Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోకిల గానంలో, ఈసారి
మునుపటి మాధుర్యం లేదు!
ఎదో యుద్ధ సందేశం లాగుంది.
ఉత్తర భారతం తిరిగొచ్చినట్టుంది.
రైతుల పోరు శిబిరాలను,
వారి కడగండ్లను, యుద్ధ పటిమను
చూసొచ్చినట్టుంది!
అందుకే ఈసారి ఎప్పటిలా లేదు!
తెలుగు జాతిని మేలుకొలిపే
ఉగాదినాడు, తనకోసం
ఎదురుచూస్తారని తెలిసి
మనకో సందేశం ఇవ్వాలని
ఎగిరెగిరి వచ్చింది!
'ఓ నా ప్రియతమ తెలుగు బిడ్డల్లారా!
మీ పంటలను, పొలాలను, తోటలను
సమస్త భూవనరులను కబళించే
నల్లచట్టాలు వచ్చాయి!
ఇప్పటికయినా మేలుకోండి!
ఢిల్లీ పోరుతో జతకట్టండి!
లేకుంటే మీరు తినే ఉగాది పచ్చడిలోని
మామిడి ముక్కలను, వేప పువ్వును,
బెల్లం, చెరుకు ముక్కలను కూడా
డాలర్ల రేటులో కార్పొరేట్ల దగ్గర
కొనాల్సి ఉంటుంది!
పేడ, పిడకలు, గోమూత్రం,
మంచి నీళ్లు, పీల్చే గాలి కూడా
కార్పొరేట్ల కబంద హస్తాలలోకి
వెళ్లనున్నాయి!' అని అంటూ
గంభీర స్వరంలో కోకిల
గానాలాపన చేస్తోంది!
'పౌరుషాల పురిటి గడ్డయిన
తెలుగు జాతి మనది!
మహత్తర తెలంగాణ రైతాంగ పోరాట
వారసత్వం మనది!
నల్ల చట్టాలతో కార్మికులు, కర్షకులను
ఉరికంబం ఎక్కిస్తోన్న కార్పొరేట్ పాలకులను
నిలువరించేందుకు పోరు సలపాలని'
కోకిల సందేశం వినిపిస్తోంది!
ఈ 'ప్లవ' నామ సంవత్సరాన్ని
వి'ప్లవ'నామ సంవత్సరంగా పాటించాలని
తెలుగు ప్రజలకు పిలుపునిస్తోంది!!
- సత్య భాస్కర్
సెల్:9848391638