Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలలో 2021-22 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆర్థికశాఖామాత్యులు తన్నీరు హరీష్‌రావు ప్రసంగ పాఠంలో పాఠశాల విద్య అభివృద్ధి కోసం నాలుగు వేల కోట్లతో వినూత్న పథకాన్ని ప్రవేశపెడ్తున్నామని ప్రకటించారు. 2021-22 సంవత్సరం బడ్జెట్లో రెండు వేల కోట్లు, 2022-23 సంవత్సర బడ్జెట్లో మరొక రెండు వేల కోట్లతో పాఠశాల విద్యను అభివృద్ధి చేస్తామన్నారు. కౌన్సిల్లో నేను ఈ పథకాన్ని స్వాగతించాను.
వినూత్న పథకం విధివిధానాలను రూపొందించుటకు విద్యాశాఖామాత్యులు పి.సబితా ఇంద్రారెడ్డి, ఆర్థికశాఖామాత్యులు తన్నీరు హరీశ్‌రావు, మున్సిపల్, ఐ.టి. శాఖామాత్యులు కల్వకుంట్ల తారకరామారావు, పంచాయతీరాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావులతో కమిటీ వేసినట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో 2019-20 యుడైస్ లెక్కల ప్రకారం 40,901 పాఠశాలలున్నాయి. ఇందులో 10,503 ప్రయివేటు పాఠశాలలు. వీటిలోనే 32,24,852మంది విద్యార్థులు చదువుతుండగా, ప్రభుత్వ నిధులతో నిర్వహించబడే 30,398 పాఠశాలల్లో 27,00,921 విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలంటే, ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గిరిజన సంక్షేమ, కెజిబివి, మోడల్ స్కూల్స్, ఐదు రకాల రెసిడెన్షియల్ స్కూల్స్, తాత్కాలిక నివాస ప్రాంత స్కూల్స్ కలిపి. గత ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ప్రయివేటు స్కూళ్లలో పెరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ఆరు విద్యా సంవత్సరాలలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూనే వస్తుంది. కొత్తగా ఆరు వందలకు పైగా గురుకులాలు ప్రారంభించినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. 6 నుంచి 10వ తరగతి వరకు కొద్దిగా పెరుగుదల కన్పించినప్పటికీ, ప్రాథమిక తరగతులు 1 నుంచి 5 వరకు వేగంగా తగ్గుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, మండల పరిషత్ యాజమాన్యంలోనే 18,230 ప్రాథమిక పాఠశాలలున్నాయి. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 1467 ప్రాథమిక పాఠశాలలు, 297 ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలున్నాయి. మొత్తం 19,984 ప్రభుత్వ నిధులతో నిర్వహించబడే ప్రాథమిక పాఠశాలలున్నప్పటికీ, ప్రాథమిక తరగతులు (1 నుంచి 5 వరకు) చదివే విద్యార్థులు 60శాతం పైగా ప్రయివేటు పాఠశాలల్లోనే చదువుచున్నారు. నూతనంగా విస్తరిస్తున్న నగరాలు, పట్టణాలలో తప్ప, మిగతా ప్రాంతాలలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నివాస ప్రాంతాలలోనే ఉన్నాయి. ఇంటి ప్రక్కన ప్రభుత్వ బడివున్నప్పటికీ, తమ సంపాదనలో అధిక భాగాన్ని వెచ్చించి స్కూలు బస్సులో గానీ, ఆటోలో గానీ దూరంగా ఉన్న ప్రయివేటు బడికి పిల్లలను పంపిస్తున్న దిగువాదాయ వర్గాల తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఈ పరిస్థితికి కారణాలను ముందు విశ్లేషణ చేసుకుంటే పాఠశాల విద్య 'వినూత్న పథకము' ఎలా ఉండాలో నిర్ణయించుకోవచ్చు. మార్చి చివరి వారంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, తరగతి గదుల రిపేర్లు, టాయిలెట్స్, ప్రహరీ గోడలు, ఫర్నిచర్ మొదలగు వివరాలు తెప్పిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు పంపిన సమాచారాన్ని మండల విద్యాధికారులు 50శాతం, జిల్లా విద్యాధికారులు 20శాతం క్రాస్ చెక్ చేయాలని ఆదేశించారు. సరే సమాచారాన్ని క్రోడీకరించి, ఈ సంవత్సరం కేటాయించే రెండువేల కోట్లతో తరగతి గదులు, టాయిలెట్స్, ప్రహరీ గోడలు నిర్మించి, ఫర్నిచర్ ఏర్పాటు చేస్తే తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారా? చేర్పించరనేదే అనుభవం చెప్తున్నది. మరేంచేయాలి?
