఎంఎఫ్ తాను చెప్పిన మంచి ప్రవచనాలకు భిన్నంగా ఆచరణలో మూడవ ప్రపంచ దేశాల యెడల వ్యవహరించిందని తేలుతోంది. ఈ కరోనా కాలంలో వివిధ మూడవ ప్రపంచ దేశాలకు రుణాలను మంజూరు చేసే సందర్భాలలో పొదుపు చర్యలను పాటించి తీరాల్సిందేనంటూ ఐఎంఎఫ్ ఒత్తిడి చేసింది.
మార్చి 2020 తర్వాత ఐఎంఎఫ్ 81 దేశాలతో రుణాల మంజూరు ఒప్పందాలను చేసింది. ఆ విధంగా మంజూరు చేసిన 91 రుణాలలో 76 రుణాల విషయంలో ద్రవ్యపరమైన పొదుపు చర్యలను పాటించి తీరాలని షరతులను విధించింది. ప్రజారోగ్యానికి చేసే ఖర్చులను తగ్గించుకోవడం, పెన్షన్ చెల్లింపుల్లో కోతలు పెట్టడం, జీతాల కోతలు విధించడం, జీతాలు పెరగకుండా స్తంభింపజేయడం, నిరుద్యోగ భృతిలో కోతలు, అనారోగ్యం పాలైనప్పుడు చెల్లించాల్పిన వేతనాల్లో కోతలు పెట్టడం వంటి పలు షరతులను పెట్టింది. ఫలితంగా ఆ దేశాల్లో ఈ కాలంలో వైద్యుల, నర్సుల ఆదాయాలు పడిపోయాయి. వారి ఉద్యోగాలు తగ్గిపోయాయి. వివిధ రంగాల్లో కార్మికుల ఆదాయాలు పడిపోయాయి.
ఆక్స్‌ఫామ్ నివేదిక కొన్ని నిర్దిష్ట ఉదాహరణలను పేర్కొంది. ఈక్వెడార్‌కు 6500 కోట్ల డాలర్ల రుణాన్ని మంజూరు చేశారు. ఆ సందర్భంగా ప్రజారోగ్యంపై చేసే ఖర్చు తగ్గించాలని, పేదలు ఎక్కువగా ప్రయోజనం పొందే ఇంధన సబ్సిడీలలో కోత పెట్టాలని, పనులు పోగొట్టుకున్న కార్మికులకు నేరుగా నగదు చెల్లింపులు నిలిపివేయాలని షరతులు పెట్టారు. అంగోలా, నైజీరియా మరో ఏడు దేశాలకు విధించిన షరతుల్లో పేదలపై నేరుగా భారం పడే వ్యాట్ ను పెంచాలన్న షరతు ఉంది. ఆ పేదలు ఉపయోగించే ఆహార వస్తువులు, దుస్తులు, గృహోపకరణాలు వంటి సరుకులపై ఈ వ్యాట్ ప్రభావం ఉంటుంది. బార్బడోస్, ఎల్ సాల్వడార్, లెసోతో, ట్యునీషియాలతో సహా 14 దేశాలలో ఈ షరతుల పర్యవసానంగా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల వేతనాల్లో కోతలు పడ్డాయి. కొత్త నియామకాలు నిలిచిపోయాయి. ప్రజలకు వైద్యం అందించాల్సిన డాక్టర్ల, నర్సుల, ఇతర ప్రజారోగ్య ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది.
