Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోదావరి ఒడ్డున దు:ఖపు జల అలలై ఎగిసి పడుతున్నది. శబరి మౌనంగా రోధిస్తున్నది. అడవితల్లి తన ముద్దుబిడ్డ యెదపైన రైళ్లపూలనిడిచి కన్నీళ్ళ నివాళి చెబుతున్నది. కొండలు, వాగులు, పుట్టలు, గుట్టలు సహచరుడి నిష్క్రమణకు చలించి పోతున్నవి. కొమ్ముబూర బోరున విలపిస్తున్నది. అడవివెంకన్న గూడెం ఆవరించిన దిగులుతో కన్నబిడ్డ కోసం కలవరిస్తున్నది. తొంబైఐదేండ్ల అనుబంధాన్ని జ్ఞాపకాల్లో దృశ్యమానం చేస్తున్నది భద్రాచల పరిసర ఆదివాసీ గోదావరి పరీవాహం.
భద్రాచలమనగానే ప్రపంచాన అందరికీ శ్రీరామ చంద్రుడు, సీత, పర్ణశాలలు గుర్తుకొస్తా యేమో! కానీ ఈ నేలపై ఇప్పపూలనేరుకుని, పుట్టతేనతో బతుకు పొట్ట నింపుకుని, కాయలు కసువులతో, కాయికష్టంతోనే ప్రకృతి వొడిలో జీవనాన్నీ కొనసాగించే సమూహాల గుండెల్లో కుంజాబొజ్జి కొండత రూపమై కదలాడుతుంటాడు. ఎర్రనిజెండాగా ధైర్యమై వాళ్ళ పక్కనే సాయంగా చేయందిస్తూనే ఉంటాడు. ఒక్క ఆదివాసీలకే కాదు. శ్రామిక జనులందరికీ, పిలిస్తే పలికే నాయకుడు. కామ్రేడ్ బుజ్జి ఒక వ్యక్తి కాదు. సమూహశక్తి. మహౌజ్వల త్యాగనిరతి. అసామాన్యంగా కనిపించే అసమాన్య యోధుడు. అతి సౌమ్యంగా వినిపించే విప్లవవీరుడు. ఆయనను గురించి చెప్పేందుకు మనం ఎన్ని విశేషణాలనయినా వినియోగించవచ్చు. కానీ ఆయనను ఆయనంత చూపించడం కష్టమైన పని.
పారేయేరంత స్వచ్ఛమూ నిర్మలమూ నిధానమూ కామ్రేడ్ బుజ్జిలో మనం చూడవచ్చు. అంతేకాదు. ఉప్పొంగే నదీ దిక్కారమూ చూడవచ్చు. మొక్కవోని కమ్యూనిస్టు నిబద్ధతా, రెక్కలు విరిచి కట్టినా, ప్రాణాలపై తుపాకులు ఎక్కుపెట్టినా నమ్మకాన్ని అమ్ముకోలేదు. సిద్ధాంతాన్ని విడిచిపెట్టలేదు. దేహమంతా అరుణమయం చేసుకుని తానే పతాకమై నిలిచాడు. అందరిలానే తానూ పుట్టాడు. ఎందరికోసమో జీవితాన్ని వ్యయం చేశాడు. పోడుతో పొట్ట నింపుకున్నాడు. పరుల పొట్టకూడా నిండాలని కోరుకున్నాడు. చదువేమంత లేకున్నా మన సమాజాన్ని మర్చుకోవాలన్న జ్ఞానం సమృద్ధిగా వున్నవాడు. మనకిప్పుడు జీవిత లక్ష్యాలు చాలానే ఉంటాయి. కానీ వారికి ప్రజల బాధలను తొలిగించేందుకు జీవితాన్నంతా వెచ్చించడమే లక్ష్యంగా, సమస్త జనుల విముక్తి సాధించడమే ఆశయంగా నిశ్చయంగా చివరి వరకూ నడపటం కంటే గొప్ప జీవనం ఏముంటుంది.!
