Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాస్తవికత లేని కల మూర్ఖుల స్వర్గం లాంటిది.
నిద్రపోతున్నంత వరకూ అక్కడ ఏమైనా సాధ్యమే!
- జేమ్స్ రస్సెల్ లోవెల్, అమెరికన్ కవి, సంపాదకుడు, రాజనీతిజ్ఞుడు.
మనిషి కొతిలా ఉండే ఓ జాతిలో నుంచి పరిణామం చెందుతూ వచ్చాడంటే నమ్మంగాక నమ్మం. అదే కోతి జాతికి చెందిన హనుమంతుడనేవాడు రెక్కలు లేకుండానే అమాంతం గాల్లో ఎగిరి వెళ్ళి ఒక సంజీవనీ పర్వతాన్ని ఎత్తుకొచ్చాడంటే మాత్రం అర్థ నిమిలిత నేత్రాలతో, భక్తి పారవశ్యంతో, భజనలు చేస్తూ నమ్ముతాం!! ఈ 'పవిత్ర భారతావని'లో పుట్టాక ఇక ఏం చేస్తాం? నమ్మక ఛస్తామా? నమ్ముతాం! నమ్ముతాం!! ''ఒకటో తరగతిలో చదివిన వాచకం, రెండో తరగతికి పనికిరాదు. మరి డెబ్బయి సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం 'రాజ్యాంగం' మన దేశ అభివృద్ధికి ఎంత వరకు దోహదపడుతుందీ?'' అని ప్రశ్నించాడు ఒక దేశభక్తుడు. అవును కదా! ఎంత గొప్ప విషయం చెప్పాడూ అని మనం గుడ్లు మిటకరించేలోపు మనకు మరొక విషయం గుర్తుకొస్తుంది. అదేమిటంటే 1500 ఏండ్ల క్రితం రాసిన 'మనుధర్మ శాస్త్రం' ఇప్పటికీ పనికొస్తుందని మనువాదులు చెపుతున్నారే - విడ్డూరం?? ఈ మనువాద దేశభక్తులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఒకటో తరగతి, రెండో తరగతి వాచకాల్లాగా భారత రాజ్యాంగం ఒక వాచకం కాదు. మరో విశేషమేమంటే, ఒకటో తరగతి వాచకానికున్న విలువకూడా వారి శాస్త్రానికి లేదు. పులిహారలో 'పులి' లేనట్టే, 'అచ్ఛే దిన్'లో అచ్ఛా ఎక్కడుందీ?
ఓ స్వామిజీ తన ఫేస్బుక్ వాల్ మీద 'వేదాలు ఏం ఘోషిస్తున్నాయంటే..'' అని రాయడం మొదలు పెట్టాడు. అంటే టైప్ చేయడం ప్రారంభించగానే బయట కాలింగ్ బెల్ మోగింది. అతను కంగారుగా ఫోను గదిలోనే వదిలేసి, హాల్లోకి వెళ్ళాడు. అదే గదిలో ఓ మూల బాల్‌తో ఆడుకుంటున్న ఆయన మనుమడు బాల్ వదిలేసి, ఫోన్ చేతిలోకి తీసుకుని, అదీ ఇదీ నొక్కడం ప్రారంభించాడు. దానితో స్క్రీన్ మీద ''జ ఇ ను అ గు ఓ ర స హ క్ జెఫ్టిక్ జిల్ వైర హాక్ ద్రజిక్ గజా పుంజెగ్..'' అంటూ ఏవేవో అక్షరాలు టైపు అయిపోయాయి. అక్కడ జరిగింది.. అది! కానీ ఫేస్ బుక్‌లో అరగంట అవ్వక ముందే అరలక్ష లైకులు, పావులక్ష షేర్లు 30కె నమస్కారాలు 10కె సూపర్లు వచ్చాయి. ఇది దేశంలో సామాన్యుల మానసిక స్థితిని తెలియజేస్తోంది. ''చూశారా? స్వామిజీ వారి జ్ఞానసారం? ఆ పదాల అర్థం తెలుసుకోవాలంటే మనబోటి వారికి ఒక జీవితకాలం సరిపోదు... అని అర్థం వచ్చేట్టు వేల మంది కామెంట్స్ చేశారు. అంటే అర్థం పర్థం లేనివన్నీ మహాద్భుతాలు- అని జనం గుడ్డిగా నమ్మేస్తున్నారన్న మాట!
