Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ఏర్పడి ఏడేండ్లయినా ప్రభుత్వం ఒక్క ఉద్యోగ ప్రకటనా చేయలేదు. మనస్తాపం చెందిన కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి, నిరుద్యోగి సునీల్ నాయక్ (25) 2021 మార్చి 26న స్వీయహత్యా ప్రయత్నంచేశారు. 2021 ఏప్రిల్ 2న మరణించారు. ఈయన మహబూబాబాద్జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింఫ్ు తండా నివాసి. ఆరేండ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు తయారౌతున్నారు. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకే స్వీయహత్యకు పాల్పడినట్లు నాయక్ వీడియో నమోదుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 61కి పెంచగానే సునీల్ నిరుత్సాహపడ్డాడని ఆయన సోదరుడు శ్రీనివాస్ అన్నారు. నిరుద్యోగ సమస్యతో దేశంలో చాలమంది స్వీయహత్య చేసుకున్నారు. ప్రతిపక్షాలన్నీ సునీల్ మృతికి ముఖ్యమంత్రిని నిందించాయి.(ప్రజాసమస్యలకు ప్రభుత్వాధినేతలే కారణం)రాజకీయలబ్ధికి ఏమేమోఅన్నాయి. తామెప్పుడూ పట్టించుకోని నిరుద్యోగ సమస్యపై గగ్గోలుపెట్టాయి. బీజేపీ యువమోర్చా ఉద్యోగనియామకాలు కోరుతూ కవాతుచేసింది. కలెక్టర్ కార్యాలయ ముట్టడికి యత్నించింది. న్యాయం కోసం పోరాడాల్సిందే. కానీ గురువిందలకు ఆ నైతికత ఉండదు. మోడీ వాగ్దానించిన 2 కోట్ల ఉద్యోగాలు, రూ.15లక్షలు ఏడేండ్లయినా ఇవ్వలేదని వీరికితెలియదా? వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్రనిరసన తెలిపాయి. సునీల్ సోదరునికి ఉద్యోగం, తల్లిదండ్రులకు 2గదుల ఇల్లు, రూ.5 లక్షల హామీతో గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ శవదహనం చేయించారు. ఇది ప్రజాధనంతో మతుని కుటుంబానికి బుజ్జగింపు. ప్రభుత్వ తప్పుకు ప్రజలకు శిక్ష. సమస్య తెగదు. స్వీయహత్యలు ఆగవు.
లంబాడీలైనా రిజర్వేషన్ ఉన్నా డిగ్రీ చదివిన సునీల్, ఎం.టెక్. చదివిన శ్రీనివాస్‌లకు ఆరేండ్ల నుంచి ఉద్యోగం రాలేదు. పెట్టుబళ్ల ఉపసంహరణ, వాటాల అమ్మకం, ప్రయివేటీకరణ తర్వాత రిజర్వేషన్లే ఉండవు. రిజర్వేషన్‌తో ఉద్యోగం పొందిన, పొందలేనివారి జుట్లు ముడేసేపని జరుగుతోంది. రిజర్వేషన్ పొందినవారు పొందనివారికి సాయమందించి కలిసి బతుకుతూ పోరాడవలసిన సమయమిది.
1994లో సుప్రీంకోర్టు స్వీయహత్య నేరం కాదంది. జీవించే హక్కులోనే మరణించే హక్కుందని వక్కాణించింది. సున్నితమనస్తత్వ భార్య స్వీయహత్యకు భర్తను శిక్షించవద్దని 2014 అక్టోబర్ 8న మద్రాసు హైకోర్టు తీర్పిచ్చింది. స్వీయహత్యకు ఆరు ప్రధాన నేరకారణాలు.