తెలంగాణలో 80శాతం బాల, బాలికలను మూడు సంవత్సరాలు నిండగానే కెజీ తరగతులలో చేర్పిస్తున్నారు. తొలుత చేయవలసింది, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (కెజి) తరగతులు, ఇంగ్లీషు మీడియం సమాంతరంగా ప్రారంభించాలి. పూర్వ ప్రాథమిక తరగతుల బోధనకు అదనపు ఉపాధ్యాయులను నియమించాలి. వీరికి మధ్యాహ్న భోజనం, దుస్తులు, స్త్రీ, మహిళా సంక్షేమశాఖ నుంచి మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల సంఖ్య ఆధారంగా బడ్జెట్‌ను విద్యా శాఖకు బదిలీ చేయాలి. ఒకేసారి రాష్ట్రంలోని 19,984 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు, ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం సాధ్యం కాకపోవచ్చు. మండలము యూనిట్‌గా జనాభా అధికంగా ఉన్న మండలాలలో 20 పాఠశాలలు, మధ్యస్థంగా ఉన్న మండలాలలో 15 పాఠశాలలు, తక్కువ జనాభా ఉన్న మండలాలలో 10 పాఠశాలల చొప్పున పదివేల ప్రాథమిక పాఠశాలల్ని ఎంపిక చేసి, పైన పేర్కొన్న విధంగా అభివృద్ధి చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటనలో పదివేల ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులు సృష్టించి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 4300 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులున్నాయి. ఇంక 5700 పోస్టులు మంజూరు చేస్తే సరిపోతుంది. ఎంపికలో అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలలుండే విధంగా చూసుకోవాలి. వినూత్న పథకం ద్వారా చేసే అభివృద్ధి ఈ ఎంపిక చేసిన ప్రాథమిక పాఠ శాలల్లోనే జరగాలి. ఒక సంవత్సరంలోనే పదివేల పాఠశాలల్ని అభివృద్ధి చేయటం సాధ్యం కాకపోతే, 2021-22లో ఐదు వేలు, 2022-23లో మరొక ఐదువేలు ఎంపిక చేసి అభివృద్ధి చేయాలి. పాఠశాల విద్యలో వినూత్న పథకము ప్రాథమిక పాఠశాలల అభివృద్ధితోనే ప్రారంభం కావాలి.
గ్రేటర్ హైదరాబాదును ప్రత్యేకంగా చూడాలి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు వస్తాయి. ఈ మూడు జిల్లాలలోనే 21,10,408మంది విద్యార్థులు పాఠశాల విద్యలో ఉన్నారు. మిగిలిన 30 జిల్లాలలో 39 లక్షల మంది విద్యార్థులున్నారు. పై మూడు జిల్లాలలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 4,67,649 మంది విద్యార్థులుంటే, ప్రయివేటు పాఠశాలల్లో 16,42,759 మంది విద్యార్థులున్నారు. అంటే 78శాతం ప్రయివేటులోనే చదువుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంటు ఎక్కువగా ఉన్న పాఠశాలలు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తక్కువగా ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం, హైదరాబాదు జిల్లా జనాభా 39,43,323, ప్రభుత్వ పాఠశాలలు 690, ఎయిడెడ్ పాఠశాలలు 245 మాత్రమే ఉన్నాయి. మేడ్చల్ జిల్లా జనాభా 24,40,074, ప్రభుత్వ పాఠశాలలు 562, రంగారెడ్డి జిల్లా జనాభా 24,46,269, ప్రభుత్వ పాఠశాలలు 1463 మాత్రమే ఉన్నాయి. వికారాబాదు జిల్లా జనాభా 9,27,140, ప్రభుత్వ పాఠశాలలు 1117, నారాయణపేట జిల్లా జనాభా 5,66,874, ప్రభుత్వ పాఠశాలలు 534, నల్లగొండ జిల్లా జనాభా 16,18,416, ప్రభుత్వ పాఠశాలలు 1663, వరంగల్ అర్బన్ జిల్లా జనాభా 10,80,867, ప్రభుత్వ పాఠశాలలు 609, వరంగల్ రూరల్ జిల్లా జనాభా 7,18,537, ప్రభుత్వ పాఠశాలలు 726 ఉన్నాయి. నగరీకరణ, పట్టణీకరణ గత 20 సంవత్సరాల నుంచి వేగవంతమైంది. ఆ క్రమములోనే నగరాల, పట్టణాల జనాభా వేగంగా పెరుగుతుంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలో జనాభా పెరుగుతదల కనుగుణంగా కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్ని ప్రారంభించలేదు. గ్రేటర్ హైదరాబాదు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ నగరాలలో కొత్తగా ఏర్పడిన బస్తీలలో ప్రభుత్వ పాఠశాలల్ని ఏర్పాటు చేయాలి. నల్లగొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాదు పట్టణాలలో కూడా కొత్తగా ఏర్పడిన బస్తీలలో కొత్త బడులు ప్రారంభించాలి.