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరా టంలో కొరియర్‌గా సాయుధులకు సద్ధి మూట లందించిన నాటి నుంచి, ఆ వీరులు అందించిన పెద్ద బాల శిక్ష చదువులోనే మహౌ న్నత మార్క్సిస్టు ఆశయ పతాకను అందుకుని తుది వరకూ పోరాట బాటలో చైతన్యాన్ని పండించాడు. అమాయక గిరిజనులను అన్యాయం చేస్తున్న దోపిడీ వర్గాలపై, అధికార బలగాలపై ఉద్యమ నిప్పులు కక్కాడు. కూలిపోరాటాలకు నాయకత్వం వహించాడు. ఎర్రజెండాతో నినదించాడు. నాయకుడంటే ఎలా ఉండాలో నిదర్శనమై నిలిచాడు. ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. సేవలను ముమ్మరం చేశాడు. శాసనసభ్యునిగానూ ఒక్కసారి కాదు, మూడుసార్లు ఎన్నికయ్యారు. శాసన సభలో ఆదివాసీల బతుకుపై ప్రభుత్వాలను నిలదీసాడు. భద్రాచలం నియోజక వర్గంలోని ప్రతి ఊరు, ప్రతి గూడెం, మారుమూల గుంపు అన్నీ అతన మదిలో తిరిగే మ్యాపు. అక్కడి ప్రజల కష్టాలు, అవసరాలు అతని నోటిపై తేలియాడే ధ్వనులు. అందుకే ఆయన ప్రజా నాయకుడు. పలకరింపుతో కార్యకర్తలకు ధైర్యాన్ని నింపేవాడు. నాయకుల మధ్య సమన్వయాన్ని నెరపేవాడు. అన్యధోరణులను ప్రశ్నించేవాడు. పార్టీ పట్ల విధేయుడుగా కొనసాగాడు.
కార్యకర్తగా పని చేసినా, శాసన సభ్యునిగా కొనసాగినా రెండూ సమానమే ఆయనకు. పదవికి నిండైన వన్నెలద్దాడే తప్ప, పదవిని అతుక్కుని పోలేదు. పదవికే ఆయనో అలంకరణ. ఆయన తలమీది కిరీటమై హౌదా లేవీ నిలబడలేదు. నిక్కమైన ప్రజా నిబద్ధ జీవితానికి బొజ్జి చొక్కమైన బంగారుపు మచ్చుతునక. చిన్న పూరిల్లు కూడా లేదంటే ఇప్పుడందరూ నవ్వుకుంటారు. కానీ కమ్యూనిస్టులు ఎలా బ్రతకాలో, సుందరయ్య లాంటి వారి నుంచి నేర్చుకున్నాడు. కాబట్టే అంత సామాన్యుడిగా జీవనం సాగించాడు. అయితే సామాన్యుడిగా జీవన శైలి ఉండటం కేవలం ఆదర్శం. మాత్రమే. దాంతో పాటుగా ప్రజలందరి బాగు కోసం, సమాజ మార్పు కోసం, సిద్ధాంతం పునాదిగా ఉద్యమించ గల సమర్థులే నిజమైన నాయకులుగా వెలుగొందుతారు. అలా తనను తాను నిర్మించుకున్నా వాడే బుజ్జిగారు. అందుకనే అతను మార్క్సిస్టు నాయకుడు, త్యాగధనుడు.
దారికాచిన దుండగులు తన ముందే కమ్యూనిస్టు యోధులు, సహచరులు బండారు చందర్ రావును, బత్తుల భీష్మారావును నరికి చంపి, నిన్నూ హతమారుస్తామని దౌర్జన్యానికి పూనుకుంటే, చెదిరి పోని స్థయిర్యంతో ఉద్యమానికి గుండెనడ్డుపెట్టి కాపాడిన సాహసి అతడు. అతివాద, మితవాద శక్తుల నెదుర్కోవడంలోని ఆయన నేర్పరితనం మనందరికీ పాఠంలా పని చేస్తుంది. సిద్ధాంతపు పరిజ్ఞానం ఎంత ఉందనేది కాదు. దాని సారాన్ని గ్రహించామా లేదా అనేది చాలా ముఖ్యం. ప్రజలలో ఉంటూ ప్రజల ఆచరణను తనదైన శైలిలో సిద్ధాంతానికి అన్వయించి ప్రజల భాషలొనే సంభాషించే సామర్థ్యం గల బొజ్జిగారు నేటి కార్యకర్తలకు నాయకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు.
ఇప్పుడు ఒక నిబద్ధ దేహం చలనర చాలించింది. అయినా వేలాది హృదయాలలో ఓ చైతన్య జ్ఞాపకమై నిలిచే వుంటుంది. 'మనుషుల్ని విభజించే మతోన్మాత రాజకీయాలకు, శ్రామిక ఉద్యమాలే అసలైన సమాధానమని' చెప్పిన కామ్రేడ్ బొజ్జిగారి ఆలోచనలో పయనించటమే నిజంగా ఆయనకు మన మందించే నివాళి. సామాన్య గిరిజన నాయకుడిగా ఉండి అసామాన్య ప్రేరణా జీవితమై నిలచిన అరుణవీరునికి అశ్రవాంజలులు లాల్ సలాములు...
- ఆనందాచారి