సంపన్న దేశాల విషయంలో ఒక విధంగా, మూడవ ప్రపంచ దేశాల విషయంలో మరొక విధంగా వ్యవహరించడం ద్వారా ఐఎంఎఫ్ తన వివక్షాపూరితమైన ధోరణిని బైటపెట్టుకుంది. సంపన్న దేశాల విషయంలో పొదుపు చర్యలను పాటించనవసరం లేదన్న ఐఎంఎఫ్ అదే పేద దేశాల దగ్గరకొచ్చేసరికి పొదుపు చర్యలను పాటించి తీరాల్సిందేనని పట్టుబట్టింది. అప్పుడప్పుడు చాలా సహేతుకంగా వ్యవహరిస్తున్నట్టు మనకు అనిపించినా, ఐఎంఎఫ్ అన్ని సందర్భాలలోనూ ప్రైవేటీకరణ, పొదుపుచర్యల ఎజెండాను తప్పనిసరిగా ముందుకు తెచ్చి వాటి అమలు కోసం పట్టుబడుతూనే ఉంది. ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాల విషయంలో ఈ వైఖరిని అనుసరిస్తోంది. తన షరతుల విషయంలో ఐఎంఎఫ్ పట్టు, విడుపులతో వ్యవహరిస్తోందని, ఆయా దేశాల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని న్యాయంగానే వ్యవహరిస్తోందని అప్పుడప్పుడు అనిపిస్తూ వుంటుంది. అయితే ఈ విధమైన ప్రకటనలు ఐఎంఎఫ్ సమర్పించే పరిశోధనా పత్రాల్లో, ఆ సంస్థ ఉద్యోగులు ప్రచురించే పత్రికలలో మాత్రమే కనపడతాయి. ఈ ప్రకటనల ముసుగు వెనుక ఐఎంఎఫ్ తన అసలు ఎజండాను మాత్రం యథావిధిగా అమలు చేస్తూ పోతోంది.
మూడవ ప్రపంచ దేశాలలోకి వచ్చి, పోయే పెట్టుబడుల ప్రవాహాలపై అదుపు ఉండడం అవసరమేనని ఐఎంఎఫ్ ఇటీవల ఒక సందర్భంగా ప్రకటించింది. అది చూసి కొందరు ప్రగతిశీల ఆర్థికవేత్తలు ఐఎంఎఫ్ వైఖరిలో మొత్తానికి మార్పు వచ్చిందని సంతోషపడ్డారు. కాని వాస్తవంగా దాని వైఖరిలో చిన్నపాటి మార్పు కూడా లేదు. మూడవ ప్రపంచ దేశాలన్నీ తమ తలుపులను బార్లా తెరిచివుంచి విదేశీ పెట్టుబడుల (ద్రవ్య పెట్టుబడులతో సహా) రాకపోకలు యథేచ్ఛగా సాగిపోవడానికి వీలు కల్పించాలన్న షరతు అమలు కోసం పట్టుబట్టడంలో ఏ మాత్రం తటపటాయింపూ ఐఎంఎఫ్ వైపు నుంచి లేదు. ఐఎంఎఫ్ పైకి ప్రదర్శిస్తున్న జాలి కేవలం ప్రచార పరమైన గిమ్మిక్కు మాత్రమే. ప్రగతిశీల ఆర్థిక వేత్తల దృష్టిలో ఐఎంఎఫ్ మంచిదేనన్న అభిప్రాయాన్ని కలిగించడం కోసమే ఈ డ్రామా ఆడుతోంది.
సంపన్న దేశాల విషయంలో ఒక విధంగా, మూడవ ప్రపంచ దేశాల విషయంలో మరొక విధంగా ఐఎంఎఫ్ అనుసరిస్తున్న వైఖరి ప్రస్తుత కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత కూడా ఇదే విధంగా కొనసాగుతుందా అన్న అనుమానం ఇక్కడ తలెత్తుతోంది. నయా ఉదారవాద విధానాలను అనుసరించిన ఫలితంగా సంపన్న దేశాలన్నీ సంక్షోభంలో పడ్డాయి. ప్రస్తుతం ఆ దేశాలు అమలు చేస్తున్న ఉద్దీపన పథకాల వలన వాటి ఆర్థిక వ్యవస్థలు కోలుకుని సంక్షోభం నుండి బైటపడేందుకు వీలుంటుంది. అదే మూడవ ప్రపంచ దేశాల దగ్గరకొచ్చేసరికి అక్కడ అమలు జరుపుతున్న పొదుపు చర్యల వలన ఇప్పటికే నెలకొన్న ఆర్థిక మాంద్యం, భారీ స్థాయి నిరుద్యోగం, ఆదాయాల కోత మరింత పెరుగుతాయి. మూడవ ప్రపంచ దేశాల దుస్థితిని ఉపయోగించుకుని సంపన్న దేశాలు తమ దేశాల్లో పెరిగిన ప్రభుత్వ వ్యయం పర్యవసానంగా ద్రవ్యోల్బణం పెరగకుండా చూసుకోగులగుతాయి.
