Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అయ్యా శాస్త్రులవారూ నమ స్కారం. ప్రతి సారిలాగే ఈ ఏడూ నా జాతకం చెప్తారని వచ్చా. విన్నవించాడు ఆశా జీవి. అయ్యవారు రెండు మూడు పంచాంగాలు చూశారు. వేళ్ళతో ఏదో లెక్క వేశారు. పాత న్యూస్ పేపర్లు తిరగేశారు. ఆరోజు పేపరూ చూశారు. మళ్ళీ వేళ్ళతో లెక్క పెట్టారు. ఉహూ, ఏమీ లాభంలేదు అని బైటికే అనేశారు.
ఆశాజీవికి కాస్త కంగారుగా, ఇంకాస్త అనుమానంగా ఉంది. భయంభయంగా చూసి మెల్లగా లేవబోయాడు శాస్త్రిగారు కళ్ళు మూసుకొని ఉండడం గమనించి. కాస్త ఓపిక పట్టు నాయానా, కూచో! ఆ మాస్కు సరిగా తగిలించుకో. టీకా వేయించుకున్నావా! అనేసరికి ఆశాజీవికి మరింత భయమేసింది. ఇంతలో శాస్త్రులవారు ఈ మహమ్మారి ఎప్పుడు పోతుందో, ఈ దేశమెప్పుడు బాగుపడుతుందో అనేసరికి కోద్దిగా ధైర్యమొచ్చింది. అవును సార్ ఈ కరోనా మహమ్మారి మళ్ళీ పెరుగు తోంది. మహారాష్ట్రలో చూడండి భయంకరంగా విస్తరిస్తోంది.
శాస్త్రిగారు కళ్ళు తెరిచారు. నేను ఆ మహమ్మారి గురించి కాదు నాయనా దేశంలో నేడు అనేక లక్షణా లుగల మహమ్మారి రాజ్యమేలుతోంది. మతాల మాటున మనుషుల్ని విడదీయడం, ప్రభుత్వరం గాలను అమ్మివేయడం చూస్తున్నావు కదా. ఎన్నికల్లో అల్లర్లు జరిగినా, ప్రాణాలు పోయినా కరగని గుండెల్ని చూస్తున్నావు కదా. ఒకానొక న్యూస్ పేపర్ పంచాంగం వేసింది చూడు. అందులో మనుషుల మధ్యన విభేదాలొస్తాయనీ రాశారు. అధికారంలో ఉండడానికి ఏదైనా చేస్తారని తమకు తెలిసిందే ఈ రూపంలో రాశారంతే. అందుకే చెబుతున్నా ఇలాంటి మహమ్మారి ముందు కరోనా ఏం చేస్తుంది చెప్పు!! కనుకనే దేశానికి మొత్తంగా కలిపి ఈసారి పంచాంగ శ్రవణం చేసి మళ్ళీ నీదగ్గర కోస్తాను.
ఈ ఏడాదంతా ఐదు మూసుడూ పది అమ్ముడూ. అర్థమయ్యేలా చెబుతా. మంచి లాభాల్లో ఉన్న సంస్థలకైనా, నష్టాల్లో ఉన్నవాటికైనా ఒకే రూలు. మూసేయడం లేదా అమ్మేయడం. ఐదు సంస్థల్ని మూసివేస్తే పది సంస్థల్ని అమ్మేయడమన్నమాట. సమానత్వ మంటే అదీ. లాభాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా ఒకే రూలు ప్రభుత్వ సంస్థలకి. చూశావా ఎంత సమదృష్టి!! ఇక పెట్రోలు, డీజీలు, వంటనూనెల ధరల విషయంలోనూ అంతే. పంచాంగంలో పెరిగేవాటి లిస్టులో ఇవి ముందుంటాయి. ఇది తెలుగు సంవత్సరాదికే కాదు, మొత్తం దేశానికి వర్తిస్తుంది.
ఇక కరోనా మహమ్మారి దగ్గరికోద్దాం. నువ్వొస్తానంటే నేనొద్దంటానా అన్నట్టు అన్ని రాశులవారికీ ఒకటే రూలన్నమాట. నువు రమ్మన్నా నేనొస్తానా అని వ్యాక్సిన్ల కొరత ఒకవైపు. ఆవిధంగా నీ రాశిని, నీదేనని కాదు నాది, ఇంకా తెలుగు రాష్ట్రాల ప్రజల, దేశ ప్రజల రాశులన్నింటికీ ఈ జాఢ్యం పట్టుకుంది నాయనా. ఇక ఉద్యోగాల మాట ఎత్తరాదు. ఉద్యోగం ఊడే మాటలు, బలవంతపు రిటైర్మెం టులు మొదలైనవి కూడా అందరికీ వర్తిస్తాయి. ఇక నీ విషయాన్ని ప్రత్యేకంగా చూద్దాం, నీ రాశి ఏదన్నావ్ , అనేంతలో ఆశాజీవి గట్టిగా అరిచాడు... వద్దు శాస్త్రిగారూ వద్దు. ఇన్నిన్ని విన్నాక ఇంక నాకంటూ మంచి ఏదైనా ఉంటుందన్నది నాకు అనుమానమే!! అందరితో పాటు నేను. అందరూ గోదారైతే నేనూ గోదారే, అందరూ మూసీ అనుకుంటే నేనూ మూసీనే. ఐనా నాకు తెలీకడు గుతా ప్లవ నామ ఉగాది అంటే దాటించునదని అర్థమంట కద శాస్త్రి గారు. అవున్నాయనా దాటించునదే!! పెనంలో నుంచి దాటించి పొయ్యిలో వేస్తుందంతే!!
- జంధ్యాల రఘుబాబు
సెల్ : 9849753298