Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళనాడులో పోలింగ్ ముగిసింది. ఫలితాలు వెలువడాల్సి ఉంది. తమిళుల అస్తిత్వానికి సుదీర్ఘ చారిత్రిక నేపథ్యం ఉంది. తమిళుల హదయాలను గెలవడానికి దీనిని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఎన్నో ఏండ్ల నుంచి తమిళనాడులో పట్టు సాధించిన ద్రవిడ పార్టీలు అక్కడి ప్రజల నాడి తమకు బాగా తెలుసని చెబుతాయి. మరోవైపు భారతీయ జనతాపార్టీ స్థానికంగా పై చేయి సాధించడం కోసం సర్వ శక్తులూ ఒడ్డింది. అదే సమయంలో తమిళ ప్రజానీకం మాత్రం ఎన్నికల ప్రక్రియలో తాజా స్ఫూర్తిని నింపగల ప్రత్యామ్నాయం కోసం చూసారు. పోలింగ్ ప్రక్రియ సమీపించే కొద్దీ మ్యానిఫెస్టోల మాయాజాలాలు, ఉచితాల గాలాలు, పొత్తుల కసరత్తుల వేగం పుంజుకున్నాయి. దీంతో తమిళనాట రాజకీయ వేడి పతాక స్థాయి చేరడాన్ని అందరూ గమనించారు.
ఎఐడిఎంకెలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నించింది. అంతర్గతంతగా పళనిస్వామి, పన్నీరుసెల్వమ్ మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాలు, బయట నుంచి శశికళ, టిటివి దినకరన్‌ల చర్యలు ఎఐడిఎంకెను బలహీనపరుస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల తాము బలపడే అవకాశం ఉందని బీజేపీ తొలుత అంచనా వేసింది. అయితే, రోజులు గడిచి, ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ ఈ అంచనా తప్పని తెలుసుకుంది. ఎఐడిఎంకె బలహీన పడితే దాని ప్రభావం తమ మీద కూడా ఉంటుందని, తమకు పడే ఓట్లూ తగ్గుతాయని బీజేపీ ఆలస్యంగా గుర్తించింది. 2014 ఎన్నికల్లో 9సీట్లలో పోటీ చేసి 5.48శాతం ఓట్లు సాధించి ఒకే ఒక్క సీటును గెలుచుకున్న ఆ పార్టీ 2019 ఎన్నికల్లో 3.66శాతం ఓట్లు మాత్రమే పొందడం, ఒక్క సీటునూ గెలుచుకోకపోవడాన్ని ఆ పార్టీ నాయకులు కొందరు ప్రస్తావిస్తున్నారు. ఎఐడిఎంకె, డిఎంకెల మధ్య తమిళ ప్రజలు చీలిన విషయం తెలిసిందే. ఈసారి ఈ రెండు ప్రధాన పార్టీల కూటములే కాకుండా ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీధి మయమ్, దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్లు కూడా బరిలో ఉన్నాయి. విడివిడిగానూ, కూటములు గానూ ఈ పార్టీలు ఊరించే ఎన్నో ఉచిత పథకాలను ప్రకటించాయి. ఏప్రిల్ ఆరున పోలింగ్ ముగిసింది. ఇక మే 2న తేలనున్న ఫలితాల్లో విజేత ఎవరన్నదే తేలాల్సి ఉంది.
తమిళ భాషకు, సంస్కృతికి సుదీర్ఘ చరిత్ర ఉన్న సంగతి తెలిసిందే. అంతకాకపోయినా, తమిళనాడులో సమానత్వం కోసం, వివక్షలేని సమాజం కోసం జరిగిన పోరాటానికి కూడా చాలా చరిత్రే ఉంది. జస్టిస్ పార్టీ, దాని నుంచి ఆవిర్భవించిన పెరియార్ ద్రవిడార్ కజగమ్ (డి.కె), ఆ తరువాత అన్నాదొరైకి చెందిన ద్రవిడ మున్నేట్ర కజగమ్ (డిఎంకె) ఈ పోరాటాలను ముందుకు తీసుకుపోవడం ద్వారా తమిళ ప్రజలకు ప్రత్యేక అస్తిత్వాన్ని రూపొందించాయి. ఈ అస్త్తిత్వ పట్టాల పైకి ఎక్కడానికి ఇప్పుడు బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. అయితే, ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే తమిళ అస్తిత్వానికి మసి పూసి మారేడుకాయ చేయాలన్న బీజేపీ తరహా బ్రాహ్మణవాద రాజకీయాలను తమిళ నేల పదేపదే తిప్పికొట్టింది. తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది.
