Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మగతోడు లేకుంటే మనుగడ లేదు' అన్న భావన స్త్రీలలో వచ్చిందంటే అది వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం'' ఇటీవల కేరళ హై కోర్టు ఒంటరి తల్లి కేసులో తీర్పు చెబుతూ పై వ్యాఖ్య చేసింది. అది ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్య కాబట్టి కొద్దిగా ఆలోచిస్తారేమో కాని ఈ సమాజంలో నిత్యం ఏదో ఒక సందర్భంలో 'మగతోడు లేకుండానా' అని స్త్రీ ఆలోచించకుండా ఉంటున్నదా?
ఇటీవల మీడియాలో చూశాను, ఉత్తర భారతదేశంలో ఒక ఆడ కూతుర్ని పదిమంది కుర్రాళ్ళు చుట్టిముట్టి కర్రలతో చావ చితక్కొట్టారు. ఆమె చేసిన మహా అపరాధం ఏమిటంటే ఆమె బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి పొలంలో మల విసర్జన చేయడం. పైరు పచ్చ పల్లెల్లోనే కాక, ఆధునిక నగరాల్లోనూ, పట్టణాల్లోనూ ఇలాంటి ఘటనలు అనేకం చూస్తున్నాం, వింటున్నాం. అయినా తెలిసీ తెలియనట్టు నటిస్తున్నాం.
ఈ రోజు డా|| బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదినం. అంబేద్కర్ బొమ్మలకి దండవెయ్యడానికి, ఫొటోలు తీపిచ్చుకొని ఫేస్ బుక్కుల్లో పోస్టు చెయ్యడానికి తెగ పోటీలు పడతాం. మరో జయంతి, మరో వర్థంతి వస్తూనే ఉంటాయి. పోతూనే ఉంటాయి. కానీ ఆయన ఏం చెప్పాడు. ఏం ఆశించాడు. ఏం జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది? మన బాధ్యత ఏమిటి? ఆలోచించాలి కదా!
అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని, సమానత్వాన్ని గాఢంగా విశ్వసించాడు. కుల, మత , లింగ, జాతి భేదాలు, ఆర్థిక, సామాజిక అసమానతలు లేని సమాజాన్ని ఆశించాడు, కలగన్నాడు. ఆయన మేథస్సుతో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం భారత ప్రజల ప్రజాస్వామ్య హక్కుల్ని, సమాన హక్కుల్ని నొక్కి చెప్పింది. కాని జరుగుతున్న ఘటనలు, ప్రస్తుత పరిస్థితి చూస్తే అసలు రాజ్యాంగం ప్రకటించిన ప్రజల హక్కులు ఏమయ్యాయి అన్న ప్రశ్న రావడం లేదా? బహుశా ఆ భయాలు ఆయన్ని కూడా వెంటాడినట్టున్నాయి. అందుకే ''1950 జనవరి 26న మనం కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వం సాధించాం. అయితే ప్రజల సామాజిక, ఆర్థిక జీవితాల్లో అసమానతలు కొనసాగుతున్నాయి... ఈ వైరుధ్యం ఎంత కాలం కొనసాగుతుంది. ఎంత కాలం ప్రజల సామాజిక, ఆర్థిక హక్కుల్ని నిరాకరించగలం. ఎంత కాలం వైరుధ్యాలతో బ్రతకగలం. ఇదే పరిస్థితి కొనసాగితే మనం సాధించిన రాజకీయ ప్రజాస్వామ్యం కూడా ప్రమాదంలో పడుతుంది''. అని అన్నాడు.
సరిగ్గా నేడు ఇదే జరుగుతోంది. అందరికీ ఓటు హక్కు ఉంది. రాజకీయ హక్కులున్నాయి. కాని ఆ ఓటు సామాజికంగా, ఆర్థికంగా మధించిన భూపతులూ, కులపతులూ, కొనుగోలు చేసే సరుకుగా మారింది. ఎన్నికల ప్రహసనాలు చూస్తున్నాం కదా! సాధించిన రాజకీయ హక్కులు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కూడా ధనాధిపతుల చేతుల్లో పడి గిలగిల కొట్టుకుంటోంది. లేబర్ కోడ్స్ పేరిట వందల సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు ఆవిరయిపోయాయి. ప్రాణ బలిదానాలు, రక్త తర్పణాలు చేసి జమీందార్లు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న 'భూమి' కార్పొరేట్ గద్దలు తన్నుకు పోయే స్థితి వచ్చింది. కనీసం పార్లమెంటులో సరైన చర్చ కూడా లేకుండా కార్మిక, వ్యవసాయ నల్ల చట్టాలు ప్రభుత్వం తెచ్చింది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడటం కాదా?
