Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డా|| బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి. సంవత్సరం సవత్సారానికి అంబేద్కర్ జయంతి వేడుకల విస్తృతి పెరుగుతున్నది. కొత్త ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు వెలుస్తున్నాయి. 100అడుగులు, 150 అడుగుల విగ్రహాలు, బారీ కార్యక్రమాలు పెట్టి ఈ మోతలో ఆయన ఆలోచనలను, దార్శనికతను అంతం చేయడానికి ఆర్ఎస్ఎస్ (హిందూత్వ) శక్తులు దూకుడు పెంచాయి. ప్రస్తుతం మత్మోనాదం, కుల వివక్ష, ప్రాంతీయదురభిమానాలు, వాక్ స్వాతంత్య్రంపైన, వ్యక్తిగత గోప్యతపైన దాడులు, మహిళలపై దౌర్జాన్యాలు అసాధారణ స్థాయిలో పెచ్చరిల్లిన నేపథ్యంలో వీటన్నింటినీ అంతం చేయడానికి అటు పౌరులకూ, న్యాయస్థానాలకూ, చట్ట సభలకూ దిక్సూచిగా ఉండాల్సిన రాజ్యాంగాన్నే నిర్వీర్యం చేస్తున్నారు. ''రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే వాళ్ళు చెడ్డ వాళ్ళు అయితే రాజ్యంగం కూడా చెడ్డదిగా మారుతుంది'' అని రాజ్యాంగ ముసాయిదాను ప్రవేశపెడుతూ 1949లో ఆయన చేసిన హెచ్చరిక ఈ రోజు అక్షరాల నిజంగా మారింది. మనువాద, హిందూత్వ శక్తులు అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న తరువాత ఈ ధోరణి తారాస్థాయికి చేరింది. ఈ ధోరణి రాజ్యాంగం ఏర్పడిన మరుసటి సంవత్సరం నుంచే నాటి పాలకులు సన్నగా ప్రారంభించారు. కానీ ''అత్యధిక మెజరిటీ సాధిస్తే ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం వైపు త్రిప్పే ప్రమాదం ఉంటుంది'' అన్న ఆయన మాటలు మనకు 2014, 19 ఎన్నికల అనంతరం కండ్లకు కట్టినట్టు కనబడుతున్నవి.
రాజ్యాంగం ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం
బ్రిటిష్ పరాయి పాలనను తుదుముట్టించిన అనంతరం మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాల్సి వచ్చినప్పుడు ఆ పాలన ఎలా ఉండాలి, చట్టాలు ఏ ప్రాతిపదికన రూపొందించాలి, అన్నింటికీమించి ఒక ఆధునిక భారతదేశ నిర్మాణానికి ప్రజలందరినీ కదిలించడానికి ఎటువంటి కట్టుబాట్లు రూపొందించాలి, అన్న ప్రశ్నలకు సమాధానమే దేశ రాజ్యాంగం. సుమారు 200సంవత్సరాల సుదీర్ఘ స్వాతంత్రోద్యమం, అది ముందుకు తెచ్చిన సాంఘిక, ఆర్ధిక, సాంస్కృతిక సమస్యలు, వాటి శాశ్వత పరిష్కారం దిశగా రాజ్యాంగాన్ని నిర్మాంచారు. డా||బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వంలోని ముసాయిదా కమిటీ, రాజ్యాంగంలోని ఆధునిక సూత్రాలపై వచ్చిన విమర్శలకు సమాధానమిస్తూ ''అవి ప్రజాప్రతినిధులు తమ అధికారాన్ని