Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరేంద్రమోడీ ఎవరికీ చెప్పకుండా, ఎవరి సలహాలూ తీసుకోకుండా రాత్రికి రాత్రి హఠాత్తుగా పెద్దనోట్ల రద్దు చేయడం వల్ల అప్పట్లో ప్రజలు చాలా కష్టపడవలసి వచ్చింది. వృద్ధులు, మహిళలు పోస్టాఫీసులు, బ్యాంకుల ముందు గంటల సేపు కాళ్ళు నొప్పెట్టేలా నిలబడవలసి వచ్చింది. ఈ కారణంతో కొందరు అనారోగ్యం పాలయ్యారు. మరికొందరు అసువులు బాసారు. బీజేపీ ప్రభుత్వం అనాలోచితంగా తెచ్చిన జీఎస్టీ వల్ల కూడా ఒరిగిన ప్రయోజనమేమీ లేదు. దానివలన రాష్ట్రాలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మోడీ నేతృత్వంలో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద చట్టాలను తెచ్చింది. దేశంలో మత ఘర్షణలు జరగటానికి కారణమయింది. ఈ చట్టాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడి ఢిల్లీతోపాటు అనేక ఉత్తరాది రాష్ట్రాలో అల్లర్లు, అలజడులు చెలరేగి పౌరులు అనేక మంది గాయపడటం, చనిపోవటం జరిగింది. ఈ మధ్య తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు కూడా ఎవరితో చెప్పకుండా రైతునేతలను సంప్రదించకుండా, ఉభయ సభల్లో చర్చలు జరపకుండా అమల్లోకి తెచ్చారు. దాంతో వ్యవసాయ చట్టాలు వివాదాస్పదమయ్యాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వాటిని వ్యతిరేకించారు. రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా నేతలు, కార్మిక సంఘాలు రైతులకు మద్దతుగా నిలిచారు. భారత్ బంద్‌ను కూడా పాటించారు. అంతేనా మోడీ పాలనలో దర్యాప్తు సంస్థలు నిర్వీర్యంగా మారాయి. ప్రతిపక్ష నాయకుల ఆస్తులపై దాడులు, అరెస్టులు నిత్యకృత్యమైపోయాయి. నిరుద్యోగం, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, సైనికుల మరణాలు, పొరుగుదేశాల చొరబాట్లు, కవ్వింపు చర్యలు అధికమయ్యాయి. అన్ని రంగాలు పతనమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యింది. బ్యాంకుల పనితీరు అధ్వాన్నంగా తయారయ్యింది. బ్యాంకులేకాక లాభాలతోనడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక దేశ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ప్రజలకు మంచి తక్కువ, చెడు ఎక్కువ జరుగుతోంది. అయినా ప్రజలు నరేంద్రమోడీనే నమ్ముతున్నారు. ఆయన మాతరతులో పడి ఓట్లు వేసి ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. ఇక ఈ ప్రక్రియ ఇంతటితో ముగిసిపోవాలి.
- ఎం.ఎస్, హైదరాబాద్.