Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రిజర్వేషన్ల వల్లనే ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగాలు రావటం లేదనేది పూర్తిగా మోసపు ప్రచారం. నిరుద్యోగులను ఒకరి పైకి ఒకరిని ఎగదోయటం ద్వారా పాలక వర్గాలు తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించటానికి ఉద్దేశించినది ఈ ప్రచారం. ఎక్కువ మార్కులు తెచ్చుకున్నవారు, చదువులో ముందున్నవారంతా ప్రతిభావంతులు కాదు. దిగువ కులాలకు చెందినవారిలో అత్యధికులు, పై కులాలకు చెందిన పేదలలో కొద్ది మంది, ఆర్థిక స్థోమత లేనివారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. ఆర్థిక స్థితి కలిగినవారు అన్ని వసతులు ఉన్న ప్రయివేటు పాఠశాలలలో తమ పిల్లలను చదివిస్తున్నారు. ఈ విధంగా అన్ని వసతులు, ఆధునిక బోధనా పరికరాలు ఉన్న పాఠశాలలలో చదివినవారిని, ఎటువంటి సదుపాయాలు, తగినంత మంది ఉపాధ్యాయులు కూడా లేని పాఠశాలలలో చదివిన వారిని ఒకే కొలబద్దతో చూడటం ఏ విధంగా సరైనది? చేతిలో రూపాయి లేక పిల్లలకు సరిగా తిండికూడా పెట్టలేని తలిదండ్రులు తమ పిల్లలను వసతులు, ఉపాధ్యాయులులేని ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. ఆర్థికంగా స్థితిమంతులైన వారు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లలో చేర్పిస్తున్నారు. ఎల్‌కేజీకే వేలు, లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తున్నారు. వసతులు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలలో చదువుతున్న వారిలో అత్యధికంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారి పిల్లలు ఉంటున్నారు. అసమాన పరిస్థితులలో చదువుతున్న వీరందరికీ సమానమైన ప్రతిభ ఉంటుందా?
ముందు తరాలలోని తల్లిదండ్రులు విద్యావంతులై ఉంటే తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దటంలో వారు ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తారు. పిల్లలలో ఎక్కువమంది పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను సక్రమంగా అర్థం చేసుకోలేరు. తల్లిదండ్రులు విద్యావంతులైతే ఇంటివద్ద వారికి ఆ అంశాలను వివరించి, అర్థం చేసుకొనేలా చేస్తారు. తమకు తీరికలేకపోతే నెలకు వేలరూపాయలు చెల్లించి ట్యూషన్లకు పంపిస్తారు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులైతే పిల్లలకు ఇంటివద్ద నేర్చుకోవటానికి అవకాశం ఉండదు. ఆర్థికస్థితి అనుమతించదు కాబట్టి ట్యూషన్లకు పంపలేరు. గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతుల ప్రజలకు అటువంటి అవకాశాలు కొరవడ్డాయి. అందువలన వారికి పాఠశాలకు వెలుపల నేర్చుకోవటానికి అవకాశం ఉండదు. కాబట్టి వారి పిల్లలు నేర్చుకోవటంలో వెనుకబడి ఉంటారు. ఈ విధంగా అన్ని విధాలైనటువంటి అవకాశాలు, ఆర్థికస్థితి కలిగిన వారిని, ఏ విధమైన అవకాశాలు లేనివారిని ఒకేగాటన కట్టి, ప్రతిభను గురించి మాట్లాడటం అర్ధంలేని విషయం.