మరో విధంగా చెప్పాలంటే, మూడవ ప్రపంచ దేశాల ఆర్ధిక అవస్థల దుష్ప్రభావాలు తమ ఆర్థిక వ్యవస్థలపై పడకుండా సంపన్న దేశాలు తమ చుట్టూ కంచెలు వేసుకుంటాయి. ఇటువంటి ప్రయత్నమే గతంలో ట్రంప్ చేశాడు. ఇప్పుడు అదే పద్ధతులను అన్ని సంపన్న దేశాలూ అవలంబిస్తాయి. దానికి తోడు ఆర్థిక ఉద్దీపన పథకాలు అమలు కావడం వలన ఆ ఉద్దీపన ప్రయోజనాలు ఆయా సంపన్న దేశాలవరకే పరిమితం అవుతాయి. సంపన్న దేశాల ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. అదే సమయంలో మూడవ ప్రపంచ దేశాల ప్రజల ఆదాయాలు తగ్గుతాయి. సంపన్న దేశాలు అనుసరించే రక్షణ చర్యల ఫలితంగా సంపన్న దేశాల మార్కెట్లలోకి ప్రవేశించడానికి మూడవ ప్రపంచ దేశాలకు అవకాశం ఉండదు
ప్రపంచంలో చాలా ముడి సరుకులు మూడవ ప్రపంచ దేశాలలోనే ఉత్పత్తి అవుతున్నాయి. వీటి ధరలు ఆ దేశాలలోని ప్రజల ఆదాయాల స్థాయిలను బట్టి నిర్ణయించబడతాయి. అక్కడ ఆదాయాలు పడిపోయినందువలన ఈ సరుకులకు ఉండే డిమాండ్ పడిపోయి వాటి ధరలు తగ్గిపోతాయి. ఆ తక్కువ ధరలకు ఆ సరుకులను సంపన్న దేశాలు కొనుగోలు చేయడానికి వీలవుతుంది.
నయా ఉదారవాద కాలంలో సంపన్న దేశాలనుండి పలు ఉత్పత్తి కార్యక్రమాలు మూడవ ప్రపంచ దేశాలకు- ముఖ్యంగా ఆసియా దేశాలకు బదలాయించబడ్డాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత ఏకీకృతం అయింది. ఇప్పుడు ఐఎంఎఫ్ అనుసరిస్తున్న వైఖరి చూస్తే మళ్ళీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త అడ్డుగోడలు లేస్తాయా అన్న అనుమానం కలుగుతుంది. సంపన్న దేశాలలోని గుత్త ద్రవ్య సంస్థలు, కార్పొరేట్లు ఒకపక్క, మూడవ ప్రపంచ దేశాలు మరోపక్క ఉండేలా మార్పులు జరిగే అవకాశం ఉంది. తమ దేశాలలో సంక్షోభం ప్రభావం నుంచి కోలుకునే కొన్ని సహాయ చర్యలను చేపట్టి అక్కడి నిరుద్యోగాన్ని, పేదరికాన్ని కొంతమేరకు తగ్గించే ప్రయత్నాలను సంపన్న దేశాలు చేస్తున్నాయి. మరోవైపు మూడవ ప్రపంచ దేశాలు మాత్రం మరింతగా మాంద్యంలో, స్తబ్దతలో కూరుకుపోయి ఉన్నాయి. ఈ మూడవ ప్రపంచ దేశాల్లోని బడా పెట్టుబడిదారులు మాత్రం మరింత సంపన్నులుగా ఎదుగుతూనే వుంటారు.
