Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాత్మా ఫూలే, అంబేద్కర్ మనదేశంలో మానవహక్కుల పోరాటానికి ఆద్యులు. పూలే దంపతులు మహారాష్ట్రలో ఆధునిక విద్యకి పునాదులు వేశారు. అణగారిన వర్గాల వారి హక్కుల కోసం పోరాడారు. సాంఘిక దురాచారాలని నిర్మూలించడానికి కషి చేసారు. ఫూలే తనకు ఆదర్శమని అంబేద్కర్ పేర్కొన్నారు. ఫూలే స్ఫూర్తితో అంబేద్కర్ నిమ్న వర్గాల హక్కుల కోసం పోరాడారు. మనిషిని మనిషిగా గౌరవించాలని, కులాన్నిబట్టి కాదని, ఫూలే జీవితమంతా పోరాడారు. రాజుల కాలంనాటి దౌర్జన్యాలను ఎదిరించారు. పాశ్చాత్య దేశాల్లోని ప్రజాస్వామ్య వ్యవస్థలను, విలువలను, సంస్కృతిని, జీవన విధానాన్ని అధ్యయనం చేశారు. థామస్ పెయిన్ 1791లో రాసిన 'మానవ హక్కులు' పుస్తకం, అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్రను చదివి, ఫ్రెంచి విప్లవం గురించి అధ్యయనం చేసి ఎంతో ప్రభావితులయ్యారు. భారతదేశం అలా కులాలు లేకుండా అవిద్య నుంచి బయటపడి ఎదగాలని పూలే కోరారు. అన్నిటికీ ఆధునిక విద్య ముఖ్యమని భావించారు. మూఢ నమ్మకాలను తొలగిస్తే తప్ప ప్రజలు చైతన్యవంతులుకారని, ఉద్యమించారు. ఏ కులం గొప్పది కాదు, ఏ కులం చిన్నది కాదు, అన్ని కులాలు సమానమే అని భావించిన ఫూలే బ్రాహ్మణులను కూడా కలుపుకొని అనేక సంఘసంస్కరణలను చేపట్టారు. స్త్రీవిద్యకు ప్రాధాన్యతనిచ్చారు. వితంతువుల కష్టాలను చూసి చలించిపోయారు. బాల్య వివాహాల వల్ల, 15-20ఏండ్లలోపే వితంతువులై దుర్భర జీవితం జీవిస్తూ తల్లులైన వారి గర్భశోకాన్ని గమనించారు. గర్భస్రావాలవల్ల చనిపోతున్న వితంతువులను మానవతా దృక్పథంతో చేరదీసి వారు పిల్లల్ని కనాలని, ఆ పిల్లలను సాదరంగా పెంచి పోషించాలని, వారి కోసం స్కూళ్ళను, హాస్టళ్ళను ప్రారంభించారు. నిమ్నవర్గాల బాలబాలికలకు విద్య అందిస్తే రాబోయే తరం ఎంతగానో ఎదుగుతుందని భావించారు. ఫూలే దంపతులు మరో విద్యావేత్త ఫాతిమా బేగంతో కలిసి మన దేశంలో అణగారిన వర్గాలకు ఆధునిక విద్యకై పునాదులు వేశారు. పురుషుల్లో స్త్రీలే ప్రకృతిపరంగా ఆధిపత్యం కలవారు. ఎవరైనా అందరి రుణం తీర్చవచ్చు కానీ, జన్మనిచ్చిన తల్లి రుణం ఎన్నటికీ తీర్చుకోలేరు. స్త్రీ లేకుండా ఏ ఇల్లు, ఏ కుటుంబం మనజాలదు. స్త్రీ స్వార్థరహితంగా తల్లి హదయంతో అందర్నీ సంరక్షిస్తుంది. స్త్రీ బలహీనురాలు కావడం వల్ల పురుషుడు స్వార్థపరుడై స్త్రీలను అణచిపెడుతూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రావడం వల్ల సమాజం ఇలా దుర్మార్ఘంగా, స్వార్థపూరితంగా మారింది అని మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆనాడే స్త్రీల మహౌన్నత కృషిని పొగిడారు.
స్వాతంత్రం అంటే దేశానికే కాదు, ప్రజలకి కూడా రావాలి. అందరికీ సమాన హక్కులు ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఫూలే, అంబేద్కర్లు అణగారిన వారి హక్కులు కోసం పోరాడారు. మన దేశంలో అంటరానితనం, కులవివక్ష దళితుల హక్కులని కాలరాసాయి. తొలిసారిగా అంబేడ్కర్ జీవిత చరిత్రను 1946లో కొంకణిభాషలో తానాజీ ఖార్వేట్కర్ రాశారు. అందులో అంబేద్కర్ బౌద్దమతం స్వీకరించక ముందున్న జీవితం గురించే ఎక్కువ భాగం ఉంది. దీన్ని పాకిస్థాన్లోని కరాచీలో రచయిత ముద్రించారు. అంబేద్కర్ గురించి తెలుసుకోడానికి సజీవంగా ఉన్న పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, వక్తగా, రచయితగా, రాజ్యాంగపితగా పేరు పొందారు. ఆయన పేదల హక్కుల కోసం అనేక సంవత్సరాలు పోరాటం సాగించాడు. భారతదేశానికి స్వాతంత్య్రం రావటం, రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగ రూపకల్పనకు కృషి చేయడం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం.
టి.టి కష్ణమాచారి (నాటి కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ 'రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో ఉండి పోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు.
కానీ ఈ రోజు ఫూలే, అంబేద్కర్లని కుల, వర్గ నాయకులుగా చూస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. అంబేద్కర్ విగ్రహాలు నిమ్న వర్గాల కాలనీల్లోనే ఉంటున్నాయి.ఆయన విగ్రహాలను అవమానిస్తున్నారు. ఫూలే, అంబేద్కర్ ఏ ఒక్క కులానికో చెందిన వారు కాదు. వారు మూఢ నమ్మకాలకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. జాతి పురోగమనానికి కృషి చేశారు. కులం రూపుమాపాలన్నారు. కానీ ఈ రోజు అనేకమంది మూఢ విశ్వాసాలలో కొట్టుకొనిపోతున్నారు. కులం పేరుతో చీలికలు పేలికలవుతున్నారు.ఇది ఫూలే, అంబేద్కర్ల స్ఫూర్తికి విరుద్ధం.వారి బాటలో నేటి యువత పయనించి ఉన్నత విద్యని అభ్యసించాలి. కుల మతాలకు అతీతంగాప్రజలు ఐక్యం కావాలి. తద్వారా ఉన్నత సమాజాన్ని నిర్మించాలి.
- ఎం. రామ్ ప్రదీప్
సెల్:9492712836