Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2021 మార్చి 23న బీహార్ అసెంబ్లీ మున్నెన్నడూ ఎరుగని హింసకు వేదికగా నిలిచింది. సభా సాంప్రదాయాలకు, నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు అసెంబ్లీలోకి ప్రవేశించి శాసనసభ్యులను అసెంబ్లీలోనే క్రూరంగా చావగొట్టారు. నితీష్ కుమార్ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో ఒక సాయుధ బలగాన్ని ఏర్పాటు చేసి దానికి అపరిమితమైన అధికారాలివ్వడానికి 'బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ బిల్-2021' ను ప్రతిపాదించింది. ఇప్పుడు ''బీహార్ మిలిటరీ పోలీస్''గా వ్యవహరిస్తున్న పోలీసు దళాలు ఇకపై ''బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్''గా పని చేస్తాయి. కేవలం పేరు మార్పు కోసమే చట్టం అయితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని ఈ చట్టం బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్‌కు విశేషమైన నిరంకుశ అధికారాలను కట్టబెడుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఏ వ్యక్తి వలన అయినా విఘాతం కలుగుతుందని పోలీసులు భావిస్తే ఎటువంటి వారంటూలేకుండానే ఆ వ్యక్తిని అరెస్టు చేయవచ్చు. ఎవరైనా వ్యక్తి, లేదా వ్యక్తుల వలన ప్రభుత్వ కార్యాలయాల రక్షణకు ప్రమాదం కలుగుతుందని పోలీసులు భావిస్తే వారిని ముందుగానే అరెస్టు చేయవచ్చు. ఎటువంటి వారంటూ అవసరం లేదు. సంబంధిత వ్యక్తుల, సంస్థల ఇళ్ళను, కార్యాలయాలను ఎటువంటి ముందస్తు అనుమతీ లేకుండానే పోలీసులు సోదా చేయవచ్చు. అలా సెర్చ్ చేసిన పోలీసు అధికారుల మీద ఎటువంటి కేసులనూ నమోదు చేయడానికి వీలులేదు.
ఈ విధంగా అవధులు లేని నిరంకుశ అధికారాలను పోలీసులకు కట్టబెట్టడం అంటే ఇకపైన బీహార్‌లో ఎవరూ నిరసనలను తెలియజేయడానికి వీలు లేదన్నమాట. నోరెత్తితే చాలు, జైల్లో కుక్కుతారు. అందుకే బీహార్‌లో ప్రతిపక్షం మొత్తం ఈ బిల్లును ప్రవేశ పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా, నితీష్‌కుమార్ ప్రభుత్వం ఈ నిరంకుశ చట్టాన్ని ప్రవేశపెట్టింది. తనకున్న మెజారిటీని అడ్డం పెట్టుకుని, అదీ చాలక, పోలీసులను అసెంబ్లీలోకి అనుమతించి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడి చేయించింది. తన ప్రభుత్వ పాలనపై రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేకతను, విమర్శలను, నిరసనలను తుపాకీ బలంతో అణచివేయడానికే నితీష్ నేతృత్వం లోని జేడీ(యూ)-బీజేపీ ప్రభుత్వం సంకల్పించింది. ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు దాపురిస్తున్నాయనడానికి ఇది మరో సంకేతంగా మనం పరిగణించాలి.
బీహార్ మిలిటరీ పోలీస్ ఇప్పటివరకూ సాధారణ పోలీసు బలగాలకు తోడుగా పనిచేసే అదనపు పోలీసు బలగంగానే ఉంది. దానికంటూ ప్రత్యేక అధికారాలు ఏవీ లేవు. మన రాష్ట్రంలో కూడా అటువంటిదే ఏపీ స్పెషల్ పోలీసు (ఎపిఎస్పి). ఏ సందర్భంలోనైనా జనరల్ పోలీసు బలగాలకు అదనంగా తోడు కావలసివస్తే అప్పుడు మాత్రమే ఈ బలగాలు (వీటినే రిజర్వు పోలీసు దళాలు అని కూడా అంటాం) రంగంలోకి దిగుతాయి. స్వంతంగా శాంతి, భద్రతల విషయంలో ఈ దళాలు ఎటువంటి నిర్ణయాలూ తీసుకోడానికి వాటికి అధికారాలు లేవు.
