Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల మద్రాస్ హైకోర్టు రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోల ద్వారా ఇచ్చే ఉచిత వరాల వల్ల ప్రజలు సోమరులుగా మారుతున్నారని, ఈ ఉచిత వరాలను అవినీతి పద్ధతిగా పరిగణించాలని వ్యాఖ్యానించింది. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, హామీలు నెరవేర్చుటకు బడ్జెట్లో పెద్ద భాగాలు కేటాయించడం, తద్వారా భవిష్యత్ అవసరాలకు నిధులులేక దీర్ఘకాలంలో రాష్ట్రాల అభివృద్ధి గాలికి వదిలివేయడం జరుగుతుంది. రాజకీయ పార్టీలు తక్షణ ప్రయోజనం కోసం, ఓటర్ల వ్యక్తిగత లబ్ది కోసం సంక్షేమ రాజ్యం ముసుగులో ఓటు బ్యాంకు పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఎన్నికలు అంటేనే నిర్ణిత కాలానికి ఓట్ల ద్వారా ప్రజల ఆమోదం పొందటం. రాజకీయ పార్టీలు స్వాతంత్య్ర ప్రారంభ కాలంలో సామాజిక, ఆర్థిక మార్పుల కోసం నూతన పథకాలు తీసుకరావడం తద్వారా కొద్దో గొప్పో అభివృద్దిని సాధించడం జరిగింది. తర్వాత కాలంలో రాజకీయ పార్టీల హామీలు సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల వైపు మళ్ళాయి. నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు, వైద్య సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు, పాఠశాల భవనాలు, మౌలిక వసతిలు మొదలైన వాటి కోసం కొత్త పథకాలతో హామీలు ఇచ్చేవి. అట్టి పథకాల వల్ల దీర్ఘకాల అభివృద్దికి బాటలు పడ్డాయి. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మొత్తం వ్యవస్థను ప్రభావితం చేసే పథకాలు కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలు పొందే పథకాలకు హామీలు ఇస్తున్నాయి. ప్రస్తుతం ఇది శృతిమించి కనీస అవసరాలు తీర్చే వ్యక్తిగత ప్రయోజన పథకాలు కాక, సౌకర్యాలను, విలాసాలను తీర్చే వ్యక్తిగత ప్రయోజన పథకాలను మ్యానిపేస్టోలో హామీల రూపంలో ప్రజలముందుకు వస్తున్నాయి. సామాజిక భద్రత, కనీస అవసరాలు తీర్చే వ్యక్తిగత పథకాలకు సంక్షేమ రాజ్యంలో ప్రజలందరి ఆమోదం ఉంటుంది. ఉదాహరణకు ఒక రూపాయికి కిలో బియ్యం, రైతు బీమా,12 రూపాయలకే జీవిత భీమా, గృహ నిర్మాణ హామీలు, వృధ్యాప్య పింఛన్లు మొదలైనవి. కానీ ఈ వ్యక్తిగత ప్రయోజనాల పథకాలు శ్రుతిమించి సౌకర్య, విలాస వస్తువులను ఎలక్షన్ హామీలుగా రాజకీయ పార్టీలు తమ మ్యానిపేస్టోలో పేర్కొంటున్నాయి. టివీ సెట్లు, వాషింగ్ మిషన్లు, గ్రైండర్స్, బాలికలకు స్కూటీలు ఇలా అనేక వ్యక్తిగత తాత్కాలిక ప్రయోజన పథకాలను మ్యానిఫెస్టోలో పొందుపరచి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నాయి. గెలిచిన తరువాత హామీల అమలుకు రాష్ట్ర దీర్ఘకాల అభివృద్ధికి ఉపయోగించే వనరులను ఈ హామీలకే కేటాయిస్తూ అభివద్ధిని గాలికోదిలేస్తున్నాయి లేదా హామీలనే గాలికొదిలేస్తున్నాయి. ప్రజలను స్వావలంబికులుగా తయారు చేయాల్సింది పోయి, పరాన్నజీవులుగా తయారు చేస్తున్నాయి. మద్రాసు హైకోర్టు పేర్కొన్నట్లు రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలకు అదే రాజకీయ పార్టీల సొంత ఆదాయం నుంచి 10 శాతం నిధులు వసూలు చేసి ఆ హామీలు తీర్చే విధంగా చట్టం తీసుకు రావాలి. అప్పుడే రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చేటప్పుడు కొంతవరకైనా నియంత్రణను పాటిస్తాయేమో. రాజకీయ పార్టీలు ఇచ్చే ఈ ఉచిత వరాలు అవినీతిగా పేర్కొనాలనే మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు తప్పక ఎలక్షన్ కమిషన్ పరిశీలించాలి. రాజకీయ పార్టీలు ఇచ్చే ఈ హామీలు సాంకేతికంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిలోకి రాకపోవచ్చు, కానీ మద్రాస్ హైకోర్టు చెప్పినట్లు ముమ్మాటికీ ఆ హామీలు అవినీతిగా ఎందుకు చూడకూడదు? ఇది ఒక రకంగా ఓటుకు పరోక్షంగా డబ్బులు ఇవ్వడం కాదా? ఈ విషయాలపై ఇప్పటికే ఉన్న సుప్రీం కోర్టు తీర్పుపై కేంద్రం ఏమి చర్యలు తీసుకున్నట్టు? ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఏ ఏ రాజకీయ పార్టీలను గుర్తించినట్టు? కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఏప్రిల్ 26న కోర్టుకు ఏ రకంగా సమాధానం చెబుతాయో వేచిచూద్దాం. కానీ ఈ ఉచిత వరాలపై (ఎన్నికల హామీలపై) ప్రజా సమూహంలో విస్తత చర్చ జరగాలి. ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో రెండో అభిప్రాయం ఎవరికీ లేనప్పటికీ వాటి వల్ల దీర్ఘకాలిక ప్రయోజనం వాటిల్లేటట్లు ఉండాలి, తద్వారా దీర్ఘకాలంలో సమాజం అభివృద్ధి ఫలాలు అందుకోగలుగాలి. రాజకీయ పార్టీలు తమ ఓట్ల కోసం తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశించి ఇటువంటి హామీలు ఇస్తూ ఉండవచ్చు కానీ ప్రజలు చైతన్యవంతులై ఇలాంటి హామీలను తిరస్కరించాలి. విద్యా, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులకై డిమాండ్ చేయాలి. అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఈ హామీలను కట్టడి చేసే విధంగా ఎన్నికల్లో సంస్కరణలను తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం 1951కి సంస్కరణలు తీసుకువచ్చి ఇటువంటి హామీలకు అడ్డుకట్ట వేయాలి. అప్పుడే దేశం అభివృద్ధిపథంలో ముందుకు నడుస్తూ నిజమైన సంక్షేమ రాజ్యం స్థాపించబడుతుంది.
- జుర్రు నారాయణ
సెల్:9494019270.