Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక్క బెంగాల్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఆ రాష్ట్రంలో మాత్రం రాజకీయ ఉద్దేశాలతో సుదీర్ఘకాలం ప్రకటించిన ఎన్నికల షెడ్యూలు సాగుతూ ఉంది. అధికారమే పరమావధిగా కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో పాలించే తృణమూల్ కాంగ్రెస్‌లు హీనస్థాయిలో కీచులాడుకుంటున్నాయి. శనివారం పోలింగ్‌లో హింసాకాండ, సీఆర్పీఎప్ కాల్పులలో నలుగురు మరణించడం అక్కడ ఉద్రిక్తతను ప్రతిబింబిస్తున్నాయి. మిగిలిన దశలు కూడా పూర్తయి ఫలితాలు రావడానికి మే నెల మూడవ తేదీ వరకూ ఆగాలి గనక ప్రజల్లోనూ పార్టీల్లోనూ ఉత్సుకత భారీగానే నెలకొంది. మీడియా వ్యాఖ్యాతలూ పరిశీలకులూ సర్వేలూ కూడా ఇందుకు సంబంధించి రకరకాల అంచనాలు విడుదల చేస్తున్నారు. అవన్నీ గమనించినప్పుడు ఒక విషయం మాత్రం రూఢ అవుతున్నది. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు లేదా పంచతంత్రం బీజేపీకి అనుకూలంగా ఉండబోవడం లేదు. ఆ పార్టీకి ఈ దఫా పలితాలు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయనే అంచనాలు కొన్నయితే మిశ్రమంగా ఉండటం తథ్యంగా కనిపిస్తుంది. రెండవ దఫా మూడువందల పైన స్థానాలు తెచ్చుకున్నప్పటికీ రైతాంగ ఆందోళన, రాష్ట్రాల నిరసన, కోవిడ్ నివారణలో వైఫల్యాలు, ఆర్థిక సంక్షోభం తదితర సవాళ్ల వలయంలో చిక్కుకున్న ప్రధాని మోడీకి ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు నల్లేరుమీద నడక మాత్రం కాదని ఇప్పటికే స్పష్టమైపోయింది. దక్షిణాది రాష్ట్రాలలోనూ పాగావేస్తామంటూ ఆపార్టీ ఆరెస్సెస్‌తో కలసి మొదట చేసిన హడావుడి గుర్తు చేసుకుంటే ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నమైన దృశ్యంగా ఉంది.
ఎవరినడిగినా ఎల్డీఎఫ్
ఈ అయిదు రాష్ట్రాలలోనూ ఎవరికీ పెద్దగా సందేహంలేని సర్వే ఫలితాలు వచ్చింది కేరళపై. రాష్ట్రంలో ప్రతి ఎన్నికలో ప్రభుత్వాలు మారే నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ ఈ సారి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నాయకత్వంలో ఎల్డీఎఫ్ తిరిగి అధికారంలోకి రాబోతుందని దాదాపు సర్వేలన్నీ ఘోషిస్తున్నాయి. దశలవారిగా జరిపిన సర్వేలలో కూడా ఈ అంచనా మారకపోవడం విశేషం. ఇందుకు ప్రధాన కారణం ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ప్రతికూల పరిస్థితులలోనూ ప్రభుత్వం సాగించిన సమర్థపాలన, సంక్షేమ పథకాలు, సహేతుక విధానాలు. దేశ వ్యాపితంగానే గాక ప్రపంచంలో ఇతర చోట్ల ఉన్న మళయాలీలు ఇతరులు కూడా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఫలితమిది. రాజకీయంగా సైద్ధాంతికంగా కేంద్ర బీజేపీ వేసిన పాచికలన్నీ విఫలం చేయడంతో పాటు రాష్ట్రంలో యూడీఎఫ్‌కు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ దుర్నీతిని కూడా ఎల్డీఎఫ్ ఎదుర్కోవలసివచ్చింది. బీజేపీ మొదట్లో వీరంగం వేసినా తీరా ఎన్నికలు వచ్చే నాటికి సోదిలో లేకుండా పోయింది. స్థానిక ఎన్నికల విజయంతో ఇనుమడించిన విశ్వాసం ఎల్డీఎఫ్ను ముందుకు నడిపించింది. తాజాగా ఒక తెలుగుపత్రికలో ప్రొఫెసర్గారొకరు రాసినట్టు కేవలం కుల పరమైన పొందికలు మాత్రమే ఈ ఫలితానికి కారణం కాదు. కేరళపై ప్రత్యేక వ్యాసం రాబోతుంది గనక ఇతర రాష్ట్రాల విషయం ఎక్కువగా చూద్దాం.
