Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయుధ దళాలకు
సద్ది మూటలు మోసినవ్
కాపరివై....పశువులనే కాక
తెలంగాణా పోరాట యోధులను సైతం
కంటికి రెప్పలా కాపాడినవ్ !!
పచ్చని వెంకన్నగూడెం గుట్టలకి
ఎర్రని పతాకాలను పరిచయం చేసినవ్
తమ్మయ్య లాలయ్య భీమయ్యలను
వెంటేసుకొని ఎర్రజెండాను వాటేసుకున్నవ్ !!
నడుమొంచి దున్నినోడిదే భూమి అన్నవ్
కష్టం జేస్తేనే కడుపు నిండాలన్నవ్
ఆట పాటలతో ఆ మాట జెప్పిన
కమ్యూనిస్టులతో కలిసి నడిచినవ్ !!
తెగ బలిసిన ఆసాముల ముక్కు పిండి
మూడు వేల ఎకరాలను పంచిపెట్టినవ్
అవనంతా అందరికీ అందాలంటే
మార్పు రావాలన్నావ్ మార్క్స్ దారే మేలన్నవ్
అడివంతా తిరిగే కష్టం లెక్కగట్టినవ్
తునికాకు రేటు గుట్టు పసిగట్టినవ్
ఆకులు తెంచే కోయలకు సుద్దులు జెప్పినవ్
పోరు రాజేసి గిట్టుబాటు అప్పజెప్పినవ్ !!
రణం చేసే దారుల గందరగోళంలో
సుందరయ్య దారే నా దారన్నవ్
దారి తప్పిన మిత్రుల దాడులను తిప్పికొట్టి
సుత్తి కొడవలి సుక్కే వేగుచుక్కన్నవ్ !!
బండారును , భీష్ముడిని నరికి చంపి
రామయ్య, మడకం, శ్యామలను మట్టుపెట్టి
రణానికి నిన్ను రాజీనామా ఇవ్వమన్నపుడు
ఇవ్వకుంటే... తల ఎగిరిపోతుందన్నపుడు
ఇంచు కూడా వెనుకడుగు వేసేది లేదన్నావ్
ప్రాణం పోయినా జెండాను దించేది లేదన్నావ్
మన్యంలో ముచ్చటగా మూడుసార్లు తిరుగులేని ప్రజా సేవకుడివైనవ్
పార్లమెంటరీ భ్రమలు ఇసుమంతైనా
అంటని ఆదర్శ కమ్యూనిస్టువైనవ్
కొండరెడ్లు, కోయ గూడాల్లో వెలుగులైనవ్
పాలకుల ఎత్తులకు లొంగని శిఖరమైనవ్
చివరాకరికి మా చిరకాల స్పూర్తివైనవ్ !!!
( కామ్రేడ్ బొజ్జి గారికి అక్షర నివాళి)
- బండారు రమేష్