ప్రస్తుతం రాష్ట్రంలో మారుతున్న సామాజిక- రాజకీయ పరిణామాల దృష్ట్యా (అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్న దృష్ట్యా) ఎదురౌతున్న సవాళ్ళను తట్టుకోడానికి ఈ అదనపు బలగాలకు కూడా ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడం అవసరమని భావిస్తున్నట్టు ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెడుతూ చెప్పింది. ''బహుముఖ ప్రజ్ఞా పాటవాలు'' కలిగిన పోలీసు బలగాలు నేటి తక్షణ ఆవశ్యకత అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది పూర్తి అప్రజాస్వామిక చట్టం అని, కేవలం ప్రతిపక్షాలను అణచివేయడానికే ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
''ఇది నితీష్ మోడల్ ఉపా (యూఏపీఏ) చట్టం'' అని ఆర్జేడీ సీనియర్ నేత మనోజ్ ఝా విమర్శించారు. కేంద్రం ఆ ఉపా చట్టం క్రింద ప్రభుత్వాన్ని విమర్శించే వారెవరైనప్పటికీ - విద్యార్థులు, ప్రొఫెసర్లు, రైతులు, మేధావులు, రాజకీయ ప్రత్యర్ధులు - ఎవరినైనా ఎటువంటి విచారణా లేకుండా ఎంతకాలమైనా నిర్బంధిస్తోంది. ఇప్పుడు అటువంటి అధికారాన్నే తన ప్రత్యర్ధులను అణచివేయడానికి నితీష్ కుమార్ కోరుకుంటున్నాడు. అందుకే ఈ చట్టం'' అన్నారాయన.
ఇంత అత్యవసరంగా ఈ తరహా చట్టాన్ని తీసుకురావలసిన అవసరమేమిటో, అందులోని ఔచిత్యమేమిటో, ఎటువంటి ఏకాభిప్రాయాన్నీ పెంపొందించకుండానే ఇంత దుర్మార్గమైన పద్ధతిలో ఈ చట్టాన్ని ఆమోదింపజేసుకోవడమెందుకో రాజకీయ విశ్లేషకులు వివరించలేకపోతున్నారు. చాలా విస్తృతమైన ప్రభావాన్ని కలిగించే ఇటువంటి చట్టాన్ని తీసుకువచ్చేటప్పుడు మామూలుగా అన్ని పార్టీల మధ్యా ఏకాభిప్రాయాన్ని సాధించడం కోసం ప్రభుత్వం ముందుగా ప్రయత్నించాలి. కాని కనీసం తన మంత్రివర్గ సహచరులను కూడా సంప్రదించినట్టు లేదు. ఇప్పుడున్న చట్టాల ప్రకారం సాధారణ పోలీసులకు సోదా చేయడానికి, అరెస్టు చేయడానికి అధికారాలున్నాయి. అదే సమయంలో పౌరులకు కూడా ఆ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అధికారం ఉంది. పోలీసులపై కోర్టుకు పోయే అవకాశం కూడా ఉంది. కాని ఈ కొత్త చట్టం పౌరులకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం'' అని మరో సీనియర్ ఆర్జెడి నేత శివానంద్ తివారీ అన్నారు.
బీహార్‌లోని ప్రతిపక్షాలన్నీ, (ఆర్జేడీ, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఎంఎల్ తదితరులు) ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. ఈ నిరంకుశ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, అసెంబ్లీలో దాడి చేసిన పోలీసులను శిక్షించాలని, మార్చి 23న అసెంబ్లీలో జరిగిన ఘటనలకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని వారు కోరుతున్నారు. ఈ బిల్లుకు ఆమోదం తెలపవద్దని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలతోబాటు కోర్టుకు కూడా పోవాలన్న యోచనలో ఉన్నారు.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం ఈ వివాదాన్ని త్వరగా పరిష్కారం చేయాలన్న దృష్టితో వ్యవహరించడంలేదు. అసెంబ్లీలో శాసనసభ్యులపై జరిగిన దాడికి పూర్తి బాధ్యత ప్రతిపక్షాలదే అని, వారిపై జరిగిన దాడికి తాను ఏ విధంగానూ బాధ్యత వహించబోనని, అసెంబ్లీలో ఏం జరిగినా అందుకు బాధ్యత వహించాల్సినది స్పీకర్ మాత్రమేనని నితీష్ ప్రకటించారు. అసెంబ్లీలోకి పోలీసులు ప్రవేశించడం గురించి స్పీకర్‌కు ఎటువంటి ముందస్తు సమాచారమూ లేదని, ఆయన అనుమతి లేకుండానే పోలీసులు లోపలికి ప్రవేశించారని ఒక ఆర్జేడీ ఎమ్మెల్యే అన్నారు. వాస్తవానికి స్పీకర్ ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న యోచన కూడా చేశారని ఆ ఎమ్మెల్యే అన్నారు.
