Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా అధ్యక్ష పదవికి డెమాక్రటిక్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేయాలన్నది ముందస్తుగా ఆ పార్టీలో ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికలో పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడిన ఎలిజబెత్ వారెన్ తన ప్రచారంలో సంపదపన్ను విధించాలన్న ప్రతిపాదనను చేశారు. ఎంత ఎక్కువ సంపద ఉంటే అంత ఎక్కువగా ఆ పన్ను ఉండాలని ఆమె ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను బలపరుస్తూ 18 మంది అమెరికన్ శత కోటీశ్వరులు ముందుకొచ్చారు. మన దేశంలో మనకు గుర్తున్నంత వరకూ ఇటువంటి తరహా స్పందన ఎప్పుడూ మన పెట్టుబడిదారుల నుంచి రాలేదు. ఐతే దీనర్ధం అమెరికన్ పెట్టుబడిదారులు గాని, పశ్చిమదేశాల పెట్టుబడిదారులు గాని మన వాళ్ళకంటే ఎక్కువ జాలి, కలిగివున్నారని గాని, తాము ఎవరినైతే దోచుకుంటున్నారో వారియెడల ఎక్కువ దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని మాత్రం కాదు. వారి దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థకు ఎటువంటి అవాంతరాలూ కలగకుండా సాఫీగా సాగిపోవాలంటే పేదలపట్ల కొంత శ్రద్ధ కనపరచవలసిన అవసరం ఉందని మాత్రం వారు నమ్ముతున్నారు.
కరోనా సంక్షోభం సమయంలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల విషయంలో కూడా ఆ దేశాల పాలకవర్గాలకు, ఇక్కడ మన పాలక వర్గాలకు మధ్య ఇటువంటి తేడాయే ఉంది. కరోనా వలన, దానితోబాటు అమలు జరిగిన లాక్డౌన్ వలన అటు పశ్చిమ దేశాలలో గాని, ఇక్కడ ఇండియాలో గాని జీడీపీ ఒక్కసారిగా పడిపోయింది. దానివలన పన్నుల ద్వారా సమకూరే ఆదాయాలూ పడిపోయాయి. కరోనా ఉపద్రవం నుంచి ప్రజలను ఆదుకోవడం సంగతి పక్కన పెట్టి కేవలం ప్రభుత్వం నిర్వహణ కొనసాగించాలన్నా దానివలన ద్రవ్యలోటు పెరుగుతుంది. లాక్డౌన్ ప్రభావం ఎంత ఎక్కువ ఉంటే ద్రవ్యలోటు పెరుగుదల అంత ఎక్కువ అవుతుంది. ఉద్దీపన ప్యాకేజీ సాపేక్షంగా ఎవరిది ఎక్కువగా ఉందో తేల్చడానికి ఎవరి ద్రవ్యలోటు ఎక్కువగా ఉందో పోల్చి నిర్ధారిస్తామంటే అది మాత్రమే చాలదు. ఆయా ప్యాకేజీలలో పేదలకు ఎంత మేరకు దక్కింది అన్నది కూడా పరిశీలించాలి.
యూరపియన్ సెంట్రల్ బ్యాంక్ 2019, 2020 సంవత్సరాలను పోల్చి ప్రాథమిక ద్రవ్యలోటు (జీడీపీతో పోల్చినపుడు) ఈ రెండు సంవత్సరాల మధ్య 6.7 శాతం యూరపియన్ యూనియన్లో పెరిగిందని నిర్ధారించింది. అదే అమెరికాలో 9.8 శాతం పెరిగింది. పేదలకు ప్రత్యక్ష సహాయం అందించినందున యూరపియన్ యూనియన్లో ప్రాథమిక ద్రవ్యలోటు 4.2 శాతం పెరిగితే, అమెరికాలో 7.8 శాతం పెరిగింది. (ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం అమెరికాలో పేదలకు సహాయం అందించిన కారణంగా ప్రాథమిక ద్రవ్యలోటు 16.7 శాతం పెరిగింది)
ఈ గణాంకాలలో దేనిని ప్రామాణికంగా తీసుకున్నా సరే, మన దేశ గణాంకాలతో పోల్చినప్పుడు అవి అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. మన దేశంలో పేదలకు ప్రత్యేకించి అందించిన సహాయం రు.1.65 లక్షల కోట్ల నుంచి రు.1.90 లక్షల కోట్ల మధ్య ఉంది. ఇది మన జీడీపీలో ఒక శాతం కన్నా తక్కువే. అందుచేత పశ్చిమ దేశాలు తమ ప్రజలకు అందించిన సహాయానికి, మనదేశంలో ప్రజలకు అందిన సహాయానికి నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది.
