Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరేబియా సముద్రంలో కేరళకు దగ్గరగా ఉన్న లక్ష దీవుల చుట్టూ ఉన్న మన ప్రత్యేక ఆర్థిక మండలి(ఇఇజెడ్) ప్రాంతంలోకి ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా యుద్ధ నావ ఏప్రిల్ ఏడున ప్రవేశించింది. ఆ విషయాన్ని అదే రోజు అమెరికా ప్రకటించిన తరువాత రెండు రోజులకు మన ప్రభుత్వం దౌత్య పద్ధతిలో నిరసన తెలిపింది. కేరళలోని కొచ్చి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో లక్షదీవులు ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం(వాటిని పాటిస్తే) ప్రతి దేశానికి తన తీరం నుంచి సముద్రంలో 200 నాటికల్ మైళ్లు లేదా 370 కిలోమీటర్ల మేరకు హక్కు ఉంటుంది. ఆ మేరకు అక్కడ ఉండే గ్యాస్, చమురు, ఖనిజాలు, చేపల వంటి సంపదలపై ఆ దేశాలకు హక్కు ఉంటుంది. ఆ పరిధిలోకి ఎవరైనా ప్రవేశించాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని అమెరికా అంగీకరించటం లేదు. అందువల్లనే తాము అనుమతులు తీసుకోవాల్సిన అవసరంలేదనీ నౌకాయానం చేసే హక్కు, స్వేచ్ఛ తమకు ఉన్నదనీ అమెరికా సప్తమ నౌకాదళంలోని డిస్ట్రాయర్ నౌక యుఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ అధికారులు ఏప్రిల్ ఏడవ తేదీన ప్రకటించారు. ఇది అనుచితం అంటూ మన దేశం నిరసన తెలిపింది. ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా విదేశీ నౌకలు ప్రవేశించరాదని పేర్కొన్నది. ఆయా దేశాల ప్రత్యేక జోన్ల తీరాలకు రావటం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలతో మిలిటరీ విన్యాసాలు- చర్యలు అనుమతి లేకుండా జరపరాదని ఐరాస తీర్మానాలున్నాయని పేర్కొన్నది. పర్షియన్ గల్ఫ్ నుంచి మలక్కా జలసంధి వరకు పహారాలో భాగంగా ప్రయాణిస్తూ అనుమతి లేకుండా మన జలాల్లో లక్ష ద్వీపాలకు పశ్చిమంగా 130 నాటికల్ మైల్ వరకు అమెరికా నౌక వచ్చింది.
చిత్రం ఏమిటంటే గతంలో కూడా అనేక సార్లు ఇలా అక్రమంగా ప్రవేశించినా ఆ విషయాన్ని అమెరికా ఎన్నడూ బహిరంగంగా ప్రకటించలేదు, మన దేశమూ ఎందుకో నిరసన తెలపలేదు. ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది అన్న ప్రశ్న తలెత్తింది. అనుమతి లేకుండా అమెరికా యుద్ధ నౌక చివరిసారిగా 2018 అక్టోబరు ఒకటి నుంచి 2019 సెప్టెంబరు 30వరకు తిరిగింది. హిందూ మహా సముద్రం ప్రాంతలో గగన తల, నౌకాయాన కార్యకలాపాలు నిర్వహించేందుకు తమకు హక్కుందని, వాటిని కాపాడుకొనేందుకు పర్యటించినట్టు అమెరికా రక్షణశాఖ నివేదికలో పేర్కొన్నారు. అంతకు ముందు 2015, 16, 17 సంవత్సరాలలో కూడా ఇలాగే అనుమతి లేకుండా పర్యటించినా ఎన్నడూ బహిరంగ ప్రకటన చేయని అమెరికా ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు ప్రకటించింది. 1991 నుంచి ఇప్పటి వరకు మూడు దశాబ్దాల్లో 20సార్లు మన అనుమతి లేకుండా అమెరికా నావలు మన జలాల్లో తిరిగాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా తమ మిలిటరీ తిరుగుతుంటుందని, అంతర్జాతీయ చట్టాల మేరకు తమకు హక్కు ఉందని తెలియచెప్పేందుకే ఈ పని చేస్తామని కూడా అమెరికా తెలిపింది. ఇదేదో ఒక దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నది లేదా రాజకీయ ప్రకటనలు చేసేందుకు కాదని, గతంలోనూ చేశామూ, భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఆయా దేశాలు తమకు లేని హక్కులను ప్రకటించుకుంటున్నాయని, అలాంటి వాటిని గుర్తించి ప్రతి చోటా దాన్ని సవాలు చేస్తూ తాము తిరుగుతుంటామని తెలిపింది. బంగాళాఖాతం, అరేబియా, హిందూ మహాసముద్రాలకు అమెరికాకు ఎలాంటి సంబంధంలేదు. ఈ ప్రాంతంలో పహారా కాయమని వారిని ఎవరు అడిగారు? ఎవరి కోసం ఆ పని చేస్తున్నారు? ఇది ప్రపంచ పోలీసుగా తనకు తానే ప్రకటించుకొని చేస్తున్న అదరగొండితనం తప్ప మరొకటి కాదు.
