Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు గమనించిన తర్వాత తలెత్తిన ప్రశ్న ఇది. నిన్నటి వారణాసి జిల్లా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశం ఆ ఆందోళనను మరింత బలపర్చేదిగా ఉంది. వారణాసి కోర్టు కథ స్థూలంగా ఇది.
స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ మహేశ్వరుడి తరఫున విజయ శంకర్ రస్తోగి వారణాసి జిల్లా న్యాయస్థానంలో కేసు వేశాడు. కాశీ విశ్వేశ్వరాలయం ప్రాంగణంలో ఉన్న మసీదు స్థలం కూడా హిందువులకు చెందినదేనని ఆదేశాలివ్వాలన్నది అతని పిటిషన్ సారాంశం. దీన్నే జ్ఞానవాపి మసీదు వివాదంగా గత కొన్ని దశాబ్దాలుగా సంఘపరివారం పెంచి పెద్దది చేశాయి. పాలంపూర్‌లో జరిగిన బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో అయోధ్య, మధుర, కాశీల్లో సో కాల్డ్ హిందూ దేవాలయ ప్రాంగణాల్లో ఉన్న ముస్లిం నిర్మాణాలను కూలగొట్టటానికి దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని తీర్మానించింది. ఈ నేపథ్యంలోనే నాటి బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎల్ కె అద్వానీ రథయాత్ర ప్రారంభించాడు. తదనంత పరిణామాల మొదలు అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం, 2019లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వరకూ దేశాన్ని అతలాకుతలం చేసిన పరిణామాలు మన తాజా జ్ఞాపకాలే.
అద్వానీ రథయాత్ర సందర్భంగా తలెత్తిన దుమారాన్ని అడ్డుకోవటానికి, భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి పార్లమెంట్ 1991లో ప్రార్థనా స్థలాల (ప్రత్యేక అంశాలు) చట్టం ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం దేశంలో ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాలైనా 1945 ఆగస్టు 15 నాటికి ఏ స్వరూప స్వభావాలతో ఉన్నాయో నాటి యథాతథ స్థితిలో కొనసాగాలి. వాటి యాజమాన్యం గురించిగానీ, మరే ఇతర విషయాల గురించిగానీ దేశంలో ఏ న్యాయస్థానంలోనూ కేసులు వేయటానికి అవకాశం లేదు. అప్పటికే బాబ్రీ మసీదు వివాదం న్యాయస్థానంలో శతాబ్దాల తరబడి నలుగుతూ ఉండటం, రాజ్యాంగం ఆదేశించిన లౌకిక స్వభావాన్ని పక్కన పెట్టి పాలక ప్రభుత్వాలు అడపాదడపా తమ రాజకీయ అవసరాల కోసం ఈ వివాదంలో వేళ్లు పెట్టటం వంటి పరిణామాలు, వాటి పర్యవసానాల నేపథ్యంలో నాటి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆమోదించాల్సి వచ్చింది. ఈ చట్టం భారత దేశపు లౌకిక స్వభావాన్ని కాపాడే చట్టమని కూడా గత సంవత్సరం సుప్రీం కోర్టు అయోధ్య వివాదంలో ఇచ్చిన తీర్పులో ప్రస్తావించింది.
ఇదిలా ఉండగా మార్చి 2020లో బీజేపీ అధికార ప్రతినిధి అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ 1991నాటి ప్రార్ధనా స్థలాల చట్టం రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులను ఉల్లంఘిస్తోందనీ, ఈ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు. అంతేకాదు. ఈ చట్టం భారతదేశపు లౌకిక స్వభావాన్ని, రాజ్యాంగ పీఠికను కూడా ఉల్లంఘించేదిగా ఉందని ఆయన తన పిటిషన్లో వాదించాడు. ఇదే చట్టం భారతదేశపు లౌకిక స్వభావాన్ని పరిరక్షించే సాధనంగా ఉందని 2019లో సుప్రీంకోర్టు ప్రకటించిన విషయాన్ని పైన ప్రస్తావించుకున్నాం. మరి సుప్రీం కోర్టు నాడు భావించిన లౌకిక స్వభావానికి, అశ్వనీకుమార్ ప్రతిపాదిస్తున్న లౌకిక స్వభావానికీ మధ్య ఉన్న వైరుధ్యమేమిటో ప్రజలో అర్థం చేసుకోవాలి. ఇదే తరహా పిటిషన్‌ను 2020లో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా దాఖలు చేశాడు.
బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏదైనా ఈ తరహా రాజకీయ లక్ష్యాల కోసం దేశ ప్రజలను ముక్కలు చేసే దిశగా సాగుతున్న దరఖాస్తుల దావానలాన్ని నిలువరించేందుకు చర్యలు తీసుకునేది. గత ఏడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా నేడు న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తి ప్రశ్నార్ధకమైంది. కాబట్టే త్వరలో పదవీ విరమణ చేయబోతున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే ఈ అర్థం లేని వ్యాజ్యాలను విచారణ నిమిత్తం స్వీకరించటమే కాక పిటిషన్లో ఫిర్యాదుదారులు లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే 2019లో ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో బోబ్డే కూడా సభ్యుడే. ముప్పై ఏండ్ల తర్వాత ఓ చట్టం యొక్క రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ నిస్సందేహంగా కొట్టివేయదగ్గది. కానీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తే ఈ పిటిషన్లను విచారణకు చేపట్టడం ఆశ్చర్యకరం. ఆందోళనకరం. అభ్యంతరకరం.