1.తల్లిదండ్రులు: బాల్యంలో తల్లిదండ్రులు, బంధుమిత్రులు పిల్లల్లో వ్యక్తిత్వం నిర్మించాలి. వ్యక్తిత్వవికాస అవకాశాలు కల్పించాలి. పిల్లలను ఆడమగ తేడా లేకుండా పెంచాలి. ప్రశ్నించే తత్వం, శాస్త్రీయ దృక్పథం అలవర్చాలి. ధైర్యసాహసాలు నూరిపోసి పిరికితనం దరికిరాకుండా చేయాలి. వివేకవిచక్షణలు, మానసిక స్థిరత్వం అలవర్చాలి. జీవితం, జీవన విధానంలో ఎదురుకాగల సమస్యల పట్ల అవగాహన కలిగించి, పరిష్కారమార్గాలు సూచించాలి. వ్యక్తిత్వవికాసం, సమాజవికాస అవగాహన, సామాజిక స్పహ, బాధ్యత నేర్పాలి. 'నీ సంగతి నీవు చూసుకో' అని ఎంసెట్ ర్యాంకు, అమెరికా చదువు, డాలర్ల సంపాదనలు మాత్రమే చెప్పి వారి మనసులను సంకుచితం, కలుషితం చేయరాదు. సంపూర్ణమానవులుగా ఎదగడానికి సమాజం నుంచి నేర్చుకునే అవకాశాలు కల్పించాలి. మానవత్వం ఉన్నవారు కష్టాలు, సమస్యలు పరిష్కరించుకుంటారు. విలువైన జీవితాన్ని అంతంచేసుకునే స్వీయహత్యకు పూనుకోరు.
2.ఉపాధ్యాయులు: 30 ఏండ్ల క్రితం విద్య ప్రభుత్వ అధీనంలో ఉండేది. వృత్తి నిబద్దత, సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయులు బడిలో, బయటా విద్యార్థులను పర్యవేక్షిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేవారు. ఆ తర్వాత విద్య బుద్ధిగలవారి నుంచి డబ్బుగల కార్పొరేట్లకు మారింది. వారికి అధిక లాభాల మీదే దృష్టి. విద్యార్థుల తల్లిదండ్రులు వీరికి వినియోగదారులుగా కన్పిస్తారు. బడిలో ప్రతిదీ వ్యాపార వస్తువుగా మారింది. సమస్యలను అధిగమించి బతకటం, ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎదిరించి పోరాడటం నేటి విద్య నేర్పటం లేదు. విద్యార్థులకు సమాజ అధ్యయన అవకాశం, జీవితాన్ని అర్థంచేసుకునే పరిస్థితులు లేవు. మార్కులు తగ్గినా, అయవార్లు, తల్లిదండ్రులు మందలించినా, తోటి విద్యార్థులతో గొడవపడినా, నచ్చిన టి.వి.ఛానల్ చూసే అవకాశం దొరక్కపోయినా, ''ప్రేమ'' విఫలమైనా, ఉద్యోగం దొరక్కపోయినా వీరికి స్వీయహత్యే శరణ్యం.
3.మతం: ప్రజల్లో మతోన్మాదం, కులమత ధోరణులు, మతమౌఢ్యం, సామాజిక ఛాందసాలు పెరిగాయి. మానవత్వం మాయమైంది. ఆధ్యాత్మికాచార్యులు, మతపెద్దలు ప్రజల్ని భావవాదంలో ముంచి భౌతిక వాస్తవాలకు దూరం చేస్తున్నారు. వారు చేప్పే భక్తిలో మానసిక ప్రశాంతత దొరికితే సంతోషమే. కానీ భౌతిక ప్రపంచంలో సుఖశాంతులతో జీవించడానికి అవసరమయిన వాస్తవ పరిస్థితులను మరుగుపరుస్తున్నారు. జనాన్ని భక్తి పేరుతో భ్రమల్లో ముంచుతున్నారు. అందుకే జీవితంలో సవాళ్లను ఎదుర్కోలేక నిరాశానిస్పహలతో స్వీయహత్యలకు పాల్పడుతున్నారు.