ఇలాగే వెనకటికి ఒకాయన ప్రతి ఉగాదికి సత్యనారాయణ వ్రతం చేసుకునేవాడు. అయితే ఆయన ఇంట్లో ఉన్న పెంపుడు పిల్లి మాటిమాటికి వ్రతం మీద కూర్చున్న యజమాని ఒళ్ళోకి వచ్చి కూర్చునేది. పూజలో అంతరాయం కలుగుతోందని ఆయన పక్కనే ఉన్న బుట్టకిందికి పిల్లిని తోసేశాడు. హాయిగా వ్రతం చేసుకున్నాడు. ఇదంతా ఆ ఇంటి యజమాని కొడుకు గమనించాడు. ఆ మరుసటి సంవత్సరం వ్రతం చేసుకోవాల్సిన ఉగాది రోజు, కొడుకు పిల్లిని ముందే గంపకింద దాచి, తల్లి దండ్రుల పక్కన కూర్చున్నాడు. కొడుకు తెలివికి ఇంటియజమాని సంతోషించాడు. అలా పిల్లిని గంపకింద దాచి, ఆ పక్కనే వ్రతం చేసుకోవాలని పిల్లవాడికి అర్థమైంది. అది ఆ ఇంటి సంప్రదాయమైంది. కాలం గడిచింది. యజమాని చనిపోయాడు. పిల్లీ అంతకు ముందే చనిపోయింది. ఉన్నత చదువులు చదివి ఇంటికి తిరిగి వచ్చిన కొడుక్కి సత్యనారాయణ వ్రతం చేయాల్సి వచ్చింది. పిల్లిలేనిది వ్రతం చేసుకోవడం ఎలాగా? అని ఊళ్ళో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లిని తెచ్చాడు. దాన్ని గంప కింద కప్పిపెట్టి.. ఆ పక్కనే ఇంటి సంప్రదాయాన్ని కొనసాగించాడు. అంటే ఎప్పటిలాగే వ్రతం చేసుకున్నాడు. మనకున్న సంప్రదాయాలలో చాలా వరకు ఇలాంటివే. అనాలోచితంగా అనుసరిస్తున్నవే. అసలు వ్రతాలు, నోములు నోచుకోవడం అవసరమా అనేది ఒక అంశం అయితే, పక్కనే పిల్లిని గంపకింద దాచిపెట్టి పెట్టడం మరో అంశం. చిలువలు పలువలుగా ఒక మూఢత్వానికి మరో మూఢత్వం జత కూడుతూ, సమాజమే సంప్రదాయాలనే మూఢత్వంలో కూరుకుపోయింది! ఇది ఒక ఇంట్లో ఏర్పడిన ఆచారం. ఇలాంటివి కొన్ని కొన్ని వర్గాలకు, జాతులకు పరిమితమైన మూఢచారాలు ఎన్నో ఉన్నాయి. గుడ్డిగా అనుసరిస్తున్నంత కాలం అవి కొనసాగుతాయి. ఎవరో ఒకరు పూనుకుని విశ్లేషించకపోతే వాస్తవాలు బయటపడవు.
ఇలాంటిదే ఒక మిలట్రీ క్యాంపులో జరిగిన సంఘటన కూడా చూడండి. కొత్తగా ఒక క్యాంప్ కమాండర్ నియమితుడయ్యాడు. అతడు తన ఏరియాను తనిఖీ చేస్తుంటే ఒక చోట ఒక బెంచ్‌ను ఇద్దరు సైనికులు తుపాకులతో కాపలా కాస్తున్నారు. వారు ఎందుకు అక్కడ కాపలా కాస్తున్నారని వారిని క్యాంప్ కమాండర్ అడిగాడు. ''ఏమో సార్ తెలియదు. మీ కంటే ముందున్న కమాండర్ ఆర్డర్ వేశారు. మేం పాటిస్తున్నాం'' అని అన్నారు వాళ్ళు - క్యాంప్ కమాండర్ తన కంటే ముందున్న కమాండర్‌కి ఫోన్ చేసి ''ఆ బెంచ్‌కి కాపలా పెట్టారు దేనికీ?'' అని అడిగాడు.