ఎలా అమలు చేయాలన్నది అర్థం చేసుకోడానికి మాత్రమే, పచ్చి మితవాదశక్తులు అధికారాన్ని కైవసం చేసుకున్న సందర్భంలోనే వీటి యొక్క గొప్ప విలువ అర్ధం అవుతుంది'' అని చెప్పారు. అత్యంత ఎక్కువ కాలం దేశాన్ని పరిపాలించిన మధ్యేవాద పార్టీలు, ఉదారవాద, ప్రజాస్వామ్యవాదులు ఆ హెచ్చరికను గుర్తించకపోవడం వలన ఈ రోజు పచ్చి మితవాదులకు రాజ్యాంగాన్నే తొత్తడం చేసే అవకాశం లభించింది. ''హిందూ రాజ్యమనేది ఒక వాస్తవమైతే అది నిస్సందేహంగా మన దేశానికి పెద్ద ఉపద్రవం అవుతుంది. హిందూత్వం అనేది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు గొడ్డలి పెట్టుగా తయారవుతుంది. ప్రజాస్వామ్యానికీ దీనికీ పొసగదు. అందువలన హిందూ రాజ్యాస్థాపన నెలకొల్పడం ఎట్టి పరిస్థితిలోనూ కానివ్వకూడదు. మతంలో భక్తి మోక్షానికి మార్గం కావచ్చు. కానీ భక్తి, వ్యక్తి ఆరాధనలు రాజకీయాల్లో దిగజారుడుకూ అంతిమంగా నియంతృత్వానికీ దారితీస్తాయి'' అన్న అంబేద్కర్ హెచ్చరిక ఈ రోజు నిజమయ్యింది. అయన హెచ్చరిక చేయడానికి కారణం దేశ విభజన సందర్భంగా ఆర్ఎస్ఎస్ ముందుకు తెచ్చిన వాదనలు, దాని ఫాసిస్టు తరహా భయానక చర్యలు, మరీ ముఖ్యంగా మహత్యగాంధీని హిందూత్వ శక్తులు హత్య చేయటం, ద్విజాతి సిద్ధాతం పేరిట వాదనలు, ఒకపక్క ఆర్ఎస్ఎస్ మరోపక్క ముస్లింలిగ్లు సృష్టించిన విషపూరిత వాతావరణమే. ముస్లింలకు పాకిస్థాన్ ఇవ్వబడింది. కాబట్టి భారతదేశం హిందూదేశం కావాలన్న ఆర్ఎస్ఎస్ తదితర హిందూత్వ శక్తుల వాదనలను దేశం తిరస్కరించింది. ఈ దేశం లౌకిక దేశంగా ఉండాలన్న ప్రజల ఆకాంక్షలకనుగుణంగా లౌకిక రాజ్యాంగం రాయబడింది. అలాగే వివిధ జాతుల సమాఖ్యగా ఉన్న భారతదేశానికి ఫెడరల్ వ్యవస్థే మూలస్తంభంగా ఉంటుందని రాజ్యాంగం రాయబడింది. తరతరాల కులవ్యవస్థను నిర్మూలించే దిశగా దేశం నడిస్తేనే సామాజిక అసమానతలు లేని ఒక ఆధునిక దేశంగా భారతదేశం వెల్లివిరుస్తుందని సామాజికన్యాయం లక్ష్యంగా రాజ్యాంగం రాయబడింది. అంటే లౌకికతత్వం, ఫెడరల్ వ్యవస్థ, సామాజికన్యాయం అనే ఉన్నతమైన ఆధునిక విలువల అవధుల్లో భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి నిండి ఉంటుంది. చట్టాలు, న్యాయస్థానాల తీర్పులు, వీటి ఆధారంగా క్రమంగా ఈ విలువలను ప్రజలందరూ అర్థం చేసుకొని ప్రతీపశక్తులకి వ్యతిరేకంగా నిలబడితేనే భారత రాజ్యాంగం సంరక్షించబడుతుంది. అందువలన భారత రాజ్యాంగం ఒక చట్టామో, ఒక సూత్రమో, ఒక నినాదామో కాదు. భారత దేశాన్ని , ప్రజలను ప్రగతి మార్గంలో నడిపించే దిక్సూచి.
రాజ్యాంగానికి ప్రమాదం....