ఈ సహాయం అందించిన విధానంలో కూడా తేడా ఉంది. అమెరికాలో సహాయాన్ని ప్రతీ ఇంటికీ అందించారు. ఇక్కడ కూడా అదే విధంగా చేయమని అనేక మంది ఆర్ధిక వేత్తలు, పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు మొత్తుకున్నాయి. ఉదాహరణకు; బైడెన్ ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం సంవత్సరానికి 75,000 డాలర్లకన్నా తక్కువ ఆదాయం వచ్చే ప్రతీ వ్యక్తికీ 1400 డాలర్ల సహాయం అందింది. ప్రతీ నిరుద్యోగికీ నెలకు 300 డాలర్లు గడిచిన సెప్టెంబరు వరకూ అందించారు. ఈ తరహా సహాయం కేవలం బైడెన్ మాత్రమే కాదు, ట్రంప్ కూడా అందించాడు. అందుకు పూర్తి భిన్నంగా మన దేశంలో మాత్రం అటువంటి సార్వత్రిక స్వభావం ఉన్న సహాయం ఏదీ ప్రజలకు అందలేదు.
శ్రామిక ప్రజలకు ఏ మేరకైనా ఆర్ధిక తోడ్పాటు అందిందీ అంటే అది కేవలం ఉపాధి హామీ పథకం ద్వారానే. 2019-20 లో 7కోట్ల 88 లక్షల మంది లబ్ధి పొందితే 2020-21లో 11 కోట్ల 17 లక్షలమంది లబ్ధి పొందారు. ఇది 41.75 శాతం పెరుగుదల. ప్రధానంగా పట్టణాలలో పనులు కోల్పోయి స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వలసకూలీలతో గ్రామీణ నిరుద్యోగ సైన్యం అమాంతం పెరిగింది. వారంతా ఉపాధిహామీ పథకంద్వారా పనులు పొందారు.
అంటే లాక్డౌన్ వలన పనులు పోగొట్టుకున్న వలసకూలీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా సహాయం చేసిందేమీ లేదు. ఆ వలసకూలీలు తమ ప్రాణాలను నిలుపుకోడానికి కండలు కరిగించే శారీరక శ్రమ చేసేందుకు సిద్ధమైనందువలన వారికి ఆ ఉపాధిహామీ కూలీ డబ్బులు దక్కాయి. లాక్డౌన్ కాలంలో అద్దెలు చెల్లించలేని వారినెవరినీ బలవంతంగా ఖాళీ చేయించరాదన్న ఆదేశాలను ట్రంప్ ప్రభుత్వం ఇచ్చింది. కనీసం ఆ పాటి సహాయం కూడా మోడీ ప్రభుత్వం ఇక్కడ చేయలేదు.