వేద సనాతన ధర్మం నుంచి సంస్కృతీకరణ, ఆలయ పూజలను వ్యతిరేకిస్తూ ప్రత్యేక తమిళ గుర్తింపును కాపాడుకోవడం కోసం జరుగుతున్న పోరాటానికి కనీసం 2000సంవత్సరాల చరిత్ర వుంది. భారత ఉపఖండమంతా మౌర్య సామ్రాజ్య విస్తరణ జరిగినప్పుడు తమిళనాడు దాని నుంచి బయటపడింది. మొదటి సహస్రాబ్దిలోని కొన్ని వందల సంవత్సరాలు సంస్కృత భాష, వేదాల ఆచార వ్యవహారాలు తమిళాన్ని పక్కకు నెట్టివేశాయి. ఉత్తర భారత దేవుళ్లయిన విష్ణు, శివుడుకు ప్రాధాన్యత పెరిగింది. పాన్ ఇండియా దేవుళ్ల ముందు స్థానిక దేవుళ్లు, దేవతల ప్రాభవం తగ్గిపోయింది. ఆ విగ్రహాలను దేవాలయాల నుంచి బయటకు తెచ్చివేయడం, లేదా తక్కువ స్థాయికి మార్చడమో జరిగింది. అయితే, ఈ పరిస్థితి క్రమేణా మారింది. భక్తి ఉద్యమాలు, నాస్తిక శ్రేణుల ప్రయత్నాలు, బౌద్ధ, జైన తత్వవేత్తల ప్రయత్నాలు ఉత్తర భారతం నుంచి వచ్చిన ఈ మంచు వరదను అడ్డుకునే ప్రయత్నాలు చేశాయి. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం రాజరాజుని నేతృత్వంలో ఆవిర్భవించిన చోళ సామ్రాజ్యం తమిళ సంస్కృతికి, భాషకు తిరిగి పట్టం కట్టింది. వేద సాంప్రదాయాల స్థానంలో దేవాలయాలలో ఆగమ శాస్త్రాలకు ప్రాధాన్యత పెరిగింది. తమిళ భక్తి శ్లోకాలకు దక్షిణ భారతదేశంలో వేదాల స్థాయి గుర్తింపు వచ్చింది. దీనినుండే స్ఫూర్తి పొందిన జస్టిస్ పార్టీ 1930వ దశకంలో తమిళ రాజకీయాల్లో కీలక స్థానానికి చేరింది. అయితే, వేద సంస్కృతి, సాంప్రదాయాలు, సంస్కత భాషను రుద్దడం వంటి అంశాలపై అప్పటి వరకు జరిగిన పోరాటాన్ని జస్టిస్ పార్టీ బ్రాహ్మణులకు, బ్రాహ్మణేతరులకు మధ్య జరిగే పోరాటంగా మార్చింది. రాజకీయంగా కొంత పలుకుబడిని, కొన్ని ప్రావిన్షియల్ సీట్లను జస్టిస్ పార్టీ పొందగలిగినప్పటికీ ఉద్యమాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా తీసుకున్న విధానం వారిని కాంగ్రెస్ పార్టీకి దూరం చేసింది. కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణాధిక్యత కొనసాగుతుండటమే దీనికి కారణం. ఈ కారణంగా వారు బ్రిటిష్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించలేని స్థితికి చేరుకున్నారు. సైమన్ కమిషన్ రాక సందర్భంగా దేశ వ్యాప్తంగా జరిగిన ఆందోళనకు వీరు దూరంగా ఉన్నారు. అదే సమయంలో రైతుల భూ యాజమాన్య హక్కులను అంగీకరించని నాయకత్వ వైఖరి కారణంగా జస్టిస్ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది. దాదాపుగా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలకు, వివక్షకు గురై బయటకు వచ్చిన పెరియార్ తమిళనాడులో స్వాభిమాన ఉద్యమాన్ని ప్రారంభించారు. జస్టిస్ పార్టీ పేరును ద్రవిడార్ కజగంగా మార్చారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం, కుల నిర్మూలన వంటి తక్షణాంశాలతో పాటు దీర్ఘకాలంలో ద్రవిడనాడు (ద్రవిడ దేశం)ను ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఆ తరువాత డిఎంకె ఆవిర్భావం. ఎఐడిఎంకె ఏర్పాటు వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1967 నుంచి ఆ రెండు పార్టీలే తమిళనాట తిరుగులేని శక్తులుగా కొనసాగుతున్నాయి.
