Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ''జాతీయ విద్యా విధానం 2020''తో విద్యలో సాంకేతికతను పెంచుతామనీ, రానున్న రోజుల్లో ఆన్లైన్, డిజిటల్ విద్యకు ప్రాధాన్యతనిస్తామనీ తెలియజేస్తోంది. డిజిటల్ విధానం వల్ల విద్యలో నాణ్యత పెరుగుతుందనీ, ప్రపంచ స్థాయి విద్య భారతీయ విద్యార్థులకు చేరువవుతుందనీ ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతున్నారు. కానీ కోవిడ్ అనుభవం ఏంచెపుతోంది? కోవిడ్ మహమ్మారి వల్ల విద్యారంగం కుదేలైంది. దేశ భవిష్యత్తును నిర్ణయించే తరగతి గదులు విద్యార్థులు లేక నేడు వెలవెలబోతున్నాయి. భావి భారత పౌరులు చేలు, చెట్లు, గట్ల వెంబడి తిరుగుతున్నారు. పిల్లల మానసిక స్థితి దిగజారుతున్నది. తల్లిదండ్రుల మనోధైర్యం పట్టు సడలుతున్నది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు గణనీయంగా నమోదవుతున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకునే స్థితిలోలేవు. తల్లిదండ్రులను తమ పిల్లల భవిష్యత్తు అంధకారమయమవుతున్నదన్న ఆవేదన కుంగదీస్తున్నది.
తెలంగాణలో పరిస్థితి: కరోనా విస్తృతం అవ్వడం వల్ల గత సంవత్సరం 2020 మార్చి 16 నుంచి పిల్లలు పాఠశాలలకు దూరమయ్యారు. వార్షిక పరీక్షలు రద్దయ్యాయి. పిల్లలందరూ పై తరగతులకు ప్రమోట్ చేయబడ్డారు. దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం అనంతరం సెప్టెంబర్ 1, 2020 నుండి ఆన్లైన్ విధానంలో తరగతులు ప్రారంభమయ్యాయి. 3 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు డిజిటల్ తరగతుల సమయసారణి రూపొందించి అమలు చేశారు. ''రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ చదువుకు సౌకర్యాలు కలిగి ఉన్నారు, మిగిలిన 30శాతం మంది విద్యార్థులకు ఉపాధ్యాయుల సహకారంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం ద్వారా ఆన్లైన్ విద్యలో భాగస్వాములను చేస్తున్నామని'' ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ వాస్తవంగా విద్యార్థులను ఆన్లైన్ తరగతులకు అనుసంధానం చేయడానికి ఉపాధ్యాయులు పడ్డ తిప్పలు అనన్య సామాన్యమైనవి. టీవీ, సెల్ ఫోన్, ఇంటర్నెట్, డిష్ కనెక్షన్ వంటి సౌకర్యాలులేని గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులను.. ఈ సౌకర్యాలు కలిగిన ఇతర విద్యార్థులకు అనుసంధానం చేయడం కష్టంతో కూడుకున్న పనే అయ్యింది. సామాజిక అంతరాలు, అంటరానితనం, కులం, మతం వంటి వైరుధ్యాలు ఉపాధ్యాయులకు సైతం చికాకు తెప్పించాయి. కేరళ ప్రభుత్వం తరహాలో ఆన్లైన్ విద్యా సౌకర్యాలు లేని పిల్లల్ని 'పంచాయతీ భవనాల'లో తరగతులు వినేలా మన రాష్ట్రం చర్యలకు పూనుకోలేదు. సౌకర్యాల కల్పన అనేది పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారుల బాధ్యతగానే భావించింది తప్ప ప్రభుత్వమే సదుపాయాలను కల్పించాలనే బాధ్యతను విస్మరించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డిడి యాదగిరి, టిశాట్ ఛానళ్లలో ప్రసారమయ్యే రికార్డెడ్ ఆన్లైన్ తరగతులను వీక్షిస్తే.. ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు వారివారి ధోరణుల్లో జూమ్ యాప్ ద్వారా, వర్చువల్ ద్వారా పిల్లలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాయి. అయితే ఆన్లైన్ ద్వారా బోధించే తరగతులు పిల్లల భాగస్వామ్యానికి ఆస్కారమిచ్చేలా లేకపోవడం, పిల్లలు ఆసక్తిని కనబరచకపోవడం, పాఠాలు ఆకర్షణీయంగా.. విద్యార్థులను ఆకట్టుకునేలా ఉండకపోవడం, బోధనాభ్యసన ప్రక్రియల్లో లోపాలు, మూసధోరణులు వంటి పలు కారణాల వల్ల ఆన్లైన్ విద్య విఫలమైందనే చెప్పాలి.