సహాయ ప్యాకేజీ సైజు గనుక పెద్దదైతే దాని వలన ద్రవ్యలోటు బాగా పెరిగి అది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అభ్యంతరాలకు, ఐఎంఎఫ్ వంటి సంస్థల నుంచి వ్యతిరేకతకు దారితీస్తుందన్న వాదన ఉంది. ఈ తరహా వాదన మరే ఇతర మూడవ ప్రపంచ దేశానికైనా వర్తిస్తుందేమో గాని మన దేశానికి మాత్రం అస్సలు వర్తించదు. ఎందుకంటే మన ప్రభుత్వం అటువంటి ప్రయత్నమే ఏమాత్రమూ చేయలేదు. ఐఎంఎఫ్ నుంచి ఎటువంటి అభ్యంతరమూ వ్యక్తం కానేలేదు. విదేశీ పెట్టుబడులు మన దేశం నుండి బైటకు తరలిపోయే ప్రమాదమేదీ ఎదురవలేదు. ఇంత పిసినిగొట్టుగా మన ప్రభుత్వం వ్యవహరించడానికి కారణం దానికి శ్రామిక ప్రజల పట్ల ఏమాత్రమూ శ్రద్ధ లేకపోవడమే. పశ్చిమ దేశాల పాలక వర్గాలకు, మన పాలకవర్గానికి నడుమ ఉన్న తేడా ఇదే.
ఇటువంటి పరిస్థితి ఏర్పడడానికి ముఖ్యంగా మూడు కారణాలను పేర్కొనవచ్చు. మొదటిది; మన శ్రామిక ప్రజలలో అత్యధిక శాతం అసంఘటిత కార్మికులు. అందువలన మన కార్మికవర్గానికి బేరసారాలాడే శక్తి బాగా తక్కువగా ఉంది. దీనికి తోడు నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. కొంతమందికి పూర్తికాలం పని దొరకడం, మరికొంతమందికి ఏ పనీ దొరకకపోవడం అన్న పరిస్థితి ఇక్కడ లేదు. దాదాపు అందరికీ కొద్ది కాలం పాటు మాత్రమే పని దొరుకుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ కార్మికవర్గాన్ని సంఘటితపరచడం మరింత కష్టం. నిరుద్యోగ సమస్య తీవ్రంగా
ఉండడం వలన ఒక విధంగా కష్టం అయితే, ఆ నిరుద్యోగ సమస్య దాదాపు శ్రామికులందరికీ ఎంతో కొంత కాలం ఉండేలా పంచబడడం రెండో కారణం. ఈ కరోనా కాలంలో మోడీ ప్రభుత్వం పార్లమెంటులో హడావుడిగా ఆమోదింపజేసుకున్న కార్మిక చట్టాలు కార్మికుల పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తాయి.
ఈ కార్మికులు, వ్యవసాయకూలీలు, రైతులు అందరి సంఘటిత శక్తీ బలహీనంగా ఉండివుండవచ్చు. కాని వారంతా ఒక్కమాటమీద నిలబడి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికలలో వోటు చేయడంద్వారా పాలకులపై రాజకీయ వత్తిడి తీసుకురావచ్చును కదా అని ఎవరైనా అనవచ్చు.నిజానికి ఇటువంటిదేదో జరిగే ప్రమాదం ఉందన్న భయం గనుక ప్రభుత్వానికి ఉంటే చచ్చినట్టు ఈ ప్రజల సమస్యలపట్ల వొళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించివుండేది. కాని మోడీ ప్రభుత్వం విషయం వేరు. ఈ ప్రజలను మతపరంగా చీల్చగలనన్న ధైర్యం దానికి ఉంది. అలా చీల్చి మెజారిటీ మతస్తులను తన వెనుక సమీకరించుకోగలనన్న నమ్మకం ఈ ప్రభుత్వానికి ఎంత మోతాదులో ఉందంటే ఇక అది శ్రామిక ప్రజల ఇక్కట్లను ఏమాత్రమూ పట్టించుకోవడం మానేసింది.
