Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కైలాసంలో శివుడు తపస్సు చేసుకుంటున్నాడు. చాలా కాలం నుంచి ఆయన తపస్సులోనే ఉన్నాడు. పార్వతికి పొద్దుపోవటం లేదు. ఆ మధ్యే లక్ష్మి, సరస్వతితో కలసి భూలోకం వెళ్ళివచ్చింది. మరోసారి భూలోకయాత్ర చేద్దామంటే కరోనాకు భయపడి వారిద్దరూ భూలోకం రాము గాక రామని తేల్చేశారు. ఈ మధ్యకాలంలో భూలోకంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని బాగా ఉత్సుకతలో ఉండగా...
''నారాయణ, నారాయణ'' అంటూ ప్రవేశించాడు నారదుడు.
నారదుడిని చూడగానే ప్రాణం లేచొచ్చింది పార్వతికి.
''రా నారదా! ఏమి విశేషాలు?'' అంటూ ఉబలాటం చూపింది.
''ఏమున్నాయి తల్లీ? భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభంజనం చాలా తీవ్రంగా ఉంది. ప్రజలు అల్లాడుతున్నారు. పాలకులు యథావిధిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. కరోనాకు పక్షపాతం ఉంది! దాని ప్రభావం ఎక్కువగా కష్టజీవులపైనే పడుతున్నది!'' అన్నాడు నారదుడు బాధతో.
''ప్రకృతి వైపరీత్యాలకు ఎలాంటి భేదాభావాలు, పక్షపాతాలు ఉండవు నారదా! మానవుడే తన చర్యల ద్వారా పక్షపాతం కల్పిస్తాడు. నదికి వరద వచ్చినప్పుడు ధనవంతుడు, పేదవాడు వరదకు ఎదురుగా నిలబడితే ఇద్దరూ కొట్టుకుపోతారు! అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఐతే ధనవంతుడు ఏడంతస్తుల మేడ మీదా, పేదవాడు పూరిగుడిసెలోనూ ఉంటే పూరిగుడెసె కొట్టుకుని పోతుంది. ఏడస్తులమేడ నిలదొక్కుకుంటుంది. కరోనా కూడా అంతే. కష్టజీవులు తమ ఉపాధి కోల్పోతే పెట్టుబడిదారులు, లాభాలు పోగేసుకుంటున్నారు!'' వివరించింది పార్వతి.
''నిజమే తల్లీ!'' అంగీకరించాడు నారదుడు.
''ఇంకేమి విశేషాలు నారదా?'' మళ్ళీ అడిగింది పార్వతి.
''తమిళ తలైవా రజనీకాంత్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారు తల్లీ!'' అన్నాడు నారదుడు.
''రజినికాంత్ సూపర్‌స్టార్ కదా!'' అంటూ నవ్వింది పార్వతి.
''ఎందుకు తల్లీ? ఇంతగా నవ్వుతున్నారు! అవార్డు ఇవ్వటంలో ఏదైనా మతలబు ఉందా?'' అడిగాడు నారదుడు.
''మతలబు లేకేమి నారదా! కావల్సినంత ఉంది! కళారంగానికి ఎంతో సేవ చేసినందుకే ఈ అవార్డు ఇస్తున్నామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. కళారంగానికి ఆయన చేసిన సేవలేమిటో నేను ఇంతకు ముందే చెప్పాను కదా! ప్రజల సమస్యలపైనగానీ, వారిని చైతన్యం చేసే సినిమాలుగానీ ఆయన చేయలేదు. ఆయన కెరీర్ మొదట్లో చేసిన రెండు, మూడు సినిమాలూ బాలచందర్ ఖాతాలోనే పడతాయి. అంతకు మించిన సేవ ఏమైనా ఉందా? ఆయనకు గొప్ప ఫాన్ పాలోయింగ్ ఉన్న మాట వాస్తవమే. ఆ ఫాన్సును బుట్టలో వేసుకునేందుకే తమిళ ఎన్నికలు జరుగుతుండగానే బీజేపీ ప్రభుత్వం అవార్డు ప్రకటించింది'' అని వివరించింది పార్వతి.
''ఇదయ దళపతి విజరు సైకిల్ మీద ఓటేయటం, తిరిగి సైకిల్ మోటార్‌పై వెళ్ళిపోవటంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది తల్లీ!'' అన్నాడు నారదుడు.
''అదే హీరోయిజం అంటే! బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న పెట్రోధరల దెబ్బకి సైకిల్లే గతి అవుతాయని, సింబాలిక్‌గా చెప్పటానికే విజరు సైకిల్ తొక్కుకుంటా వచ్చాడు. బీజేపీ ప్రభుత్వ విధానానికి నిరసన ప్రకటించటం అతని ఉద్దేశ్యం! అది పూర్తయింది. ఆ తర్వాత సైకిల్ మోటార్‌పై వెళ్ళినా కార్లో వెళ్ళినా అది చర్చించాల్సిన అంశమే కాదు!'' వివరించింది పార్వతి.
''అవును తల్లీ! విజరు మొదటి నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అందుకు కారణమైన ప్రభుత్వ విధానాలపై తన నిరసనను ప్రకటిస్తూనే ఉన్నాడు. అందుకు ఆయనపై ఇన్‌కమ్‌టాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ దాడులు కూడా చేశారు!'' అన్నాడు నారదుడు.
''తమకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై రకరకాల దాడులు చేసి వారిని దోషులుగా నిలబెట్టే కుట్రలు చేయటంలో బీజేపీ చాలా ప్రావీణ్యం సంపాదించింది! అదే విధంగా తమకు అనుకూలంగా ఉండేవారికి, అవార్డులు, రివార్డులు ఇవ్వటానికి కూడా బీజేపీ నేతలకు ఎలాంటి సిగ్గు, శరమూ లేవు. అందుకే రజనీకాంత్‌కి ఫాల్కే అవార్డు, కంగనకు ఉత్తమనటి అవార్డు ఇచ్చారు'' అన్నది పార్వతి.
''నిజమే తల్లీ! తమిళ హీరోలు, ప్రజా సమస్యలు, తమ ఆత్మగౌరవం లాంటి అంశాలపై ఎప్పటికప్పుడు నిస్సంకోంచంగా తమ అభిప్రాయాలు తెలుపుతుంటారు. ఆ అభిప్రాయాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నాసరే! ధైర్యంగా బయటకు చెబుతుంటారు! గతంలో తెలుగు హీరోలు కూడా ప్రజా సమస్యలపై స్పందించారు. జోలెలు పట్టి నిధులు వసూలు చేశారు! మొన్న లాక్డౌన్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషి కంటే ఎక్కువగా సోదూసూద్ ప్రజలకు సహాయ పడ్డాడు! తన ఆస్తులు కుదువపెట్టి మరీ వలస కూలీలను బస్సుల్లో వారి గమ్యానికి చేర్చాడు. రైతులకు ట్రాక్టర్లు సరఫరా చేశారు! కాని అత్యధిక పారితోషికం తీసుకునే హిందీ, తెలుగు హీరోలు మాత్రం ఇలాంటివి తమ పనులు కాదన్నట్టు గమ్మున ఉండిపోయారు!'' అన్నాడు నారదుడు.
''మరో ముఖ్య విషయం మర్చిపోయావు నారదా! రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సోనూసూద్ డిమాండ్ చేశాడు'' గుర్తుచేసింది పార్వతి.
''అవును తల్లీ! రైతుల సమస్యలపై సినిమాలు తీసి, కోట్లు సంపాదించుకున్న సూపర్స్టార్లు, మెగాస్టార్లు నోరు మెదపటం లేదు. ఎందుకు తల్లీ!'' అడిగాడు నారదుడు.
''కళాకారులు రెండు రకాలు నారదా! కళ కళకోసమే అనేవారు కొందరు. కళ ప్రజల కోసం అని నమ్మేవారు మరికొందరు. మనం చర్చించుకునే వారిలో వీరిద్దరూ ఉన్నారు. ఐతే ఇటీవలకాలంలో కాసుల కోసమే కళ అనే ధోరణి పెరిగింది. కళను వాడుకుని డబ్బు సంపాదించటమే దీని లక్ష్యం. ఈ క్రమంలో ఇలాంటి ధోరణి, పాలకులకు, వారి దోపిడీకి ఉపయోగపడుతున్నది. ఇలాంటి కళ ప్రజలకు ఏవిధంగానూ ఉపయోగపడకపోగా, పరోక్షంగా వారికి నష్టం కలిగిస్తుంది. బహుబలి లాంటి సినిమాలు, రజనీకాంత్, కంగన వంటి హీరో, హీరోయిన్లు ఇలాంటి కోవలోకి వస్తారు!'' అని వివరించింది పార్వతి.
''మరి తెలుగు సూపర్స్టార్లు ఏ కోవలోకి వస్తారు! కళ కళకోసమే అనే వారిలో ఉన్నారా?'' అడిగాడు నారదుడు.
పార్వతి చిన్నగా నవ్వింది.
''తెలుగు హీరోలకి అలాంటి స్పృహ కూడా లేదు! చిరంజీవి లాంటివారు ఎప్పుడో రుద్రవీణ లాంటి సినిమాలు తీశారు. కాని ఇటీవల ఆ దృక్పథం మారింది. ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే, డబ్బులు వస్తాయనుకుంటే అలాంటి సినిమాలు తీస్తున్నారు. లేదంటే డాన్సులు, ఫైట్లే. అందుకే కరోనా, లాక్డౌన్లో సోనూసూద్ బస్సులు ఎలా నడపాలా అని ఆలోచిస్తే, తెలుగు హీరోలు దోసెలు కొత్తగా ఎలా వేయాలా? అని ఆలోచించారు! తమ అభిమానులే రోడ్లపై, మండుటెండల్లో నడిచివెళ్తుంటే హీరోల హృదయాలు కరగలేదు. రైతుల కష్టాల మీద ఆహా, ఓహౌ అనిపించేలా డైలాగులు చెప్పి చప్పట్లు కొట్టించుకున్న హీరోలు. గడ్డకట్టే చలిలో రైతులు పోరాడుతుంటే, వారికి మద్దతుగా నిధులు ఇవ్వటమో, మద్దతుగా నిలబటమో చేయలేదు!'' వివరించింది పార్వతి.
''అర్థమైంది తల్లీ! ప్రజల కోసం పరితపించే కళకే అర్థం, పరమార్థం ఉంటాయి. అదే నిజమైన కళ. అంతేగాని పాలకుల సేవలో వరించే అవార్డులు, రివార్డులు వృధా!'' అంటూ సెలవు తీసుకున్నాడు నారదుడు.
- ఉషాకిరణ్