Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెదర్లాండ్స్‌లోని రోటర్ డ్యామ్ నుంచి మలేసియా దేశానికి సరుకు రవాణా చేసే ప్రపంచంలోనే అతిపెద్ద నౌకల్లో ఒకటి ఎవర్ గివెన్. దీనికి ఎవర్ గివెన్ అనేది అధికారిక నామం కాగా ఈ నౌకను ఎవర్ గ్రీన్ అనే తైవాన్ దేశానికి చెందిన నౌకాయాణ సంస్థ నడిపిస్తూ ఉంటుంది. మార్చి 23వ తేదీన సూయజ్ కాల్వలో వెళ్తున్న ఎవర్ గివెన్ నౌకకు ఇసుక తుఫాను వలన నౌక కెప్టెన్ ముందున్న మార్గం అర్థం కాక పరిస్థితులు అదుపుతప్పి ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా జరుగుతున్న చర్చ. ఏది ఎలా ఉన్నా ప్రపంచంలో పనామా జలసంధి, మలక్కా జలసంధి, దక్షిణ చైనా జలమార్గం వంటివి ఉన్నా సూయజ్ కాల్వలో జరిగిన ప్రమాదానికి ప్రపంచం ఎందుకింత ఆసక్తి చూపుతోంది అన్నదానికి వాణిజ్యపరంగా ఈ జలమార్గానికి ఉన్న విశేషమే కారణం.
ఎర్రసముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ 1859లో నాడు ఈజిప్టు రాజులతో ఒత్తిడి చేయించి మరీ ఈ మానవ నిర్మిత జలమార్గాన్ని తమ వాణిజ్య అవసరాల కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులు నిర్మించేలా చేశారు. సూయజ్ కాల్వ ప్రపంచంలోనే అత్యంత రద్దీతో కూడిన జలమార్గం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాణిజ్యంలో 12శాతం వస్తువుల్ని తీసుకుని వెళ్లే సరుకు రవాణా నౌకలు ఈ మార్గంలోనే వెళ్తున్నాయంటే ఎంత వాణిజ్యపరమైన ప్రాధాన్యం ఉందో తెలుస్తోంది, పైగా మనం నిత్యావసర జీవితంలో వాడే వివిధ రకాల వస్తువుల్లో 90శాతం సముద్ర మార్గంలో వాణిజ్య నౌకల్లో వచ్చినవే అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ జలమార్గానికి అంతర్జాతీయ స్థాయిలో ఇంత విశేషం ఉండగా రవాణా దూరాన్ని గణనీయంగా తగ్గించడం మరో విశేషం. ఉదాహరణకు సూడాన్ నుంచి టర్కీ సముద్రమార్గంలో రావాలంటే ఈ సూయజ్ కాల్వ రాకముందు ఆఫ్రికా ఖండాన్ని చుట్టివస్తే అది దాదాపు 20,000 కిలోమీటర్లు అవుతుండగా ఈ మార్గంతో అది కేవలం 2,000 కిలోమీటర్లు మాత్రమే కావడంతో తక్కువ ఖర్చుతో, స్వల్పకాలిక వ్యవధిలో ప్రయాణించే వెసులుబాటు ఇచ్చింది. సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ప్రపంచాన్ని ప్రపంచ వనరుల్ని తమ గుప్పిట్లో ఉంచుకోవాలనే తపనతో నాడు ఆసియాలో ఉన్న మార్కెట్ వనరుల కోసం సూయజ్ కాల్వను ఈజిప్ట్ రాజును ఒత్తిడి చేసి నిర్మింపజేసినా తర్వాత కాలంలో ప్రపంచ వాణిజ్య జలమార్గాల్లో ఇది విశేషమైన ఖ్యాతి గడించి ఈజిప్టు సూయజ్ కాల్వను తమ అతిపెద్ద ఆర్థిక వనరుగా, దేశానికి గౌరవ సూచికగా భావించడానికి కారణం అయ్యింది. 193 కిలోమీటర్లు ఉన్న ఈ జలమార్గంలో సగటున ఒకనౌక ప్రయాణించేందుకు దాదాపు పదిహేను గంటలు పడుతూ, అట్లాంటిక్ హిందూ మహాసముద్రంలో వాణిజ్యాన్ని సులభతరం చేసింది. అయితే మార్చి 23న ప్రమాదం జరిగి దాదాపు ఆరు రోజుల పాటు కఠోర శ్రమ అనంతరం ఎవర్ గివెన్ నౌక ఈ ఆటుపోట్ల నుంచి బయటపడి అందరూ హమ్మయ్య అనుకునేలా చేసింది. గతంలో కూడా ట్రోపిక్ బ్రిలియన్స్, హాంకాంగ్ కార్గో నౌక, 2017లో జపాన్ నౌకలు ఇలాంటి చిక్కులే ఎదుర్కున్నప్పటికీ, ఈ నౌక ఆరురోజుల పాటు కాల్వలోనే ఉండిపోవడం వలన ఆయా మార్గాల్లో నౌకలన్నీ నిలిచిపోయి వందల బిలియన్ల వాణిజ్య నష్టం జరిగిందని సంస్థలు వాపోతున్నాయి. కాగా సూయజ్ కాల్వ సీఈఓ సంబంధిత నౌకాయాణ సంస్థ దగ్గర నష్టపరిహారం వసూలు చేస్తామని చెప్పడం కథను కొత్త మలుపు తిప్పింది.
- పి. నాగఫణి,
georgepriya2020@gmail.com