ఇంతవరకూ నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానం వలన మూడవ ప్రపంచ దేశాలలో శ్రామిక ప్రజలు తీసుకునే ఆహారంలో పోషక విలువలు పడిపోయినా, కనీసం కొన్ని తరహాల ఉత్పత్తి కార్యక్రమాలు సంపన్న దేశాల నుంచి మూడవ ప్రపంచ దేశాలకు తరలివచ్చాయి. ఇకముందు ఆవిధంగా తరలివచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చు. చైనా పట్ల అమెరికా, తదితర దేశాలు అనుసరిస్తున్న శత్రుత్వ వైఖరిని సాకుగా చూపించి సంపన్న దేశాలు తమ దేశాలనుంచి ఉత్పత్తి కార్యకలాపాలు మూడవ ప్రపంచ దేశాలకు తరలిపోకుండా నిరోధించవచ్చు.
ఈ వైఖరిని సంపన్న పశ్చిమ దేశాలలోని అభ్యుదయవాదులైన ఆర్థికవేత్తలు తప్పనిసరిగా వ్యతిరేకిస్తారు, ఎండగడతారు. కానీ, ఆ విధానాలే గనుక అమలైతే మూడవ ప్రపంచ దేశాల పరిస్థితి ఏమిటి? వివక్షపూరితమైన ఆ విధానాల నుంచి విడగొట్టుకుని మూడవ ప్రపంచ దేశాలు తమ ఆర్థిక ఉద్దీపన కోసం ప్రత్యామ్నాయ విధానాలను చేపట్టక తప్పని పరిస్థితి వస్తుంది.
ప్రస్తుత ప్రపంచీకరణ విధానాలు మూడవ ప్రపంచ దేశాలలోని శ్రామిక వర్గానికి ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎటొచ్చీ, సంపన్న దేశాల నుంచి ఇక్కడకు తరలిన కొన్ని ఉత్పత్తి కార్యకలాపాల పర్యవసానంగా జీడీపీ వేగంగా పెరిగింది. అందువలన ప్రపంచీకరణ పట్ల కొన్ని భ్రమలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అనుసరించే వివక్షపూరిత వైఖరి వలన గతంలో మాదిరిగా ఉత్పత్తి కార్యకలాపాలు మూడవ ప్రపంచ దేశాలకు తరలిరావడం ఆగిపోతుంది. అప్పుడు ప్రపంచీకరణ విధానాలకు మూడవ ప్రపంచ దేశాలనుండి ప్రతిఘటన అనివార్యంగా వస్తుంది.
చాలామంది అభ్యుదయవాదులైన ఆర్థికవేత్తలకు ఒక కల ఉంది. సంపన్న దేశాలు, పేద దేశాలు పరస్పర సహకారంతో, సమన్వయంతో ఒకరి అభివృద్ధికి మరొకరు తోడ్పడడం జరుగుతుంది అనేదే ఆ కల. ఇది చాలా ఉదాత్తమైన కల. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ ఉండగా ఆ కల నేరవేరదనేదే బాధాకరమైన వాస్తవం. ఇప్పుడు కరోనా సంక్షోభం నేపథ్యంలో ఐఎంఎఫ్ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలే ఇందుకు నిదర్శనం. ఈ ద్వంద్వ వైఖరి కరోనా అనంతర కాలంలో కూడా కొనసాగనుంది. పెట్టుబడిదారీ విధానం స్వభావమేమిటో ఈ వైఖరి తేటతెల్లం చేస్తోంది.
- ప్రభాత్ పట్నాయక్