తమిళనాడులో డిఎంకె కూటమి!
కేరళలాగే తమిళనాడులోనూ ఒకో ఎన్నికలో ఒక ప్రభుత్వం మారుతుండేది. కానీ 2016లో ఈ వరవడిని జయలలిత అధిగమించి మళ్లీ అధికారంలోకి వచ్చారు. కమ్యూనిస్టులు ఎండిఎంకె విఎంసికె ప్రజా సంక్షేమ వేదిక పేరిట విడిగా పోటీ చేసినందువల్ల డిఎంకె విజయం సాధించలేకపోయింది. ఈ సారి ఆ పార్టీలన్నీ ఒకటిగా ఉన్నందున అత్యధిక సర్వేలు డిఎంకె కూటమి విజయం ఖాయమని చెబుతున్నాయి. క్షేత్రస్థాయి వాస్తవాలూ అందుకు తగినట్టే ఉన్నాయి. జయలలిత మరణానంతరం అన్నా డిఎంకెను గుప్పిట్లో పెట్టుకుని దొడ్డిదోవన పెత్తనం తెచ్చుకోవాలన్న బీజేపీ పథకానికి పురిట్లోనే సంధికొట్టింది. పాలక అన్నా డిఎంకె పొత్తు అంటూనే కొంచెం విడగొట్టుకోగా బీజేపీ నేతల అవాకులు మరింత వ్యతిరేకత పెంచాయి. ద్రవిడ ఉద్యమం ప్రాంతీయ పార్టీల పట్టు ప్రధానంగా సాగే తమిళరాజకీయాలలో బీజేపీ కాలూనడం అంతతేలిక కాదని ముందే తేలిపోయింది. వారు ఎంతో ఆశపెట్టుకుని రాజకీయ ప్రదక్షిణలు చేసినా రజనీకాంత్ చివరకు తోకముడిచేయడం ఓటమి ఖాయమన్న అంచనావల్లనే. జయలలిత నెచ్చెలి శశికళ విడుదలైనా రాజకీయ ప్రాతిపదికన రెండు శిబిరాలుగా ఉన్న రాష్ట్రంలో పెద్ద పాత్ర వహించలేకపోయారు. ముఖ్యమంత్రి ఫళనిస్వామి పట్టు బాగాపెంచుకున్నారని ప్రచారం జరిగినా ఎన్నికల క్రమంలో పెద్దగా అక్కరకు రాలేదు. లోక్‌సభ ఎన్నికల్లో 37కు 36స్థానాలు తెచ్చుకున్న డిఎంకె కూటమిదే ఘన విజయమని, స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని రాజకీయంగా మానసికంగా అంతా సంసిద్ధమైపోయారు. కమల్‌హాసన్ ఇతరులతో కలసి పోటీ చేస్తున్నప్పటికీ అతి పరిమితమైన ప్రభావం మాత్రమే ఉండొచ్చు. కాంగ్రెస్ ఇక్కడ కూడా పేచీలు పెట్టుకుని స్టాలిన్ అడ్డం తిరిగిన తర్వాత దాదాపు కాళ్లబేరానికి వచ్చినంతపనైంది. బీజేపీ మార్కు మతరాజకీయాలపైన కేంద్రం ఆధిపత్య పోకడలపైన కూడా స్టాలిన్ గట్టిగా మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక శక్తిగా డిఎంకెను ముందుకు తెచ్చారు. ఇప్పటికి రెండుసార్లుగా గట్టి పోటీ ఇచ్చి కూడా ఓటమి చవి చూసిన డిఎంకె, దాంతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇతరులదే ఈసారి విజయమన్న వాతావరణం బలంగా నెలకొంది.
పాండీలో ఏమవుతుంది?