భారత రాజ్యాంగానికి ప్రమాదం రావొచ్చని అంబేద్కర్ ఏనాడో హెచ్చారించారు. రాజ్యాంగ ముసాయిదాని ప్రవేశపెడుతూ ''మనం ఓ కొత్త జీవన వైరుధ్యంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాలలో సమానత్వం పొందినా, సామాజిక, ఆర్థిక హక్కుల విషయంలో సమానత్వం రాలేదు. ఈ వైరుధ్యాన్ని ఎంతకాలం కొనసాగించాలి. మన సామాజిక, ఆర్థిక జీవితంలో సమానత్వాన్ని ఎంతకాలం తిరస్కరించాలి. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా తొలగించాలి. లేకపోతే అసమానతలతో భాదపడేవారు ఈ అసెంబ్లీ చాల శ్రమతో నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని కూల్చివేస్తారు'' అన్నారు. కానీ వాస్తవానికి ఆయన ఊహించిన దానికి భిన్నంగా స్వాతంత్య్రనంతరం అధికారంలోకి వచ్చిన పాలకులే రాజ్యాంగాన్ని పదేపదే సవరణల పేరిట బలహీనపరుస్తూ వచ్చారు. అయితే ఆయన హెచ్చరించినట్టు ఈ రోజు పచ్చి మితవాదశక్తులు అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. గత పాలకులు దోపిడీ వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్నీ అందులో పొందుపరిచిన విలువలను బలహీనపరుస్తూ వస్తే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మొత్తం రాజ్యాంగాన్నే సమూలంగా పెకలించడానికి దూకుడుగా ప్రవర్తిస్తున్నది. నిజానికి భారత రాజ్యాంగాన్ని హిందూత్వ శక్తులు ఏనాడూ అంగీకరించలేదు. రాజ్యాంగం ఆమోదించబడ్డ 3 రోజులకే ఆర్ఎస్ఎస్ పత్రిక ''ఆర్గనైజర్'' సంపాదకీయం ''మన రాజ్యాంగంలో పురాతన భారతంలో తిరుగులేని రాజ్యాంగంగా చలామణి అయినా మనుధర్మశాస్త్రం యొక్క ప్రస్తావనే లేదు. నేటికీ మనుధర్మ శాస్త్రం ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు అందుకుంటున్నది. కానీ మన రాజ్యాంగ నిర్మాతలకి ఇదేమి పట్టలేదు'' అని పేర్కొంది. అంటే మనుధర్మశాస్త్రాన్ని భారత రాజ్యాంగంగా ప్రకటించాలన్నది ఆర్ఎస్ఎస్ పుట్టుకతో వచ్చిన కోరిక. తాత్కలికంగా ఈ కోర్కెను పక్కకు పెట్టినా బలం పెరిగేకొద్ది ఆ కోరికను హిందూత్వ శక్తులు బలంగానే ముందుకు తెస్తున్నాయి.
తన మౌలికమైన ఈ కోరికను సఫలీకృతం చేసుకొనే సందర్భంలోనే వివిధ కోణాల నుంచి ఆర్ఎస్ఎస్ తన దాడిని రాజ్యాంగంపై ఎక్కుపెడుతున్నది. సుస్మాస్వరాజ్ భారత రాజ్యాంగం కన్నా భగవద్గీత గొప్పగ్రంథం అనటంలోనూ ఇదే కనపడతుంది. కార్మికచట్టాలను యజమానులకు అనుకూలంగా కుదించటం, రాష్ట్ర జాబితాలో ఉన్న వ్యవసాయంపై కేంద్ర చట్టాలు తేవటం, రాజ్యాంగం ప్రస్తావించిన స్వేచ్ఛా స్ఫూర్తినే ఉల్లంఘిస్తూ ఉపా చట్టం తేవటం, అనేక మంది మేధావులనూ సామాజిక ఉద్యమనాయకులనూ జైళ్ళల్లో నిర్భందించడం, వీటన్నింటికీ పరాకాష్టగా భారత రాజ్యాంగానికి గుండెకాయలాంటి పౌరసత్వ చట్టాన్నే సవరించటం, తాజాగా ఢిల్లీ రాష్ట్రానికున్న హక్కులన్నింటినీ రద్దు చేసి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చివేయటం, కాశ్మీర్ ప్రత్యేక హక్కులను అంతం చేయడానికి 370 అధికరణం రద్దు చేయటం, ఇలా వరుసగా భారత రాజ్యంగాన్ని డొల్ల చేసే ప్రక్రియను ఆర్ఎస్ఎస్ వేగవంతం చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు మరింత దూకుడుగా మత మార్పిడులను నిషేధించటం పేరిట, ముస్లిం, క్రైస్తవ, మైనారిటీలను అణగదొక్కడానికి చట్టాలు తెస్తున్నాయి. ఇదంతా ఒక భాగమైతే రాజ్యాంగం స్థానంలో మనుధర్మశాస్త్రాన్ని ప్రతిష్టించటానికి ప్రయత్నాలను ఆర్ఎస్ఎస్ ముమ్మరం చేసింది. మనుధర్మశాస్త్రంలో ఉన్న కటువైన అంశాలని మెత్తపరిచి దాన్ని ప్రజామోదంగా చేయడానికీ తద్వారా ఏకికృత, నిరంకుశ, అభివృద్ధి నిరోధక మత వ్యవస్థను లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ స్థానంలో నిలబెట్టడానికి వారు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.