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నా మా ఊరి ముఖచిత్రం. ప్రజల సమస్యలు- రాజకీయాలు చర్చించే ప్రతి సందర్భంలోనూ గుర్తుకొస్తుంది. 'ఊరు' అంటే అందరికీ ఇష్టమే. చిన్నప్పటి సంగతులు గొప్పగా చెప్పుకుంటాం కాని ఊరు అందరికీ ఒకే రకమైన ఆనందాన్నిస్తున్నదా! అసలు 'ఊరు' అంటే 'గొల్లపాలెం, మాలపల్లి, మాదిగ గూడెం, సాలిపేట, పల్లిపాలేం, గౌండపాలెం, బ్రహ్మణ వీధి- ఇలా కులాల ప్రాతిపదికన ఊరు విడిపోయి లేదా!. భూమి-అసలు సిసలు ఉత్పత్తి వనరు-అధీనంలో ఉన్న 'దొరల' ఆవాసమే 'ఊరు'గా చలామణికావడం లేదా! ఇలాంటి ఊరు అందరికీ ఒకే జీవితాన్ని ఒకే విధమైన ఆనందాన్ని, అనుభూతిని ఇవ్వగలదా! ఇలాంటి ఆర్థిక, సామాజిక అంతరాలున్న గ్రామీణ భారతంలో రాజకీయ సమానత్వం సాధ్యమా? దొర ఎవరి పక్షానుంటే వారికే ఓట్లు కదా!
డా|| అంబేద్కర్ స్వతంత్ర భారత ప్రభుత్వ మొదటి న్యాయ శాఖా మంత్రి. బహుశ సామాజిక న్యాయ కోసం రాజీనామా చేసిన మొదటి మంత్రి కూడా ఆయనే కావచ్చు. ఎందుకోసం? హిందూ కోడ్ బిల్లు కోసం. హిందూ కుటుంబాల్లోని స్త్రీల ఆస్తి వారసత్వ హక్కు కోసం. వైవాహిక జీవితంలో స్త్రీలకు సమాన హక్కులు కోరడం, కొడుకులతో పాటు కూతుర్లకు ఆస్తి సమానంగా పంచాలని అడగడం అనేది హిందూ మతంపై దాడిగా అప్పటి మత పెద్దలకు కనబడింది. కులాల అంతరాలు, స్త్రీలపై వివక్ష ఇవే హిందూ ధర్మమనుకోవాలా? అంటే (ఆ) ధర్మం కుటుంబంలోని స్త్రీలను కూడా వదలదన్న మాట. 'స్త్రీకి స్వేచ్చ ఇవ్వరాదు. ఇస్తే ఎక్కడ కులాంతర వివాహాలు జరుగుతాయేమోనన్న భయం. అదే జరిగితే కుల భ్రష్టత్వం తప్పదు గనుక స్త్రీకి ఆస్తి ఇవ్వరాదు. ఆస్తి కొడుక్కు మాత్రమే చెందాలి. కొడుకు వంశాన్ని నిలబెడతాడు, కులాన్ని ఉద్దరిస్తాడు. స్త్రీ పుత్ర సంతానాన్ని కనిపెంచే పనిముట్టు మాత్రమే'. ఇది మత పెద్దల ధోరణి. అందుకే 'పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు' అనే దీవెనలు పుట్టు కొచ్చాయి. మతం స్త్రీ ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. ఇటువంటి సామాజిక స్థితి ఉండబట్టే మొదట మనం చెప్పుకున్న ఘటనలు జరుగుతున్నాయి.
అందుకని ఏ సామాజిక ఆర్థిక స్థితిలో మనం జీవిస్తున్నామన్న పరిశీలన మనందరికీ కావాలి. మార్పు కోసం ఘర్షణ పడాలి. అంబేద్కర్ కళల్ని నిజం చేయాలి. అదే మనం ఆయనకు అర్పించే ఘన నివాళి. ఈ సమాజంలో ఆయన ఆశించిన సామాజిక, ఆర్థిక, సమానత్వం సాధించే వరకు అంబేద్కర్ బతికే ఉంటాడు. - జనం గుండెల్లో......
- ఎస్. పుణ్యవతి