కేంద్రపాలితప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫిరాయింపుల క్రీడతో బీజేపీ కూలగొట్టింది. (ఈ పథకంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడైన మాజీ మంత్రి కృష్ణారావు పాత్ర కూడా కీలకమంటారు) తమిళనాడులో కాకున్నా పాండీలోనైనా పాగా వేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది. బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలుగా ఉండి తెలంగాణ గవర్నర్ అయిన తమిళసైని తాత్కాలిక బాధ్యతనిచ్చి అక్కడకు పంపడం ఇందులో భాగమే. నారాయణస్వామి వర్గం కాంగ్రెస్‌నుంచి నిష్క్రమించి ఎన్ఆర్ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం గతంలోనే ఆ పార్టీని బలహీనపర్చింది. ఇప్పుడు మరికొంతమంది ఆ పార్టీ ఫిరాయింపుదారులు బీజేపీతో కలిశారు. కాంగ్రెస్ డిఎంకె వామపక్ష సంఘటన ఈ కూటమిని ఓడించగలదేమో చూడవలసి ఉంటుంది.
అసోంలో అటూ ఇటూ..
ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాలలోనూ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఇదొక్కటే. మొదటిసారిగా 2016లో కాంగ్రెస్ నుంచి చీలిపోయి వచ్చిన వారి సాయంతో ఏజీపీ పొత్తుతో బీజేపీ గెలవగలిగింది. పౌరసత్వం, బంగ్లాదేశ్ శరణార్థుల సమస్య, జాతి మత విద్వేషాల ఆధారంగా ప్రజలను రెచ్చగొట్టి మరీ విజయం సాధించిన బీజేపీ ఈసారి అంత ధీమాగా లేదు. సీఏఏ, ఎన్ఆర్సీలు ప్రధానాస్త్రాలుగా ఉపకరిస్తాయనుకున్న ఆ పార్టీ దేశంలో రాజకీయ వాతావరణం ఇతర రాష్ట్రాలలో పోటీ కారణంగా అనేక విన్యాసాలు చేసింది. ఆ రాష్ట్రంలోనే కొన్నిచోట్ల సీఏఏ అమలు చేస్తామని మరికొన్నిచోట్ల చేయబోనని మాట్లాడింది. కొత్త ప్రభుత్వానికి నాయకుడెవరనే సమస్య కూడా ఆ పార్టీని వెన్నాడుతున్నది. అసోంలో బీజేపీ ప్రభుత్వం ఉంది గనకనే ఈశాన్య రాష్ట్రాలలో ఆ పార్టీ సామదాన భేద దండోపాయాలతో పట్టు పెంచుకుంది. ఈసారి కూడా హోంమంత్రి అమిత్ షాతో సహా కేంద్రీకరించి ప్రచారం చేశారు. అందుకే అక్కడ బీజేపీని ఓడించడం అవసరమనే లక్ష్యంతో సీపీఐ(ఎం) సీపీఐఎంఎల్ పార్టీలు కాంగ్రెస్తోకలసి పోటీ చేశాయి. 12పార్టీల ఈ కూటమిలో ఎఐఎంఎల్ ముఖ్య భాగస్వామిగా ఉంది. ఈ పార్టీ వ్యవస్థాపకుడైన పరిమళద్రవ్యాల వ్యాపారి అజ్మాల్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. అందుకే పోటాపోటీగా సాగిన అసోం ఎన్నికల పోరాటం ఫలితాలకోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక్కడ బీజేపీ అధికారం కోల్పోతే ఈశాన్యాన అది పెద్ద మలుపు అవుతుంది.