2019లో అండమాన్-నికోబార్ దీవుల జలాల్లోకి చైనా నౌక ప్రవేశించినప్పుడు వెనక్కు పంపించారు. మరి అమెరికా నావలు 20సార్లు ప్రవేశిస్తుంటే మన మిలిటరీ, ప్రభుత్వం ఏమి చేస్తున్నది? అమెరికా తాజాగా చేసిన ప్రకటన గురించి అనేక వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ఇది చైనాను ఉద్దేశించి చేసినట్టు బలంగా వినిపిస్తున్న అంశం. ఇదే సమయంలో మన దేశానికి కూడా హెచ్చరిక అన్నది మరొకటి. ఒక వేళ చైనాకు హెచ్చరిక అయితే మన ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నట్టు? దక్షిణ చైనా సముద్రంలోని దీవులపై తమకు హక్కు ఉన్నదని చైనా చేస్తున్న వాదనను అమెరికా, మరికొన్ని దేశాలు అంగీకరించటం లేదు. నిజానికి వాటి మీద చైనా పొరుగుదేశాలు తమ హక్కుల గురించి వివాదాన్ని లేవనెత్తితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎలాంటి సంబంధమూ లేని అమెరికా ముందుకు వస్తోంది. అంతేకాదు, గతంలో తాము చైనాను ఆక్రమించిన సమయంలో కొన్ని దీవులు తమ ఆధీనంలోకి వచ్చాయని, వాటిమీద హక్కు తమదే అని జపాన్ వాదిస్తోంది. ఈ వివాదంలో మన దేశానికి ఎలాంటి సంబంధం లేకపోయినా అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా విహరించే హక్కు ఉన్నదని స్పష్టీకరించేందుకు అంటూ మన దేశం కూడా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో చతుష్టయం పేరుతో చేతులు కలిపింది. అమెరికా తెలివిగా మన దేశాన్ని చైనాతో సరికొత్త వివాదంలోకి దించింది. అనేక మిలిటరీ సంబంధ ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఇప్పుడు మనం వెనక్కు రాలేని పరిస్థితి ఏర్పడిందని గ్రహించిన తరువాత అమెరికా తన అసలు రూపాన్ని బయటపెట్టి చివరికి మన హక్కులను కూడా సవాలు చేస్తోంది. చివరికి మన పరిస్థితి తేలుకుట్టిన దొంగ మాదిరి తయారైందని చెప్పవచ్చు.