ఈ పిటిషన్‌లోని కక్షిదారు (బీజేపీ అధికార ప్రతినిధి)కు ఉన్న రాజకీయ నేపథ్యం, బహిరంగ సమర్థింపు నేపథ్యంలో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ దావా వేసినట్లు భావించాలి. ఈ పిటిషన్లో ప్రతిపాదించిన రాజ్యాంగపు ప్రాధమిక హక్కులన్నీ 370 అధికరణం రద్దు సందర్భంలో దాఖలైన వందలాది పిటిషన్లలో కూడా ప్రస్తావించబడ్డాయి. కానీ ఆయా సందర్భాల్లో ఇదే సుప్రీం కోర్టు పిటిషన్‌దారులను దిగువనున్న న్యాయస్థానాలను ఆశ్రయించమని చెప్పింది. కానీ ఈ విషయంలో మాత్రం పిటిషన్ వచ్చిందే తడువుగా అడ్మిట్ చేసుకుని విచారణ ప్రారంభించింది. ఈ ప్రవర్తన అనుమాస్పదమనటాన్ని ఎవ్వరూ అభ్యంతరపెట్టబోరు. అత్యంత గౌరవనీయులైన వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు కలిగిన వారు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో ఉపయోగించిన భాష చూస్తే ఈ వ్యక్తులను గౌరవనీయులని మనం పరిగణించాలా వద్దా అన్న సంశయం కూడా తలెత్తుతుంది.
ఈ నేపథ్యంలో వారణాసి కోర్టు ఆదేశాలను పరిశీలించాలి. జ్ఞానవాపి మసీదు ప్రాంగణం హిందువులదేనంటూ దాఖలైన పిటిషన్లో అర్జీదారులు ఈ ప్రాంగణంలో మసీదు స్థానంలో దేవాలయాన్ని నిర్మించేందుకు అనుమతించాలని కోరారు. కాశీ విశ్వనాధ ఆలయంలో ఓ భాగాన్ని కూల్చి అక్కడ మసీదు కట్టారన్నది సంఫ్‌ుపరివార్ ఆరోపణ. ఈ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకూ మసీదు ప్రాంగణంలో ముస్లింలు ప్రార్థనలు జరపకుండా ఆంక్షలు విధించాలని కూడా అర్జీదారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా ఇదే ఆరోపణ చుట్టూ ఉత్తరప్రదేశ్ రాజకీయాలు తిరుగుతూ వచ్చాయి. ఈ సంవత్సరం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలకు చట్టపరమైన ప్రాధాన్యత కంటే రాజకీయ ప్రాధాన్యతే ఎక్కువగా ఉంది.
ఈ అర్జీలో ఉన్న విషయాలు, ముందుకు తెచ్చిన వాదనలు, కోరుతున్న కోరికలు అన్నీ కలిపి చూస్తే అయోధ్య వివాదంలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ సంఫ్‌ుపరివార్ చివరకు అయోధ్య వివాదాన్ని తమ డిమాండ్లకు అనుగుణంగా పరిష్కరించకపోతే దేశం అతలాకుతలమవు తుందన్న అభిప్రాయాలను దేశ విదేశాల్లో చర్చకు పెట్టిన క్రమం గుర్తుకొస్తుంది.
కోర్టు ఇచ్చిన ఆదేశంలో ఏకంగా మసీదు పునాదుల్లో హిందూ దేవాలయ శకలాలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని పరిశీలించాలని పురావస్తుశాఖను కోరింది. అంతేకాదు. అటువంటి హిందు ఆలయ నిర్మాణాన్ని పోలిన నిర్మాణం ఉంటే దాని విస్తృతి, పరిధి, వైశాల్యంలతో పాటు ఏ హిందూ దేవుడిని పూజించే నిర్మాణమో కూడా అంచనా వేయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశంలోనే పిటిషన్లో ఉన్న వాదనలను బేషరతుగా అంగీకరించటమే కాక కేసు నిర్వహణకు ప్రాతిపదికగా పరిగణించటానికి సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. ఇక్కడ మరో కిటుకు కూడా ఉంది. వారణాసి జిల్లా కోర్టులో వేసిన పిటిషన్ చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఉన్నత న్యాయస్థానంలో అసలు ఈ పిటిషన్ చట్టబద్ధమా న్యాయబద్దమా కాదా తేలక ముందే జిల్లా న్యాయస్థానం ఈ విధంగా ముందడుగు వేయటం గమనిస్తే ఈ పిటిషన్ వెనక, న్యాయస్థానపు హడావుడి ఆదేశాల వెనక న్యాయపరమైన కోణాలకంటే రాజకీయ కోణాలు, సంఫ్‌ుపరివార్ మార్క్ రాజకీయాలే ప్రధానంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో రానున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల రణరంగంలో సంఫ్‌ుపరివార్ శక్తులు మరింతగా బరితెగించి వ్యవహరించ నున్నాయి.
కొండూరి వీరయ్య
సెల్:8971794037