బెంగాల్ అనిశ్చితం
అయిదు రాష్ట్రాలలోనూ అత్యంత అనిశ్చితంగా క్లిష్టంగా కొనసాగుతున్నది పశ్చిమ బెంగాల్ ఎన్నికలు. ఇక్కడ బీజేపీ సవాలు వాస్తవమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 42లో 18 స్థానాలతో పాటు 40శాతం ఓట్లు తెచ్చుకోగా వామపక్షాల ఓట్ల శాతం ఏడుకు పడిపోయింది. మమతా బెనర్జీ తృణమూల్ ప్రజావ్యతిరేక పాలనపై అసంతృప్తి తీవ్రంగానే ఉండటమే గాక ఆ పార్టీ కీలక నేతలు మాజీ మంత్రులతో సహా బీజేపీలో చేరారు. తనదైన అఘాయిత్యశైలిలో ప్రచారం చేసిన మమత హఠాత్తుగా బీజేపీపై పోరాడాలంటూ వివిధ ప్రాంతీయపార్టీలకూ కాంగ్రెస్‌కూ లేఖ రాయడం హాస్యాస్పదంగా మారింది. మరోవంక వామపక్ష సంఘటన కాంగ్రెస్ ఐఎస్ఎప్ల కూటమి ప్రచారంలో జనసమీకరణలో బలమైన ప్రభావంచూపింది. అయితే చాలా సర్వేలు మమత మరోసారి వస్తారనే అంచనాలు ఇచ్చాయి. ఆమె సలహాదారు ప్రశాంత కిశోర్ బీజేపీకి వందపైన వస్తే తాను ఈ వృత్తినుంచి తప్పుకుంటానని సవాలు చేశారు. అయితే తృణమూల్ అంతర్గత సర్వేలోనే బీజేపీ గెలుస్తుందనివచ్చినట్టు పికె స్వయాన ఒప్పుకున్నారని బీజేపీ నాయకులొకరు ట్వీట్ చేశారు, తాను అన్న సందర్భం వేరని వివరణ ఇచ్చినప్పటికీ ప్రశాంత్ కిశోర్ ఆ కథనాన్ని మాత్రం ఖండించలేదు. అలాగే బీజేపీని ఓడించడంకోసం తృణమూల్‌ను బలపర్చాలనే వాదనతో సీపీఐ(ఎం) ఏకీభవించలేదు. ఎందుకంటే మమత పాలనమొత్తం వామపక్షాలపై దాడిగానే సాగింది. హంగ్ అసెంబ్లీ వచ్చేట్టయితే తృణమూల్ తమ సహాయం కోరవచ్చని కాంగ్రెస్ నేతలు సంకేతాలివ్వగా, ఆ విధంగా ఆమెకు మద్దతు నిచ్చేప్రసక్తిలేదని సీపీఐ(ఎం) కార్యదర్శి సూర్యకాంత్ మిశ్రా స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితే వస్తే మమత బీజేపీతో చేతులు కలుపుతారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పిన అంచనాను మిశ్రా పునరుద్గాటించారు. ఏమైనా ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) వామపక్షాలు పుంజుకుంటాయనే అభిప్రాయం కొందరు పరిశీలకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. యువతను ఎన్నికల్లో ఎక్కువగా నిలబెట్టడం కూడా మన్నన పొందింది. బుద్ధదేవ్ పాలనలో తాముసాగించిన కుట్రలను నందిగ్రామ్‌లో పోటీ చేసిన మమత బెనర్జీ ఆమె మాజీ అనుయాయులు స్వయంగా వెల్లడించడం చెప్పుకోదగినపరిణామం. దీనిపై ఆయన స్వయంగా లేఖ విడుదల చేశారు. అదలా ఉంచితే పారిశ్రామికీకరణ కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు కట్టకట్టుకుని పక్కదోవ పట్టించాయని సాధారణ ప్రజలు కూడా ఇప్పుడు గుర్తిస్తున్నట్టు క్షేత్రస్థాయి పర్యటన తర్వాత కొందరు సంపాదకులు ఉదహరించారు. మొత్తంపైన బీజేపీ అప్రతిహతమనే భావనను ఈ అయిదు ఎన్నికలు పూర్వపక్షం చేస్తాయనడంలో సందేహం లేదు. ఒక తెలుగుపత్రిక రాసినట్టు బీజేపీకి లోక్సభలోయాభై శాతం స్థానాలున్నాయి గాని రాష్ట్రాలలో అది ముప్పై శాతమే. వివిధ అసెంబ్లీలన్నిటిలో కలిపి4036 మంది ఉంటే బీజేపీకి 1374మంది మాత్రమే ఉన్నారు. అది కూడా ఫిరాయింపుల తర్వాత. ఈపరిస్థితి ఇక ముందూ మారకపోగా బీజేపీని వ్యతిరేకించే శక్తులకు సానుకూలత పెరగవచ్చు.
తెలకపల్లి రవి