ప్రత్యక్ష బోధన ప్రారంభించడం: వివిధ ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, మేథావులు, విద్యాభిమానులు, తల్లిదండ్రుల కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం 2021, ఫిబ్రవరి 1 నుండి పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధనకు అవకాశం కల్పించింది. ఉపాధ్యాయులను 3 రోజుల ముందుగానే పాఠశాలలకు పంపించి తరగతి గదుల శానిటైజేషన్, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు, పాఠశాల పరిశుభ్రత మొదలైనవి పూర్తయ్యాకే విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. దాదాపు 25 రోజుల అనంతరం అనగా ఫిబ్రవరి 26 నుండి 6 నుంచి 8 తరగతులను కూడా ప్రారంభించారు. అయితే 9 10 తరగతులను ప్రారంభించిన సందర్భంగా తీసుకున్న జాగ్రత్తలు 6 నుంచి 8 తరగతులను ప్రారంభించినప్పుడు తీసుకోలేదు. విద్యార్థుల సంఖ్య అధికమై భౌతిక దూరానికి అవకాశం లేకపోవడం, మరుగుదొడ్లు శుభ్రపరచడానికి నిర్వాహకులను విధుల్లోకి తీసుకోకపోవడం, వివిధ ప్రాంతాల నుంచి సంక్షేమ హాస్టళ్లకు, రెసిడెన్షియల్ పాఠశాలలకు విద్యార్థులు హాజరవడం, అప్పటికే వారిలో లక్షణరహితమైన కోవిడ్ వ్యాపించి ఉండడం తదితర కారణాల వల్ల ఇతర విద్యార్థులకు, కొంతమంది ఉపాధ్యాయులకు కూడా కరోనా సోకింది. ప్రభుత్వం దూరాలోచనతో కాకుండా రాజకీయ లక్ష్యంతోనే ప్రాథమికోన్నత తరగతులను హడావుడిగా ప్రారంభించిందన్న అనుమానాలు నిజాలని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీడియా అత్యుత్సాహం ప్రదర్శించి గోరంతను కొండంతలుగా చేసి చూపించింది. ఫలితంగా ప్రభుత్వం.. పాఠశాలలను తిరిగి మూసేసింది.
విద్యా వ్యవస్థ గాడిలో పడుతుందనుకున్న తరుణంలో మళ్లీ పాఠశాలలు మూతబడ్డాయి. కోవిడ్ కాలంలో విద్యార్థుల మధ్య అంతరాలు తారాస్థాయికి చేరాయి. ధనిక, పేద అనే ఆర్థిక అసమానతలు పొడసూపాయి. స్మార్ట్ఫోన్ కలిగిన విద్యార్థులు, లేని విద్యార్థులను ఎగతాళి చేశారు. కొంతమంది విద్యార్థులు తమ స్థాయికి మించి తల్లిదండ్రులతో గొడవపడి అప్పులు చేసి మరీ స్మార్ట్ ఫోన్లు కొనిపించుకున్నారు. ఫోన్ కొనియ్యకపోతే ప్రాణాలు తీసుకుంటామంటూ బెదిరింపు ధోరణులు సైతం కనబడ్డాయి. విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించింది. ఫోన్లకు బానిసలయ్యారు. ఆన్లైన్ తరగతుల పేరిట మొబైల్ ఫోన్ల ఉపయోగించడం... క్లాసులు చూడడం మానేసి ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియాలో చిట్ చాట్లలో బిజీ అయ్యారు. అశ్లీలమైన దృశ్యాలు, అసభ్యకరమైన వీడియోలు చూస్తూ పెడ ధోరణుల వైపు పయనిస్తున్నారు. భౌతికమైన ఆటలను వదిలేసి ఆన్లైన్లోనే సమయం గడపడానికి పరిమితమవుతున్నారు. మౌనం, ఒంటరితనం నిత్యకృత్యమయ్యాయి. సామాజిక సంబంధాలపై దుష్ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లల మానసిక ధోరణి, ప్రవర్తనలో చెడు లక్షణాలు అలవడ్డాయి. చదివిన చదువంతా మర్చిపోయారు. మానసిక సంఘర్షణలు ఎక్కువయ్యాయి. తమ పిల్లల భవిష్యత్తు పట్ల తల్లిదండ్రుల ఆందోళన తీవ్రమైంది. అయితే తమ పిల్లలను ఈ విపత్తునుండి మళ్ళించగలగడం తల్లిదండ్రులకు అసాధ్యమైంది. క్రమశిక్షణను నేర్పగల, తమ బిడ్డల భవిష్యత్తు మార్చగల శక్తి కలిగిన వారు ఉపాధ్యాయులు మాత్రమే అని కోవిడ్ నిరూపిస్తోంది. ఈ అనుభవం చాలదా కేంద్రం చెపుతున్న డిజిటల్ విద్యావిధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి.
మన విద్యా విధానంలో విపరీతమైన అంతరాలున్నాయి, అసమానతలున్నాయి. అంతరాలను తొలగించకుండా, అసమానతలను రూపుమాపకుండా విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామనడం అత్యాశే అవుతుంది. డిజిటల్ విధానంలో తరగతుల నిర్వహణ, బోధనలో సాంకేతికతను వినియోగించడం, అంతర్జాతీయ స్థాయి విద్యా విధానం తీసుకొస్తామని ప్రగల్భాలు పలకడం 'అందని ద్రాక్ష చందమే' అవుతుంది. 1964లో నియామకమైన కొఠారి కమిషన్ మొదలు నేటి జాతీయ విద్యా విధానం-2020 వరకు అన్ని కమిషన్లు చెప్పినది ఒకటే.. విద్యకు జీడీపీలో కనీసం 6శాతం నిధులు కేటాయించాలనీ. కానీ ఇప్పటివరకు ఏనాడు విద్యకు సరైన స్థాయిలో కేటాయింపులు లేవు. నిధులు విదిల్చకుండా విద్యావిధానంలో పెనుమార్పులు ఎలా సాధ్యం? ఇక ఉపాధ్యాయుల ప్రత్యక్ష బోధనకు మించిన ప్రత్యామ్నాయం లేదని కోవిడ్ పరిస్థితులు నిరూపిస్తున్నాయి. ఇది ప్రభుత్వాలు గమనించాలి.
- వరగంటి అశోక్
సెల్:9493001171