నవంబర్ 2020లో నితీష్ కుమార్ ఏడవసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక ఆయనలో విమర్శల పట్ల అసహనం తారాస్థాయికి చేరుకుంది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఏ పౌరుడైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దానిని ఒక సైబర్ నేరంగా పరిగణిస్తూ 2021 జనవరిలో ఒక చట్టం తెచ్చాడు నితీష్. దానిపై కూడా వ్యతిరేకత వెల్లువెత్తింది. ఐనా నితీష్ వెనక్కి తగ్గలేదు. మృదు స్వభావిగా, ప్రజాతంత్రవాదిగా, అందరినీ మెప్పించగల నాయకుడిగా గతంలో నితీష్‌కు మంచి పేరు ఉండేది. కాని బీజేపీతో జత కట్టాక ఏ స్థాయిలో మార్పు వచ్చిందో ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. విస్తుబోతున్నారు. ఈ పోలీసు చట్టం విషయంలో బీజేపీ ఇంతవరకూ పెదవి విప్పకపోవడం బట్టి ఆ పార్టీ నితీష్‌కుమార్ పై ఏ స్థాయిలో ఒత్తిడి చేయగలుగుతోందో గ్రహించవచ్చు.
చట్టసభల్లో సాధించిన మెజారిటీ ఒక్కోసారి కొందరు నాయకులకు విపరీతమైన అహంకారాన్ని తెచ్చిపెడుతుంది. 1984లో అసాధారణమైన మెజారిటీతో ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ఆ తర్వాత కొద్దికాలానికే బోఫోర్స్ కుంభకోణంలో చిక్కుకున్నాడు. విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని సహించలేకపోయిన రాజీవ్‌గాంధీ జూలై 1988లో పరువునష్టం బిల్లు తెచ్చాడు. తద్వారా పత్రికల నోళ్ళు మూయాలని ప్రయత్నించాడు. కాని దానిపై తలెత్తిన వ్యతిరేకతెంత తీవ్రంగా ఉండినదంటే పెప్టెంబరు 1988లో ఆ బిల్లును ఉపసంహరించు కుంటున్నట్టు రాజీవ్ గాంధీ ప్రకటించాడు. 'మన ప్రజాస్వామ్యం సచేతనంగా ఉండడానికి, దాని అంతర్గత బలంలో ఒక విడదీయలేని భాగంగా ఉన్న పత్రికా స్వేచ్ఛ ముఖ్య కారణం. పత్రికా స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యం మనజాలదు. ఎప్పటికీ నిలిచిపోయే మన స్వాతంత్య్రోద్యమపు విలువల నుంచి మన దేశంలో పత్రికా రంగం ఆవిర్భవించింది. ఆ వారసత్వానికి మేం కట్టుబడివున్నాం'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు.
స్వాతంత్య్రానంతరం, అధికారంలో చాలాకాలం కొనసాగిన కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పెడధోరణులు, నియంతృత్వ పోకడలు ప్రవేశించాయి. అయినప్పటికీ ఏదో ఒక మూల ఆ ''స్వాతంత్య్రోద్యమపు విలువలు ఎంతో కొంత ఇంకా ఉండబట్టి రాజీవ్ గాంధీ ప్రకటనలో అది వ్యక్తమైంది. కాని జాతీయోద్యమానికి దూరంగా ఉండి, ఇతోధికంగా బ్రిటిష్ పాలకుల పట్ల తమ విధేయతను ప్రదర్శిస్తూ వచ్చిన బీజేపీ నుంచి ఆ విధమైన స్పందన ఆశించగలమా? ఆ బీజేపీతో చెలిమి చేసి నితీష్ దిగజారిన వైనం ఇప్పుడు కండ్లకు కడుతోంది. పూర్వకాలపు నితీష్ ఇంకా ఏ మూలనైనా సజీవంగా ఉన్నారా లేక బీజేపీ ఉచ్చునే మహదానందంగా భావిస్తున్న నితీష్ మాత్రమే మిగిలివున్నారా అనేది పోలీసు బిల్లు విషయంలో నిగ్గు తేలనుంది.
- ఎం.వి.ఎస్. శర్మ