రాజ్యాంగ పరిరక్షణ ప్రజల బాధ్యత
ప్రపంచంలో అనేకదేశాలలో నూతనంగా ఏర్పడిన రాజ్యాంగాలు పదేపదే మార్చుకుంటున్నప్పటికీ 70సంవత్సరాలకు పైగా భారత రాజ్యాంగం నిలబడి వుండటం ఓ గొప్పవిషయం. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టు కాలనుగుణంగా తన వర్గ ప్రయోజనాలకి అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని పాలకులు పదేపదే బలహీనపరుస్తూ ఉన్నారు. నిజానికి రాజ్యాంగాన్ని నిలబెట్టాలంటే అందులోని అనేక కాలానుగుణం కానీ అంశాలని మార్చుకోవాల్సిందే. కానీ మనదేశంలో పాలకవర్గాలు తమ అవసరాల కోసం మాత్రమే ఈ పని చేస్తూ వచ్చాయి. ఉదాహరణకు తమిళనాడు జయలలిత ప్రభుత్వం 2లక్షల మంది ఉద్యోగులను సమ్మె చేశారని తొలగిస్తే అన్ని రాష్ట్రాలలోని పాలకులూ శభాష్ అన్నారు. ఉద్యోగ, కార్మికులు దేశ వ్యాప్తితంగా తిరగబడ్డారు. ఆ సందర్భంగా సమ్మె హక్కు అనేది సాంకేతికంగా రాజ్యాంగంలో లేదని తేలింది. పారిశ్రామిక వివాదాలు చట్టంలో ఉన్నా (అనేక పరిమితులకి లోబడి) రాజ్యాంగంలో పొందుపరచడానికి సవరణ తేవాలని నాడు కార్మికవర్గం, వామపక్షాలు కోరాయి. కానీ అది జరగలేదు. అలాగే పౌరసత్వ సవరణ, 370 అధికరణం, వీటి ఉల్లంఘన జరిగినప్పుడు వాటిపై రాజ్యాంగంలో స్పష్టంగా ఉల్లఘించిన వారిని శిక్షించేహక్కు పొందుపరచబడాలి. న్యాయస్థానాలకి ఆ విచ్చిక్షణ వదలకూడదు. అలాగే భావ ప్రకటన, సేచ్ఛ రాజ్యాంగ స్ఫూర్తిలో అంతర్భాగం. కానీ నేడు మనువాదులు దాన్ని పూర్తిగా నులిమివేస్తున్నారు. అలాగే రాష్ట్రాల హక్కులపై పార్లమెంటులో మెజారిటీ ఆధారంగా దాడి తీవ్రమైంది. ఇలా రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని పాలక పార్టీలు వెనక్కి కొట్టలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు, ప్రజాతంత్ర శక్తులు, ఉద్యోగ, కార్మిక, రైతాంగ, ఉద్యమాలు, అణగారిన దళిత, గిరిజన ఉద్యమాలు, రాజ్యాంగ పరిరక్షణకై ఒక్క తాటిపైకి రావాలి. మితవాద, మతోన్మాద శక్తులను అంతం చేయాలి. రాజ్యాంగం పీడితులకి మరిన్ని హక్కులు, సౌకర్యాలు, చట్టబద్దం చేసే విధంగా రాజ్యాంగాన్ని మరింత పరిపుష్టం చేసుకోవాలి. అదే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కి భారత ప్రజలు ఇచ్చే నివాళి కాగలదు.
- ఆర్. రఘు
సెల్:9490098422