''ఏమో - నాకూ తెలియదు. నాకంటే ముందున్న కమాండర్ అలాగే బెంచ్‌కి కాపలా పెట్టాడు. అది రెజిమెంట్ సంప్రదాయమేమో అని నేనూ అనుసరించాను'' అని చెప్పాడు.
ఈయన కంటే ఇంకా ముందు పని చేసిన కమాండర్ ఫోన్ నెంబర్ అతి కష్టం మీద సంపాదించి, ఈ ప్రస్తుత క్యాంప్ కమాండర్ ఆయనకు ఫోన్ కలిపాడు. వెంటనే దొరకలేదు. అనేకేసార్లు ప్రయత్నించి చివరకు పట్టుకున్నాడు. వినయంగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. బెంచ్‌కు పెట్టిన కాపలా గురించి అడిగాడు. ఆ పెద్దాయన సరదా మనిషి. పెద్దగా నవ్వాడు. నవ్వీ నవ్వీ.. ఇలా అన్నాడు.. ''చూడు కమాండర్ నేను రిటైరయ్యి పదేండ్లకు పైగా అయ్యింది. ఆ బెంచ్‌కు వేసిన పెయింట్ ఇంకా ఆరిపోలేదా? - విచిత్రం!!'' అంటూ మళ్ళీ పగలబడి నవ్వసాగాడు. జరుగుతూ వచ్చిన పొరపాటేమిటో ఇప్పటి క్యాంప్ కమాండర్‌కు అర్థమవుతూ వచ్చింది. ఆ పెద్దాయన ఎప్పుడో రిటైరు కాబోతున్న ముందురోజు అక్కడ ఒక బెంచ్‌కి పెయింట్ వేశారు. అది ఆరిపోయే దాకా చూస్తుండమని, ఆయన అక్కడ ఇద్దరు జవాన్లకు డ్యూటీ వేశాడు. నిజమే. విషయమేమిటో తెలుసుకోకుండా గుడ్డిగా ఇది రెజిమెంట్ కస్టమ్ అని ఆ పనిని కొనసాగించిన వారిది ఎంతటి మూర్ఖత్వమో విశ్లేషించుకుంటేనే తెలుస్తుంది.
చిలుకూరు బాలాజీ దేవాలయం పూజారి - ఆ ప్రాంగణంలో ఉన్న శివాలయంలోకి ఒక తాబేలు వచ్చినప్పుడు, సాక్షాత్తూ కూర్మావతారమే తనకు ప్రత్యక్షమైనట్టు భక్తి ప్రవత్తులు ప్రకటించాడు. ఆ పక్కనే హిమాయత్‌సాగర్ చెరువు ఉండటం వల్ల అందులోంచి తాబేలు మెల్లగా మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఉంటుందన్న ఒక చిన్న విషయం ఆ పూజారిగారికి తోచలేదు. పైగా ఆర్భాటంగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. భక్తులను ఆకట్టుకుని వారి మూఢత్వం మరింతగా పెంచి పోషించడంలో విజయం సాధించారు. ఇంగిత జ్ఞానం లోపించిన చోట భక్తి వర్థిల్లుతుంది! ''కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి / స్వార్థలోలురు నా భుక్తి ననుభవింత్రు / కర్మ మననేమొ దాని కక్షయేమొ / ఈశ్వరుని చేత రుజువు చేయింపవమ్మ'' అని అన్నారు కవి గుర్రం జాషువా. పనికొచ్చే వాస్తవమైన మాటలు మనం ఎప్పుడు మనసుకెక్కించుకున్నామనీ? ఎప్పుడు నిజానిజాలు విశ్లేషించుకున్నామనీ?