తీరదేశాల హక్కులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఒప్పందం 1994లో అమల్లోకి వచ్చింది. దాన్ని 168 దేశాలు నిర్ధారించగా అమెరికా ఇంతవరకు ఆమోదించలేదు. మన దేశం మరుసటి ఏడాదే ఆమోదించింది. కానీ, దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛగా నౌకల ప్రయాణం తమ జాతీయ భద్రతకు అవసరమని మోకాలికి - బోడి గుండుకూ ముడి వేసినట్టుగా అమెరికా వాదిస్తున్నది. ఆ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలకు తమకు హక్కున్నదని వాదిస్తోంది. పసిఫిక్ సముద్రం-మలక్కా జలసంధి మధ్య దక్షిణ చైనా సముద్రం వాణిజ్య నౌకా ప్రయాణానికి కీలకం. ఏటా నాలుగున్నరలక్షల కోట్ల డాలర్ల విలువగల వాణిజ్యం ఈ మార్గం గుండా జరుగుతున్నట్లు అంచనా.
సముద్ర చట్టాల్లో ఉన్న లోపాలు లేదా ఏకాభిప్రాయం లేకపోవటం లేదా చట్టాలకు చెబుతున్న భాష్యాల కారణంగా అనేక దేశాల మధ్య వివాదాలు ఉన్నాయి. ఉదాహరణకు దక్షిణ చైనా సముద్రంలో ఉన్న హైనాన్ దీవి చైనాలో ఒక రాష్ట్రం. అదే విధంగా ఆ సముద్రంలోని ఇతర చైనా దీవులు కూడా ఇలాగే సుదూరంగా ఉన్నాయి. అందువలన వాటి చుట్టుపక్కల 370 కిలోమీటర్ల వరకు చైనాదే అధికారం. కొన్ని దీవులు తమవని తైవాన్ అంటోంది. తైవాన్ ప్రస్తుతం విడిగా ఉన్నప్పటికీ అది చైనాలో అంతర్భాగమే కనుక ఎప్పుడైనా విలీనం కావాల్సిందే, అప్పుడు ఆ దీవులు కూడా చైనాకే చెందుతాయి. దీన్ని అమెరికా అంగీకరించటం లేదు. అదే విధంగా ఆ ప్రాంతంలోని వియత్నాం, ఫిలిప్పైన్స్, దక్షిణకొరియా, ఇతర దేశాలైన జపాన్, రష్యా, శ్రీలంక, మాల్దీవులు, భారత్ తీరాల్లోని అధికారాన్ని కూడా అమెరికా సవాలు చేస్తోంది. దానికి తన పెత్తనం, ప్రయోజనాలు తప్ప మిత్ర-శత్రు దేశాలనే తేడా లేదు. ఉంటే మన దేశం గురించి ఇలాంటి ప్రకటన చేసి ఉండేది కాదు. లక్షద్వీపాల ప్రత్యేక ఆర్థిక ప్రాంతం గురించి అమెరికా చేసిన ప్రకటన పదజాలం గతంలో శత్రుదేశంగా పరిగణించే చైనాతో మాత్రమే చేసింది. ఇంతవరకు జపాన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల విషయంలో ఉపయోగించలేదు. దీంతో మన నేతల ముఖాలు కందగడ్డల్లా రంగుమారాయని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్ ఇరకాటంలో పడటంతో అమెరికా తన ప్రకటనను సమర్ధించుకుంటూనే నష్టనివారణ చర్యలకు పూనుకుంది. భారత్‌తో భాగస్వామ్యానికి మేము ఎంతో విలువ ఇస్తాము. ఇది మీ గురించి కాదు, అంతర్జాతీయంగా మేము ఎప్పుడూ చేస్తున్నదానిలో భాగంగానే ఇక్కడా చేశాము తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నరేంద్రమోడీ లేదా విదేశాంగ, రక్షణ మంత్రుల నోట మాటరావటంలేదు. వివాదాన్ని మూసిపెట్టే ప్రయత్నం జరుగుతోంది.
ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు అమెరికా అన్ని ఖండాలలో పన్నెండు నౌకా దళాలను ఏర్పాటు చేసింది. వాటిలో లక్ష్యం పూర్తి అయిన తరువాత ఐదు పని చేయటం లేదు లేదా ఇతర వాటితో విలీనం చేశారు. ప్రస్తుతం రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, పది మాత్రమే పని చేస్తున్నాయి. వీటిలో పదవది మిగిలిన ఆరు నౌకాదళాల సమాచార వ్యవస్థలను సమన్వయ పరిచే విధులు నిర్వహిస్తుంది. ఆరింటిలో సప్తమ నౌకాదళమే పెద్దది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆసియాలో అమెరికా జరిపిన కొరియా, వియత్నాం, గల్ఫ్ దాడులన్నింటిలో ఇది పాత్రధారిగా ఉంది. మూడు వందల యుద్ధవిమానాలు, 60 నుంచి 70 వివిధ రకాల యుద్ధనౌకలు, 40వేల మంది సైనికులు ఉన్నారు. దీని ప్రధాన కేంద్రం జపాన్‌లోని యొకోసుకాలో ఉంది. బంగ్లాదేశ్ విముక్తి సమయంలో మన దేశాన్ని బెదిరించేందుకు అమెరికా ఈ దళాన్ని బంగాళాఖాతంలోకి నడిపింది. ఆ సమయంలో మన దేశం నాటి సోవియట్ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకొన్నది. సోవియట్‌తో ఆ ఒప్పందం చేసుకున్న తరువాతనే మన దేశం బంగ్లాదేశ్‌లోకి సైన్యాన్ని పంపి పాక్ సైన్యాన్ని అణచివేసి విముక్తి కలిగించింది.
ఇప్పటికే హిందూ మహాసముద్రంలో డిగాగార్షియా దీవుల్లో సైనిక స్థావరం ఉన్న అమెరికా అక్కడి నుంచి వైదొలిగేందుకు నిరాకరిస్తోంది. మారిషస్‌కు చెందిన ఈ దీవులను బ్రిటన్ తన వలస కాలంలో అమెరికాకు కౌలుకు ఇచ్చింది. వాటిని మారిషస్‌కు అప్పగించాలని అంతర్జాతీయ న్యాయస్దానం 2019లోనే తీర్పు చెప్పింది. అయినా ఖాళీ చేయలేదు. ఇక్కడి అమెరికా నౌకా స్థావరం ఆసియా-ఆఫ్రికా దేశాలపై దాడులకు అనువుగా ఉంటుంది కనుకనే ఏదో ఒక సాకుతో కొనసాగించేందుకు పూనుకుంది. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రమే కాదు అరేబియా సముద్రంలో కూడా తాము కాలుపెడతామంటూ మొదటికే మోసం తెస్తూ మన దేశానికే అమెరికా బహిరంగంగా చెప్పేసింది. రేపు బంగాళాఖాతంలో అండమాన్ దీవుల గురించి కూడా ఇదే ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదు. లడఖ్ సరిహద్దులో చైనా సైనిక కదలికల పేరుతో తప్పుడు సమాచారం అందించి మన మిలిటరీని కొండలెక్కించిన అమెరికా ఎత్తుగడ తెలిసిందే.
గత కొద్ది రోజులుగా దక్షిణ చైనా సముద్రంలోనూ, తైవాన్-చైనా మధ్య సముద్రంలోనూ రెచ్చగొట్టే కార్యకలా పాలకు పూనుకున్న అమెరికా ఇదే సమయంలో మన అరేబియా సముద్రంలోనూ కెలుకుతోంది. లక్షదీవుల ఉదంతం తరువాత చతుష్టయం పేరుతో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలసి చైనాకు వ్యతిరేకంగా కూటమి కడుతున్న మన దేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటం అవసరం. విభజించి పాలించే అమెరికా ఎత్తుగడలలో చిక్కుకోకుండా ఉండాలంటే చతుష్టయ కూటమి నుంచి బయటకు వచ్చి, మన సార్వభౌమత్వ విషయంలో ఎలాంటి రాజీలేదని అమెరికాకు స్పష్టం చేయాల్సి ఉంది. అంత సాహసం కాషాయ దేశభక్తుడు నరేంద్రమోడీకి ఉందా? నిజ మైన దేశ భక్తులు ఆలోచించాలి.
- ఎం. కోటేశ్వరరావు
సెల్:8331013288