అర్ధాంతరంగా కర్కశంగా లాక్డౌన్ ను ప్రకటించినా, కేవలం నాలుగే నాలుగు గంటల వ్యవధిని మాత్రమే ఇచ్చినా, లక్షలాది మంది వలసకూలీలను నిర్దాక్షిణ్యంగా నడిరోడ్లపాలు చేసినా, వారంతా వేరే దారిలేక కాళ్ళీడ్చుకుంటూ తమ స్వగ్రామాలకు ప్రయాణం కట్టినా, అప్పుడు కూడా వారికి ఎటువంటి తోడ్పాటూ ఇవ్వకపోయినా, అలా పనులు పోగొట్టుకున్నవారు ఎటువంటి ప్రభుత్వ సహాయమూ అందక, మార్గాంతరం లేక ఉపాధిహామీ పనులు చేయడానికి సిద్ధపడి కండలు కరిగించినా, ఎన్నికల సమయం సమీపిస్తే మాత్రం పాలకపార్టీ మతపరమైన చీలికలను తెచ్చి వారిలో మెజారిటీ వోట్లను కొల్లగొట్టడం సాధ్యమే నన్నది పాలకపార్టీకున్న బలమైన విశ్వాసం. ఈ ఆలోచనతోటే అది శ్రామిక ప్రజల భౌతిక అవసరాలను తీర్చాలన్న కనీసమైన అవగాహనను కూడా ప్రదర్శించడంలేదు.
ఇక మూడవ కారణం; కుల వ్యవస్థ కారణంగా మన భారతీయ సమాజంలో పేదలపట్ల, శ్రామిక ప్రజల పట్ల చాలా కాలంగా అశ్రద్ధ ఉండడం. శ్రామిక ప్రజలలో అత్యధిక శాతం తక్కువ కులాలకు చెందిన వారు. కులవ్యవస్థ తక్కువ కులాలను చిన్నచూపు చూస్తుంది. అందుచేత శ్రామిక ప్రజల సమస్యలను ఈ సమాజం పట్టించుకోదు.
జాతీయోద్యమకాలంలో ఈ వైఖరిని కొంతవరకూ అధిగమించగలిగాం. సోషలిస్టు వ్యవస్థ ఉవ్వెత్తున పురోగమిస్తున్న చారిత్రిక నేపధ్యంలో జాతీయోద్యమం సాగడం ఇందుకు తోడైంది. స్వతంత్ర భారతదేశంలో పౌరు లందరూ కుల, మత, లింగ, వర్గ భేదం లేకుండా సమాన హక్కులను కలిగివుంటారన్న భావన ఆ ఉద్యమంలోనుంచి ముందుకొచ్చింది. ఐతే ఇప్పుడు చరిత్రలో తిరోగమన శక్తులదే పైచేయిగా ఉన్న దశలో ఉన్నాం. అందుచేత పాత తిరోగమన, వివక్షాపూరిత భావజాలమంతా మళ్ళీ రెట్టింపు వేగంతో పైకి తన్నుకొచ్చింది.
ఒకప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త జిడి బిర్లా తన తోటి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి రాసిన లేఖలో వారంతా తమ సంపదను బాహాటంగా ఆడంబరంగా ప్రదర్శించవద్దని సలహా ఇచ్చాడు. ఆ విధంగా గనుక సంపదను ప్రదర్శిస్తే ప్రజాభిప్రాయం ప్రతికూలంగా మారవచ్చునని హెచ్చరించాడు. ఇప్పుడు చరిత్ర తిరగబడింది. ఈ దేశంలోని అత్యంత సంపన్నుడైన పారిశ్రామికవేత్త ముంబాయి మహానగరం నడిబొడ్డులో బ్రహ్మాండమైన బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించి తన సంపదను బాహాటంగా ప్రదర్శిస్తున్నాడు. అలా చేసినందుకు అతడిని తప్పుబట్టడం పోయి , స్వయానా మన ప్రధానమంత్రే అతడిని చాలా విలువైన ''సంపద సృష్టికర్త'' గా అభివర్ణిస్తున్నాడు !
- ప్రభాత్ పట్నాయిక్
(స్వేచ్ఛానుసరణ)