4.సమాజం: సమాజంలో సమిష్టిభావం అదశ్యమై వ్యక్తివాదం వేళ్ళూనుకుంది. 'ఎవరికి వారే యమునా తీరే' గా తయారయింది. నిరాసక్తత, పొరుగువారిని పట్టించుకోని అలవాట్లు, స్వార్థం పెరిగిపోయాయి. ప్రతిఫలాశ, లాభాపేక్ష లేకుండా మాట్లాడేవారేలేరు. మనసువిప్పి చెప్పుకోడానికి మనుషులే కరువయ్యారు. జీవిత భాగస్వాములు, సోదరులు, తల్లిదండ్రులు, మిత్రులతో కష్టసుఖాలు పంచుకునే తత్వం లేదు. ఈ వినిమయ ప్రపంచంలో భాగమైన మాధ్యమాలు, టి.వి.సీరియళ్ళు, కార్యక్రమాలు, సినిమాలు అవగాహనా లోపాలు, అశాస్త్రీయభావాలను పెంచుతున్నాయి. ఏకాంతాన్ని పెంచి, స్వల్పకారణాలకే స్వీయహత్యలకు పురిగొల్పుతున్నాయి.
5.ప్రభుత్వం: ప్రభుత్వాలు ప్రజాశ్రేయస్సును మరిచాయి. సంక్షేమ రాజ్యభావన మాయమైంది. ప్రజల అవసరాల కోసం కాక బహుళ జాతి సంస్థల లాభాలను పెంచడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ప్రజలు సమస్యల పుట్టలో జీవిస్తున్నారు. ఎప్పుడు ఏ పాము కాటేస్తుందో తెలీదు. వ్యవసాయావసర విత్తనాలు, ఎరువులు, మందులు బహుళ జాతి సంస్థల గుత్తసొత్తులైన నేపథ్యంలో గిట్టుబాటు ధరలు లేక, అప్పులపాలై రైతులు స్వీయహత్యలు చేసుకుంటున్నారు. ఆలోచించి, అసలు కారణాలను అన్వేషించి, సమస్యలను పరిష్కరించే సమర్థత, ఓపిక పాలకులకు లేవు. అందుకే రైతులు తిన్నది అరక్క చస్తున్నారని, నష్టపరిహారం కోసం స్వీయహత్యలు చేసుకుంటున్నారని, అవి దొంగ చావులని మంత్రులు, ముఖ్యమంత్రులు బాధ్యతారహిత వింత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు బతుకుదెరువు చూపడం లేదు. రాజ్యాంగ అధికరణ 21 ఇచ్చిన జీవించే హక్కును లెక్కచేయటం లేదు.
6.ప్రపంచీకరణ: సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో భాగమైన కొత్త ఆర్థిక విధానాలు జీవితాలతో ఆడుకుంటున్నాయి. అన్నిరంగాల్లో ప్రవేశించి తడిగుడ్డతో గొంతులు కోస్తున్నాయి. ఉచ్చుల్లో ఇరుక్కున్న సామాన్యప్రజలు స్వీయహత్యకు ఒడిగడుతున్నారు.
పాలకపక్షాలన్నీ ఒకటే. ఏరు దాటాక తెప్ప తగిలేసేవే. ప్రత్యామ్నాయ పక్షాలకు, స్వార్థ ఉద్యమ పెట్టుబడిదారీ పక్షాలకు తేడా ఉంది. నేటి పాలకులు చట్టాల, నిబంధనల మార్పుతో సుపరిపాలనకు, మంచి రోజులకు ప్రమాణపత్రాలు సేకరించే ప్రయత్నాలు మానాలి. ప్రజలకు చేసిన వాగ్దానాలు పూర్తిచేయాలి. ప్రభుత్వాలు గణాంకాలు తారుమారుచేసి పేదరికం తగ్గిందని భ్రమింపజేస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను మాయచేయడం మాని స్వీయహత్యల మూల కారణాలను పరిష్కరించాలి.
- ఎస్.హనుమంతరెడ్డి
సెల్:9490204545