Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటికి నాలుగు సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ''పరీక్షా పే చర్చా'' కార్యక్రమంలో ప్రసంగాలు చేశారు. పదో తరగతి, పన్నెండో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి చేస్తున్న ఆ ప్రసంగాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెబుతున్నారు. ప్రపంచంలో ఏ దేశ ప్రధానమంత్రీ చేయని గొప్ప పని మన ప్రధాని చేస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. కానీ అందులో ఉన్న గొప్పతనం ఏమిటని చాలామంది ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. ''పరీక్షలు గురించి భయపడవద్దు.. మానసిక వత్తిడికి గురి కావద్దు.. పరీక్షలే పరమావధి కాదు.. సుదీర్ఘమైన జీవితంలో అదొక మజిలీ మాత్రమే.. పరీక్షలను పండుగలా ఎంజారు చేయాలి.. గంటల తరబడి అదే పనిగా అవిశ్రాంతంగా చదవద్దు.. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి.. వ్యాయామం చేయాలి.. మంచి ఆహారం తీసుకోవాలి.. వత్తిడి లేకుండా పరీక్షలను ఎదుర్కోవాలి..'' ఇదేకదా ఆయన ప్రసంగాల్లో గల ముఖ్యమైన విషయాలు. ఈపాటి విషయాలను ప్రధానమంత్రే పనిగట్టుకొని ఏడాదికోసారి గంటల తరబడి ప్రసంగించాలా అనేది సహజమైన సందేహం.
ఈ నెల ఏడో తేదీన నిర్వహించిన 'పరీక్షా పే చర్చా' కార్యక్రమంలో పాల్గొనడానికి 13 లక్షల మంది 80 దేశాల నుంచి రిజిస్టర్ చేసుకున్నట్టు విద్యాశాఖమంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పారు. కానీ టీవీల్లో ప్రసారం అయిన ఆ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఎంతమంది తిలకించారు అనే విషయాన్ని యింతవరకు ప్రకటించలేదు. రిజిస్టర్ చేసుకున్న వారిలోనే చాలామంది చూడలేదు. గతంలో పాఠశాలల పని వేళల్లో ప్రత్యక్ష ప్రసారాలు చేయడం వలన ఉపాధ్యాయులే దగ్గరుండి విద్యార్థులకు చూపించేవారు. ఈసారి రాత్రి 7.00-8.30 గంటల సమయంలో ప్రసారం చేయడం వలన ఎక్కువమంది చూడలేదు. చూసినవారిలో కూడా అర్థం చేసుకున్నవారు మరీ తక్కువ. ప్రధాని ఆద్యంతం హిందీలోనే మాట్లాడటం వలన హిందీయేతర రాష్ట్రాల్లోని వారికి విషయాలు సరిగా అర్థం కాలేదు. ఇంక విదేశాల్లోని వారికి ఏమి అర్థం అయిందో ఏమో! ప్రధానితో ఇంటరాక్ట్ అయిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులలో ఎక్కువమంది ఇంగ్లీష్ మీడియం ఉండే కేంద్రీయ విద్యాలయాలు, కార్పొరేట్ స్కూళ్లకు చెందిన వారే. ఇంగ్లీషులో అడిగిన ప్రశ్నలకు కూడా ప్రధాని హిందీలోనే సమాధానాలు చెప్పారు. ఇంగ్లీషులో సమాధానాలు చెప్పడం తెలియకేమీ కాదు, హిందీ భాషా ఆధిపత్యాన్ని రుద్దడంలో అదొక ఎత్తుగడ. పైగా అడిగిన ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పకుండా సాధారణ ఉపదేశాలతో సరిపుచ్చారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక విద్యార్థి ''కరోనా వలన పాఠశాలలు సరిగా పని చేయలేదు, అయినా పరీక్షలు సమీపిస్తున్నాయి, ఎలా రాయాలో ఆందోళనగా ఉంది. భయం లేకుండా ఏకాగ్రతతో పరీక్షలు రాయడానికి ఉపాయం చెప్పండి'' అని అడిగింది. అందుకు ప్రధాని ప్రతిస్పందనలో భయానికి సంబంధించిన సాధారణ సందేశం తప్ప ఉపాయం ఏమీ లేదు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ ప్రకటించిన పరీక్షలను వాయిదా వేయాలి లేదా ఆన్లైన్లో పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేస్తున్న విజ్ఞప్తిని కూడా ప్రధాని ప్రస్తావించలేదు.
''నూటికి నూరు మార్కులు రావాలి, పదికి పది జీపీఏ రావాలి'' అంటూ విద్యార్థులను ఎక్కువసేపు చదివిస్తూ తీవ్రమైన వత్తిడికి గురి చేస్తున్నది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రయివేటు కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు. వారిని వారించే చర్యలు ప్రధాని ప్రస్తావనల్లో లేకపోవడం పెద్ద లోపం. 'విషయాలను అర్థమయ్యే విధంగా చదువుకోండి, పరీక్షల కోసం ఫలితాల కోసం ఆందోళన చెందకండి' అని ప్రధాని విద్యార్థులకు భరోసా ఇస్తున్నారు. కానీ 'ఇన్పుట్స్ కోసం పాకులాడకుండా అవుట్ పుట్స్ కోసమే కేంద్రీకరించాలి' అనే నిటి ఆయోగ్ ఆదేశాలను గానీ, ఏమి చేసైనా సరే అగ్రశ్రేణి ఫలితాలు సాధించాలనే విద్యాశాఖ అధికారుల ఆదేశాలను గానీ ప్రధాని పట్టించుకోకపోవడం విచారకరం. పరీక్షల కోసం వత్తిడికి గురవుతున్న విద్యార్థులకే సందేశాలు ఇస్తూ.. వత్తిడి చేస్తున్న వారిని వారించే పని చేయని ఇలాంటి ''పరీక్షా పే చర్చా'' కార్యక్రమాలు ఎన్ని నిర్వహించినా ఏమి ప్రయోజనం?
- నాగటి నారాయణ
సెల్:9490300577