ఎయిడెడ్ పాఠశాలలన్నీ నగరాలు, పట్టణాలలోనే ఉన్నాయి. 2004 నుంచి ఎయిడెడ్ విద్యా సంస్థలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవటం వలన ఈ పాఠశాలల్లో విద్యార్థుల నుండి ట్యూషన్ ఫీజులు వసూలు చేసి ప్రయివేటుగా ఉపాధ్యాయులను నియమించుకుంటున్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీకి అనుమతించాలి. యాజమాన్యాలు అంగీకరిస్తే ఎయిడెడ్ పాఠశాలలను స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేయాలి. హైదరాబాదు, వరంగల్ అర్భన్ జిల్లాలలో ఇది తప్పనిసరి అవసరం. ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషు మీడియం సమాంతరంగా ఏర్పాటు చేయాలి. కంప్యూటర్ విద్యను అమలు చేయాలి. గ్రంధాలయం కూడా ఏర్పాటు చేయాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని పాఠశాలలో విద్యార్థుల ఎన్రోల్మెంటుకు అనుగుణంగా నియమించాలి.
సంక్షేమ పథకాల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో 77శాతం కుటుంబాలకు కిలో రూపాయి బియ్యం అందుతున్నాయి. ఈ కుటుంబాలన్నీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయి. 23శాతం కుటుంబాలు మాత్రమే దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నాయి. ఈ 23శాతం కుటుంబాలకు తమ పిల్లలను ఫీజులు చెల్లించి ప్రయివేటు పాఠశాలల్లో చదివించే స్తోమత ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో 53శాతం కుటుంబాలు విద్యార్థులను ప్రయివేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. అంటే 30శాతం కుటుంబాలు తగిన ఆదాయాలు లేకున్పప్పటికీ ప్రయివేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివిస్తూ, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్ని తగు రీతిలో అభివృద్ధి చేస్తే తల్లిదండ్రులకు ఆ బాధ భారం తగ్గుతుంది.
రాజ్యాంగ లక్ష్యాలకనుగుణంగా విద్యనందించటం నేటి తక్షణావసరంగా ఉన్నది. మన రాజ్యాంగంలో క్రమంగా భారత సమాజంలోని ఆర్థిక, సామాజిక అంతరాలను తొలగించే విధంగా పాలనా విధానాలుండాలని పేర్కొన్నారు. కానీ, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 71సంవత్సరాలు గడిచినప్పటికీ, ఆర్థిక, సామాజిక అంతరాలు పెరిగాయే తప్ప, తగ్గలేదు. ఆర్థిక, సామాజిక అంతరాలను తగ్గించే ప్రధాన సాధనం విద్య. దేశంలోని బాల, బాలికలందరికీ ఒకే రకమైన విద్యను ఒకేచోట అందించినప్పుడు అంతరాల తొలగింపునకు అవసరమైన భూమిక ఏర్పడుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన ప్రకారం తెలంగాణ బాల, బాలికలందరూ ఒకే రకమైన బడులలో చదువుకునేటట్లు చేయవలసిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. విద్యారంగంలో చేపట్టే వినూత్న పథకం పై లక్ష్యానికి అనుగుణంగా అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 'వినూత్న పథకం' అమలుపై ముసాయిదా విడుదల చేసి విస్తృతంగా అభిప్రాయాలు స్వీకరించాలి.
అలుగుబెల్లి నర్సిరెడ్డి