9-13 సంవత్సరాల మధ్య గల బ్రాహ్మణ బ్రహ్మచారులు కావాలని శ్రీశైలంలోని శ్రీ దేవీ వేద విద్యాలయం ప్రకటించింది. 108 మంది వేద విద్యార్థులకు ఉచిత భోజనం, ఇతర వసతులు ఏర్పరిచామని ఆ సంస్థ ప్రకటించింది. వేదాలు అంతరించి పోతున్నాయని, 'వాటిని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత' అని ఆ సంస్థ గుర్తుచేసింది. అంతా బాగానే ఉంది. అది ప్రతి భారతీయుడి బాధ్యత అయినప్పుడు, కేవలం బ్రాహ్మణ బ్రహ్మచారులే ఎందుకు కావాలి? కేవలం అది వారి బాధ్యతే అని ప్రకటించుకుంటే సరిపోయేది. ప్రతి భారతీయుడు బ్రాహ్మణుడు కాలేడు కదా? ఇందులో మతపరంగా జనాన్ని విడదీసే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ప్రతి భారతీయుడూ వేదాల్ని రక్షించే బాధ్యత నెత్తినవేసుకోవాలి. వాటిని అధ్యయనం చేసే అవకాశం మాత్రం బ్రాహ్మణవర్గానికే ఇవ్వాలి. ఒక రకంగా నిచ్చెనమెట్ల సంస్కృతిని బతికిస్తూనే ఉండాలని - ఆ ప్రకటన పరోక్షంగా ప్రకటిస్తూ ఉంది.
మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ స్వప్నం ప్రపంచ మానవుల స్వప్నంగా ఎప్పుడు మారుతుందో తెలియదు. ఆయన ఏమన్నాడంటే.. ''నాకు ఒక స్వప్నం ఉంది. ఈ దేశం స్వేచ్ఛా సమానత్వాల ఆదర్శాలకు నిలయంగా మారుతుందని... నాకొక స్వప్నం ఉంది. బానిసల పిల్లలు, శ్వేత జాతీయుల పిల్లలు సోదర భావంతో కలిసి మెలిసి ఉంటారని నాకొక స్వప్నం ఉంది. నా నలుగురు పిల్లలు చర్మం రంగుని బట్టి కాకుండా, వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించబడతారని నాకొక స్వప్నం ఉంది!'' జాతి వివక్ష మాత్రమే కాదు, ఇక్కడ భారతీయ సమాజాన్ని నిచ్చెనమెట్ల సంస్కృతి ఇంకా అనేక విధాలుగా విభజించింది. అవన్నీ సమసిపోయి, మనుషులంతా ఒక్కటే అనే గ్రహింపురావాలి. ఇది ఏ దేవుడో సృష్టించిన ప్రపంచం కాదు. లక్షల సంవత్సరాలుగా మానవ జాతులు సాధిస్తూ వచ్చిందే. ఆధునికుడు ఇంకా ఇంకా దాన్ని ఉన్నతీకరించు కుంటున్నదే!
అయితే ప్రస్థుత బారత ప్రభుత్వానికి ఆస్పృహ ఉన్నట్టు లేదు. ఇంతటి కరోనా తీవ్రతలో, హరిద్వార్‌లో లక్షల మంది నగంగా పాల్గొనే 'కుంభమేళా'కు ఎందుకు అనుమతిచ్చినట్టూ? లక్షల కోట్ల బ్యాంకు దోపిడీ దార్లకు రుణమాఫీ చేసే ఈ ప్రభుత్వానికి నిజమే - ఉమ్ములు, మల మూత్రాలు విసర్జిస్తూ చేసే సామూహిక స్నానాలలో 'పవిత్రత' మాత్రమే కనిపిస్తుంది కదా? మాస్క్ లేకుండా రోడ్డుమీద కనిపించిన సామాన్యుడికి మాత్రం జరిమానా విధిస్తారు?
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీ వేత్త, జీవశాస్త్రవేత్త.