తమిళ చరిత్రలోని ఈ ప్రత్యేకతను ఏమాత్రం గుర్తించలేని బీజేపీ తెలుపు ధోవతి కట్టుకుని భుజాల చుట్టూ తుండు చుట్టుకుంటే తమిళుల హృదయాలను గెలవవచ్చని భావిస్తోంది. అదే సమయంలో మారిన పరిస్థితులలో తమిళ హృదయాన్ని అర్థం చేసుకోవడానికి డిఎంకె కష్టపడుతోంది. తమిళ రాజకీయాల్లో ఎప్పుడూ కీలక పాత్ర పోషించే సామాజిక అంశాలతో పాటు ఈసారి ఎన్నికల్లో నిరుద్యోగం, పేదలు, ధనికుల మధ్య అంతరాలు పెరగడం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. అదే సమయంలో బ్రాహ్యణ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడిన అణగారిన వర్గాలకు చెందిన కొందరు ప్రస్తుతం ఉన్నత కులాల మాయాజాలంలో పడ్డారన్నది కూడా ద్రవిడ పార్టీలు తిరస్కరించలేని వాస్తవం. ఒకప్పుడు తమిళ నేలను ఏకం చేసిన లౌకక భావనలు, భాష, సంస్కృతులపై అభిమానం కలగలిసిన తమిళ ఆత్మగౌరవ భావన గడిచిన దశాబ్ద కాలంలో క్షీణించిందన్నది వాస్తవం. గ్రూపుల తగాదాలలో పీకల్లోతు కూరుకుపోయిన ఎఐడిఎంకె తన మనుగడ కోసం బీజేపీపై ఆధారపడాల్సిన స్థితికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో తమిళ అస్తిత్వాన్ని ఆ పార్టీ కాపాడటం ప్రశ్నార్ధకమే.
ఓబీసీ రిజర్వేషన్లలో 3 శాతాన్ని ముస్లిములకు కేటాయిస్తామన్న డిఎంకె హామీ దేశ వ్యాప్తంగా నెలకొన్న మత రాజకీయాల నేపథ్యంలో తమిళనాడులో ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందన్నది వేచిచూడాల్సి ఉంది. ఇది గాకుండా 75శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇస్తామని, హిందువులు చేసే తీర్థ, పుణ్య యాత్రల కోసం 25 వేల నుంచి లక్ష రూపాయలు ఇస్తామని, హిందూ దేవాలయాల పునరుద్ధరణ కోసం రూ.1,000 కోట్లను, చర్చిలు, మసీదుల పునరుద్ధరణ కోసం రూ.250 కోట్లను కేటాయిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. తమిళ అస్తిత్వానికి భూమికలైన అనేక అంశాలు తాజా ఎన్నికల్లో చర్చనీయాంశం కాలేదు. ద్రవిడ పార్టీలు కూడా వాటిని ఎన్నికల ఎజెండాగా మార్చడానికి సిద్ధపడటం లేదు. ఈ నేపథ్యంలో తమిళ ప్రజలు ఎలా స్పందించారన్నది ఆసక్తిదాయకంగా మారింది.
- రాఘవన్ శ్రీనివాసన్