రిజర్వేషన్లు పొందుతున్న తరగతుల విద్యార్థులు ప్రతిభలేని వారని అంటున్నారు. రిజర్వేషన్లు పొందని తరగతుల విదార్థులందరూ ప్రతిభ కలిగివున్నారా? ఇన్ని విధాలైన అనుకూల పరిస్థితులున్నప్పటికీ, అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ అత్తెసరు మార్కులతో పాసవుతున్నవారు ఎందరులేరు? కాలేజీలు, యూనివర్సిటీలు, మెడికల్, డెంటల్, ఇతర కాలేజీలలో లక్షల రూపాయలు పెట్టి సీట్లు కొనుక్కొంటున్న వారు ఎందరులేరు? ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించటం కోసం లక్షల రూపాయల లంచాలు ఇవ్వటం, మంత్రులు, ఇతర పలుకుబడి కలిగినవారి ద్వారా సిఫార్సులు చేయించి ఉద్యోగాలు పొందినవారు ఎందరులేరు? వీరంతా ప్రతిభ ఉన్నవారా? ప్రతిభ ఉంటే కాలేజీలలో సీట్లకోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం లంచాలు ఎందుకు ఇస్తున్నారు? పలుకుబడి కలిగినవారితో సిఫార్సులు ఎందుకు చేయిస్తున్నారు? మరి ఈ విధంగా వీరు కాలేజీలలో సీట్లు, ఉద్యోగాలు పొందటం వలన పై కులాలలోని ప్రతిభకలిగిన విద్యార్థులకు అన్యాయం జరగటం లేదా? రిజర్వేషన్లను వ్యతిరేకించేవారు దీనిని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఈ సీట్లు, ఉద్యోగాలు రిజర్వేషన్లు పొందే కులాల వారికి పోవటం లేదు కాబట్టి వారికేమీ ఇబ్బంది లేదు. అందుకే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నవారు. సామాజికంగా అణచబడిన కులాలపై అణచివేత కొనసాగాలని కోరుకుంటున్నారు. దానికి ప్రతిభను అడ్డం పెట్టుకుంటున్నారు మినహా నిజంగా ప్రతిభ కలిగిన వారికి అన్యాయం జరిగినా వారు పట్టించుకోవటం లేదని పైన చర్చించిన అంశాలు స్పష్టం చేస్తున్నాయి.
ఒక తరానికి రిజర్వేషన్లు ఇచ్చారు. వారు అభివృద్ధి చెందారు. వారి పిల్లలు తిరిగి రిజర్వేషన్లు పొందుతున్నారు. ఒకతరం అభివృద్ధి చెందిన తర్వాత తిరిగి వారి పిల్లలకు, పిల్లల పిల్లలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని కూడా రిజర్వేషన్ల వ్యతిరేకులు వాదిస్తున్నారు. వెనుకబడిన తరగతులకు ఆ జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఉంటాయి. అటువంటప్పుడు వారు ఇతరుల అవకాశాలను కొల్లగొట్టడమేనేది వుండదు కదా! ప్రతిభతో సీటు సంపాదించుకున్నా, రిజర్వేషన్లోనే చూపిస్తున్నారుగానీ... జనరల్‌లో పేర్కొనడంలేదు. వివక్ష, అంటరానితనం కారణంగా వెనుకబడిపోయిన తరగతులకు ప్రత్యేక రక్షణగా రిజర్వేషన్లు వచ్చాయి. రాజ్యాంగాన్ని ఆమోదించేటపుడు 10సంవత్సరాలలో సమాజంలో అంటరానితనాన్ని, అసమానతలను అంతం చేయాలని, ఆ తర్వాత రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రతిపాదించారు. కానీ అంటరానితనాన్ని అంతం చేయటం, సామాజిక అసమానతలను నిర్మూలించటం 70 సంవత్సరాల తర్వాత కూడా సాధించలేకపోయాం. ఈనాటికీ అంటరానితనం, అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. అటువంటపుడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం అంటే దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన తరగతులలోని పరిమిత సంఖ్య ప్రజలు సాధించిన కొద్దిపాటి అభివృద్ధిని కూడా వ్యతిరేకించటమే అవుతుంది.
రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు, ప్రమోషన్లు పొందినవారు సమర్థులు కారా?
ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇస్తున్నారు. ప్రయోషన్లలో కూడా రిజర్వేషన్ల ఇవ్వాలా అని ప్రశ్నించేవారున్నారు. రిజర్వేషన్లు ద్వారా ఉద్యోగాలు, ప్రమోషన్లు పొందినవారికి పనిచేయటం రాదని, వారి వలన పనులు, ప్రభుత్వ కార్యక్రమాలు కుంటుబడుతున్నాయని, అందువలన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వాదించేవారున్నారు. ఈ వాదన పూర్తిగా తప్పు. రిజర్వేషన్లు ద్వారా ఉద్యోగాలు, ప్రమోషన్లు పొందినవారు మిగతా వారి కన్నా పనిలో వెనుకబడినట్లు రుజువు కాలేదు. అనేక రంగాలలో, అనేక సందర్భాలలో ప్రతిభ ఉన్నవారికన్నా, ఎక్కువ మార్కులు తెచ్చుకున్నవారి కన్నా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందినవారు ఎక్కువ సమర్థవంతంగా పని చేస్తున్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి. పై కులాలలో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు చేస్తున్న వారి కన్నా తక్కువ మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు పొందిన వారు ఎక్కువ సమర్థవంతంగా పని చేస్తున్నవారున్నారు. మార్కులకు, ప్రతిభావంతంగా పని చేయటానికి సంబంధంలేదు. పని చేయాలనే దృక్పథం, తన బాధ్యతను నెరవేర్చాలనే పట్టుదల ఉన్నవారు సమర్థవంతంగా పని చేస్తారు. దానికి ప్రతిభతో, మార్కులతో సంబంధం లేదు. అటువంటి ఆలోచనలు లేనివారు మార్కులు సంపాదించటంలో మొదటి స్థానంలో ఉన్నా తన బాధ్యతలను నెరవేర్చటంలో అట్టడుగు స్థానంలో ఉంటారు.
రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పొందినవారు కూడా సమర్థవంతంగా పని చేస్తున్నవారున్నారు. పంచాయితీ వార్డు సభ్యుని స్థాయి నుంచి పార్లమెంటు వరకు రిజర్వేషన్ల ద్వారా ఎన్నికైన వారికన్నా మిగతా వారు సమర్ధవంతంగా పనిచేస్తున్న దాఖలాలేదు. సర్పంచులుగా ఎన్నికైన దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందినవారు చాలా పంచాయితీలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దారు. మండలాలు, జిల్లా పరిషత్‌ల పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తున్నవారున్నారు. రాష్ట్రాలు, కేంద్రంలో కూడా అనేకమంది చట్టసభల సభ్యులుగా, మంత్రులుగా సమర్థంగా పనిచేసినవారున్నారు.
బడా పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు సాగిస్తున్న దోపిడీ పైకి యువత దృష్టి మళ్ళించకుండా చేయటానికి ఈ ప్రచారం తోడ్పడుతున్నది. పై కులాలలోని నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించటానికి, గ్రామాలలోని యువత ఐక్యం కాకుండా చేయటం ద్వారా తమ సామాజిక ఆధిపత్యాన్ని చలాయించటానికి భూస్వాములకు రిజర్వేషన్ల వ్యతిరేక ప్రచారం ఉపయోగపడుతున్నది. దళిత, గిరిజన, వెనుకబడిన కులాలలోని అభివృద్ధి చెందుతున్న కుటుంబాలలోని యువతను చూపించి పై కులాలలోని యువతను రెచ్చగొడుతున్నారు. తమ ఆర్థిక దోపిడీ కొనసాగించటానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా యువతను, ప్రజలను ఐక్యం కాకుండా చేస్తున్నారు.
భారతీయ సమాజంలో ఆస్తులు, అన్ని విధాలైన అవకాశాలలో అత్యధిక భాగం పైకులాల వారి ఆధిపత్యంలో ఉండగా, దానిని గురించి ప్రశ్నించకుండా ఉండడానికీ, దోపిడీ, అణచివేతల నుంచి ప్రజల దృష్టి మళ్ళించటానికే దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు ఉన్న రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లపై సంఘ్ పరివార్ దాడి చేస్తున్నది.
- ఎ. కోటిరెడ్డి